[జూలియన్ బార్న్స్ రచించిన ‘ది సెన్స్ ఆప్ ఆన్ ఎండింగ్’ అనే నవలని సమీక్షిస్తున్నారు పి. జ్యోతి.]
జూలియన్ బార్న్స్ ఇంగ్లండ్‌కు చెందిన ఆంగ్ల రచయిత. సొంత పేరుతో గంభీరమైన రచనలు చేస్తూ, మరో పక్క డాన్ కావనాగ్ అనే కలం పేరుతో క్రైమ్ ఫిక్షన్‌ను కూడా ఆయన రాసారు. కొన్ని చిన్న కథలు వ్యాసాలు కూడా రాసిన బార్న్స్ ఇంగ్లండ్‌లో ఎంతో పేరు సంపాదించుకున్న ఈ దశాబ్ద రచయిత. నాలుగు సార్లు బూకర్ ప్రైజ్‌కు నామినేట్ అయ్యారంటే ఈయన రచయితగా ఎంత ఆదరణ సంపాదించుకున్నారో అర్థం అవుతుంది. ‘ది సెన్స్ ఆఫ్ ఎండింగ్’ 150 పేజీల నవల మాత్రమే. కాని ఈ పుస్తకం చదవడం ఓ గొప్ప అనుభవం.
మానవ సంబంధాలలో ఎవరికీ అర్థం కాని చిక్కుముడులు ఇలా అడుగున పడిపోయిన జ్ఞాపకాలలో నిక్షిప్తమై ఉంటాయి. వాటిని వెలికి తీసి చూసుకుంటే మనలోని మరో మనిషి కనిపించి కొన్ని సార్లు ఇబ్బంది పెడతారు. దీన్ని తప్పించుకోవడానికే గతకాలపు స్మృతులలో కేవలం ఆనందాన్ని ఇచ్చేవాటినే మనుషులు ప్రస్తావిస్తారు. వాటి నడుమ దాచిపెట్టిన కఠిన సత్యాల జోలికి వెళ్ళరు. వెళితే అక్కడ కనిపించే తమ నీడను తామే చూడలేరు.
ఈ ఇతివృత్తంతో బార్న్స్ రాసిన నవల ‘ది సెన్స్ ఆప్ ఎండింగ్’. ఇది ఆయన పదకొండవ నవల. 2011లో బూకర్ ప్రైజ్ వచ్చిన ఈ నవల సినిమాగానూ తెరకెక్కింది. అంతకు ముందు మూడు సార్లు బార్న్స్ ఇదే బహుమతికి మరో మూడు నవలల నేపథ్యంలో బూకర్ ప్రైజ్ కోసం ఎంపికయ్యారు. కాని నాలుగవ సారి నామినేట్ అయి ఈ నవలకు బూకర్ అందుకున్నారు. సర్ జాన్ ఫ్రాంక్ కర్మోడే అనే ఇంగ్లీషు సాహితీ విమర్శకుడి పుస్తకం ఇదే పేరుతో 1967లో ప్రచురితమైంది. ఈ నవలకు అదే పేరు బార్న్స్ ఎన్నుకున్నరని కొందరంటారు. కాని తనకి ఆ పుస్తకం గురించి తెలియదని అనుకోకుండా తనకీ అదే పేరు తన పుస్తకం కోసం తట్టిందని బార్న్స్ ఆ తరువాత పలు ఇంటర్వ్యూలలో చెప్పారు.
మన జీవితాలను అర్థం చేసుకోవడానికి మనం ప్రయతిస్తున్న మార్గాలను ముందు అర్థం చేసుకోవాలన్న గూడార్థాన్ని ‘ది సెన్స్ ఆప్ ఆన్ ఎండింగ్’ అన్న ఈ వాక్యం సూచిస్తుంది. మనం ఏ మార్గంలో జీవితాన్ని విప్పి చూసుకునే ప్రయత్నం చేస్తున్నాం అన్న దాని మీదే నిజమైన మన వ్యక్తిత్వం ఆధారపడుతుంది. సాధారణంగా మనుషులు తమ మనసులోని ఉద్దేశాల ఆధారంగానే తమను తాము ప్రపంచం ముందు నిలుపుకుంటారు. అంటే ఏ విధంగా ఇతరులకు కనిపించాలనుకుంటారో అదే బాటలో తమ జీవితాలను విప్పి చూసుకుంటారు. అందువల్ల చాలా సందర్భాలలో నిజమైన వారి వ్యక్తిత్వం ప్రకటితమవదు.
