Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తొలి తెలుగు చలనచిత్ర గీత రచయిత చందాల కేశవదాసు

[శ్రీమతి చంద్రకళ దీకొండ గారి ‘తొలి తెలుగు చలనచిత్ర గీత రచయిత చందాల కేశవదాసు’ అనే రచనని అందిస్తున్నాము.]

ఉపోద్ఘాతం:

తెలుగునాట ఏ నాటకాల్లో  అయినా మొదట పాడే

‘పరాబ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ సదాశివ
పరంజ్యోతి పరాత్పర పతితపావన స్వప్రకాశ ॥పరా॥
వరదాయక సకలలోక నాభిత ఫలనా ప్రమేయ
పాహి-పాహీ-మాం-పాహి ॥పరా॥
పరబ్రహ్మ భళిరా  హరి మహిమం చెరుగగ
బ్రహ్మాదుల తరమా!’

అనే గొప్ప కీర్తనను, ఆంధ్రదేశమంతటిని ఉర్రూతలూగించిన ‘భలే మంచి చౌకబేరము-పోయినన్ దొరకదు-త్వరంగొనుడు సుజనులార’ అనే పాటను వ్రాసిన తెలుగు చలనచిత్ర వాచస్పతి చందాల కేశవదాసు గారు. ఈయన తొలి తెలుగు చలనచిత్ర గీత రచయిత, కవి, నటుడు, గాయకుడు, హరికథా భాగవతార్, అష్టావధాని, శతావధాని. ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి తొలి భారతీయ టాకీ సినిమా ‘భక్త ప్రహ్లాద’ కు పాటలు వ్రాసినారు.

పుట్టు పూర్వోత్తరాలు:

చందాల కేశవదాసు గారు ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని జక్కేపల్లిలో జూన్ 20వ తేదీన,1876 సంవత్సరంలో  చందాల లక్ష్మీనారాయణ, వీరమ్మ  దంపతులకు రెండవ కుమారుడిగా జన్మించారు. తాత చందాల శ్రీనివాసులు ఖమ్మం జిల్లా గంగదేవిపాడుకు చెందిన తెలుగు వంశీయులలో వైద్యవృత్తి సాగిస్తున్న వారిలో ముఖ్యుడు. చందవోలు నుండి ఇప్పటి భద్రాద్రి జిల్లాకు చెందిన గంగదేవిపాడుకు చేరుకుని, ఆయుర్వేద వైద్యవృత్తిలో జీవనం సాగిస్తూ, పేదలకు ఉచితంగా, ఉదారంగా వైద్యం చేసేవారు.

ఆ ఊరి వారు వీరిని సులభంగా గుర్తించేందుకు చందోలు వారని పిలిచేవారు. అది కాలక్రమేణా ‘చందాల’గా స్థిరపడిపోయింది. శ్రీనివాసులు గారి ఏకైక కుమారుడు లక్ష్మీనారాయణ వైద్యవృత్తితో పాటు వ్యవసాయం చేసేవారు. ఆ తర్వాత వారు జక్కేపల్లికి చేరుకున్నారు.

బాల్యం-విద్యాభ్యాసం:

చిన్నతనంలోనే తండ్రి మరణించగా అన్న వెంకటరమణ యోగి నిర్వహణలోని వీధిబడిలో విద్యాభ్యాసం జరిగింది. ఆ తర్వాత అన్నగారి వీధిబడిని తానే నడుపుతూ, అందులో విద్యార్థులనే పృచ్ఛకులుగా సమస్యపూరణం మరియు అష్టావధాన సాధన గావించారు. సిరిపురంలో జమీందారు పిల్లలకు కొంతకాలం చదువు చెప్పారు. మొదటి అష్టావధానాన్ని భద్రాచాలంలో చేసారు. తర్వాత హుజూర్ నగర్, జగ్గయ్యపేట, తమ్మర, తిరువూరు, కందిబండ తదితర ప్రాంతాల్లో అష్టావధానాలు చేసి, పండితుల ప్రశంసలు పొందారు.

స్వాతంత్రోద్యమ దోహదకారి:

1933-35 ప్రాంతాల్లో స్వాతంత్రోద్యమం బలంగా ఉండేది. చందాల ‘జయతు జై’ వంటి గీతాలతో ప్రజల్లో దేశభక్తిని, చైతన్యాన్ని రగిలించారు.

