Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

జెఫ్రీ ఆర్చర్: కథకుడి జీవితం, రచనలు, శైలి

[5 అక్టోబర్ 2026 నాడు మృతిచెందిన ప్రసిద్ధ ఆంగ్ల రచయిత జెఫ్రీ ఆర్చర్ జీవితం, రచనల గురించి ఈ వ్యాసంలో వివరిస్తున్నారు డా. చిత్తర్వు మధు.]

పరిచయం:

నవలా సాహిత్యంలో రెండు విధాల రచయితలు, రచనలు వుంటాయి. వేగంగా సరళమైన భాషలో ఒక పథకంతో పేజీలు తిప్పి చదివించే రచయితలు. సాథారణంగా వీరి అమ్మకాలు, ప్రఖ్యాతి ఎక్కువగా నే వుంటాయి. రెండవ వారు క్లిష్టమైన శిల్పం శైలి భాషతో మానవ జీవితాన్ని మనస్తత్వ విశ్లేషణ చరిత్ర సంఘటనలు కలగలిపి ‘సాహిత్య విలువలు’ వున్న రచనలుగా పేరు పొంది బుకర్, నోబెల్ బహుమతులు లాంటివి అందుకునే రచయితలు.

జెఫ్రీ ఆర్చర్ మొదటి రకం రచయిత. ఆయన నవలలు పేజీలు చకచకా తిప్పి తెల్లవార్లూ నిద్ర పోగొట్టుకున్న వారిలో నేను కూడా ఒక అభిమానినే. సల్మాన్ రష్డీ, జేమ్స్ జాయిస్, లియో టాల్‌స్టాయ్, దోస్తావ్సకీ, గార్సియా ఇంకా జీన్ పాల్ సార్త్ర్, కాఫ్కా లాంటివారి రచనలు చదివితే ఒక కష్టమైన అధ్యయనం చేసినట్లు వుండేది.

జెఫ్రీ ఆర్చర్‌తో బాటు సిడ్నీ షెల్డన్, ఇర్వింగ్ వాలస్, ఫ్రెడరిక్ ఫార్సిత్, జెకె రౌలింగ్స్ కూడా తమదైన శైలిలో ఇతివృత్తంతో పఠనానందం కలిగించినవారు. ప్రపంచ పాఠకులు లక్షలమందిని అలరించిన రచయితలు, లేక కోట్ల డాలర్లు పౌండ్ల సంపద కేవలం పుస్తక రచనల మీద ఆర్జించినవారు.

నాలాంటి రచయితలకి ఇలా మనం కూడా రాయాలి అనే స్ఫూర్తి కలిగించినవారు.

అందుకనే జెఫ్రీ ఆర్చర్ మరణం ఎంతో విచారాన్ని కలిగించి, జ్ఞాపకాలను తిరిగి గుర్తు చేసింది. ఒక రచయిత రచననే నేను చూస్తాను, అతని వ్యక్తిగత జీవితం అలవాట్లు పట్టించుకోను. జెఫ్రీ ఆర్చర్ ఎంతో నేర్పు గల రచయిత అయినా ఆయన అనేక విధాలుగా కీర్తి, అపకీర్తి కూడా జీవితంలో మిగుల్చుకుని వెళ్లిపోయాడు. ఎన్నో ఉత్థాన పతనాలు అనుభవించాడు. అయినా ఆయన పేరు వినగానే నేను చదివి ధ్రిల్ అయి అభిమానిగా మారిన నవలలు మాత్రమే గుర్తు వస్తాయి. ఆయన గురించి అన్ని విషయాలు వివరంగా చూద్దాం. ఇప్పుడు ఒక రచయితని ఒక వ్యక్తిగా, రచయితగా విశ్లేషణ చేసే సమయం వచ్చింది కాబట్టి.