ఈ మానవ నైజాన్ని ఆధారం చేసుకుని కథను నిర్మించుకున్నారు బార్న్స్. నవల రెండు భాగాలుగా కథ నడుస్తుంది. మొదటి భాగంలో నవల ప్రధాన పాత్ర టోనీ వెబ్సటర్ యువకుడు. రెండవ భాగంలో రిటైర్ అయిన వృద్ధుడు. 1960లలో నలుగురు హైస్కూలు విద్యార్ధుల నేపథ్యంతో మొదటి భాగంలోని కథ మొదలవుతుంది. ఈ నలుగురు చాలా తెలివైన వాళ్లు, ఎన్నో విషయాలపై నిర్దుష్టమైన అభిప్రాయాలు ఉన్న యువకులు. ఆ స్కూలుకు అడ్రియన్ అనే కొత్త స్టూడెంట్ వస్తాడు. అడ్రియన తెలివితేటలు ఈ ముగ్గురు స్నేహితులను ఆకర్షిస్తాయి. వాళ్లు అతన్ని తమతో నాలుగవ స్నేహితుడిగా కలుపుకుంటారు. ఎప్పటికీ అదే స్నేహంతో మెలగాలని నిశ్చయించుకుంటారు. అడ్రియన్ ఆలోచనలు ఎంతో భిన్నంగానూ లోతుగాను ఉండడంతో అతన్ని టీచర్లు చాలా ఇష్టపడతారు. ప్రత్యేకంగా చూస్తారు.
వీరి క్లాస్‌కు సంబంధించిన రాబ్సన్ అనే అబ్బాయి ఓ అమ్మాయితో ప్రేమ వ్యవహారం నడిపి ఆమె గర్భం దాల్చిందని తెలిసిన తరువాత ఆత్మహత్య చేసుకుంటాడు. ఇది ఆ నలుగురు స్నేహితులకు కొరుకుడు పడని విషయం. ఆల్బర్ట్ కాము రచనల ప్రభావంలో ఉన్న వాళ్లు “ఆత్మహత్య మాత్రమే నిజమైన తాత్విక ప్రశ్న” అన్న కామూ మాటల ఆధారంగా ఈ ఘటనను విశ్లేషించే ప్రయత్నం చేస్తారు. ఈ ఘటన చరిత్రలో ఎలా మిగిలిపోతుందో అన్న ఆలోచనతో అడ్రియన తమ చరిత్ర టీచర్‌తో వాదనకూ దిగుతాడు. అడ్రియన్ తల్లి తండ్రులు విడిపోయారు. అప్పట్లో ఇలా విడిపోయిన కుటుంబాలు ఎక్కువ ఉండేవి కావు. అందువల్ల అతని జీవితం, అతని ఆలోచనలు అన్ని సాధారణత్వానికి విరుద్ధంగా ఉన్నాయి అని అనుకుంటూనే అతనిలోని మేధావిని గౌరవిస్తారు మిగతా ముగ్గురు మిత్రులు కూడా. టోని అడ్రియన్‌కు దగ్గర అవ్వాలని చాలా ప్రయత్నిస్తాడు. ఈ ప్రయత్నం చాలా సందర్భాలలో ఇతరులకు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది కూడా. స్కూలు అయిపోయాక అందరూ ఊహించినట్లు గానే అడియన్ కేంబ్రిడ్జ్‌లో చదవడానికి స్కాలర్‌షిప్ సంపాదిస్తాడు. టోని చరిత్ర చదవడానికి బ్రిస్టల్ వెళ్లిపోతే మిగతా ఇద్దరూ తమకిష్టమైన రంగాలలో మరో చోటుకు వెళ్లిపోతారు. సెలవుల్లో తప్పకుండా కలవాలని నలుగురూ నిర్ణయం తీసుకుంటారు.