గాంధీగారి విధానాలకు ముగ్ధుడై ఆకుల నరసింహారావు, సాలూరు రాజేశ్వరరావులతో పాడించి, స్వంత ఖర్చులతో బెంగళూరులో రికార్డ్ చేయించి, ఉద్యమానికి దోహదకారి అయ్యారు.అనేక స్థానిక పోరాటాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా తన ప్రాంతంలో నిరంతర స్ఫూర్తిని నింపడంలో ముఖ్య భూమిక పోషించారు.

1948 జులైలో జక్కేపల్లిలోని ఇంటిపై రజాకార్లు దాడి చేసి రచనా సంపదను, ఆస్తిపాస్తులను, వస్తుసామాగ్రిని, ధనధాన్యాలను దోపిడీ చేసి బీభత్సం సృష్టించారు. ఆ సంవత్సరం చివర్లో పొలాలను నమ్మకస్తులకు అప్పగించి, కుటుంబంతో సహా జక్కేపల్లి విడిచి, వైద్యవృత్తికి అనుకూలమైన గ్రామీణ ప్రాంతం నాయకన్ గూడెంను చేరుకున్నారు.

ప్రముఖ వాగ్గేయకారుడు పాపట్ల కాంతయ్య గారితో స్నేహం కుదిరి, దాసు గారి ప్రతిభాసంపత్తిని, భాషా మార్దవాన్ని, భావసౌందర్యాన్ని, ధారాశుద్ధిని  మెచ్చి, సంగీతంలో మెళకువలు నేర్పారు.

హరికథా భాగవతార్‌గా:

క్రమంగా గేయరచన, సంగీతం కూర్పు, హరికథనం, రచనలో ఆరితేరి, నాటక సమాజంలో కవి, నటుడుగా పేరు సంపాదించారు. సేవకుడినుండి రాజు వేషం దాకా ఏ వేషమైనా మెప్పించేవారు. మైలవరం కంపెనీకి శ్రీకృష్ణ తులాభారం, రాధాకృష్ణ నాటకాలకు  భక్తి భావం, సరళత్వం తొణికిసలాడే పాటలు వ్రాసారు. బాలభారతి సమాజం తరపున జగ్గయ్యపేట, విజయవాడ, గుంటూరు, తెనాలిలలో ప్రదర్శనలు ఇచ్చారు. ఆ తర్వాత నాటకరంగానికి స్వస్తి పలికి, పొలంపల్లి, దుబ్బాకుపల్లి, ఖమ్మం, జక్కేపల్లి, కోదాడ, తమ్మర.. ఇలా తెలంగాణ అంతటా తిరిగి హరికథలు చెప్పారు. కొన్ని సంవత్సరాల పాటు ప్రతిరోజూ ఒక పాట, మూడు పద్యాలు రచించేవారు. లయశాస్త్రంపై దృష్టి పెట్టి, ప్రయోగాలు చేసి లయబ్రహ్మగా కీర్తి, ధనం సంపాదించారు. అతని కంఠంలో పల్చటి బొంగురు జీర ప్రత్యేక అందాన్నిచ్చేదని సంగీత విద్వాంసులు వి.ఎన్. ఆచార్య గారు మెచ్చుకున్నారు. జగ్గయ్యపేటలో ప్రముఖ వయోలిన్ విద్వాంసులు ద్వారం వెంకటస్వామినాయుడు గారు ఈతనికి వాద్యసహకారం ఇచ్చేంతగా ఎదిగారు.

చలనచిత్ర రంగంలో:

అప్పట్లో మూకీ సినిమాలు ఆడేవి.1931 మార్చి 15 వ తేదీన దేశంలో తొలిసారిగా ‘ఆలం ఆరా’ అనే మాటలతో కూడిన టాకీ సినిమా వచ్చింది. తొలి భారతీయ టాకీ 1931-32 ప్రాంతంలో విడుదలైన ‘భక్త ప్రహ్లాద’ సినిమాకు పాటలు వ్రాయడంతో సినీరంగ ప్రస్థానానికి శ్రీకారం చుట్టారు కేశవదాసు గారు. తొలి సినిమా పాట రచయితగా చరిత్ర సృష్టించారు. ఈ చిత్రంలోని పాటలను తరువాత సురభి నాటకంలో  వాడుకున్నారు.

ఆ పాట ఇది..