ఆంగ్ల సాహిత్యంలో జెఫ్రీ ఆర్చర్ (Jeffrey Archer) పేరు వినగానే ఉత్కంఠభరితమైన కథలు, ఊహించని మలుపులు గుర్తుకొస్తాయి. ఆయన కేవలం రచయిత మాత్రమే కాదు. క్రీడాకారుడు, రాజకీయ నాయకుడు, నిధుల సేకరణ వేలం పాటదారు, జైలు శిక్ష అనుభవించిన వ్యక్తి కూడా. ఇన్ని పాత్రలు ఒకే జీవితంలో ఇమిడిన వ్యక్తులు అరుదు. ఆయన నవలలు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ప్రతులు అమ్ముడయ్యాయి, అనేక భాషల్లోకి అనువాదమయ్యాయి. భారతదేశంలో కూడా ఆయనకు పెద్ద పాఠకవర్గం ఉంది. 2026 అక్టోబర్ 5న 86 ఏళ్ల వయసులో ఆయన కన్నుమూశారు; ఆయన చివరి నవల Adam and Eve ఆ మరుసటి రోజే విడుదలైంది.

బాల్యం, విద్య:

జెఫ్రీ హోవర్డ్ ఆర్చర్ 1940 ఏప్రిల్ 15న ఇంగ్లండ్ లోని లండన్‌లో జన్మించారు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఆయన బాల్యం గడిచింది. కుటుంబం త్వరలోనే సోమర్సెట్ ప్రాంతంలోని వెస్టన్-సూపర్-మేర్ అనే సముద్రతీర పట్టణానికి మారింది. ఆయన తల్లి లోలా ఆర్చర్ స్థానిక పత్రికలో పనిచేసిన ధైర్యవంతురాలు. కొడుకు ఎదుగుదలపై ఆమె ప్రభావం బలంగా ఉందని ఆర్చర్ చెబుతుంటారు. తండ్రి విలియం ఆర్చర్ గురించి ఆసక్తికరమైన కథనాలున్నాయి. ఆయన ఓ మోసగాడనీ, అనేక కథలు అల్లి చెప్పేవాడనీ చెబుతారు. కథలు చెప్పే నైపుణ్యం ఆర్చర్‌కు తండ్రి నుంచే వచ్చిందని కొందరు విమర్శకులు అంటారు.

చదువులో ఆర్చర్ గొప్ప విద్యార్థి కాదు. కానీ క్రీడల్లో అద్భుతంగా రాణించారు. వెల్లింగ్టన్ స్కూల్లో చదివి, తర్వాత ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని బ్రేజెన్నోస్ కాలేజీలో శారీరక విద్య కోర్సులో చేరారు. ఇక్కడ ఆయన స్ప్రింటర్‌గా పేరు తెచ్చుకున్నారు. 100 గజాల పరుగును సుమారు 9.6 సెకన్లలో పూర్తి చేసేవారని ఆయన చెబుతారు. గ్రేట్ బ్రిటన్ తరఫున కూడా పరుగెత్తారు. ఈ క్రీడా జీవితం ఆయనలో పోటీతత్వాన్ని, క్రమశిక్షణను నాటింది. ఆ లక్షణాలు తర్వాత ఆయన రచనా జీవితంలో కూడా కనిపిస్తాయి.

నిధుల సేకరణ, రాజకీయ ప్రవేశం:

ఆక్స్ఫర్డ్ తర్వాత ఆర్చర్ స్వచ్ఛంద సంస్థలకు నిధులు సేకరించే పనిలోకి వచ్చారు. ఆక్స్ఫామ్ (Oxfam) వంటి సంస్థల కోసం ఆయన చేసిన కృషి గుర్తింపు పొందింది. ప్రసంగాలు, వేలం పాటల్లో ఆయన నైపుణ్యం అప్పుడే బయటపడింది. తర్వాతి కాలంలో చారిటీ వేలాల్లో ఆయన ప్రసిద్ధ వేలందారుగా మారారు.