అక్కడి నుండి వచ్చాక తన స్నేహితులకు వెరోనికాను పరిచయం చేస్తాడు టోని. అడ్రియన్‌తో వెరోనికా చనువుగా గడపడం అతని స్నేహితులకు వింతగా అనిపించినా టోని దాన్ని పట్టించుకోడు. ఆమె అన్న జాక్ కేంబ్రిడ్జ్ లోనే చదువుతున్నాడని, తన సీనియర్ అని విని అడ్రియన్ అంత గొప్పగా స్పందించడు. తనకు జాక్ తెలుసని కాని అతనితో స్నేహం తనకు సరిపడదని కొంత విసుగునూ ప్రదర్శిస్తాడు. మెల్లిగా వెరోనికా టోనిల మధ్య దూరం పెరుగుతుంది. టోనీ తనకు దూరం అవుతున్నాడని తెలిసిన సమయంలోనే వెరోనికా శారీరికంగా టోనితో కలుస్తుంది. అయినా వారి మధ్య ఆ పాత స్నేహం కనుమరుగవుతుంది. మెల్లగా వెరోనికాని తప్పించుకుని తిరుగుతుంటాడు టోని.
కొన్నాళ్లకి వెరోనికా తల్లి నుండి టోనికి ఓ ఉత్తరం అందుతుంది. టోని వెరోనికా విడిపోయినందుకు ఆమె బాధపడుతూ, అతని భవిష్యత్తుకు శుభాకాంక్షలు అందిస్తూ ఆమె రాసిన ఉత్తరం టోనికి పూర్తిగా అర్థం కాదు. టోని మరో అమ్మాయితో స్నేహం మొదలెడతాడు. ఆ సమయంలోనే అడ్రియన్ నుండి టోనికి ఓ ఉత్తరం వస్తుంది. వెరోనికాతో తాను సంబంధం కొనసాగించాలనుకుంటున్నానని దానికి టోని అనుమతి కోరుతూ రాసిన ఉత్తరం అది. దానికి తనకేమీ అభ్యంతరం లేదని వెరోనికాను దాటి తన జీవితం ముందుకెళ్లిపోయిందని తిరుగు జవాబు రాసి తన చదువులో పడిపోతాడు టోని. డిగ్రీ వచ్చిన తరువాత ఆరు నెలలు దేశాలను చూడాలని వెళతాడు. ఆనీ అనే అమ్మాయితో డేట్ చేస్తాడు. కాని అదీ ముగిసి చివరకు ఇల్లు చేరతాడు.
ఇంటికి వచ్చిన టోనికి అడ్రియన్ ఆత్మహత్య చేసుకున్నాడన్న వార్త తెలుస్తుంది. చదువుకునే రోజుల్లో ఆత్మహత్య అనేది ప్రతి స్వేచ్ఛాప్రియ వ్యక్తులకు సరైనదని, ప్రాణాంతకమైన అనారోగ్యం లేదా వృద్ధాప్యాన్ని ఎదుర్కొన్నప్పుడు అదో తార్కిక చర్య, హింసను ఎదుర్కొన్నప్పుడు లేదా ఇతరులు తప్పించుకోదగిన మరణాలను ఎదుర్కొన్నప్పుడు ఒక వీరోచిత చర్య, నిరాశ చెందిన ప్రేమ విషయంలో ఆకర్షణీయంగా కనిపించే చర్య అని ఒకప్పుడు నలుగురు రాబ్సన్ విషయంలో వాదులాడుకోవడం, అతని ఆత్మహత్యకు కారణాన్ని వెతకడం టోనికి గుర్తుకొస్తుంది. ఇప్పుడు అడ్రియన్ మరణం వెనుక కారణం గురించి ఆలోచించడం మొదలెడతారు ముగ్గురు మిత్రులు. అతను చేతి నరాలను కోసుకుని చనిపోయాడని తెలుసుకుంటాడు టోని. బాత్ రూమ్ తలువు వేసుకుని తలుపు పైన పోలీసులను పిలవమనే ఉత్తరం అంటించి అతను చనిపోయాడని, తన రక్తపు మడుగులను ఇతరులు చూసి భయపడకుండా జాగ్రత్త పడ్డాడని తెలుస్తుంది టోనికి. అప్పటిని వెరోనికాతో ప్రేమలో ఉన్నాడని స్నేహితులు టోనికి చెబుతారు. ఈ మరణం వెనుక ఏదో రకంగా వెరోనికా బాధ్యత ఉంటుందని టోని అనుకుంటాడు.
మెల్లగా అతను తన జీవిత ప్రయాణంలో పడిపోతాడు. మార్గరెట్ అనే యువతిని పెళ్లి చేసుకుంటాడు, వీరికి సూసి అనే కూతురు కూడా. తరువాత మార్గరెట్ టోనితో విడిపోతుంది. సూసిని ఇద్దరూ కలిసే పెంచుతారు. ఆ తరువాత సూసి వివాహం ఓ డాక్టర్‌తో జరుగుతుంది. వారికి ఇద్దరు పిల్లలు. మార్గరెట్ టోని ఇద్దరూ స్నేహితుల్లా మసలుతూ ఉంటారు. టోని రిటైర్ అయి ప్రశాంతంగా జీవిస్తూ ఉంటాడు.
