[శ్రీ కుంతి (కౌండిన్య తిలక్) రచించిన ‘తొలి వలపు!’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక – బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో ₹ 2,000/- బహుమతి గెల్చుకున్న కథ.]
పెన్షన్స్ కార్యాలయం కు వెళ్ళి, సరాసరి ప్రధాన అధికారి చాంబర్‌కు చేరుకున్నాను. అక్కడ ఉన్న పీ.ఎ. “ఏమి కావాలి” అని అడిగింది. “నా పేరు చక్రవర్తి. నా మిత్రుడు విశ్వం చనిపోయి సంవత్సరమైంది. కొంత కాలం వరకు పెన్షన్ సబబుగానే వచ్చింది. కానీ రెండు మూడు నెలలుగా ఆగిపోయింది” అంటూ నా వద్ద ఉన్న డాక్యుమెంట్లు ఆమె కిచ్చాను.
ఆ అమ్మాయి ఆ పేపర్లు తీసుకొని పరిశీలిస్తుండగా, ఒక పాతిక సంవత్సరాల అందమైన అమ్మాయి భుజం పైన చంటి పిల్లాడిని మోసుకొని వచ్చింది.
ఆమెను చూడగానే, “హాయ్ లాస్యా! ఏమిటీ ఇలా వచ్చారు?” అన్నది పీ ఏ.
“మా అమ్మ పొద్దున ఫోన్ చేసింది. మందులు అయిపోయ్యాయట. తీసుకు రమ్మని చెప్పింది. ఆఫీసుకు పోతూ పోతూ అమ్మకు మందులు ఇచ్చిపోదామని వచ్చాను. వస్తూ వస్తూ దారిలో అమ్మకు ఫోన్ చేసాను. కాని ఫోన్ ఎత్తలేదు” అన్నది
“మేడం గారు ఆఫీస్‌కు రాగానే, కలెక్టర్ పేషీ నుండి, ‘అర్జెంట్ మీటింగ్ ఉంది అటెండ్ కావాలి’ అంటూ ఫోన్ వచ్చింది. వెంటనే వెళ్ళిపోయారు. ఆ మెడిసిన్స్ నాకు ఇవ్వండి. మేడం రాగానే ఇస్తాను” అన్నది పీ ఏ నవ్వుతూ.
“ఓహ్ థాంక్యూ! నాకు ఆఫీస్ కు లేట్ అవుతున్నది. పైగా ఈ రోజు సాయంత్రం ఆఫీస్ నుండి డైరెక్ట్‌గా విజయవాడ వెళుతున్నాను. మావారి ఫ్రెండ్ పెళ్లి. అమ్మకు రాగానే ఈ మందులివ్వు. నేను కాసేపైనాక ఫోన్ చేసి మాట్లాడుతాను” అంటూ హడావిడిగా వెళ్ళిపోయింది.
ఆ అమ్మాయిని చూడగానే ఎక్కడో చూసినట్లుగా కాక, ఎవరినో దగ్గర వాళ్ళను చూస్తున్నట్లుగా అనిపించింది.
“సార్! మీరు లాంజ్‌లో కూర్చోండి. సెక్షన్‌కు ఈ పేపర్స్ పంపి జరిగినదేమిటో తెలుసుకుంటాను” అన్నది.
“అలాగే” అంటూ అక్కడి నుండి వెళ్ళబోతుండగా సైడ్ వాల్ పైన దృష్టి పడింది.
అక్కడ గోడపైన అమర్చిన ఛాయాచిత్రాలు ఉన్నాయి. ఆ చిత్రాలలో కొన్నిటిలో నవ్వుతూ, కొన్నిటిలో ప్రముఖులతో మాట్లాడుతూ, కొన్నింటిలో బహుమతులు పంచుతూ, కొన్నిటిలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు నిర్వహిస్తూ.. ఉమాదేవి.
అవి చూస్తూనే అవాక్కయ్యాను. దాదాపు మూడున్నర దశాబ్దాల తరువాత ఆమెను చూసాను. అలాగేచూస్తూ.. చూస్తూ.. కాసేపటిలో తేరుకొని.. పీ.ఏ.తో..
“ఈ ఫోటోలో ఉన్నది..” అంటూ అడిగాను.