1966లో గ్రేటర్ లండన్ కౌన్సిల్‌కు ఎన్నికైన ఆయన, 1969లో లింకన్షైర్లోని లూత్ నియోజకవర్గం నుంచి కన్జర్వేటివ్ పార్టీ తరఫున పార్లమెంటు సభ్యుడయ్యారు. అప్పుడు ఆయన వయసు కేవలం 29 సంవత్సరాలు. అప్పటి అత్యంత పిన్న వయస్కులైన ఎంపీలలో ఒకరిగా నిలిచారు. భవిష్యత్తు ప్రధానమంత్రి అవుతారని కూడా కొందరు ఊహించారు.

పతనం, రచనా జీవిత ఆరంభం:

1974లో ఆయన జీవితం ఒక్కసారిగా తలకిందులైంది. కెనడాకు చెందిన ఒక కంపెనీలో భారీగా పెట్టుబడి పెట్టి, అది మోసమని తేలడంతో ఆయన దివాలా తీశారు. అప్పులు తీర్చలేక పార్లమెంటుకు రాజీనామా చేయాల్సి వచ్చింది. రాజకీయ భవిష్యత్తు అంధకారమైన ఈ దశలోనే సాహిత్య ప్రపంచానికి ఒక గొప్ప కథకుడు దొరికాడు.

తన ఆర్థిక సంక్షోభాన్నే ఆధారంగా చేసుకుని ఆయన తొలి నవల Not a Penny More, Not a Penny Less (1976) రాశారు. ఒక మోసగాడి చేతిలో డబ్బు పోగొట్టుకున్న నలుగురు వ్యక్తులు తెలివిగా పన్నాగం పన్ని తమ సొమ్మును తిరిగి రాబట్టుకునే కథ ఇది. సరదాగా సాగే ఈ నవల విజయం సాధించింది. సొంత అనుభవాన్ని కథగా మలచడం ఆయన శైలికి తొలి ఉదాహరణ.

ప్రధాన రచనలు:

Kane and Abel (1979): ఆర్చర్ రచనల్లో అత్యంత ప్రసిద్ధమైనది ఇదే. ఒకే రోజున జన్మించిన ఇద్దరు పురుషుల కథ ఇది. ఒకరు బోస్టన్ సంపన్న బ్యాంకర్ కుటుంబానికి చెందిన విలియం కేన్. మరొకరు పోలండ్లోని పేద కుటుంబంలో పుట్టి అమెరికా చేరి హోటల్ సామ్రాజ్యం నిర్మించే వ్లాడెక్ (అబెల్). వీరిద్దరి మధ్య దశాబ్దాల పాటు సాగే శత్రుత్వం, పోటీ కథ ప్రధానాంశం. దీని కొనసాగింపులుగా The Prodigal Daughter (1982), Shall We Tell the President? వంటి రచనలు వచ్చాయి. ఈ నవల టెలివిజన్ ధారావాహికగా కూడా రూపొంది ప్రజాదరణ పొందింది.

First Among Equals (1984): బ్రిటిష్ ప్రధానమంత్రి పదవి కోసం పోటీపడే నలుగురు రాజకీయ నాయకుల కథ. ఆర్చర్ స్వయంగా పార్లమెంటు సభ్యుడిగా పనిచేసిన అనుభవం ఇందులో స్పష్టంగా కనిపిస్తుంది.

As the Crow Flies (1991): ఒక చిన్న కిరాణా వ్యాపారి కుమారుడు చార్లీ ట్రంపర్ ఎదుగుదల కథ. సామాజిక, ఆర్థిక మార్పుల నేపథ్యంలో సాగే ఈ రచన ఒక కుటుంబ గాథ.

Sons of Fortune (2002): కవలల జీవితాలు వేర్వేరు దారుల్లో సాగే నవల.

