Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తోలుబొమ్మలాట

[నల్లబాటి రాఘవేంద్రరావు గారు రచించిన ‘తోలుబొమ్మలాట’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక – బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో సాధారణ ప్రచురణకి ఎంపికైన కథ.]

ర్మారావుకి పెళ్లి చూపులు. తన ఊరు వైజాగ్ నుండి వచ్చి కోటిపల్లి వెళ్లడానికి రామచంద్రపురంలో బస్సు దిగాడు. అతని కూడా బంధువర్గం చాలా మంది ఉన్నారు. కోటిపల్లి బస్సు రావడానికి టైం ఇంకా ఉండడంతో ఆ బస్సు స్టాండ్ పరిసర ప్రాంతాలన్నీ కలియ తిరుగుతున్నారు వాళ్లంతా.

ధర్మారావు సడన్‌గా ఒక దృశ్యం చూసి ఆగిపోయాడు.

పండుటాకులా ఉన్న ఆ ముసలావిడ బంగారు రంగు శరీరంతో, ముఖాన రూపాయి బిళ్ళంతా ఎర్రని కుంకుమ బొట్టుతో మెడలో రకరకాల పూసల దండలతో చేతినిండా రంగురంగుల గాజులతో ముగ్గుబుట్ట లాంటి తల వెంట్రుకలతో శరీరం మొత్తం చిన్న చిన్న ముడతలతో తల చిన్న చిన్నగా ఊగుతూ, క్షణక్షణానికి కళ్ళు మూసి తెరుస్తూ అక్కడున్న రెండు పెద్ద ఎలక్ట్రిక్ స్తంభాల నడుమ నివాసం చేసుకుని కూర్చుంది. చేతిలో చిన్న జూకతో నేల మీద కొడుతూ కంచంలో డబ్బులు గల గలలాడిస్తూ అడుక్కుంటుంది. ఆమెకు ఎండ వాన పడకుండా రెండు మూడు తాటాకులతో ఎవరో పందిరి లాంటిది వేసి పుణ్యం కట్టుకున్నారు. ఆ తాటాకుల్లో దూర్చిన చిన్న గుట్టల మూటే ఆవిడ ఆస్తిపాస్తులు.

ఆ ముసలావిడ వివరాలు అడిగాడు పక్కనే ఉన్న బడ్డీ కొట్టు అతన్ని ధర్మారావు.

“ఎక్కడ నుండి వచ్చిందో ఇక్కడ ఎవరికీ తెలియదు సారూ. ఈవిడను మేము పుష్కరం నుండి చూస్తున్నాము. ఇదే రూపం. మార్పు అస్సలు లేదు. పోయిన వడగాడుపులకే బాల్చి తన్నేయాలి. ఎలా బ్రతికేసిందో అర్థం కావడం లేదు. ‘నువ్వు ఇంకా ఎక్కువ రోజులు బ్రతకవు రేపు ఎల్లుండో చచ్చి పోతావ్.’ అని మేము అందరం వేళాకోళం ఆడుతూ ఉంటాం. ‘సుబ్బాయమ్మ మామ్మ..’ అంటూ పలకరిస్తూ డబ్బులు వేయండి కంచంలో. ‘మనవడా..’ అంటూ మీతో బాగా మాట్లాడుతుంది.”

అలా అతను చెప్పిన మాటలతో ధర్మారావు వెంటనే జేబులోంచి రూపాయి కాసు తీసి ఆమె సత్తు కంచంలో వేశాడు. వెంటనే “సుబ్బయమ్మా.. ఓ మామ్మ.. నిన్నే నీ వయసెంత.” అంటూ అడిగాడు.

“మనవడా ఇలా రారా కూర్చో 60 పైనే ఉండొచ్చు.” అంటూ వణుకుతూ చెప్పింది సుబ్బాయమ్మ.

“అదృష్టవంతురాలివి. ఇంత వయసు వచ్చినా ఎవరు సాయం లేకుండా ఏ రోగం లేకుండా కనీసం ఇల్లు కూడా లేకుండా..”

“నిజమే మనవడా నాకు ఎవరూ సాయం లేరు. ఏ జబ్బు రాదు నాకు దేవుడే దిక్కు. నారు పోసినవాడు నీరు పోయాడా ఆడే చూసుకుంటాడు. తింటానికి ఏమైనా ఉంటే పెట్టు మనవడా.” అంటూ ఆశగా తల పైకి ఎత్తి అడిగింది.

“సరే ఈ రెండు రూపాయలతో అరటిపండ్లు కొనుక్కొని తిను. నా పేరు ధర్మారావు. కోటిపల్లిలో సంబంధం ఉందట. నాకే. వెళ్తున్నాను. నాకు నప్పింది అనుకో నీకు పప్పుఅన్నం పెడతా. పెళ్లి అయ్యాక మామగారు ఇంటికి వెళుతూ ప్రతిసారి నిన్ను కలిసి వెళ్తాను. అయినా నువ్వు రేపో ఎల్లుండో హష్ కాకి అయిపోతావట.” ధర్మారావు పెద్ద జోక్ వేసిన వాడిలా నవ్వుతూ అన్నాడు.