“ఆవిడ మా ఆఫీసర్ గారు టీ.వీ. ఉమాదేవి గారు. రెండు నెలల కింద ఇక్కడికి వచ్చారు. నెక్స్ట్ మంత్‌లో రిటైర్ అవుతారు” అని సమాధానం చెప్పింది.
నేను “అలాగా” అంటూ, అంతకు ముందు వచ్చిన అమ్మాయిని గుర్తుకు తెచ్చుకుంటూ, ‘అచ్చం తల్లి లాగే ఉంద’ని అనుకుంటూ, అక్కడి నుండి వెళ్లి లాంజ్‌లో కూర్చున్నాను.
లాంజ్‌లో పెద్ద అద్దం ఉంది. ఆ అద్దం లోకి చూస్తుంటే నా రూపం నాకే అసహ్యం వేసింది. జుట్టంతా పోయింది. బట్టతల వచ్చింది. పొట్ట పెరిగిపోయింది. కంటి కింద నల్లటి చారలు. నుదుటి పైన ముడుతలు.
కూర్చుంటున్నప్పుడు నా పర్స్ కింద పడినట్టుంది. దానితో పాటు డిగ్రీలో ఉండగా తీసుకున్న నా ఫోటో కూడా కింద పడింది. ఎవరో తీసి ఇచ్చారు. అందులో ఉన్న నా ఫోటోను చూసాను. ఉంగరాల జట్టుతో, ముఖంమీద పడుతున్న శోభన్ బాబు రింగ్‌తో, అందమైన మీసకట్టుతో లవర్ బాయ్‌లా, సినిమా హీరోలా ఉన్నాను. నా ఫోటోను అభావంగా చూస్తూ లోపల పెట్టుకున్నాను.
లాంజ్‌లో చాలా మంది కూర్చున్నారు.
ఉమాదేవి ‘సిన్సియర్ ఆఫీసర్’, ‘మంచి వ్యక్తి’, ‘డ్యూటీ మైండెడ్’ అని అక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్న వాళ్ళ మాటలను బట్టి నాకు అర్థమైంది.
నేను కూర్చున్న సీట్ కు ఎదురుగా ఉన్న బోర్డ్ పైన మరి కొన్ని ఉమాదేవి ఫోటోలు ఉన్నాయి.
అవి చూస్తూ.. మూడున్నర దశాబ్దాల గతం లోకి జారుకున్నాను.
***
“ఏడవకు ఉమా. నీవు ఏడుస్తుంటే నేను చూడలేకపోతున్నాను. మనిద్దరం ఉద్యోగాలకు ప్రయత్నం చేసాము. నీకు రిక్రూట్‌మెంట్ వచ్చింది. నాకు రాలేదు. ఇపుడు ప్రేమా పెళ్లి అని నేను మా అమ్మా నాన్నలతో ఎలా చెప్పేది. అదీ గాక మా చెల్లెలు పెళ్ళికి ఎదిగి ఉంది. నా పరిస్థితిని అర్ధం చేసుకో.”
“చూడు చక్రీ! పోయిన ఆదివారం నాడు ఒక సంబంధం వచ్చింది. అబ్బాయి బొంబాయిలోని బ్యాంక్‌లో పని చేస్తాడు. బాగా డబ్బున్న వాళ్ళు. మా నాన్న, ‘మా పెద్దమ్మాయి పెళ్లి చేసి అప్పుల్లో ఉన్నాము. ఇపుడు మేము మరొక పెళ్లి చేయలేము’ అన్నాడు. దానికి ఆ అబ్బాయి తండ్రి, ‘మాకు కట్నం వద్దు. పెళ్లి గుడిలో సింపుల్‌గా చేయండి. ఖర్చులు కూడా మేము భరిస్తాము. పెళ్లి మాత్రం ఈ నెలలోచేయండి’ అన్నాడు. దానితో మా అమ్మా నాన్నలు, గడప దగ్గరికి వచ్చిన సంబంధం పోగొట్టుకోవద్దని పెళ్ళికి అంగీకరించారు.”
“నీకు పిల్లవాడు నచ్చాడా? నీవు ఒప్పుకున్నావా?”
