[టామీ వైనెట్ పాడిన ‘టిల్ ఐ కాన్ మేక్ ఇట్ ఆన్ మై ఓన్’ అనే పాటని విశ్లేషిస్తున్నారు పి. జ్యోతి.]
- టామీ వైనెట్ – టిల్ ఐ కాన్ మేక్ ఇట్ ఆన్ మై ఓన్ (1976)
- ఆల్బమ్ – టిల్ ఐ కాన్ మేక్ ఇట్ ఆన్ మై ఓన్ (సింగిల్)
- రచన – బిల్లీ షెరిల్, జార్జ్ రిచీ టామీ వైనెట్
~
ఈ పాటను తన భర్త, సహ కళాకారుడు జార్జ్ జోన్స్తో విడిపోతున్న సందర్భంలో రాసి పాడానని ఆమె చెప్పుకున్నారు. ఈ పాటలోనే వేదన తాను అనుభవిస్తూ పాడానని, అందుకే ఇది తనకు వ్యక్తిగతంగా మనసుకు దగ్గరయిన పాట అని టామీ చెప్పుకున్నారు.
ప్రేమించిన వ్యక్తితో జీవితం సరిపడక విడిపోవలసి రావడం జీవితంలో ఎవరికయినా కష్టసమయమే. ఒక బంధం వీడిపోయి, ఆ లోటును జీవితంలో అంగీకరించి ముందుకు సాగడం అంత సులువైన పని కాదు. ఆ బంధాన్ని, ప్రేమను, మనిషిని వదిలి కొత్త జీవితాన్ని నిర్మించుకోవడం అంత సులువుగా సాగే పని కాదు. ఏ బంధంలో అయినా కొన్నాళ్ళు కలిసి జీవించాక ఒకరికొకరు అలవాటవుతారు. దాన్ని మర్చిపోయి ఒంటరితనాన్ని అంగీకరిస్తూ, మనసుకు అయిన గాయాన్ని నయం చేసుకుంటూ జీవితంలో సంఘర్షించే సమయం ఎన్నో భావోద్వేగాలతో నిండి ఉంటుంది. ఆ కష్టసమయానికి తనను తాను సన్నద్దం చేసుకుంటూ ఆ తర్వాతి ఒంటరితనానికి అలవాటు పడేటప్పుడు ఒక స్త్రీ అనుభవించే వేదనను ఈ పాట వివరిస్తుంది.
I’ll need time to get you off my mind
And I may sometimes bother you
Try to be in touch with you
Even ask too much of you from time to time
(నిన్ను నా మనసు నుండి తొలగించుకోవడానికి నాకు కొంత సమయం కావాలి. కొన్నిసార్లు నేను నిన్ను విసిగించవచ్చు, నీతో మాట్లాడడానికి ప్రయత్నించవచ్చు, నీ నుంచి అప్పుడప్పుడూ చాలా ఆశించనూవచ్చు)
Now and then
Lord, you know I’ll need a friend
And ‘till I get used to losing you
Let me keep on using you
‘Til I can make it on my own
(అప్పుడప్పుడు భగవంతుడా నాకు స్నేహితుల అవసరం ఉంటుందని నీకు తెలుసు. నిన్ను వదులుకోవడానికి నేను అలవాటు పడేదాకా, నాకై నేను సొంతంగా నిలదొక్కుకునేంత వరకు నిన్ను నేను ఇంకొన్నాళ్లు ఉపయోగించుకునే అనుమతి ఇవ్వు)
ఆ సమయంలో ఆమెకు స్నేహితుల అవసరమూ ఉంది. అతనితో కొంత కాలం గడిపాక, ఆ కష్టకాలంలో అతనే స్నేహితుడిగా ప్రవర్తించగలిగితే ఆమెకు ఆ దశను దాటడం సులువవుతుంది. అతన్ని పూర్తిగా తన జీవితం నుండి దూరం చేసేదాకా, తాను పూర్తిగా తన చేతుల్లోకి జీవితాన్ని తీసుకునేదాకా అతన్ని కొంత ఉపయోగించుకుంటానని, దానికి అనుమతి ఇవ్వమని ఆమె అడుగుతుంది.
