బస్సు కోసం ఎదురు చూస్తూ చిన్న గాంధీబొమ్మ దగ్గర నిలబడివున్న నాకు ఆయన మీద ఊహ పోయి ఆలోచనలు ముసిరాయ్. ‘ఒక సూర్యుడు సమస్త జీవులకు తానొక్కక్కడై తోచు పోలిక’. గాంధీ కూడా ఒక్కొక్కసారికి ఒక్కొక్కలా కనబడతాడు సుమా అనిపించింది. ఒకరికి మహాత్ముడైతే ఇంకొకరికి మహా చెత్తాత్ముడు! ఎవరి కళ్ళద్దాలు వారివి అనుకున్నాను ఆ క్షణం. ఎటొచ్చీ సర్వాన్ని (మంచిని కూడా) తుడిచిపెడుతున్న ఓటాట్లగాళ్ళు పెట్రేగుతున్న రోజుల్లో అక్కడ గాంధీ బొమ్మ జాలిగా చూస్తున్నట్లు కనపడింది. గాంధీ సెక్యులర్ అనుకుని కొందరు తిడ్తారు. ఆయన సెక్యులరిజమ్ ‘నాట్ అప్ టూ మార్క్’ అని మరికొందరు తెగనాడుతారు. అంబేద్కర్‍ని ఆయన సరిగ్గా ఎత్తుకోలేదని కళ్ళెర్ర చేసేది కొందరైతే, సుభాష్ చంద్రబోస్‍ని అసలు ఎత్తుకోలేదు కదా అని గుడ్లురుముతారు మరికొందరు. తాము రెచ్చగొట్టే మత కలహ హత్యలకు వత్తాసుగా గాంధీ చేయని హత్యలను చేసినట్లు బల్లగుద్దే వక్రీకరణ సామ్రాట్‍లు ఈ రోజుల్లో ఓట్ల గేలాలు పట్టుకుని తిరుగుతున్నారు.
ఇంక ఆయన్ని చంపినట్లు మనం అనుమానించేవాళ్ళ తీరు చూస్తే విచిత్రంగా వుంటుంది. గాంధీ హత్య సంగతే తెలీదని అంటారు. ఆత్మహత్య చేసుకున్నవాణ్ణి ఎవరైనా ఎలా హత్య చేయగలరు అని ఆ ‘అమాయకులు’ అడుగుతున్నట్లు నాకు ఆ క్షణం ఊహపోయింది. గాంధీగారు తన సబర్మతీ ఆశ్రమంలో ఒక ఆవును చంపించారు కనుక అసలు ఆయన హిందువే కాదంటారు ‘హిందూ ఉద్ధరింపుగాళ్లు’. యూథనేషియా అనే ఆలోచనని అప్పుడు గాంధీ ఆచరించి, మరణబాధతో విలవిలలాడుతున్న ఆవుని ‘క్షమాదృష్టి’తో చంపించారని చెబితే వినరు. మెర్సీకిల్లింగ్ గురించి చదువుకోని వారికి ఏం చెబుతాం?
‘ఆవు మాంసం తిన్నట్టు ఎవరిమీద అనుమానం వస్తే వారిని కొట్టాలి. వీలైతే చంపాలి’ అని ‘మతపిచ్చిగాళ్ళు’ వాదిస్తారు. హరిజన పదాన్ని సృష్టించారని ఆయన్ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతారు దళిత మేధావులు. ‘హరి అనే హిందూ దేవుడి జనాలు’ అనే అర్థం తీసి హిందూ భక్తుడు కాబట్టి ఆయన సెక్యూలరిజమ్ బూటకం అని మేధోజీవులు ఈసడిస్తారు. ఇలా నా ఆలోచనల్లో నేనుండగా ఓ మైకు రొద చెవుల్లో గీ పెట్టింది.
‘తూ.చా తప్పని గాంధీ. బాబూ… తూ.చా తప్పని గాంధీ! మహత్తర అవకాశం బాబూ. ఈవేళ పెద్దగాంధీ సెంటరు దగ్గర చూడండి బాబూ! చూడండి ఆలోచించిన ఆశాభంగం బాబూ! తప్పక దయచేయండి’ అనే మైకు అరుపు వినపడింది. దాంతో జనం అరుగుల మీద స్థిమితంగా కూర్చోలేక పెద్ద గాంధీ బొమ్మ దిశగా మైకు రిక్షా వెంటే అడుగులేయడం కనపడింది. ఒకాయన కర్ర తాటిస్తూ నా దగ్గరికి గాంధీ ఫక్కీలో నడుస్తూ వచ్చి “తూ.చా తప్పని గాంధీట, మహత్తర అవకాశమట. రండి బాబూ రండి బస్సు తరువాత ఎక్కొచ్చు” అని తొందరపెట్టాడు. ఆసక్తితో నేను అతని వెంటే ఉప్పు సత్యాగ్రహం ఏదో జరుగుతున్నట్లు కదిలాను. మొత్తానికి మైకు చెప్పిన సమయానికి పెద్దగాంధీ బొమ్మ సెంటర్ కిటకిటలాడింది.