కోటిపల్లి సంబంధం కుదరటం. పెళ్లి అవటం; 16 రోజుల పండుగ, సంక్రాంతి, ఉగాది, ఆషాడం, శ్రావణం ఇలా అత్తారింటికి వెళ్లి వచ్చే ప్రతిసారి బస్టాండ్లో సుబ్బాయమ్మ మామ్మను కలవడం అలవాటై పోయింది ధర్మారావుకి.

అంతేకాదు వైజాగ్ నుండి తను వచ్చి రామచంద్రపురంలో దిగగానే కోటిపల్లి బస్సు సిద్ధంగా ఉన్న ధర్మారావు ఎక్కడు.

ఆ విషయం తెలిసిన అతని భార్య గుణవతి కంగారు పెట్టదు.. “ముందు మీ మామ్మ ఉన్నదో లేదో చూసి రండి. తర్వాత బస్సు ఉందో లేదో చూద్దాం” అంటుంది. దాంతో ధర్మారావు మామ్మ దగ్గరికి వెళ్లి “మామ్మ సుబ్బయమ్మా.. బాగున్నావా.” అని అడగ్గానే.. “నువ్వు ధర్మారావు కదరా నాయనా.. బాగున్నావా…” అంటూ పలకరించేస్తుంది.

అక్కడున్న ఇద్దరు ముగ్గురు బడ్డీవాళ్లకు తను ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాడు ధర్మారావు. సుబ్బాయమ్మకు ఏదైనా జరిగితే తనకు కబురు చేయమని, మనవడిగా తాను ఆమె అంత్యక్రియలు జరుపుతానని వాళ్ళ అందరితో చెప్పాడు కూడా.

***

6 ఏళ్ల తర్వాత..

ధర్మారావు భార్య పిల్లలతో బస్సు దిగాడు. అబ్బాయి రవిబాబు అమ్మాయి మల్లిక. అబ్బాయి రవిబాబు వయసు అప్పుడు ఐదేళ్లు. తండ్రి ఇచ్చిన ఐదు రూపాయల బిళ్ళ సుబ్బయ్య సత్తు కంచంలో వేశాడు. మల్లిక తాను మరో రూపాయి వేసింది.

“6 ఏళ్ల నుండి ఇలాగే ఉన్నావు. నీలో ఏ మార్పు లేదు. నేను చూడు, అప్పుడే తెల్లవెంట్రుకలతో ఎలా అయిపోయానో.” అన్నాడు ధర్మారావు నవ్వుతూ. భార్య గుణవతి నవ్వేసింది భర్త తలలో పైకి వచ్చిన తెల్ల వెంట్రుకలు లాగేస్తూ.

పిల్లలు ఇద్దరూ సుబ్బయ్య మామ్మను చాలా చిత్రంగా చూశారు. ఆ తర్వాత అందరూ బస్సు ఎక్కేసారు.

“మల్లికా.. మీ మామ్మ మళ్లీ మనం వచ్చేసరికి కనిపిస్తుందో లేదో చాలా పెద్ద వయసు కదా.. ఒకసారి మళ్లీ చూడవే దాన్ని” అన్నాడు తండ్రి ధర్మారావు.

“పాపం అలా అనకండి. ఎవరు చెప్పగలరు.” అంటూ బాధ పడినట్టు అంది భార్య.

“ఎందుకు కనపడదు నాన్నా ఈ మామ్మ.” అడిగాడు కొడుకు.

“ఎందుకు అంటే.. చచ్చిపోతుందేమోరా. చాలా పెద్ద వయసు కదా. మళ్లీ చూపించు నాన్నా అంటే చూపించలేనురోయ్. ఎవరూ లేరు, ఒంటరిది. ఎండకు ఎండాలి, వానకు నానాలి ఇలాంటి వాళ్ళు బ్రతకరు మరి. ఈ బస్సు కిటికీలోంచి చివరిగా చూడరా నీకు కనిపిస్తుందో లేదో మళ్లీ.. మల్లికా నువ్వు కూడా చూడు.” ధర్మారావు ఆ మామ్మను బస్సు కిటికీలోంచి చూపించి తను కూడా చూసి భార్యకు కూడా చూపించాడు.

