Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఓ విఫల ప్రేమికుడి బాధను వినిపించిన పాట ‘దేర్స్ ఏ హార్ట్ ఏక్ ఫాలోయింగ్ మీ’

[జిమ్ రీవ్స్ పాడిన ‘దేర్స్ ఏ హార్ట్ ఏక్ ఫాలోయింగ్ మీ’ అనే పాటని విశ్లేషిస్తున్నారు పి. జ్యోతి.]

~

జిమ్ రీవ్స్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎందరో అభిమానులున్నారు. ఆయన గొంతులోని గాంభీర్యం, వేదన ఎందరినో కదిలించింది. భారతదేశంలో గొప్ప ఆధ్యాత్మిక గురువుగా పేరు పొందిన మెహర్ బాబా జిమ్ రీవ్స్ అభిమాని. ముఖ్యంగా రీవ్స్ పాడిన ఓ పాట ఆయన మరీ మరీ వినేవారని ఆయన్ని దగ్గరగా చూసిన వారు చెప్తారు. ఆ పాటలో గొప్ప దర్ద్ ఉందన్ని మెహర్ బాబా అనేవారట. అదే ‘దేర్స్ ఏ హార్ట్ ఏక్ ఫాలోయింగ్ మీ’. దీన్ని రే బేకర్ రాసారు. 1963లో ఈ పాటను జిమ్ గానం చేస్తే ఆయన ఆల్బం గుడ్ ఎన్ కంట్రీ లో హిట్ సింగల్ గా ఇది 1964లో విడుదలయ్యింది. తర్వాత కొందరు గాయకులు దీన్ని మళ్లీ గానం చేసినా జిమ్ రీవ్స్ పాడిన పాటే శ్రోతలకు చేరువయ్యింది.

గతకాలపు ప్రేమ నుండి మరలలేక మరలుతున్నట్లు నటించలేక, పైకి తాను చాలా బాగానే ఉన్నట్లు, లోన అంతులేని ఒంటరితనాన్ని, వేదనని భరిస్తూ ఎవరికీ చెప్పుకోలేని బాధను అనుభవిస్తున్న ఓ విఫల ప్రేమికుడి బాధను జిమ్ పలికించే విధానం మనసును కరిగిస్తుంది. తాను బాగానే ఉన్నానని ఇతరులను నమ్మించడానికి ప్రయత్నిస్తూ, లోన వేదనతో అల్లాడుతూ ఆ ప్రేమికుడు అనుభవిస్తున్న దుఖాన్ని ఈ పాట వినిపిస్తుంది. దీనికి జిమ్ నూరు శాతం న్యాయం చేసారు. హృదయ లోతుల్లోంచి తన అసహాయతను వినిపిస్తూ అతను పడే మరణయాతన కఠిన హృదయాలను సైతం కరిగించేట్లు ఉంటుంది.

నిజానికి ఇది చాలా చిన్న పాట కాని చాలా సేపు మనతో ఆ వేదన ఉండిపోతుంది. అది జిమ్ గానంలోని విశిష్టత. “ఆమె వెళ్లిపోయినందుకు సంతోషంగా ఉంది” అని, తాను “ఆమెను ఎప్పుడూ ప్రేమించలేదు” అని అతను చెబుతుంటే మనకు అది నిజం కాదని అర్థం అయిపోతూ అతనిపై ఎంతో జాలి కలుగుతుంది. అతని అంతరంగంలోని తీవ్రమైన ఆరాటాన్ని తన మనసుతో అతను చేస్తున్న యుద్దాన్ని అర్థం చేసుకుంటూ మనమూ ఆ దుఃఖాన్ని అనుభవిస్తాం.

Sometimes they ask me if I’m really happy now
I say sure I’ve never loved her anyhow
But inside I long for you and the way it used to be
I look around and there’s a heartache following me

(కొన్నిసార్లు వాళ్లు నెనిప్పుడు ఆనందంగా ఉన్నానా అని ప్రశ్నిస్తారు. నేను చాలా బావున్నానని, నిజానికి ఆమెను నేను ప్రేమించనేలేదని జవాబిస్తాను. కాని లోలోన నీ కోసం, గతించిపోయిన ఆ ప్రేమ కోసం తల్లడిల్లిపోతుంటాను. నలువైపులా చూస్తే నన్నో గుండెనొప్పి నిరంతరం వెంటాడుతూనే ఉంది.)

అతని ప్రేమ విఫలం అయిందని తెలిసిన మిత్రులు అతనెలా ఉన్నాడో అని ప్రశ్నిస్తే చాలా బింకంగా నాకేం నేను హాయిగా ఉన్నాను, అసలు ఆమెను నేను ప్రేమింనేలేదు తెలుసా అని బదులిస్తాడు ఈ ప్రేమికుడు. తాను గాయపడ్డానని ఒప్పుకోవడానికి అతనికి మనస్కరించదు. అహం అడ్డు వస్తూ ఉంటుంది. కాని లోలోన ఆ పాత ప్రేమ నిరంతరం అతన్ని బాధిస్తూనే ఉంది. తానెంత దూరం వచ్చేసినా తన వెనుక ఆ బాధ కూడా వచ్చిందని, అది తనను చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేసేస్తుందని అతను ఒప్పుకోలేకపోతున్నాడు.