A Prisoner of Birth (2008): అలెగ్జాండర్ డ్యూమా The Count of Monte Cristo స్ఫూర్తితో రాసిన కథ. అన్యాయంగా జైలు పాలైన వ్యక్తి ప్రతీకారం తీర్చుకునే కథాంశం.

Paths of Glory (2009): ఎవరెస్ట్ శిఖరారోహకుడు జార్జ్ మాలరీ జీవితం ఆధారంగా రాసిన చారిత్రక నవల. ఇందుకోసం ఆర్చర్ విస్తృతంగా పరిశోధన చేశారు.

The Clifton Chronicles (2011–2016): Only Time Will Tell తో మొదలై ఏడు భాగాలుగా సాగిన కుటుంబ గాథ. బ్రిస్టల్ నేపథ్యంలో హ్యారీ క్లిఫ్టన్ అనే యువకుడి జీవితాన్ని, అతని కుటుంబ రహస్యాలను తరతరాల పాటు చిత్రించే ధారావాహిక ఇది. ప్రతి భాగం ఉత్కంఠభరిత ముగింపుతో ముగుస్తుంది.

William Warwick Novels. Nothing Ventured తో మొదలైన పోలీసు డిటెక్టివ్ ధారావాహిక. ఎనిమిదో, చివరి భాగం End Game 2025 అక్టోబర్‌లో వచ్చి ఈ ధారావాహికను ముగించింది. వయసు పెరిగినా ఆయన కొత్త పాత్రలతో కొత్త కథలు సృష్టిస్తూనే ఉన్నారని ఇది చూపిస్తుంది.

చిన్న కథలు: ఆర్చర్ చిన్న కథల్లో కూడా ప్రఖ్యాతి పొందారు. A Quiver Full of Arrows, A Twist in the Tale, Twelve Red Herrings, Cat O’ Nine Tales, And Thereby Hangs a Tale వంటి సంకలనాలు ఉన్నాయి. కొన్ని పేజీల్లోనే ఊహించని మలుపుతో ముగిసే కథలు ఆయన ప్రత్యేకత. ఈ విషయంలో ఆయనను సాకీ (Saki), ఓ. హెన్రీ వంటి కథకులతో పోల్చుతారు.

నాటకాలు, ఇతర రచనలు: ఆయన కొన్ని నాటకాలు కూడా రాశారు, వాటిలో న్యాయస్థాన నేపథ్య నాటకం Beyond Reasonable Doubt ప్రసిద్ధం. క్రైస్తవ చరిత్రపై ఆధారపడిన The Gospel According to Judas ను పండితుడు ఫ్రాన్సిస్ మోలోనీతో కలిసి రాశారు.

వ్యక్తిగత జీవితం – అబద్ధాలు, కేసులు, జైలు:

ఆర్చర్ జీవితంలో అత్యంత వివాదాస్పద అధ్యాయం ఆయన వ్యక్తిగత జీవితంలోని అబద్ధాలు, కేసులు, ఆరోపణలే. 1980లలో కన్జర్వేటివ్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడు, ఒక మహిళకు సెక్స్ కోసం డబ్బు చెల్లించినట్లు ఒక వార్తాపత్రిక ఆరోపించింది. ఆయన పరువు నష్టం దావా వేసి 1987లో గెలిచి భారీ నష్టపరిహారం ఎన్నో మిలియన్ల పౌండ్లు పొందారు. కానీ ఆ కేసులో ఆయన కోర్టుకు అబద్ధాలు చెప్పినట్లు, ఒక స్నేహితుడితో తప్పుడు సాక్ష్యం ఇప్పించినట్లు తర్వాత బయటపడింది. 1999లో లండన్ మేయర్ అభ్యర్థిగా ఎంపికైనా, ఈ నిజాలు వెలుగులోకి రావడంతో పోటీ నుంచి తప్పుకున్నారు. 2001లో న్యాయవ్యవస్థను తప్పుదోవ పట్టించిన నేరం, అబద్ధపు సాక్ష్యం కేసుల్లో దోషిగా తేలి నాలుగేళ్ల జైలు శిక్ష పొందారు; రెండేళ్లు జైలులో గడిపారు. అంతకుముందు 1994లో ఒక టెలివిజన్ కంపెనీ షేర్ల కొనుగోలుపై ఆయనపై విచారణ జరిగింది, కానీ అభియోగాలు నమోదు కాలేదు. తన విద్యా, క్రీడా ఘనతలను అతిశయోక్తిగా చెప్పుకున్నారని కూడా విమర్శకులు ఆరోపించారు. ఈ ఆరోపణల్లో న్యాయస్థానం నిర్ధారించినవి 2001 నాటి నేరాలే. ఆక్స్‌ఫామ్ నిథుల సేకరణలో కూడా ఆరోపణలు వున్నాయి. ఈ అబథ్థాలు చెప్పినందుకు నాలుగు సంవత్సరాల జైలు శిక్ష పడింది. మధ్యలో బెయిల్ మీద విడుదల అయినప్పుడు కూడా నిబంధనలు వుల్లంఘించినట్లు ఆరోపణలు వచ్చాయి.

