Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ట్రూ కలర్

చేతులకు
రంగుల పరిచయం లేకుండానే
ముఖానికి రంగులు సన్నిహితం.

ముసుగు మెళకువలో
మనసుది
అడుగుకో తెర

మాటల ఎలివేషన్స్‌తో
బతుకులో
అన్నీ యానిమాషన్లే

క్షణాల్లో చెక్కే ఏ ముఖమైనా
మెరుపులు కక్కి
అరక్షణంలో చలామణి.

చూపు పోగేసే ఇష్టాన్ని
కాళ్ళు వాటేసుకుని
నాలుక నడక జోడై

అల్లిన కథలో
ప్రతి పాత్ర దొర్లి
మనసు పొర్లిపోతుంటుంది..

కానీ
ఒకనాటికి నిజం కురిసి
రంగులు కొట్టుకుపోయి

ముఖం ముంపుకి గురై
అసలు రంగు
ఒడ్డున పడక తప్పదు.

Exit mobile version