***

“పెళ్లి చేసుకోవటమే మహా పాపం. అందరికీ అనుకున్నట్టు అన్ని జరగవు. రోజులు చాలా మారిపోయాయి. ఇదేంటి అని అడిగితే గొడవలు. నాతో గొడవ పెట్టుకుని మా ఆవిడను బలవంతంగా కోటిపల్లి తీసుకొచ్చేశారు. నేను ఇప్పుడు వెళ్లి మామూలుగా నా పెళ్ళాన్ని పంపించేయండి అని అడిగాను. పెద్దలను తీసుకొచ్చి సమస్య పరిష్కరించుకొని నీ భార్యను తీసుకెళ్ళు అంటున్నారు. దానికైనా బుద్ధి ఉండాలి కదా. ఛీ ఛీ ఈ జన్మలో మళ్ళీ నేను దాని మొఖం చూడను. నేను చచ్చేలోపులో మళ్ళీ ఈ కోటిపల్లి కూడా రాను మామ్మ. పక్క ఊరే కనుక అది కనక నీ దగ్గరికి ఎప్పుడైనా వస్తే కాస్త బుద్ధి, గడ్డి పెట్టు. భర్త రమ్మన్నప్పుడు వెళ్ళిపోవాలి.. అన్న జ్ఞానం లేదా అని గట్టిగా అడుగు. సమస్యలు అన్నీ తీరడానికి పది సంవత్సరాలు పడితే ఈ పిల్లల్ని ఎలా పెంచి పోషిస్తావు అని అడుగు. అసలు కరిగి పోయిన యవ్వనం అంతా తిరిగి వస్తుందా తింగరి దానా అని గడ్డిపెట్టు. అసలే అన్నదమ్ములతో నా ఇంటి దగ్గర ఆస్తి గొడవలతో ఒక పక్క, ఆఫీసులో ఘర్షణలు మరొకపక్క. దానికి తోడు ఈవిడ సమస్య ఒకటి. సుబ్బాయమ్మ మామ్మా, వినపడుతుందా నేను చెప్పేవన్నీ. నిన్నే..” అరిచినట్టు విషయం చెప్పాడు ధర్మారావు.

“ఎ..వ..రు.. నా మనవడు ధర్మా..రావా”

“‘ఏడ్చినట్టుంది నీకు వినపడలేదన్నమాట. నేను ధర్మారావునే.”

“మనవడా.. నాకు ఈ మధ్యన సరిగ్గా వినబడటం లేదు నాయనా. బాగున్నావా? కళ్ళు కూడా మసక బారినై. నువ్వేదో అంటున్నట్టున్నావు”

“సర్లే నీ వయసు అయిపోయింది. రేపో ఎల్లుండోలా ఉన్నావు. ఇదంతా నీకు చెప్పడం నా తెలివితక్కువ. నా బుద్ధి తక్కువ.” అంటూ ధర్మారావు విసురుగా ముందుకు వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కు వచ్చి రెండు రూపాయలబిళ్ళ జేబులోంచి తీసి సత్తు బొచ్చెలో దూరంగా ఉండి గిరాటేశాడు.

శబ్దం విని.. “నా మనవడు ఎంత మంచోడో” అంటూ ఆనందంగా అంది.

“అవును.. నేను మంచివాడిని. చాలా మంచివాడిని. ఈ సమాజమే నన్ను అర్థం చేసుకోవట్లేదు” తను మూలిగినట్టు అంటూ ముందుకు సాగిపోయాడు ధర్మారావు.

***

దశాబ్ద కాలం గడిచిపోయింది.

కోర్టు గొడవలు, ఘర్షణలు గతించిన తర్వాత ఆ మధ్య గుణవతిని తీసుకెళ్లి ధర్మారావు దగ్గర దిగబెట్టారు అత్తవారి ఇంటి దగ్గర పెద్దలు.

ఈ రోజు ధర్మారావు మళ్లీ భార్య పిల్లలతో కోటిపల్లి వెళ్లడానికి రామచంద్రపురంలో బస్సు దిగాడు.

“ఇదిగో సుబ్బాయమ్మ మామ్మా బాగున్నావా.. నేను చెప్పినట్టు మా ఆవిడతో గొడవలు సద్దుమడగడానికి 10 ఏళ్లు పట్టింది. అందుకనే నిన్ను చూడడానికి రాలేకపోయాను. నువ్వు అప్పుడు లాగే ఉన్నావు కానీ నేను చాలా మారిపోయాను. నేనే ధర్మారావుని.. నన్ను గుర్తుపట్టావా? నీకు అసలు వినపడుతుందా?”

“మనవడు ధర్మారావా. నువ్వ నాయన బాగున్నావా. మీ ఆవిడ పిల్లలు బాగున్నారా”

“ఇదిగో మా అబ్బాయి రవిబాబు. పెద్దోడు అయిపోయాడు. ఎంత పొడుగు అయిపోయాడో చూడు.. ఇదిగో మా అమ్మాయి మల్లిక. మా ఆవిడ గుణవతి ఇదిగో.. పళ్ళు అన్ని ఊడిపోయి నీ కన్నా ముసలి దానిగా తయారైపోయింది. నువ్వు మాత్రం అలాగే ఉన్నావు.. ఏమిటి వినపడుతుందా”

“అదేమిటోరా ఈమధ్య బాగా వినబడుతుంది బాగా కనపడుతుంది.”