ఇంతకీ ఈ తూ.చా తప్పని గాంధీ ఎవరు? ఏమా కథ? అని వాకబు చేశాను. ఆయనో 90% గాంధీ. మందు కొట్టడం, అబద్ధాలు ఆడడం వల్ల నూటికి నూరుశాతం గాంధీ కాకుండా మిగిలాడు. 90% శాతం పోగా మిగిలిన 10% గురించి అతడికి బెంగ వుందట. ఎందుకంటే మందు మానలేడు. అబద్ధాలు లేకుంటే బతుకు బస్టాండ్! ఆ 10% పూడ్చుకోడానికి ఏవేవో పనులు చేస్తూ వుంటాడు.
సర్ రిచెర్డ్ అటెన్‍బరోకి పదేళ్ళక్రితం ఓ ఉత్తరం రాశాడు. ‘మా గురువుగారు గాంధీ అని ఒకరున్నారు. ఆయన మీద మీరు సినిమా తీస్తే చాలా బాగుంటుంది’ అని ఆ ఉత్తరంలో సలహా ఇచ్చాడు. అందుకు తిరుగుటపాలో తన్నుకుంటూ వచ్చింది జవాబు ‘ఏ గాంధీ మీరనేది?’ అంటూ! కొన్ని ఉత్తరప్రత్యుత్తరాల తరువాత అటెన్‍బరో రాశాడు – ‘మహాత్మా గాంధీ అయితే ఎప్పుడో తీసేశాను సినిమా’ అని అంతే! ‘నా సలహా ఎంత గొప్పదంటే అటెన్‍బరో దాన్ని ఎప్పుడో ముందే అమలు చేసేడాడట’ అని టముకేసుకున్నాడు మన గాంధీ. అప్పుడే 85 నుంచి 90 శాతానికి ఎదిగాడు. అతనితో అర్జంటు పని ఎవరికీ పడకపోవడంతో తక్కిన 10 శాతం అలాగే వుండిపోయింది. అది సాధించాలనే ఈ ’తూ.చా’ తప్పని గాంధీ ప్రదర్శనట!
గాంధీగారు ఏం చెప్పారు. కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించమన్నారు. ఈ ప్రదర్శనలో మన లోకల్ గాంధీ ఆ మాటను తూ.చా తప్పకుండా పాటించదలిచాడు. ‘రెడీ వన్, టూ, త్రీ’ అని మైకు కూతపెట్టగానే పెద్ద గాంధీ బొమ్మ సెంటరు నిశ్శబ్దం అయిపోయింది.
వేదిక సీను: కిరాయి మనిషి కుడి చెంప మీద లంకించుకుంటే వెంటనే ఎడం చెంప చూపిస్తున్నాడు మన లోకల్ గాంధీ! అయిదు నిమిషాలు…. పది నిమిషాలు… పావుగంట…. అలా అలా అరగంట చులాగ్గా గడిచిపోయింది. మన స్థానిక గాంధీ రెండు చెంపలూ వాచిపోయాయ్. కాని కొట్టేవాడిలో, కొట్టించుకునేవాడిలో ‘వాయింపు స్ఫూర్తి’ ఏ మాత్రం తగ్గలేదు. జనంలో ఉత్కంఠ పెరిగింది. అంతలో… కొడుతున్న వాడు పరుగు మొదలెట్టాడు. “రక్షించండి… రక్షించండి” అంటూ! లోకల్ గాంధీ వాడి వెంట పడ్డాడు. ఏం జరిగిందేం జరిగింది జనం అరుస్తున్నారు. కొట్టేవాణ్ణి పెద్ద దుడ్డుకర్రతో తరుముతున్న లోకల్‍గాంధీకి అడ్డుపడి నిలేశారు. రొప్పుతూ మన గాంధీ చెప్పాడు – “కుడిచెంప మీద కొడితే ఎడం చెంప చూపాలని కదా గాంధీగారు చెప్పారు. మరి వీడు నా మెడమీద కొట్టి చేయి జారిందని బుకాయిస్తున్నాడు” అంటూ మళ్ళీ తరమడం మొదలెట్టాడు.
‘ఔరా గాంధీ’ అని జనంతో పాటు విస్తుపోక తప్పలేదు నాకు.