[హాంక్ విలియమ్స్ జూనియర్ పాడిన ‘దేర్స్ ఎ టియర్ ఇన్ మై బీర్’ అనే పాటని విశ్లేషిస్తున్నారు పి. జ్యోతి.]
- హాంక్ విలియమ్స్ – దేర్స్ ఎ టియర్ ఇన్ మై బీర్ (1988)
- ఆల్బమ్ – హాంక్ విలియం జూనియర్ గ్రేటెస్ట్ హిట్స్ వాల్యూం-3 (1989)
- రచన – హాంక్ విలియమ్స్ (1951)
~
హాంక్ విలియమ్స్ ఇరవై తొమ్మిదేళ్ళ వయసులో మరణించేటప్పటికి అతని కొడుకు రాండాల్ హాంక్ విలియమ్స్ (జననం మే 26, 1949) వయసు కేవలం మూడు సంవత్సరాలు. ఆ తర్వాత ఇతను తల్లి ఆడ్రీ విలియమ్స్ వద్దే పెరిగాడు. గాయకుడుగానే ఎదిగి ఆ రంగంలో పేరు సంపాదించుకున్నాడు. హాంక్ విలియమ్స్ జూనియర్ అని అభిమానులతో పిలిపించుకున్న ఇతని సంగీత శైలిని రాక్, బ్లూస్ కంట్రీల మిశ్రమంగా విశ్లేషకులు వర్ణించారు. సంగీతకారులు సామ్ విలియమ్స్, హాలీ విలియమ్స్, హాంక్ విలియమ్స్ III ఇతని పిల్లలే.
హాంక్ విలియమ్స్ సీనియర్ జూనియర్ లిద్దరు పాడిన డ్యూయెట్ సంగీత ప్రపంచంలో సంచలనం సృష్టించింది. తండ్రి చనిపోయేటప్పుడు మూడు సంవత్సరాల వయసున్న జూనియర్ ఆయనతో కలిసి డ్యూయెట్ పాడడం ఏంటనే ఆశ్చర్యం అక్కర్లేదు. ఇది ఎనభైలలో రికార్డింగ్ వ్యవస్థలో కొత్తగా వచ్చిన టెక్నాలజీ మహిమ. వీరిద్దరి డ్యూయెట్ ‘దేర్స్ ఎ టియర్ ఇన్ మై బీర్’. దీనిని హాంక్ విలియమ్స్ సీనియర్ 1950-51లో రాసారు. దీన్ని మొదట ‘బిగ్ బిల్’ లిస్టర్ రికార్డ్ చేసారు. హాంక్ సీనియర్ రికార్డ్‌ల నిర్మాత ఫ్రెడ్ రోజ్‌కి పాటలో మద్యం ప్రస్తావనకు రావడం నచ్చలేదు. అందుకని ఇది ప్రజల మధ్యకు పూర్తి స్థాయి గీతంగా రాలేకపోయింది. విలియమ్స్ షోలకు ఓపెనింగ్ ఆర్టిస్ట్‌గా పనిచేసిన లిస్టర్‌కు ఆ తర్వాత ఒక డ్రింకింగ్ సాంగ్ అవసరమైంది. అప్పుడు విలియమ్స్ తాను రికార్డ్ చేసిన డెమోను అతనికి ఇచ్చారు. లిస్టర్ దానిని రికార్డ్ చేసి, 1952లో క్యాపిటల్ లేబుల్‌పై విడుదల చేశారు. 40 సంవత్సరాల తర్వాత 1988లో ఆ డెమోను విలియమ్స్ కొడుకు సంపాదించాడు. హాంక్ విలియమ్స్ జూనియర్ తన స్వరాన్నిఈ ఒరిజినల్ పాటను జోడిస్తూ తిరిగి రికార్డ్ చేశారు. ఈ యుగళగీత వెర్షన్ 1988లో సింగిల్‌గా విడుదలై, బిల్బోర్డ్ కంట్రీ మ్యూజిక్ చార్టులలో మొదటి పది స్థానాలలో నిలిచింది.
హాంక్ విలియమ్స్ జూనియర్ ఈ రికార్డును మొదట ఆడియో టేప్‌లోకి మార్చారు. విలియమ్స్ సీనియర్ చేసిన డెమోలో అతను కేవలం గిటార్ మాత్రమే వాయిస్తూ రికార్డ్ చేసాడు. దానికి అదనపు గాత్రాలను కలిపి తిరిగి రికార్డ్ చేశారు. ఈ పాట మ్యూజిక్ వీడియో కోసం, అప్పటికే అందుబాటులో ఉన్న హాంక్ విలియమ్స్ ప్రదర్శనకు సంబంధించిన ఓ టెలివిజన్ ఫుటేజ్‌ను ఉపయోగించారు. దానిపై ఎలక్ట్రానిక్ మెర్జింగ్ టెక్నాలజీని ఉపయోగించి హాంక్ జూనియర్ రికార్డింగ్‌లను ముద్రించారు. దీనివల్ల ఈ రికార్డ్ లో అతను తన తండ్రితో కలిసి గిటార్ వాయిస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఈ వీడియో విమర్శకుల ప్రశంసలతో పాటు వాణిజ్యపరంగా విజయం సాధించడమే కాకుండా కంట్రీ మ్యూజిక్ అసోసియేషన్, అకాడమీ ఆఫ్ కంట్రీ మ్యూజిక్ రెండూ కూడా దీన్ని ‘వీడియో ఆఫ్ ది ఇయర్’గా ఎంపిక చేసాయి. హాంక్ విలియమ్స్, సీనియర్ & జూనియర్, ఈ పాటతో 1990లో ‘బెస్ట్ కంట్రీ వోకల్ కొలాబరేషన్’ విభాగంలో గ్రామీ అవార్డును కలిసి ‘పంచుకున్నారు’.