పరితాపభారంబు భరియింపతరమా
కటకట నే విధి గడువంగజాలుదు
పతి ఆజ్ఞను దాటగలనా
పుత్రుని కాపాడగలనా  ॥పరి॥

ఈ విషము నేనెటులను
తనయుని ద్రావింపగలను?
ధర్మమును కాపాడుదునా?
తనయుని కావగవలెనా?  ॥పరి॥

భారత లక్ష్మీ ఫిలిమ్స్ వారి సతీ సక్కుబాయి సినిమాలో కృష్ణా పోబోకురా, రాదేల కరుణా, ఆటలాడుకోరా, పాలుమీగడ పలుసార్లు భుజియించి పాషాణమేలవైతివో, జాగేలా కావగరారుగా పాటలు రచించారు.  శ్రీకృష్ణ పాత్రధారి చలపతిరావు మరియు సక్కుబాయి పాత్రధారిణి  దాసరి కోటిరత్నం గారు పాడారు. చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు ఈ సినిమాకు పాటలు, మాటలు వ్రాయగా, కొన్ని పాటలు చందాల గారు వ్రాసారు.

శ్రీకృష్ణ తులాభారం ముత్తురాజు సుబ్బారావు గారు వ్రాసిన నాటకం. భారత, భాగవతాల్లో లేని కల్పిత కథ.1935లో ముఖర్జీ,రాజారామ్‌ల దర్శకత్వంలో సినిమాగా రూపొందింది. కాంచనమాల, రేలంగి మరియు లక్ష్మీరాజ్యం వంటి ప్రముఖ తారాగణం నటించిన తొలి చిత్రం.

1935 లోనే సి.పుల్లయ్య గారి దర్శకత్వంలో వచ్చిన కాశీ ఫిలిమ్స్ వారి శ్రీకృష్ణ తులాభారం కేశవదాసు గారు చలనచిత్ర గీత రచయితగా ఉన్నతస్థానాన్ని పొందుటకు దోహదపడిన చిత్రం. వీరు వ్రాసిన భలే మంచి చౌకబేరము, మునివరా తుదికిట్లు ననున్ మోసగింతురా, కొట్టండి కొట్టండి బుర్రలు పగులకొట్టండి అనే మూడు  పాటలు బహుళ ప్రజాదరణ పొందాయి.

పెండ్యాల గారి సంగీత దర్శకత్వంలో ఘంటసాల మరియు సుశీల గార్లు గానం చేసిన పాట..

బలే మంచి చౌకబేరము
ఇది సమయము మించినన్ దొరుకదు
త్వరన్ గొనుడు సుజనులార..॥బలే॥
విలువ ఇంతయని చెప్పుటకలవిగాని బేరము

కలుముల చేడియకు సతము నిలయమైన బేరము
సలిల జగర్భాదులౌ ఘనులకందని బేరము
ఫలాపేక్షరహిత భక్తసులభమైన బేరము॥బలే॥

~

మునివరా– ఆ..ఆ..ఆ..తుదికి..ట్లు ననున్ మోసగింతువా.. ఆ.. ఆ.. ఆ..
ఘనులు సాదృశులె యిటులన్
కరుణమాలిన-ఇంకే-మున్నది–మునివరా–తుదకిట్లు—-ననున్ మోసగింతువా – ఆ -ఆ-

ధనధనేతరముల చేతగాని
సాధన శమదమ నియమములకు గాని
లభియింపబోదు సుండి
కాదనుకొనుడౌననుకొనుడొక మనసు
నిష్కళంకముగా నొనరించి తృణంబొసగిన
వెనువెంటనే నడచుచుండు
బలే మంచి చౌకబేరము-ఇది సమయము మించినన్ దొరుకదు-త్వరన్ గొనుడు సుజనులార-బలే మంచి చౌకబేరము

ఏమిసేతు ఎటు బోవుదు
ఏ మార్గంబగుపడదే ॥ఏమి॥
నా మనోవిభుని దరిచేరగనీయడాయెగా
మునివరా–ఆ..ఆ..ఆ..మునివరా–తుదకి–ట్లు
ననున్ మోసగింతువా–ఆ..ఆ..ఆ..మునివరా

ఓ యాదవులారా కనుచు ఊరక నిలుచున్నారు
మీ యజమానిని గొనుడు సుమీ తరిచెడుగా
పిదప నా ఈ పలుకులు మీ మానసములందు నిడి
దూరంబరయుడు సరగున తడయగ

బలే మంచి చౌకబేరము
ఇది సమయము మించినన్ దొరుకదు
త్వరన్ గొనుడు సుజనులార
బలే మంచి చౌకబేరము!