“నచ్చడం, ఒప్పుకోవడం వంటివి మా ఇంటిలో ఆడపిల్లలకు ఉండవు. పెద్ద వాళ్ళు చెబితే తలవంచి తాళి కట్టించుకోవల్సిందే”
“……..”
“ఏమిటీ మాట్లాడవు. చచ్చేంతగా ప్రేమించావు. నీ వ్యక్తిత్వంతో, మంచితనంతో నన్ను ప్రేమించేలా చేసుకున్నావు. ఇపుడీ మౌనం ఏమిటీ? అందరి లాగే నాకూ ఆశలూ, కోరికలూ ఉన్నాయి. కానీ నేను మధ్యతరగతి అమ్మాయిని. పెద్దలను మాత్రం ఎదిరించలేను. ఏదో ఒకటి చేయకపోతే నీకు దక్కను.”
“……”
“ఏమీ మాట్లాడవు”
“మా పెద్దన్నయ్య బిజినెస్ చేసి ఇంటిని అప్పుల పాలు చేసాడు. అవి మేమంతా కలిసి తీర్చాలి. మా చెల్లెలు పెళ్లి కావాలి. నాకు ఉద్యోగం రావాలి. నిన్ను పోషించే స్తోమత నాకు సమకూరాలి. ఇలా.. చాలా విషయాలు మన పెళ్లితో ముడిపడి ఉన్నాయి ”
“ఇన్ని క్యాలిక్యులేషన్స్ ఉన్నవాడివి నన్ను ప్రేమ అనే ఎమోషన్స్ లోకి ఎందుకు లాగావు”
“……….”
“చివరగా అడుగుతున్నాను. ఇంతకీ నీ అభిప్రాయం ఏమిటి?”
“నేను చెడ్డవాడిని కాదు. ప్రేమించి మోసం చేయాలని లేదు. కుటుంబ బాధ్యతలు తీరే వరకు నేను నిన్ను పెళ్లి చేసుకోలేను. ఒకవేళ నాకు ఈ బాధ్యతలు లేకుంటే పెద్దలను ఎదిరించి అయినా పెళ్లి చేసుకునే వాడిని.”
“నా కన్నా నీకు కుటుంబం గొప్పదా”
“నాకు గొప్పగా అనిపించే కుటుంబం లోకి నిన్ను ఆహ్వానించడానికి నాకు సమయం కావాలి. లేదా.. నీవు.. నన్ను మరిచిపోవాలి ”
“…………”
“ఉమా! నేను నిష్ఠదరిద్రుడిని. నీవు నన్ను పెళ్లి చేసుకోకుండా ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే తప్పక సుఖపడతావు. కానీ నేను నిన్ను కోల్పోతే నా జీవితంలో స్వర్గం కోల్పోయినట్లే. నీవు లేకుంటే బతుకుతానేమో కానీ జీవించను. ‘తథాస్తు’ అని యే దేవతలు అనవలసిన పనిలేదు. నాకు నేనే ఈ శిక్షను విధించుకుంటాను”
“……….”
“నీకు మంచి సంబంధం వచ్చింది. పెళ్లి చేసుకో. నీవు సుఖంగా ఉంటే నాకు ఆనందమే. నేను ఇంకా నీ ఛాయలోకి రాను”
***
“సార్! పీ.ఏ. గారు పిలుస్తున్నారు”
ఆ పిలుపుకు జ్ఞాపకాల దొంతర నుండి ఉలిక్కి పడిన నేను పీ ఏ దగ్గరికి వెళ్లాను.
“నేను సెక్షన్ వాళ్ళతో సంప్రదించాను. వారం రోజుల్లో ఫైల్ క్లియర్ చేయిస్తాను” అన్నది పీ ఏ.
“ధాంక్స్ తల్లి! గాడ్ బ్లెస్ యూ! నీలాంటి వాళ్ళు ప్రభుత్వసంస్థలలో పనిచేస్తే దేశం బాగు పడుతుంది. అన్నట్లు మీ మేడం గారి పర్సనల్ నంబర్ ఇవ్వగలరా?” అన్నాను
“సారీ సార్! ఆవిడ పర్సనల్ నంబర్ ఇవ్వలేను. అవసరమైతే ఆఫీసుకు ఫోన్ చేయండి”
“అదీ ఆవిడ నాకు..” అంటూ ఆగిపోయాను.