హాంక్ సీనియర్ కనిపించే ఆ ఫుటేజ్, నిజానికి 1952లో కేట్ స్మిత్ ఈవినింగ్ అవర్‌లో ప్రదర్శించిన ‘హే, గుడ్ లుకిన్’ పాట కైనెస్కోప్‌ను డిజిటల్‌గా మార్పులు చేసి తీసారు. హాంక్ సీనియర్ నోటిపై అతని లాగే దుస్తులు ధరించిన ఒక నటుడి నోటిని అమర్చి మార్పులు చేసారు. ఇప్పుడు దీన్ని మించిన ప్రయోగాలు జరుగుతున్నాయి కాని ఆ రోజుల్లో ఇది ప్రజలని ఆశ్చర్యానందాలకు గురి చేసిన విప్లవాత్మక ప్రయోగం.
There’s a tear in my beer
‘Cause I’m crying for you, dear
You are on my lonely mind
Into these last nine beers
I have shed a million tears
You are on my lonely mind
(నేను తాగుతున్న బీరులో ఓ కన్నీటి చుక్క ఉంది. ఎందుకంటే ప్రియా నేను నీ కోసం ఏడుస్తున్నాను. నా ఒంటరి మనసులో నువ్వే ఉన్నావు. ఇప్పటిదాకా నేను తాగిన తొమ్మిది బీర్లలో నేను లక్షల కన్నీటి బొట్లు కార్చాను.)
హాంక్ పాటలన్నీ విషాదంతో నిండి ఉండడం శ్రోతలకు కొత్త కాదు. తనను వీడి వెళ్లిపోయిన ప్రేయసిని తలచుకుని ఒంటరితనంలో గుండెలోని బాధను తగ్గించుకునే దారిలేక మధ్యంలో ప్రశాంతతను వెతుక్కుంటున్నాడు అతను. కాని తొమ్మిది బీర్లు తాగి పదో బీరు తాగుతున్నప్పుడు కూడా అతని కన్నీరు ఆగట్లేదు. ఆమె మరుపుకు రావట్లేదు. ఆ ఒంటరితనం అతన్ని మరీ బాధిస్తుంది.
I’m gonna keep drinkin’ until I’m petrified
And then maybe these tears will leave my eyes
There’s a tear in my beer
‘Cause I’m crying for you, dear
You are on my lonely mind
(నేను శిలలా మారే దాకా తాగుతూనే ఉంటాను. అప్పుడు కాని ఈ కన్నీళ్ళూ నా కళ్ళని వదిలి వెళ్ళవేమో. నేను తాగుతున్న బీరులో ఓ కన్నీటి చుక్క కలిసింది. నేను నీ కోసమే కన్నీరు చిందిస్తున్నాను. నువ్వే నా ఒంటరి హృదయంలో నిండి ఉన్నావు.)
ఈ రెండు వాక్యాలు అతనిలోని విషాద తీవ్రతను సూచిస్తున్నాయి. అసలు దీన్ని డ్యూయెట్‍గా గానం చేయాలనుకోవడమే ఓ ప్రయోగం. ఎందుకంటే ఇది వ్యక్తిగత దుఃఖం. దానికి మరొకరు ఉత్తమ పురుషలో గొంతు కలపడం సాధారణంగా అతకదు. కాని ఈ పాట నేపథ్యం తండ్రీ కొడుకులిద్దరు కలిసి గానం చేయడం, ఇద్దరి గాత్రంలోని వైరుధ్యం, ఈ పాట శ్రోతలు మెచ్చడానికి కారణం అయింది.
Last night I walked the floor
And the night before
You were on my lonely mind
It seems my life is through
And I’m so doggone blue
You are on my lonely mind
(నిన్నా, ఆ ముందు రాత్రంతా కూడా నేను పచారులు చేస్తూనే గడిపాను. నువ్వే నా ఒంటరి మనసంతా నిండి ఉన్నావు. నా జీవితం ఇక ముగిసినట్లే అనిపిస్తుంది. నీలి మేఘాల విషాదం నాలో అలుముకుని ఉంది.)