బంధంలో ఒకరికొకరు అలవాటవడం, కొన్ని విషయాలలో ఒకరిపై ఒకరు అనుకోకుండానే ఆధారపడి జీవించేయడం వల్ల ఇప్పుడు ఒకరికొకరు లేకుండా జీవించడం అన్నది కొంత గందరగోళాన్ని తీసుకొస్తుంది. ఒకరినొకరు ఏదో సందర్భంలో సంప్రదించుకోవలసిన అవసరమూ వస్తుంది. అలాంటి సందర్భాలలో తనకు సహకరించమని ఆమె అభ్యర్ధన, బంధాల నడుమ విషాదాన్ని, జీవితపు కఠిన వాస్తవాలను, బంధాల విచ్చిన్నంలోని వేదనను వివరిస్తుంది.
I’ll get by, but no matter how I try
There’ll be times that you’ll know I’ll call
Chances are my tears will fall
And I’ll have no pride at all, from time to time
(నేను ఈ స్థితి నుండి బైటపడతాను. కాని ఎంత ప్రయత్నించినా కొన్ని సందర్భాలలో నీకు కాల్ చేస్తానని నీకు తెలుసు. అప్పుడు నా కళ్లు వర్షించవచ్చు, నేను కొన్ని సమయాలలో అభిమానాన్ని చంపుకుని ప్రవర్తించవచ్చు)
విడిపోయేటప్పుడు చాలా సందర్భాలలో ఆత్మాభిమానాన్ని వదులుకుని వ్యక్తులు అవతలి వారి వద్ద తమ అసహాయతను ప్రకటిస్తూ ఉంటారు. నిజానికి ఇది చాలా దయనీయమైన స్థితి. ఆ విషాదాన్ని అధిగమించే ప్రయత్నంలో బలహీన మనస్కులై తడబాటుకు గురై వారు ప్రవర్తించే తీరు శాశ్వతంగా వారి వ్యక్తిత్వంగా మిగిలి ఉండిపోదు. అది గడిచిపోయే సమయమే. ఆ తడబాటును దాటి వాస్తవాన్ని స్వీకరించి ముందుకు సాగక తప్పదు. కాని దానికి కొంత సమయం పడుతుంది.
ఈ పాటను వింటుంటే గొప్ప మానసిక విశ్లేషకులు రాసినట్లు అనిపిస్తుంది. తమకు ఏం జరుగుతుందో, తాము ఎందుకు అలా ప్రవర్తిస్తున్నరో తెలుసుకుని, ఆ అసహయ క్షణాలలోని విషాదాన్ని, అవసరాన్ని కూడా గుర్తించి విశ్లేషించుకోవడం గొప్ప ఆలోచనాపరులకే సాధ్యం. ఎంతటి బలవంతులైనా జీవితంలో కొన్ని సందర్భాలలో బలహీనపడడం జరుగుతుందని ఈ పాట మనకు వివరిస్తుంది.
But they say, oh, there’ll be a brighter day
But ‘til then I lean on you
That’s all I mean to do
‘Til I can make it on my own
(వాళ్లు మంచి రోజులు వస్తాయని అంటున్నారు. కాని అప్పటిదాకా నీపై నేను ఆధారపడి ఉంటాను. నాకై నేనే సొంతంగా నిలదొక్కుకునేంత వరకు నేనిలా ప్రవర్తిస్తాను)
అతని జీవితం నుండి దూరమయే ప్రయత్నంలో తాను ఎలాంటి సంఘర్షణను అనుభవించబోతుందో చెబుతూ మంచిరోజులు వస్తాయని అందరూ అంటున్నారని, కాని అప్పటి దాకా అతనిపై ఆధారపడే స్థితిలో తాను కొన్నాళ్ళు ఉండవలసి వస్తుందని ఆమె వివరుస్తున్నప్పుడు టామీ గొంతులో ద్వనించే విషాదం కోసం ఈ పాట వినాలి. ఈ వాక్యాలను అద్భుతంగా గానం చేస్తుందామె.