పీ.ఏ. ఏమనుకుందో ఏమో కానే ఉమాదేవి నంబర్, తన నంబర్ కాగితం మీద రాసి నాకు ఇస్తూ,
“మేడం కు మాత్రం నేను నంబర్ ఇచ్చానని చెప్పకండి. అవసరమైతే నాకే ఫోన్ చేయండి” అన్నది.
మరొకసారి ధన్యవాదాలు చెప్పి ఆఫీస్ నుండి బయట పడ్డాను.
సూపర్ మార్కెట్‌కు వెళ్లి రెండు నెలలకు సరిపడేలా ముఖ్యమైన సరుకులు కొని ప్యాక్ చేయించి, విశ్వం ఇంటికి పంపించాను. ఆ తరువాత విశ్వం భార్య కామేశ్వరికి ఫోన్ చేసి,
“పెన్షన్ ఆఫీసుకు వెళ్లాను. కావలసిన పేపర్స్ సబ్మిట్ చేసాను. త్వరలో ఇష్యూ సెటిల్ అవుతుంది. సరుకులు ప్యాక్ చేయించి, బుచ్చన్న ద్వారా మీ ఇంటికి పంపించాను. ఫోన్ పే ద్వారా మీ అమ్మాయి అకౌంట్ లో పది వేలు వేసాను. మందులకు, అవసరాలకు దగ్గర ఉంచుకొండి” అన్నాను.
“ఎందుకన్నయ్య! మాకోసం అంతగా ఇబ్బంది పడుతున్నారు” అన్నది కామేశ్వరి.
“నేను విశ్వం ముప్పై సంవత్సరాలు ఒకేచోట కలిసి పని చేసాము. ఒకరికొకరం తోడూ నీడగా ఉన్నాము. వాడు నన్ను వదిలి హఠాత్తుగా వెళ్ళిపోయాడు. వాడి కుటుంబం ఇబ్బందుల్లో ఉంటే, చూస్తూ ఎలా వదిలి వేయగలను. నేను నీకు స్వంత అన్నయ్యనే అనుకో. మీ పెన్షన్ చక్కగా వచ్చేంతవరకు, యే ఇబ్బందులు ఉన్నా మొహమాట పడకుండా నన్ను అడగండి” అని మరిన్ని విషయాలు మాట్లాడి పెట్టేసాను.
ఆ పనీ ఈ పనీ ముగించుకొని నేను అద్దెకున్న చిన్న ఇంటికి వెళ్లేసరికి రాత్రి బాగా అయింది.
నా రాకడను గమనించి, “అయినాయా మీ ఊరి పెత్తనాలు, మీ దిక్కుమాలిన రాచకార్యాలు”అంటూ తాను రోజు చదివే అష్టోత్తరాలు, సహస్రనామాలు చదవడం ప్రారంభించింది రుక్మిణి.
నేను ఆమె మాటలు వినబడకుండా బెడ్ రూమ్ తలుపులు గట్టిగా మూసాను.
నేను భోజనం చేసి, పాత్రలు కడిగేసి బెడ్ రూమ్ లోకి వెళ్లి, నా బెడ్ పైకి చేరుకున్నాను.
“అబ్బాయి ఫోన్ చేసాడు. ఫ్లాట్ అమ్మేసి తన వాటా సొమ్ము తనకు ఇవ్వమన్నాడు. అమ్మాయి కూడా ఫోన్ చేసింది. ఫ్లాట్ అమ్మితే తన వంతు డబ్బులు తనకు ఇవ్వాలని, లేకుంటే కోర్ట్‌కు వెళతానని తెగేసి చెప్పింది.”
“ఎప్పుడూ ఉన్నదే కదా. ఏదో ఒకటి చేద్దాం. ప్రశాంతంగా ఉండరాదు” అన్నాను.