ఇప్పుడు నవల రెండవ భాగం మొదలవుతుంది. టోనికి ఓ లాయర్ నుండి ఓ నోటీసు వస్తుంది. సారా ఫోర్డ్ అనే స్త్రీ అతనికి మరణానంతరం ఐదు వందల పౌండ్లు వదిలి వెళ్లిందని దానితో పాటు ఓ డైరీ కూడా వదిలిందని అది ఆమె కూతురి అధీనంలో ఉందన్నది ఆ ఉత్తరం సారాంశం. ఎంతో ఆలోచిస్తే కాని సారా వెరోనికా తల్లి అన్నది టోనికి గుర్తు రాదు. ఒక ఐదు వందల పొండ్లు పెద్ద ధనమూ కాదు మరి తనకి ఆమె ఎందుకు వదిలిందో ఆ డైరీ ఏంటో కనుక్కోవాలనే పట్టుదల అతనిలో పెరుగుతుంది. వెరోనికా అడ్రస్సు లేకపోవడంతో ఆమె అన్న జాక్ ఈ మెయిల్ పట్టుకుని ఉత్తరం రాస్తాడు టోని. వెరోనికా ఈ-మెయిల్ దొరకడంతో తనకు ఆ డైరీ కావాలని ఆమెకు ఉత్తరం రాస్తాడు. అది అడ్రియన్ డైరీ అని అతనికి అర్థం అవుతుంది. చాలా ఉత్తరాల తరువాత ఆమె ఆ డైరీలో ఓ పేజీ అతనికి పంపిస్తుంది. అది అతనిలో ఇంకా కుతూహలాన్ని కలిగిస్తుంది. అతని ఒత్తిడికి తల వంచి వెరోనికా అతన్ని కలుస్తుంది. అప్పుడు అడ్రియన్‌కు టోని ఒకప్పుడు రాసిన ఉత్తరాన్ని ఆమె అతనికి చదవమని ఇస్తుంది.
ఆ ఉత్తరం ఆడ్రియన్ వెరోనికాతో బంధంలోకి వెళ్లాలని అనుకుంటున్నానని దానికి టోని అనుమతి కోరుతూ రాసిన ఉత్తరానికి టోని ఇచ్చిన జవాబు. అందులో ఎంతో కసితో వెరోనికా అతనికి సరైనదని, ఆమెతో సంబంధం కలుపుకోవాలంటే ఆమెకు దూరం అవ్వాలని అప్పుడే ఆమె శారీరికంగా అడ్రియన్‌కు దగ్గరవుతుందని, తాము అలానే కలిసామని చెబుతూ ఆమె అసలు గుణం తెలియాలంటే ఆమె తల్లిని కలవమని ఆమె వెరోనికాతో జాగ్రత్తగా మసలమని తనకు ముందే చెప్పిందనే విషయాన్ని రాస్తూ చివర్లో “అయినా మీరిద్దరూ ఒకరికొకరు సరిపోతారులే” అనే వ్యంగ్యంతో టోని ఉత్తరాన్ని ముగిస్తాడు. ఇన్ని సంవత్సరాల తరువాత ఆ ఉత్తరాన్ని చూస్తే అది తానే రాసానా అన్న అనుమానం టోనిలో కలుగుతుంది. ఇంత కసి కోపంతో తాను ఉత్తరం రాసిన సంగతే తాను మర్చిపోయానని అతను వెరోనికాతో చెప్తాడు. అంత దారుణంగా తాను వెరోనికాను ఎలా చిత్రించగలిగాడన్నది టోనికి ఇప్పుడు ఈ వయసులో అర్థం కాదు. కోపంతో రగిలిపోతూ తాను ఇలా ఉత్తరం రాసానన్న విషయాన్ని తాను మర్చిపోవడం గురించి ఆలోచిస్తాడు. తనలో ఇంత క్రూరత్వం ఉండిందా అన్న ఆలోచన అతన్ని స్థిమితంగా ఉండనివ్వదు. అంతే కాదు అడ్రియన్‌కు తాను అభినందనలు తెలుపుతూ పంపిన కార్డు క్లిప్టన్ సస్పెన్షన్ బ్రిడ్జ్ ది అని అప్పుడు అతనికి గుర్తుకు వస్తుంది. ఆ బ్రిడ్జ్ మీద నుండి ప్రతి సంవత్సరం ఎందరో ఆత్మహత్య చేసుకుంటారు. ఆ కార్డును తాను ఎందుకు అడ్రియన్‌కు పంపాడో టోనికి అర్థం కాదు. అడ్రియన్‌ను ఆత్మహత్య దిశగా తానే తెలియకుండా మళ్ళించానా అన్న ఆలోచన మొదటిసారి అతనిలో కలుగుతుంది.
