Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఓ విషాద – తీపి గుర్తుగా నిలిచిపోయిన పాట ‘టిల్ ఎ టియర్ బికమ్స్ ఎ రోజ్’

[కీత్ విట్లీ, లారీ మోర్గాన్‌ పాడిన ‘టిల్ ఎ టియర్ బికమ్స్ ఎ రోజ్’ అనే పాటని విశ్లేషిస్తున్నారు పి. జ్యోతి.]

~

కీత్ విట్లీ తన జీవితకాలంలో రికార్డు చేసిన యుగళగీతాలను రెండే. భార్య లారీ మోర్గాన్‌తో కలిసి రికార్డ్ చేసిన ‘టిల్ ఎ టియర్ బికమ్స్ ఎ రోజ్’ అతని మరణానంతరం రిలీజ్ అయింది. ఇది కాక ‘బ్రదర్లీ లవ్’ అనే మరో పాటను 1987లో ఎర్ల్ థామస్ కాన్లీతో రికార్డ్ చేశారు కీత్. కానీ ఇది కూడా అతని మరణం తర్వాతే 1991లో విడుదలైంది.

కీత్ విట్లీ భార్య, లోరెట్టా లిన్ మోర్గాన్ (జననం జూన్ 27, 1959) ప్రఖ్యాత కంట్రీ గాయకుడు జార్జ్ మోర్గాన్ కుమార్తె. మోర్గాన్ 13 సంవత్సరాల వయస్సు నుండి గాయనిగా స్టేజ్ షోలు ఇచ్చేవారు. 1979లోనే ఈమె మొదటి సింగిల్‌ చార్ట్‌లో చేరింది. ఆమె మొదటి రెండు RCA ఆల్బమ్‌లు (లీవ్ ది లైట్ ఆన్, సమ్‌థింగ్ ఇన్ రెడ్) అలాగే ఆమె BNA ఆల్బమ్ ‘వాచ్ మీ’ రికార్డింగ్ ఇండస్ట్రీ అసోసియేషన్ ఆఫ్ అమెరికా (RIAA) ప్లాటినం సర్టిఫికేట్ పొందాయి. కీత్ వెట్లీని ఆమె 1986లో వివాహం చేసుకున్నారు. రెండున్నర సంవత్సరాల వీరి వైవాహిక జీవితంలో వీరికి ఓ కొడుకు కూడా ఉన్నాడు. కీత్ బ్రతికి ఉంటే ఇంకా ఎన్నో పాటలు వీరిద్దరూ కలిసి పాడేవారేమో కాని ఇదొక్కటే వారిద్దరు డ్యూయెట్‌గా కీట్ మరణించిన తర్వాత రిలీజ్ అయింది.

‘టిల్ ఎ టియర్ బికమ్స్ ఎ రోజ్’ అనే పాటను మొదట అమెరికన్ కంట్రీ మ్యూజిక్ ఆర్టిస్ట్ లియోన్ ఎవెరెట్ రికార్డ్ చేశారు. ఇది 1985లో అతని ఆల్బమ్ ‘వేర్ ఈజ్ ది ఫైర్’ నుండి విడుదలైంది. ఈ పాట హాట్ కంట్రీ సాంగ్స్‌లో 44వ స్థానానికి చేరుకుంది. తరువాత కీత్ విట్లీ దీనినే లారీ మోర్గాన్‌తో కలిసి యుగళగీతంగా పాడారు. అతని మరణానంతరం జూలై 1990లో విడుదలైన ఈ పాట అతని ‘గ్రేటెస్ట్ హిట్స్’ ఆల్బమ్‌లోని ఏకైక సింగిల్. ఈ వెర్షన్ కంట్రీ సింగిల్స్ చార్టులలో 13వ స్థానానికి చేరుకోవడమే కాక, కంట్రీ మ్యూజిక్ అసోసియేషన్ అవార్డులలో వోకల్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కూడా గెలుచుకుంది.