“ప్రశాంతతా? నాకా? మిమ్మల్ని కట్టుకున్నాక నాకు ప్రశాంతత ఎక్కడిది? మిమల్ని పెళ్ళి చేసుకొని వచ్చినప్పటి నుండి అన్నీ కష్టాలే కదా. మొదట్లో మీ అన్నయ్య చేసిన అప్పులు, ఆ తరువాత మీ చెల్లెలు పెళ్లి కోసం చేసిన అప్పులు, ఆ తరువాత మీ అమ్మానాన్నల రోగాలకు చేసిన అప్పులు తీర్చడం, ఆ తరువాత పిల్లల చదువులకు, పెళ్లిళ్లకు చేసిన అప్పులు తీర్చడం..
ఇట్లా ఇప్పటి వరకు మీరు కుటుంబాన్ని ఉద్ధరించడంలో, సాయపడంతోనే నా జీవితం గడిచిపోయింది. ఇవి కాకుండా మీ ఇంటిల్లిపాదితో నేను ఏగిన ఏగుడు మామూలుదా? పోనీ ఇప్పుడన్నా కాస్తా సుఖంగా ఉందామంటే పిల్లలు కూడా నా ప్రాణానికి యమగండంలా తయారయ్యారు. నేను యే రోజన్న సంతోషంగా ఉన్నానా?”
“నేను నిన్ను ఏ రోజు కష్ట పెట్టలేదు. పల్లెత్తు మాట అనలేదు. నీ సుఖం కోసం, సంతోషం కోసం నాకు చేతనయినంత చేసాను. అయితే ‘కుటుంబంలో ఉండే బాధ్యతలను, విధులను వదిలించుకోవాలని, వేరు కాపురం పెట్టి హాయిగా ఉండాలని’ నీవు కోరినట్లు చేయలేదు. అందుకు నా పైన నీకు కోపం. దానికి నేను ఏమీ చేయలేను. పిల్లలు ఇలా అవుతారని నేను ఊహించలేదు. కాని నా పెంపకంలో యే లోపం లేదు.”
“మీరు కుటుంబం, కుటుంబం అన్నారు ఈ రోజు మనకు ఏమి మిగిలింది. మన ఇంటిలో, మన మధ్య ఉన్న గొడవలతో మన పిల్లలను మనం పట్టించుకోలేదు. అందుకే ఈ రోజు వాళ్ళు కూడా మనకు దూరమయ్యారు.”
“నేను బాధ్యతలను, ధర్మాన్ని వదలలేదు. కుటుంబంలో ఒక కొడుకుగా, ఒక సోదరుడిగా, ఒక భర్తగా, ఒక తండ్రిగా నేను యే తప్పు చేయలేదు.”
“ఒక విషయం చెప్పాలా. మీరన్నా.. మీ కుటుంబం అన్నా.. మీ ఆలోచనలన్నా.. నాకు అసహ్యం. ఆ అసహ్యం చచ్చినా పోదు” అన్నది కోపంగా మరింత రెచ్చిపోతూ.
నేను రుక్మిణితో వాగ్వివాదం ఆపాను.
బెడ్ రూమ్ గోడ పైన ఉన్న రుక్మిణి ఫోటో పైన ఉన్న దండను సవరించి, చాపా దిండు తీసుకొని హాల్ లోకి వచ్చాను.
గత రెండు సంవత్సరాలుగా నా ఒంటరి జీవితానికి ఎకోలో వినిపించే రుక్మిణి తిట్లు, శాపనార్థాలే నా నేస్తాలు.
నేను కష్టపడి కట్టుకున్న ఇంటిని అమ్మేసి, వచ్చిన డబ్బును పిల్లలకు ఇచ్చి, నివాసం ఉంటున్న ఆద్దె ఇంటిలో ఉన్న బల్లులు, బొద్దింకలు, ఎలుకలే నా బంధువులు.
బెడ్ రూమ్ నుండి రుక్మిణి మాటలు ఇంకా వినబడుతున్నాయి. వాటిని పట్టించుకోకుండా లైట్లు ఆఫ్ చేసి చాప మీద పడుకున్నాను. నిద్దుర రావడం లేదు.
ఉమాదేవి గుర్తుకు వచ్చింది. ఒకసారిగా గుండె పిండినట్లు అయింది. కానీ ఆమె ఎదిగిన ఎత్తును, పిల్ల పాపలతో ఉన్న తీరును చూసి ఆనందం కలిగింది. ఆమెను, ఆమె కుటుంబాన్ని అలాగే పది కాలాల పాటు హాయిగా సంతోషంగా ఉంచాలని దేవుడిని ప్రార్థించాను.
