[శ్రీ పుల్లెల వెంకట శివ ప్రసాద్ గారు రచించిన ‘తిరిగి వచ్చిన దీపం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక – బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో సాధారణ ప్రచురణకి ఎంపికైన కథ.]
గుంటూరు జిల్లాలోని తెనాలి పక్కన ఉన్న చిన్న ఊరు కొలకలూరు. ఆ ఊరిలో వితంతువు ప్రమీల, తన ఒక్కగానొక్క కూతురు అనితతో కలిసి చిన్న రేకుల ఇంట్లో ఉండేది. భర్త పోయాక, ప్రమీల ఇంటింటికీ తిరిగి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొచ్చేది.
అనిత చదువులో చురుకు. ఉదయం 7 గంటలకే జడ వేసుకుని, నలిగిన యూనిఫాం వేసుకుని ప్రభుత్వ జూనియర్ కాలేజీకి వెళ్లేది. కానీ సాయంత్రం అయ్యేసరికి ఆమె రూపం మారిపోయేది.
‘సంజీవని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్’ లో స్వీపర్ కమ్ అటెండెంట్‌గా చేరింది అనిత. సాయంత్రం 4 నుంచి రాత్రి 10 వరకు వార్డులు తుడవడం, పేషెంట్లకు నీళ్లు అందించడం, నర్సులకు సాయం చేయడం. చేతులు డెటాల్ వాసన కొడుతున్నా, కళ్లలో మాత్రం డాక్టర్ కావాలనే కల మెరిసేది. వచ్చిన 4000 రూపాయల జీతం అమ్మ చేతిలో పెట్టేది.
ఒక రోజు పిల్లల వార్డు తుడుస్తుండగా, ఒక పాప జ్వరంతో ఏడుస్తుంటే, చూసింది. డాక్టర్ రాకముందే, తడి గుడ్డతో పాప నుదురు తుడిచింది. ఆ పాప తల్లి “తల్లీ, నువ్వు డాక్టర్ అయితే బాగుండు” అని దీవించింది. ఆ మాట అనిత గుండెల్లో నాటుకుపోయింది.
ఇంటర్మీడియట్ అయ్యాక, రాత్రి హాస్పిటల్ డ్యూటీ ముగించి, ఇంట్లో కాంతి లేనిలో ఓల్టేజ్ లైట్ కింద కూర్చుని ఎంసెట్‌కి ప్రిపేర్ అయ్యేది. ప్రమీల కూతురికి వడ్డిస్తూ “అమ్మా, నీ కష్టం వృథా పోదు” అనేది.
ఎంసెట్ ఫలితాలు వచ్చాయి. అనితకు 1,240 ర్యాంక్. గుంటూరు మెడికల్ కాలేజీలో MBBS సీటు వచ్చింది. ఊరంతా సంబరం. సంజీవని హాస్పిటల్ MD డాక్టర్ రాఘవేంద్రరావు గారు స్వయంగా వచ్చి ప్రమీలను, అనితను అభినందించారు. ఫీజు కోసం హాస్పిటల్ స్టాఫ్ అంతా చందాలు వేసుకున్నారు.
ఎంబీబీఎస్ అయ్యాక, అనిత చైల్డ్ స్పెషలిస్ట్ – డీసీహెచ్ చేసింది. హైదరాబాద్లో పెద్ద హాస్పిటల్లో పనిచేసే అవకాశం వచ్చినా వదిలేసింది.
***
10 ఏళ్ల తర్వాత, ఒక ఉదయం సంజీవని హాస్పిటల్ గేటు దగ్గర ఒక కారు ఆగింది. కారు దిగింది డా. అనిత, MBBS, DCH. చైల్డ్ స్పెషలిస్ట్. చేతిలో స్టెతస్కోప్, మెడలో ID కార్డు.
రిసెప్షన్లో ఉన్న సుబ్బారావు లేచి నిలబడి “గుడ్ మార్నింగ్ డాక్టర్” అన్నాడు. కొన్ని ఏళ్ల క్రితం ఇదే సుబ్బారావు “ఏయ్ పిల్లా, ఫ్లోర్ త్వరగా తుడువు, డాక్టర్ గారు రౌండ్స్‌కి వస్తున్నారు” అని గదమాయించేవాడు. అనిత చిన్నగా నవ్వి తల ఊపింది.
పిల్లల వార్డుకు వెళ్లేసరికి నర్స్ లక్ష్మి పరిగెత్తుకుంటూ వచ్చింది. లక్ష్మి ఒకప్పుడు అనితతో పాటు నైట్ షిఫ్ట్ చేసేది. ఇప్పుడు సెల్యూట్ కొట్టి “మేడం, బెడ్ నెం. 3 లో పాపకి 103 జ్వరం” అంది.
అనిత స్టెతస్కోప్ చెవిలో పెట్టుకుని పాపను చెక్ చేసింది. చేతులు వణుకుతున్నాయి. కానీ 10 ఏళ్ల క్రితం ఇదే వార్డులో నేల మీద కూర్చుని జ్వరంతో వణుకుతున్న పిల్లల నుదుటిని తడి గుడ్డతో తుడిచిన అనుభవం ఆమెకు ధైర్యం ఇచ్చింది. ట్రీట్మెంట్ రాసింది. ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చింది.