ఎట్టకేలకు రెండు సంవత్సరాల జైలుశిక్షకే బయటికి వచ్చి మళ్ళీ సాధారణ జీవితంలోకి వచ్చాడు ఆయన.

ఈ అనుభవాన్ని కూడా ఆయన రచనగా మలిచారు. A Prison Diary పేరుతో మూడు సంపుటాలు (Belmarsh, Wayland, North Sea Camp) వెలువడ్డాయి. జైలు జీవితపు కఠిన వాస్తవాలు, తోటి ఖైదీల కథలు, వ్యవస్థలోని లోపాలను ఇవి వివరిస్తాయి. జీవితంలోని ప్రతి సంఘటననూ కథగా మార్చగల ఆయన సామర్థ్యానికి ఇది మరో నిదర్శనం.

1992లో ఆయనకు ‘లార్డ్ ఆర్చర్ ఆఫ్ వెస్టన్-సూపర్-మేర్’ బిరుదుతో బ్రిటిష్ పార్లమెంటు ఎగువ సభ (హౌస్ ఆఫ్ లార్డ్స్) సభ్యత్వం లభించింది; 2024లో ఆయన అక్కడి నుంచి పదవీ విరమణ చేశారు. ఆయన భార్య మేరీ ఆర్చర్ ప్రఖ్యాత శాస్త్రవేత్త. అన్ని సంక్షోభాల్లోనూ ఆమె ఆయన పక్కన నిలిచారు. వారికి ఇద్దరు కుమారులు.

చివరి నవల, ఆకస్మిక మరణం:

2026 ఆర్చర్ రచనా జీవితానికి 50 ఏళ్లు నిండిన సంవత్సరం. ఆ జనవరిలో ఆయన, ప్రచురణకర్త హార్పర్ కాలిన్స్ కలిసి Adam and Eve తన చివరి నవల అని ప్రకటించారు. మొదటి ముసాయిదా పూర్తయ్యేసరికే ఇది తన చివరి నవల అని అనిపించిందని, 85 ఏళ్ల వయసులో దీన్ని మించిన రచన తాను చేయలేనని ఆయన చెప్పారు. కథ 1918 నవంబర్ 11న, మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన రోజున మొదలవుతుంది. ఆ రోజున ఇద్దరు పిల్లలు పుడతారు: ఈవ్ ఒక ఎర్ల్ కూతురు, ఆడమ్ ఒక గొర్రెల కాపరి కొడుకు. 1940 సెప్టెంబర్లో హిట్లర్ బ్రిటన్ పై దండెత్తడానికి సిద్ధమవుతున్న వేళ, వీరిద్దరి చర్యలు అతని ఆలోచనను మార్చి దేశ భవితవ్యాన్ని నిర్ణయిస్తాయని ప్రచురణకర్తల వివరణ. నార్ఫోక్ బ్రాడ్స్ నుంచి డంకిర్క్ తీరం వరకు సాగే ఈ 480 పేజీల నవల 2026 అక్టోబర్ 6న విడుదలైంది.