“ఏం మందులు వాడుతున్నావేంటి?”

“మందులా నా మొఖమా ఏది లేదు..”

“అవును.. ఇక్కడ కర్రలు పైన తాటాకులు లేవేంటి?”

“మొన్న సీఎం గారు వచ్చారని పీకేసార్ రా బాబా.”

“మరి ఇప్పుడు ఎలా?”

“ఇవిగో నాలుగు గడలు నాలుగు తాటాకులు సంపాదించాను. రాత్రికి రిక్షావోళ్ళు, మేస్త్రీలు కలిపి వేస్తానన్నారు”

“సరే ఆయాసపడుతున్నావేమిటి?”

“మామూలే అప్పుడప్పుడు వస్తుంటుంది.”

“నాకు ఈ పది సంవత్సరాల్లో బిపి.. షుగర్.. ఆ మధ్య నేను హైదరాబాద్ పనిమీద వెళుతుంటే యాక్సిడెంట్ కూడా అయింది. మూడు లక్షలు వదిలాయి. ఏమిటి వింటున్నావా.”

“వినబడుతుంది మనవడా.”

“ఇంకా చాలా విషయాలు జరిగాయి. నా ఉద్యోగం పోయింది. మా నాన్న అమ్మ చచ్చిపోయారు. అక్క బావ కూడా. ఇంకా చాలామంది మా వాళ్ళు కాలం చేశారు. ఇప్పుడు అందరిలోకి నేనే పెద్దవాడిని. ఏమిటి నాకేసి అలా చూస్తున్నావు.. ఈ పొట్ట గురించే కదా.. నా డబ్బు కన్నా బాగా ఎక్కువగా పెరిగింది. ఈ పొట్ట ఒకటే. చాకలి బాన అంత పొట్ట. ఇంక మా ఆవిడకు సరే సరి.. అన్ని రోగాలు ఉన్నట్టే. ఇదిగో నాకు బాగా ఎక్కువ చెత్వారం వచ్చేసింది. భూతద్దం కళ్ళజోడు. అవును నీకు కళ్ళజోడు లేదేమిటి.. ఎలా కనపడుతుంది.”

“చత్వారం వచ్చి తగ్గిపోయినట్టుంది. ఇప్పుడు బాగుంది. నా మాటకే గాని నీ గొడవలన్నీ తగ్గించుకో మనవడా.” వణుకుతూ అంది

“అదే ప్రయత్నంలో ఉన్నాను కానీ ఎక్కడ తగ్గుతాయి. పెరుగుతున్నాయి. 15 లక్షలతో బిల్డింగు కట్టి నాలుగు రాళ్లు వెనకేసుకుని ముసలి వయసులో వీధిపాలు కాకుండా హాయిగా బ్రతకాలని ప్రయత్నం చేస్తున్నాను. అలా జరగకపోతే ఇదిగో నీలాంటి బ్రతుకు బ్రతకాలి. నా సంపాదన అంతా అందరూ దొబ్బేశారు. కోర్టులో కేసులు వేస్తున్నాను. నా బ్రతుకంతా కూడా కోర్టులు పాలే ఛీ ఛీ.”

“సరే నువ్వు మాత్రం ఎవరి మీద తప్పుడు కేసు పెట్టకు మనవడా, అది మహా పాపం.”

“ఎవరైనా న్యాయంగా ధర్మంగా బ్రతుకుదాం అంటే కుదరని రోజులు ఇవి. నువ్వు ధర్మంగానే ఉన్నావు కదా అయితే ఏమైందో నువ్వే ఆలోచించుకో. ఉండడానికి ఇల్లు లేకుండా దిక్కుమాలినదానివి అయిపోయావు. ఇదంతా చెప్పి నీకు ఉపయోగం లేదు కానీ మళ్ళీ వచ్చినప్పుడు తీరిగ్గా చెప్తాలే. అయినా ఈ పది సంవత్సరాలు ఎలాగో గమ్మత్తుగా బ్రతికేశావు. నీ రూపంలో శరీరంలో మార్పు లేదు. 20 ఏళ్ల క్రితం నీకు అప్పుడు 60 ఏళ్లు నేను నిన్ను మొదట చూసినప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా అలాగే ఉన్నావు. నీ వయసు ఇప్పుడు 80 దగ్గర దగ్గర ఉంటాయి. ఇంకా బ్రతకేద్దాం అనుకుంటున్నావా. ఇదే నీకు నాకు చివరి చూపేమో. ఇక నువ్వు నాకు కనపడకపోవచ్చు. ఇదిగో వంద రూపాయలు పొట్లం కట్టి ఇస్తున్నాను. బొడ్డులో దాచుకో. ఒక చీర కొనుక్కో. ఇదే చివరిసారి నీకు నేను చీర పెట్టడం అవుతుంది మరి.”