ఆ తర్వాత ఇదే పాటను 1990లో జాన్ బ్రౌన్ తన ఆల్బమ్ ‘టెల్ మీ వై’ కోసం రికార్డ్ చేస్తే, జాన్ ప్రిన్, ఫియోనా వీలన్ ప్రిన్‌లు 1999లో తమ ఆల్బమ్ ‘ఇన్ స్పైట్ ఆఫ్ అవర్సెల్వ్స్’ కోసం ఈ పాటను మళ్లీ రికార్డ్ చేసారు. 2015లో, మూన్ త్రోబ్యాక్ CD కోసం కెవిన్ మూన్, బ్లూగ్రాస్ కళాకారుడు రోండా విన్సెంట్ ఈ పాటనే సరికొత్తగా పాడి విడుదల చేశారు. కాని కీత్ వర్షన్‌కే అభిమానులు ఎక్కువ.

కీత్ పాటలన్నిటిలోనూ అంతర్లీనంగా ద్వనించే ఆర్ద్రతే ఈ పాట ప్రత్యేకత. ఇది ప్రేమ గీతమే అయినా ప్రేమికులు వారి మనసుల్లోని అంతులేని దుఃఖానికి ఒకరికొకరు బాసటగా నిలిచి సాంత్వన చేకూర్చుకునే ప్రయత్నం, ఒకరికొకరుగా తాముంటాం అనే మాటను ఇచ్చిపుచ్చుకోవడం ఇందులో కనిపిస్తుంది.

Darling I can see the clouds around you
And in your heart I know a sorrow grows
But if you weep I’ll be right here to hold you
‘Til each tear you cry becomes a rose

(ప్రియా నీ చుట్టూ కమ్ముకున్న మేఘాలు నాకు కనిపిస్తున్నాయి. నీ మనసులో ఒక విషాదం పెరుగుతోందని నాకు తెలుసు. నువ్వు ఏడుస్తే మాత్రం నీ కళ్ల నుండి వెలువడే ప్రతి కన్నీటి బొట్టు ఓ గులాబిగా మారేదాకా నేను నీ పక్కన నిలబడే ఉంటాను.)

ఆమె దుఃఖాన్ని, దాని వెనుక ఉన్న కారణాన్ని, గడిచిన గతాన్ని తుడిచే శక్తి అతనికి లేదు. కాని ఆమె ప్రతి కన్నీటి బొట్టు ఓ గులాబిగా మారే దాకా, ఆమె ప్రతి కష్టం సుఖంగా మార్పు చెందేదాకా తాను ఆమెను విడిచి వెళ్లనని ఆమె పక్కన తోడుగా నీడగా కనిపెట్టుకుని ఎప్పుడూ ఉంటానని ఆ ప్రియుడు ప్రియురాలికి మాట ఇస్తున్నాడు.

Dearest love I know your heart is shattered
And all my words can offer no relief
But my love will heal the pain you’ve suffered
And I’ll be here if you should turn to me

(ప్రియమైన ప్రేమికుడా, నాకు తెలుసు నీ మనసు ముక్కలయిందని, నా మాటలు నిన్ను ఎక్కువగా సాంత్వనపరచవని, కాని నా ప్రేమ నువ్వు అనుభవించిన బాధను నయంచేయగలదు. నువ్వు నా వైపు తిరిగితే చాలు, నేను నీ చెంతనే ఉండిపోతాను)

నిజానికి ఇది సోలో కోసం రాసిన గీతం. కాని డ్యూయెట్‌గా మార్చి ఈ చరణాన్ని లారి మార్గన్‌తో పాడించాడు కీత్. తాను ప్రియుడి గాయాలను తన ప్రేమతో మాన్పగలని, అతను అనుమతిస్తే, తనను స్వీకరిస్తే అతని పక్కనే ఉండిపోగలనని ఆమె వాగ్దానం చేస్తుంది. జీవితంలో గాయపడిన రెండు హృదయాలు ఒకరికొకరు ఓదార్పుపుగా మారుతూ కొత్త బంధాన్ని నిర్మించుకోవడానికి ఒకరి నుండి మరొకరు పరస్పర సహకారం అందించుకుంటూ కనిపిస్తారు.