ఆ నవల విడుదలకు ఒక్క రోజు ముందు, 2026 అక్టోబర్ 5 సోమవారం నాడు, ఆర్చర్ 86 ఏళ్ల వయసులో ఇంట్లో ‘హఠాత్తుగా, ప్రశాంతంగా’ మరణించారని హార్పర్ కాలిన్స్ ప్రకటించింది. మరణానికి కారణం వెల్లడి కాలేదు. కొద్ది రోజుల ముందే ఆయన తన ఆరోగ్యం బాగుందని, రచన నుంచి పూర్తిగా విరమించడం లేదని చెప్పారు; ఆ వారాంతంలో తన చివరి నవల గురించి ఒక బహిరంగ కార్యక్రమంలో మాట్లాడాలని కూడా అనుకున్నారు. ప్రచురణకర్తలు ఆయనను, ప్రతి పదం పరిపూర్ణంగా ఉండేలా ముసాయిదా తర్వాత ముసాయిదా రాసిన అద్భుత కథకుడిగా స్మరించారు. రాణి కెమిల్లా సహా అనేకమంది నివాళులు అర్పించారు. ఆయనకు భార్య డేమ్ మేరీ, కుమారులు విలియం, జేమ్స్ ఉన్నారు. తన ఆఖరి కథ పాఠకుల చేతికి చేరే ముందు రోజే ఆయన కథ ముగియడం, ఆయన నవలల్లోలాగే ఊహించని మలుపు.

రచనా శైలి:

  1. కథ ప్రథమం: ఆర్చర్ తనను తాను ‘కథకుడు’గా చెప్పుకుంటారు, సాహితీవేత్తగా కాదు. భాషా సౌందర్యం కంటే కథ నడిపే వేగానికి ఆయన ప్రాధాన్యమిస్తారు. వాక్యాలు సరళంగా, స్పష్టంగా ఉంటాయి. క్లిష్టమైన ఉపమానాలు, తాత్విక చర్చలు చాలా తక్కువ.
  2. క్లిఫ్‌హ్యాంగర్ ముగింపులు: చాలా అధ్యాయాలు ఓ ఉత్కంఠభరిత క్షణంతో ముగుస్తాయి. తర్వాత ఏం జరుగుతుందోనని పాఠకుడు పుస్తకం వదలలేడు. ఈ లక్షణమే ఆయన పుస్తకాలను ‘పేజ్-టర్నర్స్’గా మార్చింది.
  3. ఊహించని మలుపులు: ముగింపులో వచ్చే ట్విస్ట్ ఆయన ట్రేడ్‌మార్క్. పాఠకుడు ఒక దిశలో ఊహించేలా చేసి, చివరలో వేరే సత్యం బయటపెట్టే నైపుణ్యం ఆయన చిన్న కథల్లో మరింత స్పష్టంగా కనిపిస్తుంది.
  4. చిన్న అధ్యాయాలు, వేగవంతమైన కథనం: కథను చిన్న చిన్న భాగాలుగా విభజించి, పలు పాత్రల దృక్కోణాల మధ్య మారుతూ నడిపిస్తారు. దీనివల్ల కథ నిరంతరం కదులుతూ ఉంటుంది.
  5. పునఃరచన: ఒక్కో నవలను ఆయన అనేక సార్లు తిరగరాస్తారని చెబుతారు. ఉదయాన్నే లేచి నిర్ణీత సమయాల్లో రాసే కఠిన దినచర్య ఆయనది.

