[శ్రీ వారాల ఆనంద్ రచించిన ‘త్రివేణి’ అనే కవితలని పాఠకులకు అందిస్తున్నాము.]
1)
రోజులు రాకముందే గడిచి పోతాయి
అప్పటికీ మనం ఏమీ రాయకపోతే
జీవితం ఓ ఖాళీ పుట.
2)
ఎంత నడిచినా గమ్యం చేరడం ముఖ్యం కాదు
ఎలా నడిచామన్నదే గమ్యం
అదే కదా మరి అనుభవం.
3)
ప్రశ్నలే మనసుకు అద్దం
జవాబులు కేవలం ప్రతిబింబం
సత్యం వాటి మధ్యలో నిలుస్తుంది.
4)
బయటవున్న చీకటి కాదు
లోపల వెలిగే దీపమే జ్ఞానం
అది మనమే సృష్టించిన దారి.
5)
నడిచిన పాత వీధుల్లో తిరిగి నడిస్తే,
పాదాల కంటే ముందే
జ్ఞాపకాలు గమ్యం చేరతాయి.
6)
లోన ఒక జ్ఞాపకం మెరిస్తే చాలు
ఏండ్ల దూరం ఒక క్షణంలో ముగుస్తుంది
గుర్తులు వయసును అడగవు.
7)
నేను నీలి ఆకాశం కింద నడుస్తున్నాను
నా పాదాలు నేలలో ముద్రలు వేస్తున్నాయి
గుండెల్లోనేమో ఆకాశం విస్తరిస్తోంది.
8)
పువ్వు మొగ్గలో దాగిన నవ్వు
చీకటి రాత్రిలో వికసిస్తుంది
నా కళ్లలో మాత్రమే ఆలస్యం.
9)
కాఫీ కప్పులో ఆవిరి మెరుస్తుంది
జ్ఞాపకాలు అలా బుడగల్లా తేలుతాయి
చేదు రుచి మాత్రం అట్లా మిగిలి పోతుంది.
కేంద్ర సాహిత్య అకాడెమీ అనువాద పురస్కార గ్రహీత