ఆమె లేకపోతే నిద్రరాని రాత్రుల్లు, భరించలేని ఒంటరితనం తననెంతగా ఇబ్బంది పెడుతుందో అత్యంత విషాదంగా గానం చేస్తున్నాడు అతను.
I’m gonna keep drinkin’ ‘til I can’t move a toe
And then maybe my heart won’t hurt me so
There’s a tear in my beer
‘Cause I’m crying for you, dear
You were on my lonely mind
(కాలు కదపలేనంత మత్తు నన్ను కప్పేసేదాకా నేను తాగుతూనే ఉంటాను. అప్పుడు కాని నా గుండె నొప్పి ఇంతగా బాధించకపోవచ్చు. నేను తాగుతున్న బీరులో నా కన్నీరు కలిసిపోయింది. నా ఒంటరి మనసంతా ఆక్రమించుకుని ఉన్న నీ కోసం నేను కన్నీరు కారుస్తున్నాను.)
ఆమె లేని ఆ ఒంటరితనంలో ఆ గుండె నొప్పిని భరించలేక, ఏ నొప్పీ తనకు తెలియని మత్తు ఆవహించేదాక తాను తాగుతానని అంటున్నాడతను. నిజానికి ఇద్దరు హాంక్ లు ఈ పాటను గానం చేస్తున్నా, సీనియర్ హాంక్ గొంతులోని విషాదం, ప్రత్యేకంగా వినిపిస్తుంది. హాంక్ జూనియర్, తండ్రి గొంతుకి తన గొంతు కలుపుతూ అతని స్వర స్థాయిని మించకుండా తన స్వరం ఉండేటట్లు ప్రయత్నిస్తున్నట్లు అనిపిస్తుంది.
Lord, I’ve tried and I’ve tried
But my tears, I can’t hide
You are on my lonely mind
All these blues that I’ve found
Have really got me down
You are on my lonely mind
(భగవంతుడా నేను ఎంతో ప్రయత్నించాను కాని ఈ కన్నీటిని దాచలేకపోతున్నాను. నువ్వే నా మనసంతా ఉన్నావు. నేను అనుభవిస్తున్న ఈ విషాదం పూర్తిగా నన్ను అశక్తుడిని చేసేసింది.)
I’m gonna keep drinkin’ ‘til I can’t even think
‘Cause in the last week, I ain’t slept a wink
(నేను ఆలోచించలేనంతగా తాగాలనుకుంటున్నాను. ఈ బాధతో నేను గత వారం రోజులుగా నేను ఒక్క పూట కూడా నిద్రపోలేదు.)
దుఃఖం ముంచేస్తుంటే, జీవితంలో ఏ మాత్రం ఆశ లేకుండాపోతే, వారం రోజులుగా ఒక్క పూట కూడా నిద్రపోలేకపోతే ఆ మనిషి మనస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో హాంక్ గొంతు అంత అసహాయంగానూ తన ఒంటరితనాన్ని పంచుకుంటున్నప్పుడు వింటున్న శ్రోతల మనసంతా ఆ విషాదం ఆవహిస్తుంది.
There’s a tear in my beer
‘Cause I’m crying for you, dear
You were on my lonely mind
తండ్రి కొడుకులు గాయకులుగా పాడిన కంట్రీ డ్యూయెట్లలో ఈ పాట ప్రత్యేక స్థానంలో నిలుస్తుంది. చిన్న పిల్లవాడిగా తండ్రిని పోగొట్టుకున్న హాంక్ విలియమ్స్ జూనియర్ తన తండ్రి గొంతుతో గొంతు కలిపి గానం చేసే అవకాశం ఇచ్చిన టెక్నాలజీ పట్ల శ్రోతలందరికీ గౌరవం కలుగుతుంది. ఇది ప్రజల మధ్యకు రాని హాంక్ సీనియర్ పాట అవడం చేత కూడా ఈ ప్రయోగం విజయవంతమయింది.
అయితే మరణించిన ఇన్నేళ్ల తరవాత కూడా కేవలం ఆరేళ్ళ కెరీర్‌లో హాంక్ విలియమ్స్ సీనియర్ ఎందరో గాయకులను సైతం ప్రభావితం చేసిన కంట్రీ గాయకుడిగా చరిత్రలో నిలిచిపోయారు. ఆ తర్వాత ఎందరో గాయకులు వీరి శైలిని, వీరి బాణీలను, పాటలలోని ఆ విషాదాన్ని తమ గాత్రంలో పలికించే ప్రయత్నం చేసారు. హాంక్ బాటలో నడవడమే కాకుండా తరువాతి తరం గాయకులందరూ ఆయన రచించి పాడిన పాటలను తిరిగి గానం చేసి ఆ పాటలను తమ రికార్డులతో పునః ప్రతిష్ఠ చేశారు.
~
(ఈ పాట యూ ట్యూబ్ లింక్ ఇది..
https://www.youtube.com/watch?v=rM8tROzp4Dc)