I always say that I’m really glad you’re gone
I even act like I never cared at all
But your memory lingers on and I’m never really free
I look around and there’s a heartache following me

(నువ్వు నన్ను వదిలి వెల్లిపోవడం చాలా హాయిగా ఉందనే చెప్పుకుంటూ ఉంటాను. అసలు నా జీవితంలో పెద్ద మార్పు ఏం జరగలేదన్నట్లుగానే ప్రవర్తిస్తుంటాను. కాని నీ జ్ఞాపకాల నుండి మాత్రం నన్నునేను విముక్తుడిని చేసుకోలేకపోతున్నాను. చుట్టూ చూస్తే ఓ గుండెనొప్పి నన్ను వెంటాడుతూనే ఉంది)

పైకి ఏం పట్టనట్లు, అసలేం జరగనట్లు అతను నటిస్తూనే ఉన్నా లోలోన ఆమె జ్ఞాపకాలు అతన్ని వేధిసూనే ఉన్నాయి. ఎంత ప్రయత్నించినా తనను వెంటాడే ఆ నొప్పి నుండి తప్పించుకోవడం అతనికి అసాధ్యం అవుతుంది.

I pawned my ring and everything that tied me to the past
I say I never loved her never meant for it to last
But I know it’s just a game and the loser’s always me
I look around and there’s a heartache following me

(నా ఉంగరాన్ని తాకట్టు పెట్టి, గతంతో సంబంధం ఉన్న అన్నిటినీ దూరం చేసుకున్నాను. ఆమెను నేను ప్రేమించనే లేదని, ఇది ఎన్నోరోజులు సాగే బంధంగా అనుకోలేదని అంటూ ఉంటాను. కాని నాకు తెలుసు నేనాడే ఈ ఆటలో ఓడిపోయేది ఎప్పుడూ నేనే. చూట్టూ చూస్తే ఓ గుండెనొప్పి నన్ను వెంటాడుతూనే ఉంది)

ఉంగరం ప్రసక్తి ఇక్కడ రావడంతో ఆమె అతని భార్య అని అర్ధం అవుతుంది. ఉంగరంతో పాటు గతానికి సంబంధించినవాటన్నిటినీ అతను వదిలించుకున్నాడు. అసలు ఆమెపై నాకు ప్రేమేంటీ, అది ఎక్కువ కాలం నిలవని బంధం అని నాకు ముందు నుంచీ తెలుసు అంటూ తేలికగా దాన్ని దులిపేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. కాని తాను ఓడిపోయే ఆటనే ఆడుతున్నానని తాను చెప్పేవేవీ నిజాలు కావని తనకీ అందరికీ అర్థం అవుతూనే ఉందని, తాను పూర్తిగా ఓడిపోయానని అతనికి లోలోన అర్థం అవుతూనే ఉంది. ఎన్నిఅబద్దాలు చెప్పినా ఎంతగా నటించినా తనను చుట్టుముడుతున్న ఆ అంతులేని వేదనను అతను తప్పించుకోలేకపోతున్నాడు. తాను ఒక ఆట ఆడుతున్నానని అంగీకరిస్తూ, పైకి ఉదాసీనంగా వ్యవహరించడానికి ఎంత ప్రయత్నిస్తున్నా, జ్ఞాపకాల నుండి తప్పించుకోలేని ‘ఓడిపోయిన వ్యక్తి’ తానేనని అతను ఒప్పుకుంటున్నాడు.

ఆ హృదయ వేదన ఒక స్థిరమైన నీడలా తనను నిత్యం వెంటాడుతుందని అతను చివర్లో అతి విషాదంగా ఒప్పుకుంటాడు. ఈ పాటకు జిమ్ రీవ్స్ మృదువైన, వెల్వెట్ లాంటి స్వరం ప్రత్యేకతను తీసుకొచ్చింది. ప్రశాంతమైన, గౌరవప్రదమైన ఒంటరితనాన్ని అనుభవంలోకి తీసుకొస్తుంది. ఎక్కడా లౌడ్నెస్ లేకుండా అతను పలికించే ఆ వేదన చాలా గొప్పగా ఉంటుంది. ఇలాంటి గాన శైలి కంట్రీ మ్యూజిక్ ప్రపంచంలో ‘జెంటిల్మన్ జిమ్’ శైలిగా నిలిచిపోయింది.

~

(‘దేర్స్ ఏ హార్ట్ ఏక్ ఫాలోయింగ్ మీ’ పాటని యూట్యూబ్‌లో వినవచ్చు/చూడవచ్చు:
https://www.youtube.com/watch?v=nBA7bXdpMyU )

Exit mobile version