ప్రధాన లక్షణాలు, ఇతివృత్తాలు:

ఇతర పాపులర్ రచయితలతో పోలిక:

ఆర్చర్‌ను ఆయన కాలపు ఇతర బెస్ట్ సెల్లర్ రచయితలతో పోల్చి చూస్తే తేడాలు స్పష్టంగా కనిపిస్తాయి. సిడ్నీ షెల్డన్ కథల్లో శక్తివంతమైన స్త్రీ పాత్రలు, గ్లామర్, కుట్రలు, మెలోడ్రామా ఎక్కువ; అధ్యాయాలు పరుగులు పెడతాయి. ఆర్చర్ కథల్లో కూడా వేగం ఉన్నా, కేంద్రంలో కుటుంబాలు, తరాల ప్రయాణం, వర్గ భేదాలు, బ్రిటిష్ సంస్థల వాతావరణం ఉంటాయి. ఫ్రెడరిక్ ఫార్సిత్ మాజీ జర్నలిస్టు కావడంతో The Day of the Jackal వంటి రచనల్లో డాక్యుమెంటరీ లాంటి కచ్చితమైన వివరాలు, అంతర్జాతీయ రాజకీయాలు, భావోద్వేగాలు తక్కువగా ఉండే చల్లని కథనం కనిపిస్తాయి; ఆర్చర్ పాత్రల ఆశలు, పగలు, భావోద్వేగాలకు ఎక్కువ చోటిస్తారు. ఇర్వింగ్ వాలస్ లోతైన పరిశోధనతో వివాదాస్పద సామాజిక అంశాలను, సంచలనాత్మక విషయాలను (The Prize, The Seven Minutes) కథలోకి తెస్తారు; ఆర్చర్ రచనల్లో హింస, శృంగార వర్ణనలు తక్కువ, అందరూ చదవగలిగేలా ఉంటాయి. జేమ్స్ హాడ్లి చేజ్ (No Orchids for Miss Blandish) హింస, కామం, నేర ప్రపంచం, నిరాశ నిండిన ముగింపులతో కూడిన పల్ప్ క్రైమ్ రచయిత; ఆర్చర్ కథల్లో నైతిక స్పష్టత, చివరికి న్యాయం గెలవడం, చివరి ట్విస్ట్ ప్రధానం. పాఠకుణ్ని చివరి పేజీ వరకు లాగే పట్టు వీరందరిలో ఉమ్మడి లక్షణం. కానీ ఆర్చర్ ప్రత్యేకత ఆశావాదం, సామాన్యుడి ఎదుగుదల, పోరాడితే న్యాయం దక్కుతుందనే భరోసా.

సాహిత్య రచయితలతో పోలిక – సల్మాన్ రష్దీ వంటి వారు:

సల్మాన్ రష్దీ వంటి సాహిత్య విలువలకు ప్రాధాన్యమిచ్చే సమకాలీన రచయితలతో పోలిస్తే ఆర్చర్ ప్రపంచం పూర్తిగా వేరు. రష్దీ Midnight’s Children తో బుకర్ ప్రైజ్ గెలిచారు. ఆయన రచనల్లో భాషతో ఆటలు, మాయా వాస్తవికత, చరిత్ర, జ్ఞాపకం, వలస, గుర్తింపు వంటి సంక్లిష్ట అంశాలు, పొరలు పొరలుగా సాగే కథనం ఉంటాయి; పాఠకుడు శ్రద్ధగా, నెమ్మదిగా చదివి అర్థం చేసుకోవాలి. ఆర్చర్‌కు భాష లక్ష్యం కాదు, కథను నడిపే సాధనం మాత్రమే; వాక్యాలు సరళం, పాత్రలు స్పష్టం, ప్రశ్నల కంటే సమాధానాలే ఎక్కువ. రష్దీ రచనలు ప్రశ్నలు లేవనెత్తుతాయి, అస్పష్టతను, విరుద్ధ భావాలను అంగీకరిస్తాయి; ఆర్చర్ ముగింపుల్లో కథ చక్కగా ముడి విడుతుంది. విమర్శకుల ప్రశంసలు, అవార్డులు ఎక్కువగా రష్దీ వైపు వెళ్తే, భారీ అమ్మకాలు, విస్తృత పాఠకులు ఆర్చర్ వైపు వెళ్లారు. అయితే ఇది గొప్ప-తక్కువ అనే పోటీ కాదు. ఒకరు సాహిత్య కళకు, మరొకరు కథ చెప్పే కళకు ప్రతినిధులు; ఇద్దరూ వేర్వేరు పాఠక అవసరాలను తీరుస్తారు అనుకుంటున్నాను.