అడ్రియన్ జీవితపు ముగింపులో తన ప్రమేయం ఎంతో కొంత ఉండే ఉంటుందని టోనికి అర్థం అవుతుంది. అసలు అడ్రియన్ జీవితపు ముగింపులోని సత్యాన్ని శోధించాలన్న పట్టుదల పెరుగుతుంది. వెరోనికాని మళ్ళీ కలుస్తాడు. ఆమె అతన్ని ఓ చోటుకు తీసుకువెళుతుంది. అక్కడ ఓ మెదడు ఎదగని యువకుడిని చూస్తాడు టోని. అతను ఇంకా నిజాన్ని చూడలేకపోతున్నందుకు, అర్థం చేసుకోలేకపోతున్నందుకు వెరోనికా కోపంతో అక్కడే అతన్ని వదిలిపోతుంది. అప్పుడు అక్కడ నుంచుని ఆలోచిస్తున్న టోనికి నెమ్మదిగా విషయం అర్థం అవుతుంది. ఆ మతి స్థిమితం లేని యువకుడు అచ్చు అడ్రియన్ పోలికలతో ఉండడంతో అతను విషయాన్ని తన పద్ధతిలో అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాడు. వెరోనికా అడ్రియన్ ఇద్దరికి పుట్టిన బిడ్డ మతిస్థిమితం లేనివాడని, అది భరించలేక అడ్రియన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని అతనికి అర్థం అవుతుంది.
కాని ఆ యువకుడిని మరోసారి చూడాలని అతను కనిపించిన చోట బార్‌కి హోటల్‌కి వెళుతూ ఉంటాడు టోని. ఆ యువకుడిని చూసుకుంటున్న వ్యక్తితో సంభాషించినప్పుడు కాని అతనికి పూర్తి విషయం అర్థం కాదు. ఆ యువకుడు వెరోనికా తమ్ముడని, ఆమె తల్లికి మరెవరికో పుట్టినవాడని అతనికి తెలిసినప్పుడు అసలు కథ పూర్తిగా అతనికి అర్థం అవుతుంది.
అడ్రియన్‌కు వెరోనికా గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఆమె తల్లిని అడగమని తాను అడ్రియన్‌తో ఉత్తరం ద్వారా చెప్పడం అతనికి అప్పుడు గుర్తుకు వస్తుంది. అడ్రియన్ వెరోనికా తల్లిని కలుసుకోవడానికి ఒంటరిగా వెళ్లి ఉంటాడని ఆమె మాయలో పడి ఉంటాడని అప్పుడు టోనికి పూర్తిగా అర్థం అవుతుంది. వెరోనికా వింత ప్రవర్తన వెనుక అమె తల్లి కారణం అని తనతో వెరోనికా కలిసి ఉన్నప్పుడు కూడా కూతురు గురించి ఆమె అనుమానాలను రేకెత్తించే విధంగా మాట్లాడడం అతనికిప్పుడు అర్థం అవుతుంది. వారికి పుట్టిన ఆ యువకుడు మతి స్తిమితం లేకుండా పుట్టడం, దిగజారిన అడ్రియన్ జీవిత ప్రమాణాలు, ఇవన్నీ అతని ఆత్మహత్యకు కారణం అని అతనికి పూర్తిగా అర్థం అవుతుంది. అప్పటి దాకా తాను విష కన్యగా భావించిన వెరోనికా ఆ యువకుడి బాధ్యత తీసుకోవడం, అతని బాగోగులు చూడడం గమనించాకా తాను ఇప్పటి దాకా అనుకున్నదేదీ నిజం కాదని, తెలిసి టోని నిర్షాంత పోతాడు.