Darling I can see the clouds around you
And in your heart I know a sorrow grows
But if you weep I’ll be right here to hold you
‘Til each tear you cry becomes a rose

(ప్రియా నీ చుట్టూ కమ్ముకున్న మేఘాలు నాకు కనిపిస్తున్నాయి. నీ మనసులో ఒక విషాదం పెరుగుతోందని నాకు తెలుసు. నువ్వు ఏడుస్తే మాత్రం నీ కళ్ల నుండి వెలువడే ప్రతి కన్నీటి బొట్టు ఓ గులాబిగా మారేదాకా నేను నీ పక్కన నిలబడే ఉంటాను.)

ఇక్కడ ప్ల్లల్లవిని ఇద్దరూ కలిసి గానం చేయడం బావుంటుంది.

In deepest night when memories tend to gather
Lay with me and put your fears to sleep
Cause there’s no pain no dream can put as under
All the love that binds you and me

(చిక్కటి రాత్రి, జ్ఞాపకాలు ముసురుకునే సమయాన నా పక్కన పడుకుని నీ భయాలను నిద్రపుచ్చు. మనిద్దరిని కలిపి ఉంచే ప్రేమ ఎటువంటి బాధనయినా కలగా మారి దూరం చేయగలదు)

ఈ చరణం కీత్ పాడతాడు. చీకటి ముసిరిన ఏకాంత వేళ గతం తాలుకు జ్ఞాపకాలు ఇబ్బంది పెడుతుంటే తన పక్కన పడుకుని అన్ని భయాలను వీడి పాత గాయాలను నిద్రపుచ్చమని అతను చెపుతున్నాడు. వారిద్దరి మధ్య ఉన్న ప్రేమ ఎటువంటి గాయానయినా మాన్పగలదని, ఎంతటి దుఃఖాన్నయినా తీర్చగలదని, ఒకరికి దగ్గరగా మరొకరు ఉంటే వారిని ఏ వేదనా ఇక బాధపెట్టబోదని అతని నమ్మకం.

Darling I can see the clouds around you
And in your heart I know a sorrow grows
But if you weep I’ll be right here to hold you
‘Til each tear you cry becomes a rose
‘Til each tear you cry becomes a rose

(ప్రియా నీ చుట్టూ కమ్ముకున్న మేఘాలు నాకు కనిపిస్తున్నాయి. నీ మనసులో ఒక విషాదం పెరుగుతోందని నాకు తెలుసు. నువ్వు ఏడుస్తే మాత్రం నీ కళ్ల నుండి వెలువడే ప్రతి కన్నీటి బొట్టు ఓ గులాబిగా మారేదాకా నేను నీ పక్కన నిలబడే ఉంటాను.)

ఇందులో సాహిత్యం కన్నా పాటను గానం చేసిన విధానం బాగా ఆకట్టుకుంటుంది. ‘Till each tear you cry becomes a rose అనే వాక్యం ప్రేమికుల మధ్య చాలా పాపులర్ ఎక్స్‌ప్రెషన్. ఈ పాటను లారీ ఆ తరువాత తన స్టేజ్ షోలలో ఎన్నోసార్లు పాడింది. కీత్ గానం చేసిన వాక్యాలు రికార్డ్‌లో వస్తూ ఉంటే, దానికి తన స్వరం జోడించి ఆమె ఆ పాట పాడుతుంటే ఆ ప్రదర్శనను చూస్తున్న అభిమానులు కన్నీళ్ళ పర్యంతం అయ్యేవాళ్ళు. అలా ఈ పాట అభిమానుల మనసుల్లో ఓ విషాద – తీపి గుర్తుగా నిలిచిపోయింది.

~

ఈ పాటని యూట్యూబ్‌లో వినవచ్చు/చూడవచ్చు:
https://youtu.be/SlY12EETu7k?si=zCn1u1wsfHdR7WdI

Exit mobile version