Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కథారచయిత, అనువాదకుడు డా. ఎల్. ఆర్. స్వామి గారికి నివాళి

ప్రముఖ తెలుగు సాహితీవేత్త, కథారచయిత, అనువాదకుడు డాక్టర్ ఎల్. ఆర్. స్వామి 25-4-26 ఉదయం 2 గంటల 45 నిమిషాలకు విశాఖపట్టణంలో మరణించారు.

స్వామి గారు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వారానికి రెండుసార్లు డయాలిసిస్ చేయించుకుంటున్నారు.

డాక్టర్ స్వామి జన్మతః మలయాళీ.‌ మాతృభాష తమిళం.‌ ఉద్యోగరీత్యా విశాఖపట్నం చేరుకుని తెలుగు నేర్చుకుని, మిత్రుల సవాల్ స్వీకరించి తెలుగులోనే స్వంతంగా రచనలు, మలయాళం నుండి తెలుగులోకి, తెలుగు నుండి మలయాళంలోకి అనువాదాలు చేసి‌, రెండు భాషలను సంపన్నం చేసారు.

ఆయన అనువదించిన ‘సూఫీ చెప్పిన కథ’ గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద సాహిత్య పురస్కారం లభించడం ఆయన ప్రతిభకు నిదర్శనం.

విశాఖపట్నంలోని గీతం విశ్వవిద్యాలయం కూడా ఆయన సాహిత్య సేవలను గౌరవిస్తూ గౌరవ డాక్టరేట్ పట్టా ప్రదానం చేసింది. ఈ విషయం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వారి మిత్రబృందంలోనే కొందరికి తెలియదు. అహంభావానికి స్వామి గారు ఆమడ దూరం.

‘విశాఖసాహితి’ తొలితరం సభ్యునిగా వారి సాహితీ యాత్ర ప్రారంభమైంది. తదనంతర కాలంలో అనేక సంవత్సరాలు ‘మొజాయిక్ లిటరరీ ఆర్గనైజేషన్’ మరియు ‘సహృదయ సాహితి’ అధ్యక్షులుగా విశిష్ట సేవలు అందించారు.

వారు చివరి రోజులలో ప్రారంభించిన వారి జీవనయాత్రా కథనం ‘మూడో జన్మ’ను పూర్తిచేయకుండానే వెళ్లిపోవడం ఒక విషాదం.

ఆయన మరణంతో తెలుగు సాహిత్య ప్రపంచం ఒక ఆణి ముత్యాన్ని కోల్పోయింది.

స్వామి గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.

Exit mobile version