టోని కథ చెప్తున్నంత సేపు వెరోనికా మనకూ అంటే పాఠకులకూ మరో విధంగానే అర్థం అవుతుంది. ఆమెను పొందలేక, తాను అసూయపడే అడ్రియన్ ఆమెకు దగ్గరవుతున్నాడని తెలిసి కసితో ఆమె గురించి అవాకులు చెవాకులు రాసి ఆ తరువాత అన్నీ మర్చిపోతాడు టోని. కాని ఆ లేఖ అడ్రియన్ జీవితాన్నే మార్చేస్తుంది. సారా అతన్ని వెరోనికాకు కాకుండా చేస్తుంది. వెరోనికాతో కలిసి తిరిగిన టోనీ కూడా ఆమె గురించి తప్పుగా చెప్పడం, దానికి సాక్షిగా ఆమె తల్లిని పరిచయం చేయడం, కూతురు ప్రేమించిన వ్యక్తిని తనవాడిగా మలచుకునే నైజం ఉన్న సారా అడ్రియన్‌ను లోబర్చుకోవడం ఫలితంగా పుట్టిన బిడ్డ అంగ వైకల్యుడవడం ఇవన్నీ అడ్రియన్ తప్పించుకోలేని తప్పిదాలు. వీటికి జవాబుగా అతను ఆత్మహత్యను ఎన్నుకున్నాడు. జీవితాన్ని చాలించాడు. అడ్రియన్‌తో పరిచయానికి కారకుడయిన టోనికి తన దగ్గర ఉన్న డబ్బు పంపి సారా తన జీవితపు ఆ కాస్త మాధుర్యానికి కృతజ్ఞత చూపించుకుంటే, అన్ని విధాలుగా మోసపోయి కూడా ఆ తల్లికి అడ్రియన్‌కు పుట్టిన బిడ్డ భాద్యత తీసుకుని తన ఉదాత్తతను చాటుకుంటుంది అప్పటి దాకా మనం కూడా ఇష్టపడని వెరోనికా.
వెరోనికాను టోని తాను అనుకున్న దృష్టిలోనించే చూసాడు. అందుకే ఆమెలోని ఆ ఉదాత్త కోణం అతనికి కనిపించలేదు. ఆ తరువాత అన్నిటినీ వెరోనికాకు విరుద్ధంగా చూస్తూనే వెళ్లాడు. అడ్రియన్‌పై అతనికున్న అసూయ అతనికే తెలీదు. అతని స్నేహాన్ని కోరుతూనే అతని విద్వత్తుపై టోనిలో పేరుకున్న అసూయ సమయం వచ్చినప్పుడు ఆ ఉత్తరంలో బైటపడి అడ్రియన్ జీవితాన్నే మార్చివేసింది. ఇది కొన్నేళ్ళ తరువాత మళ్లీ ఆ ఉత్తరం చూసే దాకా టోనికి కూడా అర్థం కాని విషయం. తనలో అంత క్రూరత్వం ఎలా ఉండిందో అని ఆ ముదుసలి వయసులో ఆశ్చర్యపోతాడు టోని.
మానవ సంబంధాలలో ఎన్నో రహస్యాలు, అందుకే వాటిని అర్థం చేసుకోవడానికి ఆ రహస్యపు ముళ్లు విప్పడానికి మనం ఏ దారిని ఎంచుకుంటున్నామో కూడా విశ్లేషిస్తే తప్ప మనం నిజం వైపు ప్రయాణిస్తున్నామా లేదా మనం సృష్టించుకున్న మన వ్యక్తిత్వానికి అనుగుణంగా విషయాలను మరల్చుకుంటున్నామా అన్నది అర్థం కాదు.
సెలెక్టివ్ మెమరీతో మనం చాలా సార్లు మనల్ని మనం రక్షించుకుంటాం. మనల్ని మనం ఎలా ప్రదర్శించుకోవాలనుకుంటామో ఆ దిశగానే అన్ని ఆలోచనలూ పనులనూ చేస్తాం. అందుకే చాలా సంబంధాలు అనుబంధాల మధ్య ఉండే వాస్తవాలు వెలుగులోకి రావు. మనిషి మేధ వాటిని పైకి రానివ్వదు. ఇది మనిషి అవలంబించే స్వీయ రక్షణ స్థితి. ఈ నవల ఆ స్థితిని చర్చిస్తుంది. మనిషి ఇలా బతకడంలోని స్వార్థాన్ని బట్టబయలు చేస్తుంది.