Surely someday I’ll look up and see the morning sun
Without another lonely night behind me
Then I’ll know I’m over you and all my crying’s done
No more hurtin’ memories can find me
(తప్పకుండా ఏదో ఒక రోజు నేను రాత్రి ఒంటరితనాన్ని దాటుకుని పగటి సూర్యుడి వైపు చూస్తాను. నిన్ను ఇక దాటి వచ్చేసానని, నా ఏడుపు ఇప్పుడు పూర్తయిందని, నన్ను ఇంకే జ్ఞాపకాలు బాధపెట్టవని అప్పుడు తెలుసుకుంటాను)
వాళిద్దరూ విడిపోవడం అవసరం. కాని ఇద్దరు మనుష్యులు కలిసి ఉండే క్రమంలో అది సరిపడని బంధమయినా, కలిసి ఉన్న జ్ఞాపకాలుగా వారిని కొన్నాళ్ళు వెంటాడుతాయి. మనుష్యులను వదిలినంత సులువుగా జ్ఞాపకాలను, అనుభవాలను వదిలించుకోలేం. అవి మన మనసుల్లో ఉండిపోయి అప్పుడప్పుడూ బైటికి వస్తూ బాధిస్తూ ఉంటాయి. ఆ జ్ఞాపకాలు బాధించని స్థితికి చేరుకునే క్రమంలో మనుషులు కొంత సంఘర్షణను గురవుతారు. గడిచిపోయిన కాలం పంచిన జ్ఞాపకాలను తుడిచేయడంలోని కష్టాన్ని, ఘర్షణను ఈ పాట గొప్పగా చిత్రీకరిస్తుంది.
But ‘til then
Lord, You know I’m gonna need a friend
‘Til I get used to losing you
Let me keep on using you
‘Til I can make it on my own
‘Til I can make it on my own
(కాని అప్పటిదాకా భగవంతుడా నాకు స్నేహితుల అవసరం ఉంటుందని నీకు తెలుసు. నిన్ను వదులుకోవడానికి నేను అలవాటు పడేదాకా, నాకు నేనే సొంతంగా నిలదొక్కుకునేంత వరకు నిన్ను నేను ఇంకొన్నాళ్లు ఉపయోగించుకునే అనుమతి ఇవ్వు)
మనుషులు కలిసి జీవించలేనప్పుడు, విడిపోవడం తప్పనప్పుడు దూరం అవుతూ స్నేహితులుగా సెలవు తీసుకోవడం ఉత్తమం. ఆ స్నేహపూరిత వీడ్కోలు కష్టంగానే ఉన్నాఅది అవసరం కూడా. ఇది అర్థం చేసుకుంటే జీవితాన్ని కోపంతోనూ, కసితోను కాక ఆలోచనతో జీవించే అవకాశం ఉంటుంది. విడిపోవడంలోని సంఘర్షణను ఇంత ఆలోచనాత్మకంగా వ్యక్తీకరించే గీతం నాకు తెలిసి ఇదొక్కటే. అందుకే ఇది నాకు చాలా ప్రత్యేకంగానూ, నిజాయితీతో, విషాదంతో పాటు ఆత్మగౌరవాన్ని సమపాళ్లలో స్పృశించిన పాటగా అనిపిస్తుంది. టామీ గానం చేసిన విధానం చాలా గొప్పగా ఉంటుంది. దీన్ని ఆ తర్వాత కెన్నీ రోగర్స్, డాటి వెస్ట్ కూడా రికార్డ్ చేసారు. కాని ఎందుకో టామీ పాడిన గీతమే నాతో పాటు చాలా మంది ఇష్టపడతారు.
ఈ పాటను క్రింది యూ ట్యూబ్ లింక్ లో వినండి..
https://www.youtube.com/watch?v=k0Al-BIHST4

