Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తోకచుక్కలను పరిశోధించిన ఎడ్మండ్ హేలీ

[బాలబాలికల కోసం ‘తోకచుక్కలను పరిశోధించిన ఎడ్మండ్ హేలీ’ అనే రచన అందిస్తున్నారు డా. కందేపి రాణీప్రసాద్.]

హేలీ తోకచుక్క అంటే మీకు తెలుసా! ఇటీవల అంటే 1986వ సంవత్సరంలో హేలీ తోకచుక్క భూమికి దగ్గరగా వచ్చి అందరికీ కనిపించింది. ఈ తోకచుక్క ప్రతి 76 లేదా 77 సం॥లకు ఒకసారి భూమికి దగ్గరగా వస్తుందనీ, దీన్ని కనుగొన్నది ఎడ్మండ్ హేలీ అనే శాస్త్రవేత్త అనీ మీకు తెలుసా! ఇపుడు ఆ వివరాలు తెలుసుకుందాం.

ఎడ్మండ్ హేలీ బ్రిటన్ లోని హాగర్‌స్టన్‌లో 1656వ సం॥ నవంబరు 8వ తేదీన జన్మించాడు. ఈయన తండ్రి పారిశ్రామికవేత్త. హేలీ స్కూలు చదువంతా లండన్ లోని సెయింట్ పాల్స్ స్కూల్లోనూ, కాలేజీ చదువు ఆక్స్‌ఫర్డ్ లోని క్వీన్స్ కాలేజీలోనూ సాగింది. చిన్నతనం నుండీ ఖగోళశాస్త్రంపై ఉన్న ఇష్టం కారణంగా ఆయన కేవలం తన పందొమ్మిది సంవత్సరాల వయసులోనే కెప్లర్ సూత్రాలపై పుస్తకాన్నిప్రచురించారు. ఈ పుస్తకాన్ని చూసిన ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త ఫ్లామ్ స్టీడ్, హేలీని బాగా ప్రొత్సహించారు.

హేలీ 1676వ సం॥లో ఆఫ్రికాలోని సెయింట్ హెలెనా ద్వీపంలో ఉండి నక్షత్రాలపై పరిశోధనలు చేయడం మొదలుపెట్టాడు. ఆ ప్రదేశం పరిశోధనలకు అనుకూలంగా లేకపోవడం వలన అక్కడ హేలీ ఆరోగ్యం దెబ్బతిన్నది. అయినప్పటికీ 2 సం॥ల నిరంతర పరిశోధన కావించి కొత్త నక్షత్రాల జాబితాను తయారుచేశాడు. 1679వ సం॥లో తన పరిశోధనా వివరాలతో ‘కేటలాగ్’ అనే పుస్తకాన్ని ప్రచురించాడు. దీనితో హేలీకి 22 ఏళ్ళ అతి చిన్నవయసులోనే రాయల్ సొసైటీ సభ్యత్వం లభించింది. సర్ ఐజాక్ న్యూటన్‌తో స్నేహం చేసి అత్యంత సన్నిహితుడై, న్యూటన్ తన ‘ప్రిన్సిపియా’ను ప్రచురించేందుకు ప్రోత్సహించారు.

రాయల్   సొసైటీ   హేలీని ‘భూభౌతిక శాస్త్ర పితామహు’నిగా కీర్తించింది. రాయల్ సొసైటీ పత్రిక ‘ఫిలసాఫికల్ ట్రాన్సాక్షన్స్’కు  హేలీ  సంపాదకుడిగా పనిచేశాడు. రాయల్  సొసైటీ అంటార్కిటికాలోని తమ స్థావరానికి హేలీ పేరు మీదగా ‘హేలీ బే’ అని నామకరణం చేసింది. 1531, 1607, 1682 లలో కనిపించిన మూడు తోకచుక్కలపై హేలీ పరిశోధన గావించి అవి వేరువేరు తోకచుక్కలు కాదని నిరూపించాడు. ఒకే తోకచుక్క ప్రతి 76, 77 ఏళ్ళకోసారి భూమికి దగ్గరగా వెళుతున్నదనీ, దానిని చూసే మనం రకరకాల తోకచుక్కలని  భ్రమిస్తున్నామనీ  ప్రకటించారు. ఆయన ప్రకటించినట్లుగానే అప్పటి నుంచి ప్రతి 76సం॥ల కొకసారి తోకచుక్క మనకు దర్శనమిస్తూనే ఉన్నది. ఆ తోకచుక్కకు ‘హేలీ తోకచుక్క’ అని పేరు పెట్టారు.

హేలీ సముద్ర ప్రయాణం చేసేటప్పుడు ఋతుపవనాలు, వాతావరణంలో మార్పులు, గాలిపటం, సముద్రపు నీరు ఆవిరి అవటం మొదలైన విషయాలను పరిశీలించేవాడు. ఇలా పరిశీలించిన విషయాలన్నింటిని కలిపి ఒక ‘meteorological chart’ ను తయారు చేశాడు. దీనివలన వాతావరణ వివరాలు తెలుస్తాయి. దక్షిణ అట్లాంటిక్, పసిఫిక్ ప్రాంతాలలో హేలీ రెండు సంవత్సరాలు పరిశోధనలు చేశాడు. పరిశోధనల ఫలితంగా అట్లాంటిక్ పసిఫిక్ ప్రాంతాల యొక్క అయస్కాంత ఛార్టుల్ని రూపొందించాడు. జనన మరణాల రేటుకు సంబంధించిన ప్రయోగాలు, భూమి పుట్టుకకు సంబంధించిన పరిశోధనలు చేశాడు. భూమికి, సూర్యుడికి మధ్య దూరాన్నికొలవటం ఎలాగో పేర్కొన్నాడు.

ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గానూ, ఇంగ్లాండు ఆస్థాన ఖగోళ శాస్త్రవేత్తగానూ పనిచేసిన ఎడ్మండ్ హేలీ 1742వ సం॥ జనవరి 14వ తేదీన తుదిశ్వాస వదిలాడు.

Exit mobile version