మరలా పడుకునే ప్రయత్నం చేసాను. నిదుర రావడం లేదు.
బెడ్ రూమ్ నుండి ఇంకా రుక్మిణి తిట్లు వినబడుతున్నాయి.
ఇంతలో నాకు ఉమాదేవితో మాట్లాడాలని, ఇన్ని సంవత్సరాల తన జీవన ప్రయాణం గురించి తెలుసుకోవాలని అనిపించింది.
అంతలోనే, ఉన్నతమైన అధికారిగా, గృహిణిగా ఒక ఉన్నతమైన జీవితాన్ని గడుపుతున్న ఆమెను పలకరించడం, ఆమె జీవితం లోకి తొంగి చూడడం అవసరమా అనిపించింది.
‘కేవలం మంచీచెడూ కనుక్కోవాలనుకుంటున్నాను. పాత ప్రేమను తవ్విపోయాలని కాదు కదా’ అని మనసు సమాధానం చెప్పింది.
నా మనసు ఆమెతో ఎలాగైనా మాట్లాడాలని, మంచీచెడులు తెలుసుకోవాలని ఒక వైపు..
మూసిన పుస్తకం లోని అధ్యాయాలను మళ్ళీ తెరిచే కుసంస్కారానికి పూనుకోకూడదని మరొకవైపు.. కొట్టుమిట్టాడసాగింది.
నేను ఉద్యోగ రీత్యా రిటైర్ అయి ఒక కుటుంబానికి అధిపతిగా ఉన్నానానని, ఆవిడ ఒక ఉద్యోగిగా గౌరవనీయమైన స్థానంలో, కుటుంబ రీత్యా అమ్మమ్మ స్థాయిలో ఉన్నదని కాబట్టి అలాంటి ప్రయత్నాలు చేయవద్దని కూడా నా మనసు హెచ్చరించ సాగింది.
ఒక వేళ ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేస్తే ఆమె ఏమనుకుంటుందో, ఆమె పిల్లలకు, నా పిల్లలకు తెలిస్తే ఎలా భావిస్తారో అన్న ఆలోచనలు కూడా నాలో రాసాగాయి.
నా మనసుకు మెదడుకు పెద్ద యుద్ధమే జరిగింది. దాదాపు రెండు గంటలు నా మనసులో అలా ఘర్షణ అనుభవించాను.కాని ఆ యుద్ధంలో నా మనసు గెలిచింది.
మనిషి తన జీవిత కాలమంతా విలువలతో గడిపినా ఎక్కడో ఒకసారి.. చిన్న తప్పులు చేస్తాడు.. ఇది యేమంత పెద్ద తప్పు అని నా మనసు నాకు నచ్చ చెప్పింది.
ఉమాదేవి పట్ల ఉన్నది పవిత్ర భావన యేనని, కేవలం ఆత్మీయంగా పలకరించాలని మాత్రమే కోరుకుంటున్నదని, ఒకవేళ ఈ ప్రయత్నంలో ఆమెకు ఏదైనా ఇబ్బంది వస్తే ఆమె చాయలోకి పోగూడదని కూడా నా మనసు నాకు చెప్పింది.
వెంటనే ఫోన్ తీసాను. ఆమె నంబర్ కు వాట్సాప్ సదుపాయం ఉండడంతో, ఉమాదేవికి..
‘నేను ఈ రోజు ఆఫీసుకు వచ్చాను. నీ అమ్మాయిని, మనవడిని చూసాను. నీవు ఉన్నత స్థానంలో ఉన్నందుకు ఆనందం, గర్వం కలిగింది. ఇలాగే నీవూ, నీ కుటుంబం హాయిగా ఉండాలని కోరుకుంటున్నాను.- చక్రి’ అని మెసేజ్ చేసి జవాబు ఎలా వస్తుందో అన్న భయం వేసి, సెల్ ఆఫ్ చేసి పడుకున్నాను. రెండు రోజులైంది. నా మెసేజ్‌కు జవాబు రాలేదు. బ్లూటిక్స్ వచ్చాయి.