మధ్యాహ్నం లంచ్ టైంలో, పాత స్టాఫ్ క్యాంటీన్‌కు వెళ్లింది. ఒకప్పుడు అక్కడ టీ ఇచ్చే రాములమ్మ అనితను చూసి కళ్లనీళ్లు పెట్టుకుంది. “నా తల్లీ, నువ్వు డాక్టర్ అవుతావని నాకు తెలుసు” అంటూ దోసెడు పులిహోర చేతిలో పెట్టింది.
సాయంత్రం 5 గంటలకు డాక్టర్ రాఘవేంద్రరావు గారు అనితను తన ఛాంబర్‌కి పిలిపించారు. “అమ్మా అనిత, ఈ హాస్పిటల్‌కి నువ్వు కొత్త రక్తం. రేపటి నుంచి పీడియాట్రిక్ వార్డ్ ఇన్‌చార్జ్‌వి నువ్వే” అన్నారు. ఫైల్ అందించారు.
అనిత ఫైల్ తెరిచింది. మొదటి పేజీలో ఇలా రాసుంది:
“To be appointed as Head of Paediatrics: Dr. Anitha. Recommended by: Mrs. Prameela, Senior Advisor, Sanjeevani Trust.”
తెలుగులోకి అనువదిస్తే
“సంజీవని ట్రస్ట్‌కి సీనియర్ అడ్వైసర్ అయిన శ్రీమతి ప్రమీల గారి రికమండేషన్‌తో, పెడియాట్రిక్స్ డిపార్ట్మెంట్కి హెడ్‌గా డాక్టర్ అనితను నియమించడమైనది”.
అనితకు గుండె ఆగినంత పనైంది. “సార్, మా అమ్మా? సీనియర్ అడ్వైజరా?” అంది.
***
డాక్టర్ రాఘవేంద్రరావు గారు కళ్లద్దాలు తీసి నవ్వారు. “డాక్టర్ అనితా, నువ్వు కొన్ని ఏళ్ల క్రితం ఇక్కడ స్వీపర్‌గా చేరిన రోజు, మీ అమ్మ ప్రమీల నా ఛాంబర్‌కి వచ్చింది. ‘సార్, మా పాప చదువుకోవాలి. డాక్టర్ అవ్వాలి. దానికి ఏ పని ఇచ్చినా చేస్తుంది’ అని బ్రతిమిలాడింది. నేను కాదన్నాను.”
“మరి నాకు ఉద్యోగం ఎలా ఇచ్చారు?” అనిత ఆశ్చర్యపోయింది.
“ఆ మర్నాడు నీ అమ్మ మళ్ళీ వచ్చింది. చేతిలో ఒక చిన్న డబ్బా. ‘సార్, ఇది మా ఆయన నాకిచ్చిన ఒక్క పొలం. ఎకరం పొలం. దీన్ని అమ్మేసి, ఆ డబ్బు హాస్పిటల్ ట్రస్ట్‌కి డొనేట్ చేస్తాను. ఒక్క షరతు: మా అనితను పనిలో పెట్టుకోండి. జీతం వద్దు. కానీ రాత్రి చదువుకోనివ్వండి’ అంది.”
అనిత స్తబ్ధురాలైంది.
“ఆ రోజు మీ అమ్మ గారు ఇచ్చిన ఎకరం పొలం విలువ ఆ తరువాత తరువాత, 2 కోట్లు రూపాయలు అయ్యింది. ఆ డబ్బుతోనే మనం పీడియాట్రిక్ వింగ్ కట్టాం. ట్రస్ట్ రూల్స్ ప్రకారం, మేజర్ డోనర్‌ని సీనియర్ అడ్వైజర్‌గా నియమించాలి. చాలా ఏళ్లుగా మీ అమ్మ ప్రమీలనే మన సీనియర్ అడ్వైజర్. నీ ఎంబీబీఎస్ ఫీజుకి చందాలు వేశామని నువ్వు అనుకున్నావ్. నిజానికి ఆ డబ్బు మీ అమ్మ గారి పొలం అమ్మగా వచ్చిన వడ్డీనే.”
“మరి అమ్మ నాకెందుకు చెప్పలేదు?” అనిత గొంతు వణికింది.
“నువ్వు నీ కష్టంతో పైకి రావాలని. ఈ రోజు నీ అపాయింట్మెంట్ ఫైల్ మీద సంతకం పెట్టింది కూడా మీ అమ్మే.”
అనిత ఫైల్ వెనక్కి తిప్పి చూసింది. వణుకుతున్న చేతిరాతతో సంతకం: ప్రమీల. పక్కన చిన్న నోట్: “నా కూతురికి ఇంతకన్నా పెద్ద గిఫ్ట్ ఏముంటుంది.”
ఆ క్షణం అనితకు అర్థమైంది: తాను తుడిచిన నేల, తాను చదివిన లైట్, తాను సంపాదించిన డిగ్రీలు – అన్నిటి వెనుక అమ్మ అమ్మేసిన ఎకరం పొలం, చెప్పని త్యాగం ఉంది.
డాక్టర్‌గా తిరిగి వచ్చింది అనిత. కానీ ఆ హాస్పిటల్ని తనకోసం కొన్ని ఏళ్ల ముందే ఏర్పాటు చేసింది ప్రమీల.
చీపురు పట్టుకున్న కూతుర్ని చూసి ఏడ్చిన అమ్మ, ఆ చీపురు పడేసి స్టెతస్కోప్ పట్టుకునే దారిని రహస్యంగా పరిచిందని అనితకు ఆ రోజే తెలిసింది.
