Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

త్రివేణి-5

[శ్రీ వారాల ఆనంద్ రచించిన ‘త్రివేణి’ అనే కవితలని పాఠకులకు అందిస్తున్నాము.]


1)
ఒక పక్షి పాట విన్నాక
చాలా పెద్దది అనుకున్న

మన జీవితం ఎంత చిన్నదో తెలిసొస్తుంది.

2)
మనుషుల మధ్య విపరీతమయిన పోటీ
చెప్పలేనంత గందరగోళం

అదే నాగరికతగా పేరు తెచ్చుకుంది.

3)
ఎప్పటికయినా తప్పని మరణం
భయంకరం కాదు భయమొద్దు

అది మర్యాదగా మన చేయి పట్టుకుంటుంది.

4)
అందం పెద్ద అరుపు కాదు
అది సంధ్య వేళలో

నెమ్మదిగా జారే వెలుగు.

5)
ఎప్పుడూ అధికంగా ఆలోచించే మనిషి
తన జీవితాన్ని కాకుండా

ఆలోచనల్లోనే జీవిస్తాడు.

6)
శరీరం గాయపడొచ్చు
నొప్పి కలగొచ్చు దుఃఖం రావొచ్చు

ఆత్మకు మాత్రం లొంగడం తెలియదు.

7)
జీవితం
వేళ్ల మధ్య జారిపోతున్న

క్షణాల సమాహారం.

8)
కలలతో నిర్మించిన రాజ్యాలు
వాస్తవానికి ఆవలి అంచునే నిలుస్తాయి

కూలుతాయి కూడా.

9)
అలిసిన కొన్ని క్షణాల్లో
ఆగాలని నిలబడాలని అనిపిస్తుంది

మరుక్షణం ముందుకు నడవాల్సిన బాధ్యత తళుక్కుమంతుంది.

10)
ఎందరు స్నేహితులున్నారన్నది కాదు లెక్క
ఎంతమంది మిత్రులు శత్రువులయ్యారన్నదే

లెక్కించాల్సిన అసలయిన చిట్టా.

Exit mobile version