1955 లో సి.ఎస్.ఆర్. మరియు 1966లో రామానాయుడుగారు తీసిన ఇదే సినిమాలో  కూడా ఈ పాటలు వాడుకున్నారు.

కానీ,రామానాయుడు గారు సినిమాలో గానీ,పాటల పుస్తకాల్లో గానీ ఆయన పేరు వేయలేదు.1970 లో ఆయన కుటుంబసభ్యులు కోర్టులో కేసు వేయగా, దిగి వచ్చిన నిర్మాతలు సినిమా టైటిల్స్ లో పేరు వేసారు.1936 లో సి.పుల్లయ్య గారి దర్శకత్వంలో నిర్మాత దాసరి కోటిరత్నం గారే అనసూయ పాత్రధారిణిగా తీసిన సతీ అనసూయ చిత్రానికి స్క్రిప్టు, పాటలు, మాటలు వ్రాసి, పూర్తిస్థాయి రచయితగా నిలదొక్కుకున్నారు.

పాటల పుస్తకంలో అనసూయ స్క్రిప్ట్ పట్టుకుని ఉన్న కేశవదాసు గారి ఫోటో ప్రచురణ న భూతో న భవిష్యతి!దేవుని దయ ఉంచి,ప్రహ్లాదునికి స్తంభమునందు నృహరినై, మాతయని మాట విని, కురుతే గంగాసాగర గమనం అను ఈ సినిమా పాటల తర్వాత అతనికి వరుస అవకాశాలు వెల్లువెత్తాయి. రాధా ఫిలిం కంపెనీ వారు కాళ్లకూరి సదాశివం గారి దర్శకత్వంలో తీసిన లంకాదహనం సినిమాకు పాటలు, పద్యాలు వ్రాసారు. తరువాత  సరస్వతీ టాకీస్ వారు హెచ్. వి.బాబు గారి దర్శకత్వంలో కన్నాంబ, కడారు నాగభూషణం, గంగారత్నం ప్రధాన పాత్రధారులుగా తీసిన కనకతార సినిమాలో వ్రాసిన దప్పిచే నాలుక తడిపొడి లేకపద్యం, ఎంత బాగుండది సక్కని గుంటా రాయేనా, అబ్బో నా వొళ్ళు మంటెత్తుతాంది పాటలు జనాదరణ పొందాయి.1937,1956 లలో తీసిన  అదే సినిమాలో ఈ పాటలను వాడుకున్నారు.1939లో స్థానం నరసింహారావు గారు రాధగా నటించిన రాధాకృష్ణచిత్రంలో కేశవదాసు గారు వ్రాసిన 22 పాటల నుండి కొన్ని పాటలను వాడుకున్నారు.

స్వాతంత్ర్యానంతరం 1948లో ప్రతిభా బ్యానర్‌పై ఘంటసాల బలరామయ్య గారి దర్శకత్వంలో అక్కినేని, ఎస్.వరలక్ష్మి, కస్తూరి శివరావు పాత్రధారులుగా వచ్చిన బాలరాజు చిత్రానికి కూడా పాటలు వ్రాసారు.

ఉన్నత వ్యక్తిత్వం-ఆదర్శ జీవనం:

బాలాభారత సమాజంలో కళాప్రదర్శన ద్వారా సాధించిన బంగారు కంకణాలు, పతకాలను సత్కార్యాలకు వినియోగించి, మార్గదర్శిగా నిలిచారు. హరికథాగానం ద్వారా సంపాదించిన సొమ్ముతో భద్రాచలంలో భక్తుల కొరకు బావి తవ్వించి, భోజన, వసతి ఏర్పాట్లు చేసారు. తమ్మరలో సీతారామచంద్రస్వామి ఆలయానికి గాలిగోపురం నిర్మాణానికి పాటుపడ్డారు.

