[డాలీ పార్టన్, లిండా రోన్‌స్టాడ్ట్, ఎమ్మిలో హారిస్ పాడిన ‘టు నో హిమ్ ఈజ్ టు లవ్ హిమ్’ అనే పాటను విశ్లేషిస్తున్నారు పి. జ్యోతి.]
- డాలీ పార్టన్, లిండా రోన్‌స్టాడ్ట్, ఎమ్మిలో హారిస్ – ‘టు నో హిమ్ ఈజ్ టు లవ్ హిమ్’
- ఆల్బమ్ – ట్రియో (1987)
- ప్రొడ్యూసర్ – జార్జ్ మాసెన్బర్గ్
- రచన – ఫిల్ స్పెక్టర్
~
డాలీ పార్టన్ ఆనాటి కంట్రీ గాయకుల నుండి నేటి తరం గాయకుల దాకా ఎందరితోనే డ్యూయెట్ గీతాలు పాడుతూనే ఉన్నారు. ఆమె గాత్రంతో తమ పాటలను హిట్ చేయించుకున్న నేటి తరం గాయకులు చాలా మంది కనిపిస్తారు. ఆమె తోటి గాయకులతో విడుదల చేసిన ఆల్బమ్‌లు అన్నిటిలోనూ విలక్షణమైన ఆల్బం ‘ట్రియో’. ఇందులో డాలి తన తోటి ఇద్దరు కంట్రీ మహిళా గాయకులతో కల్సి పాటలు పాడారు. పూర్తి కంట్రీ శైలిలో స్వరపరచిన ఈ పాటలు, ఎక్కువగా కంట్రీ మ్యూజిక్ వినని వారిని కూడా ఆ జానర్ వైపుకు లాక్కు వచ్చాయి. వారికి ఆ సంగీత మాధుర్యాన్ని పరిచయం చేశాయి. దానికి ఉదాహరణగా ‘టు నో హిమ్ ఈజ్ టు లవ్ హిమ్’ అనే ఈ పాటను చర్చించుకుందాం.
ఈ పాటకు అంతకు ఉందే ఓ చరిత్ర ఉంది. ఫిల్ స్పెక్టర్ అనే గాయకుడు తన తండ్రి సమాధి రాయిపై ఉన్న ‘టు నో హిమ్ వాజ్ టు లవ్ హిమ్’ అనే వాక్యం నుండి ప్రేరణ పొంది ఈ పాటను రాసుకున్నాడు. దీనిని మొదట అతను సభ్యుడిగా ఉన్న టెడ్డీ బేర్స్ అనే బృందం రికార్డ్ చేసింది. ఈ సింగిల్ 1958లో బిల్‌బోర్డ్ హాట్ 100 చార్ట్‌లో మూడు వారాలు నంబర్ 1 స్థానంలో నిలిచింది. అయితే ఇది పూర్తి పాప్ స్టైల్ లో గానం చేసిన గీతం. దీన్ని తీసుకుని 1987లో, డాలీ పార్టన్, లిండా రోన్‌స్టాడ్ట్, ఎమ్మిలో హారిస్‌లు ‘ట్రియో’గా ఏర్పడి పూర్తి కంట్రీ బాణిలో దీన్ని గానం చేశారు. ఈ ఆల్బమ్ బృందగానంలో ఉత్తమ కంట్రీ పెర్ఫార్మెన్స్‌కు గ్రామీ అవార్డును గెలుచుకుంది. ఇది మైఖేల్ జాక్సన్, U2, ప్రిన్స్, విట్నీ హ్యూస్టన్‌తో పాటు ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ గా కూడా నామినేట్ అయింది. 1987 అకాడమీ ఆఫ్ కంట్రీ మ్యూజిక్ అవార్డును ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్‌గా గెలుచుకుంది. 1988 వేడుకలో కంట్రీ మ్యూజిక్ అసోసియేషన్ అవార్డులలో వోకల్ ఈవెంట్ ఆఫ్ ది ఇయర్‌ను గెలుచుకుంది.
To know, know, know him
Is to love, love, love him
Just to see him smile
Makes my life worthwhile
To know, know, know him
Is to love, love, love him
And I do
(అతన్ని తెలుసుకోవడం అంటే అతన్ని ప్రేమించడమే, అతని చిరునవ్వు నవ్వుతుంటే చూడడమే నా జీవితాన్ని అర్థవంతం చేస్తుంది. అతన్ని తెలుసుకోవమే అతన్ని ప్రేమించడం, నేను అదే చేస్తున్నాను)
తాను ప్రేమిస్తున్న వ్యక్తి గురించి తెలుసుకుంటున్న కొద్దీ, అతనిపై ప్రేమ ఎంతగా పెరుగుతోందో ముగ్గురు స్నేహితులు కలిసి చెప్పుకుంటూ, ఈ తెలుసుకోవడమే ప్రేమించడం అంటే అనే భావాన్ని అంగీకరిస్తూ తమ తొలి ప్రేమానుభూతిని ఒకరితో మరొకరు పంచుకుంటున్నారు. అమాయకత్వం, నమ్మకం, జీవితంపై ఎంతో ఆశ, కోరిక వారి గాత్రం నుండి ప్రవహిస్తూ ఉంటాయి.
