Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సికిందరాబాద్ సిరిచుక్క శారదా అశోక్‌వర్ధన్

ఇటీవలే దివంగతురాలయిన శారదా అశోకవర్ధన్ గారి కథలు, నవలలు ప్రచురితం కాని పత్రికలు ఒకప్పుడు ఉండేవికావు. ఆవిడ ఓ శక్తి స్వరూపిణిలా ఉండేవారు. సికిందరాబాద్ నగరమంటే ఆవిడకు ప్రాణం.

2019లో ఆవిడకు మాలతీచందూర్ పురస్కారం ప్రకటించినప్పుడు ఆవిడ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రానికి వచ్చారు. ఆ సందర్భంలో ఆవిడెన్నో విషయాలు గుర్తుచేసుకున్నారు.. కథలు, కవితలు, నవలలు, లలితగేయాలు ఇలా అనేక ప్రక్రియల్లో ఆవిడ సృజన సాగింది. వీటినన్నింటిని ఎనభై పుస్తకాలుగా ప్రచురించారు.

ఇందులో ఇరవైఏడు నవలలు, తొమ్మిది కథా సంపుటాలు, తొమ్మిది కవితా సంపుటాలూ ఉన్నాయి. ఆవిడ పాటలు కొన్ని గ్రాంఫోన్ రికార్డులుగా కూడా వెలువడ్డాయని చెప్పారారోజున.

ఇంకా రాసి ఉండాల్సింది అనెప్పుడైనా అనుకున్నారా అంటే రాయలేదని విచారం లేదన్నారు. అన్నీ కొంచెం కొంచెమే రాసినా అదే తృప్తినిచ్చిందన్నారు.

ఆవిడ ఆరోజుల్లో స్టేజి యాంకరింగ్ పేరొందారు. ఇన్ని మీరు ఎలా చేయగలిగారంటే ఆవిడ ఒకమాటన్నారు.

“ఇది మీరు చేయగలరు అని నన్ను ఎవరైతే ప్రోత్సహించారో, వారి మాటలే నాలో తెలియని శక్తిని నింపేవి. నాలో ఇంత శక్తి ఉందాని ఆశ్చర్యపోయేదాన్ని. నిజానికి అలా నన్ను గుర్తించినవారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి” అన్నారు.

“వ్యాఖ్రాత్రిగా నాకారోజుల్లో ఒక సంస్థవారు గోల్డ్ మెడల్ ఇచ్చారు. నా యాంకరింగ్ చూసి ఎన్టీఆర్ శభాషన్నారు.అది నాకు వారిపై బుర్రకథ రాసే అవకాశం కల్పించంది” అని గుర్తుచేసుకున్నారు..

2018లో ఆవిడ సికిందరాబాద్ నేపథ్యాన్ని వివరిస్తూ ‘నా సిరిచుక్క సికిందరాబాద్’ అనే పుస్తకం వెలువరించారు. ఆవిడ హృదయానికి చాలా దగ్గరైన పుస్తకం. ఆ పుస్తకం ఎందుకు రాశారని అడిగితే నాకు జన్మనిచ్చిన నగరాన్ని తలుచుకోకపోతే ఎలా అన్నారు.. ఆ రోజుల్లో సికిందరాబాద్ ఎంతో అందమైన నగరమని, ఎన్నో సొగసైన పేర్లు కలిగుండేదని అయితే ఆ పేర్లన్నీ బ్రిటిషువారు పెట్టినవేనని అన్నారు. నిజాం ప్రభావం సికిందరాబాద్ నగరంలో తక్కువని, కానీ రజాకార్ల దుశ్చర్యలు, ఆ ఆగడాలు తాను చిన్నపిల్లగా ఉన్నప్పుడు చూశానని చెప్పారు.

సికింద్రాబాద్ పై ఆవిడ రాసిన పుస్తకానికి ఒక నివాసి కథనం అని పేరుపెట్టారు. ఆ పుస్తకం మంచి ప్రశంసలు పొందింది. మీ ఉత్సాహం వెనకున్న కారణమేమిటంటే ఆవిడ అందరూ ఆలోచించాల్సిన మాట చెప్పారు. వయసు పెరిగితే శరీరంలో మార్పులు రావటం సహజమే అయినా, మానసికంగా మిమ్మల్ని మీరు కోల్పోకండి అన్నారు. అది ఆవిడ నమ్మిన ఫిలాసఫీ. భగవంతుడు మనకు ఆరోగ్యం ఇచ్చినంతవరకూ , మానసికంగా దృఢంగా ఉంచినంతవరకూ ఏదో ఒకటి చేయాల్సిందే అన్నారారోజున. యాభైశాతం సంతోషం, మన మనస్సు, మన పరిసరాలు మన అధీనంలో ఉంటాయని మర్చిపోకూడదన్నది ఆవిడ చెప్పేమాట. ఆత్మసంతృప్తి చాలా ముఖ్యమని మనం గుర్తించాలన్నారు..

ఒకరికి ఉందన్న బాధ, మనకు లేదన్న దిగులు కూడదని మనోబలాన్ని మించిన మందులేదని ఆ మనోబలంతోనే మనుగడ మహాసాధ్యమన్న సత్యాన్ని మనం మర్చిపోకూడదన్నారు.

ఏ కళయినా ఒక సముద్రంలాంటిదని ఆవిడ చెప్పేవారు. ఆ కళ అనే సముద్రాన్నిఈదటం ద్వారానే ఆ కళ మనకు ప్రాప్తిస్తుందని నమ్మారావిడ.

ఆ రోజుల్లో ఆవిడ రేడియోలో కేజువల్ అనౌన్సర్‌గా పనిచేయటం వలన ఆవిడ రేడియో శ్రోతలకు కూడా చిరపరిచితులయ్యారు.. 2019, సెప్టెంబర్ 17వ తేదీనాడు ఆవిడ ఆకాశవాణి స్టూడియోస్‌కి వచ్చారు.. ఆ జ్ఞాపకాల పరిమళం ఇంకా వీడలేదు నన్ను.

శారదా అశోకవర్ధన్ గారికి వినమ్ర శద్ధాంజలి.

Exit mobile version