ఆర్చర్ రచనలపై విమర్శకుల అభిప్రాయాలు కలగలిసి ఉన్నాయి. కొందరు ఆయన భాష సాధారణమనీ, పాత్రల మానసిక లోతు పరిమితమనీ, కథనాలు కొన్నిసార్లు ఊహించదగినవిగా ఉంటాయనీ విమర్శించారు. మరికొందరు ఆయన కథలు అల్లే నైపుణ్యాన్ని, పాఠకులను చివరి వరకు పట్టి ఉంచే సామర్థ్యాన్ని ప్రశంసించారు. కానీ పాఠకుల ప్రేమ మాత్రం స్పష్టంగా ఉంది. ఆయన పుస్తకాలు అంతర్జాతీయంగా కోట్లాది ప్రతులు అమ్ముడుపోయాయని ప్రచురణకర్తలు, ఆయన స్వయంగా చెబుతారు. విమానాశ్రయాల్లో, రైళ్లలో, విరామ సమయాల్లో చదివే ‘పాపులర్ ఫిక్షన్’కు ఆయన ఒక ప్రమాణంగా మారారు.

భారతదేశంలో కూడా ఆర్చర్ రచనలకు ఆదరణ ఎక్కువ. సరళమైన ఆంగ్లం, వేగవంతమైన కథ వల్ల ఇంగ్లిష్ చదవడం నేర్చుకునే చాలా మంది పాఠకులకు ఆయన పుస్తకాలు తొలి నవలలుగా ఉపయోగపడ్డాయి.

జెఫ్రీ ఆర్చర్ జీవితమే ఒక నవలలా ఉంటుంది. అత్యున్నత శిఖరాల నుంచి అగాధం లోతుల వరకు, అక్కడి నుంచి మళ్లీ శిఖరానికి ఎగసిన ప్రయాణం ఆయనది. ఒక గొప్ప రచయిత జీవితంలో అనేక పార్శ్వాలు ఉంటాయి, మంచివీ చెడ్డవీ కూడా. ఆర్చర్ విషయంలో ఒకవైపు క్రమశిక్షణ, పట్టుదల, ఎన్నిసార్లు పడినా లేచి నిలబడే సంకల్పం, చారిటీ కోసం చేసిన కృషి ఉన్నాయి. మరోవైపు అబద్ధాలు, కోర్టు కేసులు, జైలు శిక్ష ఉన్నాయి. ఈ రెండూ కలిపితేనే ఆయన జీవితం. అయినా కాలం గడిచేకొద్దీ నిలిచేది ఆయన రచనా శైలే: సరళమైన భాష, వేగవంతమైన కథనం, చివరి పేజీలో ఊహించని మలుపు. ఆ శైలి తెచ్చిన 30 కోట్లకు పైగా ప్రతుల అమ్మకాలు, ప్రపంచవ్యాప్తంగా పాఠకుల అభిమానం శాశ్వతంగా నిలుస్తాయి. చివరి నవల విడుదలకు ఒక్క రోజు ముందే ఆయన కన్నుమూసినా, ఆయన కథలు పాఠకుల చేతుల్లో బతికే ఉంటాయి. కథ చెప్పే కళలో ఆర్చర్ స్థానం శాశ్వతం.

Exit mobile version