“అయితే నేను చచ్చిపోతానంటావా మనవడా”

“ఎవరు చెప్పగలరు సుబ్బాయమ్మా. ఈరోజుల్లో 80 దాటి బ్రతికి బట్టకట్టే వాళ్ళు ఎవరూ లేరు. నువ్వు తప్ప. సరే అది నీ అదృష్టం. నేను బయలుదేరుతున్నాను. కానీ జాగ్రత్తగా విను. ఎప్పుడైనా నీకు ఏదైనా అయినా కంగారు పడకు. నీకు నేను ఉన్నాను. నేను వెంటనే వచ్చేలాగా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నానులే.. ఏమిటో నువ్వు నాకు దగ్గర దానిలా కనిపిస్తున్నావు మరి అందుకనే అన్నమాట.. ఈ ఏర్పాటు అంతా.” అని అంటూ ముందుకు కదిలాడు ధర్మరావు.

***

కాలగమనంలో మరో 10 సంవత్సరాలు గతించిపోగా, హరించిపోగా సుబ్బాయమ్మ వయసు ఇప్పుడు 90 ఏళ్ళు.

60 ఏళ్ళు పైబడ్డ ధర్మరావు టాటా సుమోలోంచి అప్పుడే దిగాడు తన ఫ్యామిలీతో రామచంద్రపురం బస్టాండులో.

బస్టాండ్ చాలా మారిపోయింది. చుట్టూ కల తిరిగాడు. ఇదివరకటి షాపులు షాపు ఓనర్స్ ఏ ఒక్కరు కనబడలేదు. చాలామంది కాలగర్భంలో కలిసిపోయినట్టు తెలిసింది. ఆ కరెంటు పోల్స్, బడ్డీకోట్లు, తాటాకు పాకలు ఏమీ లేవు ఇప్పుడు. వెతికి వెతికి సుబ్బాయమ్మ కూర్చున్న దగ్గరకు వెళ్ళాడు అందరితో ధర్మారావు.

“నీ ఇంటాపటాన నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా. సుబ్బాయమ్మ మామ్మ, ఆరోగ్యం బాగుందా నేను చూస్తాను అనుకోలేదు బాబు నిన్ను”

“నా మనవడు ధర్మారావువి కదూ..”

“అవును.. నీకు వయస్సు వచ్చే కొలది యవ్వనం వస్తున్నట్టుంది. బాగానే గుర్తుపట్టావు కానీ ఏమిటలా పీకి పాడేసిన తాటి టెంకను గిరాటేసినట్టు దూరంగా వచ్చి పడ్డావు..” ధర్మారావు పెద్ద జోక్ పేల్చిన వాడిలా గట్టిగా నవ్వుతూ అన్నాడు.

“మొన్న గవర్నమెంట్ మనుషులు రాత్రి కాడ వచ్చి రోడ్డు వెడల్పు చేస్తామని బిల్డింగులే కొట్టేసారు నాయనా.. ఇదిగో ఇక్కడ చోటు దొరికింది. నువ్వెలా ఉన్నావు మనవడా చూసి పదేళ్లయింది” అర నిమిషానికి ఒక మాట చొప్పున వణుకుతూ అంది.

“బ్రహ్మాండంగా ఉన్నాను పాతిక లక్షలతో ఇల్లు కట్టాను. ఐదు లక్షల కారు కొన్నాను. పిల్లలు ఇద్దరినీ ఇంజనీరు, డాక్టరు చదివించాను. మా అత్తవారింటికి కోటిపల్లి ముఖ్యమైన పని మీద వెళ్తుంటే పిల్లలు పట్టుపట్టారు నిన్ను ఒకసారి చూడాలని ఉంది అని. ఇక్కడ వాళ్ళకి నేను ఫోన్ చేసి తెలుసుకుంటే నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావని చెప్పడంతో వాళ్లు ఎగిరి గంతేసి మరీ వచ్చేసారు.. ఇరుగో. ఇదిగో ఈవిడ ఎవరు అనుకుంటున్నావు. ఎండిపోయిన కొబ్బరిమట్టలాగా ఉన్న ఈవిడే మా ఆవిడ. గుణవతి. నీకన్నా ముసలి డొక్కు అయిపోయింది. కీళ్లు నొప్పులు, ఇంకా 90 రకాల జబ్బులతో పోరాడుతూనే ఉంది. నాకేమో మొన్న హార్ట్ ఎటాక్ కూడా వచ్చి పది లక్షలు పట్టుకుపోయింది.” అంటూ అందరినీ ఆవిడకు చూపించి.. “రవిబాబు, మల్లికా ఈ సుబ్బాయమ్మ మామ్మ గురించే మీరు ఇప్పుడు వచ్చింది. 30 ఏళ్ల క్రితం మీ అమ్మని పెళ్లి చూపులు చూడడానికి ఇటు వెళుతూ చూస్తే అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది ఈ ముసలిది.. అదే పెద్ద విచిత్రం. ‘వేదాంతంగా నాకు దేవుడే దిక్కు!’ అంటూ మాట్లాడుతూ ఏ రోగాలు లేకుండా 100 ఏళ్ళు బ్రతికేయడానికి సిద్ధంగా ఉంది. ఫోటో తీసి మ్యాగజైన్‌లో వేయించుకోండి.. మీ దగ్గర కెమెరాలు ఉన్నాయి కదా ఆ పని మీద ఉండండి. ఇదిగో.. సుబ్బాయమ్మ మామ్మా, మా ఆవిడ నీకు చివరగా పెట్టాలని ఒక చీర తెచ్చింది. నీకు ఆకుపచ్చ చీర బాగుంటుంది అంటూ సెలక్షన్ చేసి కొంది. ఇదిగో ఈ వంద రూపాయలు కూడా నీ బొడ్డులో దోపుకో. అవసరానికి ఉపయోగపడుతుంది”