I’ll be good to him
I’ll bring love to him
Everyone says there’ll come a day
When I’ll walk alongside of him
Yes, just to know him
Is to love love love him
And I do
(నేను అతనితో మంచిగా ఉంటాను, అతని జీవితంలోకి ప్రేమను తీసుకొస్తాను. అందరూ అంటున్నారు అతని పక్కన నేను నడిచే రోజు తప్పకుండా వస్తుందని. నిజం. అతన్ని తెలుసుకోవడం అతన్ని ప్రేమించడమే. నేను అదే చేస్తున్నాను)
ఆమె ప్రేమ ఇంకా మొదటి దశలోనే ఉంది. అతను ఆమెకు నచ్చాడు. అతన్ని చూస్తూ, అతని గురించి తెలుసుకుంటూ అతనిపై తనకున్న ఆసక్తిని స్నేహితులతో పంచుకుంటూ ఆమె ఎంతో ఆనందం అనుభవిస్తుంది. ప్రేమలోకి దిగుతున్న కొత్తలో ప్రియుడిను చూస్తూ చూపులతో ఆనందిస్తున్న కాలంలో ఇంకా పెరగని సాంగత్యం, మనసులో పెరుగుతున్న కోరిక, అతని గురించి అంతా తెలుసుకోవలనే ఆత్రం, వీటన్నిటినీ ఒకే సారి అనుభవిస్తున్న అమ్మాయి మనసును ఈ చరణం వ్యక్తీకరిస్తుంది.
Why can’t he see
How blind can he be?
Someday he will see
That he was meant for me, oh
To know, know, know him
Is to love love love him
(అతనికి ఎందుకు ఇదంతా కనిపించట్లేదు? అతనంత గుడ్డిగా ఎలా ఉండగలుగుతున్నాడు? ఏదో రోజు అతను చూస్తాడు. అతనున్నది నా కోసమే అని తెలుసుకుంటాడు. అతన్ని తెలుసుకోవడం అతన్ని ప్రేమించడమే)
ఆమె ప్రేమిస్తుంది. ఆశగా అతన్ని చూస్తుంది. అతనిపట్ల అమెకున్న ఆసక్తి అందరికీ తెలుసు. కాని అతను మాత్రం ఏమీ తెలియనట్లే ఉంటున్నాడు. ఈమె మనసులోని ఘర్షణను చూసి చూడనట్లు ప్రవర్తిస్తున్నాడు. అంత గుడ్డిగా ఎలా ఉంటున్నాడు అని బాధపడుతూనే, ఏదో ఒక రోజు అతనికి తన ప్రేమ చేరుతుందని, తాను అతని కోసమే ఎదురుచూస్తున్నానని అతను తెలుసుకుంటాడని నమ్ముతూ తాను అనుభవిస్తున్న ప్రేమ పారవశ్యంలో ఆమె తేలిపోతోంది.
Just to see him smile
Makes my life worthwhile
To know, know, know him
Is to love love love him
And I do
(అతన్ని నవ్వుతూ చూస్తూ ఉండడమే నా జీవితానికో అర్థాన్ని తీసుకొస్తుంది. అతన్ని తెలుసుకోవడం అంటే అతన్ని ప్రేమించడమే.. నేను అదే చేస్తున్నాను)
తమ మొదటి ప్రేమాకర్షణలోని మాధుర్యాన్ని అనుభవిస్తూ ముగ్గురు అమ్మాయిలు కలిసి కూర్చుని పాడే ఈ పాట వారి అమాయకత్వం, భవిష్యత్తుపై వారికున్ననమ్మకంలోకి మనల్ని కూడా తీసుకెళుతుంది.
ఈ పాటను ఈ గాయకులు ముగ్గురు ఎంతో స్వరనియంత్రణతో ఆలపించడం దీనికో అందాన్ని తీసుకొచ్చింది. తమ గొంతులతో వాళ్లు మీటే ఆ స్వరాలు, ఆ విరుపులు వినడం చాలా బావుంటుంది. హాయిగా తేలిగ్గా వినిపిస్తూనే గొప్ప కంట్రోల్‌తో తమ వోకల్స్‌పై పట్టుతో సాగే వారి గానం కంట్రీ మ్యూజిక్ సౌందర్యానికి ఓ ఉదాహరణగా ఈ పాటను నిలుపుతాయి.
~
ఈ పాటని యూట్యూబ్‌లో వినవచ్చు/చూడవచ్చు:
(https://youtu.be/Kw1zqSqCvNY?si=KkluQ5_3dsJSB6np )