ఆమె నా మెసేజ్‌కు జవాబు ఇవ్వనందుకు బాధగా, ఎక్కడో కొంచం ‘హార్ట్’ అయినట్లుగా అనిపించింది.
మరల రెండు రోజుల తరువాత మరొక మెసేజ్ పెట్టాను. వెంటనే బ్లూ టిక్స్ వచ్చాయి.
కానీ సమాధానం రాలేదు.
తొలి వలపు మధురమైనది. అది గెలిపించుకోలేని వాళ్ళు, తమ ప్రేమను సామాజిక కట్టుబాట్లకు లోబడి మనసు మారుమూల గదిలో సమాధి చేసినా, చీకటి మూసిన ఏకాంతంలోనో, మరొక సందర్భంలోనో అది బయటికి వచ్చే ప్రయత్నం చేస్తుందని నాకు తెలుసు.
అయితే ఉమాదేవి ఎంతైనా స్త్రీ కదా, భర్త, పిల్లలు, ఇల్లు, ఉద్యోగం వంటి వ్యాపకాలతో తన తొలివలపు మరచిపోయి ఉండవచ్చు అనుకున్నాను. ‘అలా మరిచిపోవడమే సబబు కదా’ అనిపించింది.
ఈ మధ్య దినాలలో పదేపదే గుర్తుకు వస్తున్న నా తొలి వలపు సంఘటనలను నేను కూడా బలవంతంగా మరిచిపోయే ప్రయత్నంచేసాను.
ఇది ఇలా ఉండగా ఒకరోజు పెన్షన్ ఆఫీసు నుండి, “విశ్వం ఫైల్ క్లియర్ అయింది, ఒకసారి వచ్చి వెళ్ళండి” అని ఫోన్ వచ్చింది. నేను వెళ్ళాలా, వద్దా అనుకుంటూనే ఆఫీసుకు వెళ్లాను.
అదృష్టవశాత్తు ఆ రోజు ఆఫీసుకు ఉమాదేవి రాలేదు.
“విశ్వం గారి ఫైల్ క్లియర్ అయింది. ఎరియర్స్ కూడా వేసారు. వచ్చే నెల నుండి పెన్షన్ సజావుగా వస్తుంది. మేడంగారు పర్సనల్‌గా ఈ ఫైల్‌ను మూవ్ చేయించారు” అన్నది పీ.ఏ.
ఆమెకు కృతజ్ఞతలు తెలుపుతూ, “ఈ రోజు మీ మేడం గారు రాలేదా?” అని అడిగాను.
“మేడంగారి భర్త సంవత్సరీకాలు. లీవ్ పెట్టారు” అన్నది.
‘ఆమె సుమంగళిగా, ఆనందంగా ఉంది’ అనుకున్న నేను ఆ వాస్తవాన్ని కాసేపటి వరకు జీర్ణించుకోలేక పోయాను. నా మనసు చాలా బాధ పడింది.
మనం ప్రేమించినవాళ్ళు కష్టాల్లో ఉంటే అంతకంటే మించిన కష్టం మనకు ఇంకొకటి ఉండదు కదా.
‘ఆవిడ ఇంటికి వెళ్లి ఓదార్పు వచనాలు మాట్లాడాలి’ అనిపించింది. కాని మనసును దిటవు పరుచుకొని అక్కడి నుండి బయలుదేరాను.
ఎందుకో ఇంకా ఆఫీస్ వైపు వెళ్ళకూడదు అనిపించింది. ఎంతకైనా మంచిదని నా సెల్ ఫోన్ నుండి ఆమె కాంటాక్ట్ నంబర్ తీసి వేసాను.
ఈ సంఘటన జరిగిన కొన్ని నాళ్ళకు నేను మా ఇంటి దగ్గర ఉన్న ఆలయానికి వెళ్ళాను.
నేను గుడికి లోకి వెళుతుండగా అప్పుడే కార్‌లో కూర్చొని వెళ్ళిపోబోతున్న ఉమాదేవిని చూసాను. నేను తేరుకునేలోగా ఆమె కారులో వెళ్లిపోయింది. నేను గుడిలోకి వెళ్లి దర్శనం చేసుకొని వచ్చి, ఒక పక్కకు కూర్చొని, కళ్ళు మూసుకొని, ధ్యానం చేసుకోసాగాను. ఇంతలో ఏదో ఒక కాగితం లాంటిది, నా ముఖంమీద వాలితే కళ్ళు తెరిచాను. అది అర్చన టికెట్.