“ఎందుకురా ఇవన్నీ మనవడా.”

“ఆ మాట అనకు ఉంచుకో.”

తన దగ్గర ఉన్న విజిటింగ్ కార్డు అక్కడ అరడజను మందికి ఇచ్చి టాటా సుమో ఎక్కి అందరితో పాటు వెళ్లిపోయాడు ధర్మారావు.

***

కాలం మరో అర్థ పుష్కరం మింగేసింది.

ఈ మధ్యన అగ్ని ప్రమాదంలో అక్కడ షాపులన్నీ కాలి బూడిద అయిపోగా సుబ్బాయమ్మ మాత్రం తన గూడును వదిలి ఇంకో మూల దూరంగా ఉన్న ఒకే రేకుపై ఆధారంగా ఉన్న చెక్కపెట్టి లాంటి జాగాలో తలదాచుకుంది.

ఆ మధ్యానం ఆ రామచంద్రపురం బస్టాండ్‌లో టాటా సుమో దిగిన ధర్మారావు ఒక్కడు చేతి కర్ర సహాయంతో సుబ్బాయమ్మ కోసం వెతుకుతున్నాడు. అన్ని వెతికి అందర్నీ అడిగి చివరికి సుబ్బాయమ్మ ఉండే చోటు సమీపించగలిగాడు.

“మామ్మ.. సుబ్బాయమ్మా.. ఎలా ఉన్నావు. నీరసంగా అలా పడిపోయి ఉన్నావేమిటి. వయసు భారంతో కుంగిపోయి ఉన్నావు. నా పరిస్థితి కూడా అలాగే ఉందిలే.”

“ధర్మారావా.. మనవడా రా నాయనా కూర్చో..” కూర్చోలేక పెదాలు కూడా కదపలేని స్థితిలో అంది సుబ్బాయమ్మ.

“నువ్వెలా బ్రతికేస్తున్నావో నాకు అర్థం కావడం లేదు. నా భార్య క్యాన్సర్‌తో చనిపోయి చాలా రోజులైంది. పిల్లలు ఇద్దరికీ పెళ్లిళ్లు అయ్యాయి. వాళ్లకి పిల్లలు పుట్టారు. కోటిపల్లిలో మా అత్తవారు మా ఆవిడ పేరిట ఉన్న పొలం అమ్మేశారట. ఆ డబ్బు పట్టుకెళ్దాం అని నేను ఇప్పుడు చివరిసారిగా వచ్చాను అన్నమాట. ఇక ముందు వచ్చే పని నాకు ఈ జన్మలో ఉండదు మరి. ఎప్పుడైనా నీ కార్యక్రమాల కోసం మాత్రం రావాల్సి వస్తుంది.”

“అలా అనకురా మనవడా. నిన్ను చూస్తుంటే నాకు కొత్త ప్రాణం వచ్చినట్టు ఉంటుంది.”

“నీ మాటేమో కానీ నాకు మాత్రం చచ్చిపోవాలని ఉంది. బ్రతికి ఏం సాధించాలట. జీవితం చాలా విరక్తిగా ఉంది. మొన్న మా అబ్బాయి కూడా నామీద తిరగబడినట్టు మాట్లాడాడు. నన్ను చూసీచూడనట్లు చూస్తుంది నా కోడలు. ఎప్పుడు వదిలిపోతానా అన్నట్టు ఉంది వ్యవహారం. అల్లుడితో పొత్తులు లేవు. కూతురు, అల్లుడుకు అన్నీ పెట్టిన సరే నా గుమ్మం తొక్కనన్నారు.