కులవివక్ష తగదని, హెచ్చుతగ్గులు మన సంస్కారాన్ని బట్టి గాని, కులాన్ని బట్టి కాదనేవారు. ఎవరైనా వ్యతిరేకిస్తే వాదించి, మెప్పింపజేసేవారు. జక్కేపల్లికి దగ్గర రాజపేటకు చెందిన వెంకయ్య అనే దళితుడు, తన వీరాభిమానిని, అతని బీదరికాన్ని చూసి, తరచూ తన ఇంటిలో భోజనం పెట్టించి, పక్కనే కూర్చుని, విసనకఱ్ఱతో గాలి విసురుతూ ఆదరించిన విశాల హృదయులు. వ్యక్తిగా ఉన్నత విలువలకు కట్టుబడిన ఆదర్శ జీవనం వారిది.

జాతీయవాదిగా పలు దేశభక్తి రచనలు చేసి, వాటిని బెంగళూరు కంపెనీ వారిచే స్వంత ఖర్చులతో గ్రాంఫోన్ రికార్డులుగా రూపొందించారు. తన ఇంటి నిర్మాణం కొరకు దాచుకున్న కలపను సీతారామచంద్రస్వామి రథగోపుర నిర్మాణానికి అందజేసారు. తమ్మరలో దేవాలయ గాలిగోపురం, ధ్వజస్తంభ నిర్మాణానికి డబ్బు లేక ఆగిపోతే, ఇంటికి మనిషిని పంపించి, భార్య చేతి బంగారు గాజులను తెప్పించి అమ్మిన ఉదార హృదయుడు.

జగ్గయ్యపేటలో భాగవత సప్తాహం నిర్వహించి,పండిత సత్కారాలకు తన బంగారు కంకణాన్ని వినియోగించిన నిస్వార్థపరుడు, మహితాత్ముడు!

రేపాల జనతా కళామండలి సంస్థ సభ్యుడిగా గంధం నర్సయ్య నటనకు, కథాగానానికి ముగ్ధుడై, అభినందించి, తన కూతురు  ఆండాళ్లును సాలంకృత కన్యాదానం చేసారు.

రచనలు:

కేశవ శతకం, కనకతార నాటకం (1926 లో), బలిబంధనం (1935లో వ్రాసిన ఆరు అంకాల నాటకం), శ్రీరామ నామామృత గేయం, సీతాకల్యాణం (హరికథ), రుక్మాంగద (హరికథ), మేలుకొలుపులు, జోలపాటలు, సత్యభామ పరిణయం (హరికథ), నాగదాసు(హరికథ), అనేక సినిమా స్క్రిప్టులు.

కనక్తార నాటకం నాంది

ఉ:

శ్రీకరమైన రాజ్యము వి; శేష సుఖంబుల ఘెర వృత్తి చే గైకొని
క్రూర లెంతటి చి; కాకుల బెట్టిన గాని ధర్మమే మాకు జయం బటంచు
దయ; మాల నిమాన్యుల బ్రోచు నట్టి ను శ్లోకుడు శ్రీవరుం డిడుత;
శోభనముల్ కృప మీకు నిచ్చలున్

బిరుదులు:

ఆంధ్రసూత, కలియుగ దశరథ, నటనావతంస.

చివరి రోజులు:

తన చివరి రోజులు నాయకన్ గూడెంలో గడుపుతూ, దుర్ముఖ నామ సంవత్సర వైశాఖ శుద్ధ పంచమి నాడు (1956 మే 14వ తేదీ) రామనామ స్మరణతో నిద్ర లేచి, స్నానాదికాలు ముగించుకుని, నిలువునామాలు పెట్టుకుని, కొడుకు కృష్ణమూర్తిని ఆ రోజు ఎక్కడికీ వెళ్లవద్దని ఆదేశించారు. నవ్వు ముఖంతో, ప్రశాంతంగా ఇంటిలోని వారందరినీ, ఇంటినీ కలయజూసి, కన్నులు మూసుకుని, ధ్యానం చేస్తూనే దీర్ఘనిద్రలో, తమ్మర రామునిలో లీనమై పోయారని కుటుంబసభ్యులు కళ్ళకు కట్టినట్లు చెప్పారట!

సహాయక రచనలు:

  1. తెలుగు తేజాలు – శ్రీ అంబడిపూడి శ్యామసుందర్ గారు
  2. తొలి తెలుగు సినీ గేయ రచయిత చందాల – శ్రీ బెల్లంకొండ నాగేశ్వరరావు గారు
  3. రసికప్రియ సృష్టికర్త, హిందీ రచయిత గారి వ్యాసం
Exit mobile version