దానిపైన అన్నంపూడి చక్రవర్తి, భారద్వాజస గోత్రం అని రాసి ఉంది.
ఆ పేరు, గోత్రం నాదే. ‘నా పేరూ, గోత్రంతో ఇక్కడ ఇంకా ఎవరున్నారబ్బా’ ఆన్న ఆశ్చర్యంతో నేను టికెట్ కౌంటర్ దగ్గరకు వెళ్లి, క్లర్క్‌కు టికెట్ చూపిస్తూ “ఈ టికెట్ ఎవరిదో ఇక్కడ పడి ఉంది” అన్నాను.
“ఇది ఇంతకు ముందు ఉమాదేవి మేడం గారు తీసుకున్నారు. ఆ చీటీ లో ఉన్న పేరు గల వ్యక్తి పుట్టిన రోజట. అర్చన చేయించి వెళ్ళారు” అన్నాడు పక్కనే ఉండి నా ప్రశ్న విన్న పూజారిగారు.
నవ్వడంతో పాటు, దశాబ్దాలుగా మరిచిపోయిన నా పుట్టిన దినం అప్పుడు గుర్తుకు వచ్చింది.
‘ఉమాదేవి నన్ను మరిచిపోలేదు. అంతమాత్రాన ఆమె మనసులో యే మలిన భావం లేదు. బాధ్యతాయుతమైన ప్రౌఢ ఇల్లాలు యే విధంగా బ్రతకాలో అలాగే ఉన్నతంగా బ్రతుకుతుంది’ అనిపింది.
ఆమె పైన మరింత గౌరవం పెరిగింది.
అక్కడి నుండి మళ్ళీ గర్భగుడి వైపు వెళ్లాను. కళ్ళు మూసుకున్నాను.
“తండ్రీ! ఉమాదేవిని చూస్తుంటే గుడిలో అమ్మవారిలా తోస్తుంది. ఆమె ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లేలా దీవించు” అని మొక్కుకున్నాను.
అక్కడి నుండి బయలుదేరాను. ఇంటికి వెళ్లాను.
మనసు అట్టడుగు పొరల్లో ఎపుడో సమాధి అయిపోయి, ఈ మధ్య కాలంలో నిదురించే తోటలోకి వచ్చిన పాటను వినడం వలన తాత్కాలికంగా బయటకు వచ్చిన నా తొలి వలపు జ్ఞాపకాలను శాశ్వతంగా సమాధి చేసి.. మలిజీవనభావనలకు మరింత పాదు పోసి..
బెడ్ రూమ్ నుండి ఎప్పుడూ వినపడే రుక్మిణి పాడే దూషణ గానాన్ని వింటూ..
బ్రతుకుతు.. కాదు కాదు.. జీవిస్తున్నాను.
రచయిత ‘కుంతి’ అసలు పేరు కుంతీపురము కౌండిన్య తిలక్. కుంతి కలం పేరు. వృత్తి రీత్యా కేంద్ర ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. ప్రవృత్తి రీత్యా కవి, రచయిత. హైదరాబాద్ వాస్తవ్యులు.
‘యాదగిరి లక్ష్మీ నృసింహ ముక్తావళి’, ‘ప్రణతి! వేంకట పతి!’ అన్న కావ్యాలను; మూడు ఆశ్వాసాల ‘మహా పరిణయము’ అను ప్రబంధాన్ని రచించారు.
వీరు వ్రాసిన పలు వ్యాసాలు, కథలు ప్రముఖ ముద్రణా/ఎలక్ట్రానిక్ పత్రికలో ప్రచురితమయ్యాయి. అనువాదాలు చేశారు.
హైదరాబద్ ఆకాశవాణిలో వీరి కథానికలు, నాటికలు, వ్యాసాలు ప్రసారమయ్యాయి.
కొన్ని కథలకు, కావ్యాలకు బహుమతులు, ప్రశంసలు లభించాయి. ప్రపంచ తెలుగు మహా సభలలో శతావధానం కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించారు.