ఇక ఆస్తిపాస్తులు అంటావా ఈ మధ్య మూడు బంగళాలు సంపాదించాను. పొలాలు, డిపాజిట్లు, బంగా రాలు, ఫ్యాక్టరీల్లో షేర్లు ఎందుకు ఇవన్నీ. దండగ కదా. తలపోటు వ్యవహారం. నిమిషం నిమిషం భయంతో బ్రతుకుతున్నాను వాట్లను చూసుకొని. నువ్వు చూడు ఎంతో హాయిగా ఉన్నావు. నిన్ను.. నీ ఆరోగ్యం చూస్తుంటే నాకు కుళ్ళుమోతుతనం వచ్చేస్తుంది. నీకు ఒంట్లో బాగోకపోతే ఇక్కడ నిన్ను కనీసం పలకరించేవారు ఉన్నారు. చస్తే చివరికి ఈడ్చి ఎక్కడికైనా పట్టి కెళ్ళి పడేసేవాళ్ళు కూడా ఉన్నారు. నాకు జ్వరం వస్తే నన్ను పలకరించే దిక్కులేదు. మంచినీళ్లు కావాలంటే అందించే తోడు లేదు. చస్తే శవాన్ని తరలించే వాడు కూడా లేడు. మునిసిపాలిటీ వాళ్ళు తప్ప. కర్మ కర్మ. ఈ చెక్కపెట్టే లాంటి ఇంట్లోనే ఇక్కడే నీతోనే ఉండాలి అని పిస్తుంది నాకు.” గట్టిగా ఏడ్చేస్తూ అన్నాడు ధర్మారావు.

సుబ్బాయమ్మ పక్కనే కూర్చున్న ధర్మారావు భుజం మీద చేయి వేసి ఓదార్చింది.

“నాకు తెలుసుండి నువ్వు మూడు పుష్కరాలుగా బ్రతికేయడం ఏమిటో నాకు అర్థం కావడం లేదే. నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. కొన్ని జన్మల నుదుటిరాతలు ఆ బ్రహ్మదేవుడు సంతృప్తిగా భోజనం చేశాక ఆనందంగా ఉన్నప్పుడు రాస్తాడేమో. ఇదిగో బోల్డంత డబ్బు ఉంది నాకు. ఏం చేసుకుంటాను. ఈ 500 రూపాయలు నీ దగ్గర ఉంచుకో. నేను వెళ్తూ చిట్టచివరిగా నిన్ను ఒక మాట అడుగుతాను నిజం చెప్తావా. ఇన్నాళ్ళు.. ఇన్నేళ్లు ఆనందంగా ఉండడానికి నువ్వేం చేస్తుండే దానివి. ఏం తినేదానివి.”

ముసిముసిగా నవ్వేసింది సుబ్బాయమ్మ.

“చెప్పు, అలా నవ్వకు”

“ఆ పైవాడు ఏది పెడితే అది తినడం లేదంటే పస్తులు ఉండడం.”

“సరే నువ్వు నిజం చెప్పవని నాకు తెలుసులే ఇక నేను వెళ్ళిపోతున్నాను.” అంటూ పైకి లేచి ముందుకు వెళ్లిపోయాడు ధర్మారావు తన బ్యాగు చేత్తో పట్టుకొని.

***

కొన్ని సంవత్సరాల తర్వాత తర్వాత ధర్మారావు కొడుకు రవిబాబు తాతగారి ఇంటికి వెళుతూ రామచంద్రపురం బస్టాండ్‌లో దిగాడు.

ఆ ప్రదేశం చాలా మారిపోయి ఉంది. చాలా ఇళ్ళు పాడుబడిపోయి కూడా ఉన్నాయి. కొన్ని కూలిపోయి ఉన్నాయి. చాలాసేపు అందరినీ అడిగి వెతికి వెతికి అతి కష్టం మీద దూరంగా పొదల్లో పెద్ద సిమెంట్ తూరలో ముడిచిపెట్టుకొని వణుకుతూ, మూలుగుతూ పడుకున్న సుబ్బాయమ్మని పట్టుకోగలిగాడు రవిబాబు

“బాగున్నావా సుబ్బాయమ్మ మామ్మా.. నేను ధర్మారావుని కాదు ఆయన అబ్బాయిని రవిబాబుని. నువ్వు చచ్చిపోతావు అనుకున్నాడు నాన్న. కానీ నీకంటే ముందే ట్రైన్ యాక్సిడెంట్లో మూడేళ్ల క్రితమే నాన్న చచ్చిపోయాడు. శవాన్ని మేం గుర్తించి ఇంటికి కూడా తీసుకురాలేకపోయాం. నాన్న కోటీశ్వరుడు అయినా చివరికి దిక్కులేని చావు. మాయాప్రపంచం. నువ్వు వందేళ్లు దాటి హాయిగా బ్రతుకుతున్నావు. తిన్నావో తినలేదో ఎలాగోలా ప్రాణంతో బ్రతికి ఉన్నావు. రోగాలు, రొస్టులు, విపత్కర పరిస్థితులు నీకు భయపడి దూరంగా ఉండటమే నువ్వు చేసుకున్న పుణ్య ఫలితమేమో. డబ్బు.. హోదా దేముంది. ఈ వేళ ఉండి రేపు మాయమైపోయే ఇంద్రజాలాలవి. చివరికి ఎంతో మంది కన్నా నువ్వే గెలుపు సాధించిన దానివయ్యావు.

