Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కొత్త వాకిలి

[19 మార్చ్ 2026 శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా డా. వేమూరి సత్యవతి గారు రచించిన ‘తొలి వాకిలి’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

60 సంవత్సరాల తర్వాత వచ్చేస్తూ అదే పేరుతో పరాభవా!
స్వాగతం చెప్పేముందు నీకో మాట…
ఇప్పటి తెలుగు నేలలో తెలుగు కోసం వెతకద్దు..
తెలుగు మాటలు విన రావటం లేదని వాపోవద్దు..
తెలుగు లిపి కనిపించటం లేదని వెత చెందవద్దు..
అ ఆ లు దిద్దటం మాని అమెరికా అంటూ ఆరాటపడుతున్నారని చిన్న పోవద్దు..
ఆంగ్ల పదాల మధ్య తెలుగు బిక్క చచ్చి నలిగిపోతోందనుకోవద్దు..
అపుడెపుడో నువ్వు చూసిన తెలుగు సంస్కృతి లేదని బెంగపడిపోకు..
పండుగలన్నీ బుల్లితెరపై చేసుకుంటున్నారని చింత పడకు..
కొత్త వాకిలివై ఉగాది హరివిల్లులా రా!
ఆనందాను రాగాలు చుట్టిన బంగరు బహుమతిలా రా!
ధనస్సును విరిచిన వరుని మురిపెంగా చూసే సీతమ్మలా..
కొత్త వాకిలి కోసం నేను ఎదురు చూస్తున్నా..!
గతకాలపు బీటలిచ్చిన ప్రాజెక్టులు
ప్రాంతీయతా జ్వాలలు, ధర్మంపై దాడులు..,
కాలుష్యపు కాసారాల కరోనా ని మించిన వైరస్ లు..,
రెచ్చగొట్టే మారణాయుధాల ప్రపంచ యుద్ధాలు..,
సైబర్ నేరాలు, సీమలు దాటిన చీకటి వ్యాపారాలు,
వీటన్నిటిని వదిలి పెట్టేసి కొత్తగా రా!
వాస్తవాల వార్ధిలో సుగంధపు ‘మూలికలు వేరులు’ వేసి..
ఆదిలో వచ్చే కాలకూట విషాన్ని ఆది యోగిలా అదిమిపెట్టి..
అమృతం పంచే జగన్మోహినిలా నీవు రావాలి!
సుమనుస్కులమై తేట తెలుగుసుధను అందుకుంటూ..
తెలుగు పతాకను తల ఎత్తుకొనేలా..
అమ్మ భాషలో ఉగాది ప్రతిన చేస్తాం!
కొత్త వాకిలివై పరాభవాలే లేని విజేతలా తెలుగునేలకి రా..!

Exit mobile version