నా అదృష్టం బాగుండి నువ్వు నాకు ఈ రోజు కనిపించావు. ఏమిటి ఏడుస్తున్నావు. మా నాన్న, నీ ముద్దుల మనవడు ధర్మారావు చచ్చిపోయాడని చెప్పానని బాధపడుతున్నావు కదూ. ఏం చేస్తాం కాలం చేసే గారడీని ఎలా చూడగలం. ఎలా అర్థం చేసుకోగలం. మనిషి అన్ని సాధించగలడు కానీ ఒక్కటి మాత్రం ఎప్పటికీ సాధించలేడు. అదే చావు ఎప్పుడో తెలుసుకోవడం.”

“నా మనవడు ధర్మారావు చచ్చిపోయాడా. అయ్యో అయ్యో.. వాడి కొడుకువా నువ్వు.” మూలగలేక మూలగలేక మూలుగుతూ అంది సుబ్బాయమ్మ.

“నాన్న లేడని నువ్వు దిగులు పడుతున్నట్టున్నావు. ఏం భయం లేదులే. ఈసారి నీకేం జరిగినా నాన్న తరపున నేను వచ్చి చేస్తాను. ఇక్కడ అందరికీ నా అడ్రస్ కార్డులు ఇచ్చాను. నీ అంతిమ కార్యక్రమాలు చేయడానికి నేనున్నాను. మరిచిపోకు. ఇక్కడ ఎవరో ఒకరు నాకు ఫోన్ చేస్తారు. వచ్చి చూస్తాను. దగ్గరుండి అన్ని వ్యవహారాలు చక్కపెట్టి వెళ్తాను. భయపడకు. మా నాన్న లాగే నేను కూడా నీకు ముద్దుల మునిమనవడిని. ఇదిగో ఈ డబ్బు నీ ప్లాస్టిక్ డబ్బాలో పెడుతున్నాను. ఎందుకైనా ఉపయోగిస్తుంది ఉంచుకో” అంటూ జేబులో చెయ్యి పెట్టాడు కానీ పైకి తీయలేకపోయాడు రవిబాబు. అలా పక్కకు ఒరిగిపోయాడు. అక్కడి వాళ్ళు డాక్టర్ని పిలిచారు కానీ అప్పటికే రవిబాబుకి హార్ట్ ఎటాక్‌తో ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. విషయం అందిన రవిబాబు దగ్గరలోని బంధువులు వచ్చి రవిబాబు మృతశరీరాన్ని కారులో ఎక్కించుకొన్నారు. కారు గాలిలో రివ్వున దూసుకుపోయింది ఆ శవంతో.

జరిగిన విషయం సుబ్బాయమ్మకు ఎవరో వివరంగా చెబితే అర్థమైంది. మరో రెండు కన్నీటి బొట్లు కార్చి అక్కడ ఉన్న చెట్టు మొదలుకు చేరబడింది.

నిస్సత్తువతో.. మగతగా కళ్ళు మూసుకుంది. ఆమె మూసిన కళ్ళు ఎదుట రకరకాల రంగురంగుల బొమ్మలు అలా కదులుతున్నాయి.

అందులో కొన్ని క్రింద పడకపోయినా వాటిలకవే బీటలు వారి పగిలి ముక్కలయిపోతున్నాయి.

కొన్ని పర్వతం మీద నుండి దభేలున క్రిందకు పడినా పగలటం లేదు.. ముక్కలు కావడం లేదు.

నీడ పాటుకే రంగు వెలిసి వెలవెలపోతున్నాయి కొన్ని బొమ్మలు.

మండుటెండలో ఉండే కొలది ఏ మాత్రం వాడిపోకుండా కాంతితో ప్రకాశిస్తున్నాయి.. ఇంకొన్ని బొమ్మలు.

మరికొన్ని తారాజువ్వలా ఆకాశాన్ని తగిలి మహారాజ వైభవంగా నాట్యం చేస్తున్నాయి.

మరికొన్ని వానపాముల్లా పాతాళ పొరల్లోకి కూరుకు పోయి కృశించుకుపోతున్నాయి.

Exit mobile version