Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తుది నిర్ణయం

[డా. ఎన్.ఎల్.ఎస్. విద్యా సాగర్ రచించిన ‘తుది నిర్ణయం’ అనే కథని అందిస్తున్నాము.]

సాయంత్రం 5.30 ఈటీవీలో ‘సద్గురు సాయి’ ధారావాహిక వస్తూంది. సాయి పాత్రధారి నటన మనస్సుకు హత్తుకునేలా ఉంది. మహళ్సాపతి, శ్యామా పాత్రధారులు పరకాయ ప్రవేశం చేశారా అనేలా ఉంది వారి నటన. కులకర్ణి ప్రతినాయక పాత్రలో చక్కగా ఒదిగి పోయాడు పాత్రధారి.

స్టేట్ బ్యాంక్‌లో రీజినల్ మేనేజర్‌గా ఉద్యోగ విరమణ చేసిన వ్యాస మూర్తి, ఆయన భార్య రమ ప్రతిరోజు దిన చర్యలో ఒక భాగం ఆ ధారావాహిక చూడడం.

ఎన్ని పనులున్నా పక్కన పెట్టి టీవీకి అతుక్కుపోతారు ఆ సమయంలో. అనంతరం దానినే మననం చేసుకుంటూ, దాని గురించే చర్చించుకుంటూ ఉంటారు.

ఈ రోజు మూర్తి మౌనంగా ఉన్నాడు. రమ కారణం తెలుసుకోవాలని చాలా ప్రయత్నం చేసింది. కానీ అసలు సంగతి రాబట్టలేక సతతమౌతూంది.

మూడు రోజుల క్రితం తన అన్న గంగారామ్ వచ్చి మధ్యాహ్నమే తిరిగి వెళ్లి పోయాడు. అంత వరకు అతనిని కారులో ఊరంతా తిప్పి తాము ఆడుకున్న గ్రౌండ్లు చదువుకున్న స్కూల్, పరీక్షల తరువాత పాసు అయ్యేలా చేయమని మొక్కుకున్న ఆలయాలు తిరిగి వచ్చారు.

మూర్తి తన పిత్రార్జితమైన ఇంట్లో ఉంటున్నాడు. కొడుకు వాచస్పతి, కోడలు అనిత హైదరాబాద్‌లో ఉద్యోగస్థులు. కూతురు వారిజ, అల్లుడు వివేక్ విజయవాడ లో ఉంటారు.

గంగారామ్ కూతురు, అనిత, కుమారుడు ఆనంద్ భార్య ప్రియతో గుంటూరులో ఉంటాడు.

“నిజం ఏనాటికైనా బయట పడుతుందని సాయి అన్న మాట ఈ కాలానికి వర్తిస్తుందా?” మూర్తి సడన్‌గా ప్రశ్నించాడు.

“మీరు ఉద్యోగంలో ఎన్ని ఒడుదుడుకులు ఎదుర్కున్నారు. ఉద్యోగం పోయే స్థితి నుండి, నిజం బయట పడడం వలనే కాదా ఆ స్థాయికి రాగలిగినారు”, రమ జవాబు.

“నిజమే కానీ చాలా విషయాలు మన ఇంట్లోనే మరుగున పడలేదా?”, అన్నాడు మూర్తి.

“మీరన్నది దేని గురించో నాకు అర్థమైంది. గంగారామ్ అన్నయ్య అలవాటు గురించే కదా?”

“అవును, నాన్నగారు మరణించిన పదమూడో రోజు మన దేవతార్చనలో మాయమైన వస్తువు ఇరవైయ్యేళ్లైనా బయటపడలేదే. అది శ్రీశైలంలో కొన్నదని తమ ఇంట్లో నమ్మించలేదా గంగారామ్. వచ్చినప్పుడు అడపా దడపా నోట్లు మాయమయ్యేవి కదా. చాలా కాలం తరువాత వచ్చాడు బుద్ధి మారింటుందనుకున్నాము. ఇప్పుడు పతి నాకోసం ఆన్‌లైన్‌లో తెప్పించిన మొబైల్ కనబడడం లేదు. నేను పాతది పని చేస్తూంది మార్చడం ఎందుకని గూట్లో ఉంచాను. అది పోవడం కన్నా దానిని ఏ షాపులోనో అమ్ముంటే, షాపువాడు ఎవరికైనా సేల్ చేసింటే, ఆ కొనినవాడు ఫ్రాడ్ అవుతే పతికీ సమస్య కదా అని నా భయం. అది వాడి పేరు మీద ఉంటుంది. వాడి తలకు చుట్టుకుంటుంది. ఏ తప్పు చేయని వాడు శిక్షకు గురవుతాడు కదా. అది మామూలు శిక్ష గా ఉండదు. జైలు పాలు కావలసి వస్తుంది కదా.”

“అంత దూరం ఆలోచించకండి, ఏమీ కాదు.”

“అలాగని నిర్వికారంగా ఉండలేను. నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఆ స్థితే వస్తే తప్పు నాపై వేసుకుని జైలుకెళ్ళడానికి సిద్దం.”

కొడుకు కోసం తండ్రి నిర్ణయానికి భయపడాలో, బాధపడాలో, తన అన్న చేసిన పనికి సిగ్గుపడాలో, రమకు అర్థం కాలేదు.

తన అన్న ఇంత పని చేశాడంటే నమ్మే వాళ్ళుండరు. పైపెచ్చు అపవాదు వేశారంటారు. ఆయన కొడుకు కోడలు, కూతురు, అల్లుడు నమ్మరు. అభాండాలేశారంటారు. తమ నాన్న గారు కూడా తన కొడుకుకున్న ఈ పాడు అలవాటు తెలిసి బాధపడని రోజంటూ ఉండేది కాదు. గుడ్ల నీళ్ళ కుక్కు కుంటూ ఉండి పోయింది, రమ.

‘సాయీ, ఈ సమస్య నుండి నీవే రక్షించాలం’టూ సాయిబాబాకు విన్నవించుకుంటూ ఉండిపోయింది. భవిష్యత్తులో ఎటువంటి సవాళ్లను ఎదుర్కోవాలో పాలుపోక విచారంగా వంటింట్లోకి వెళ్లింది.

మూర్తి తన నిర్ణయం సరియైనదేనని నమ్ముతూ సాయంత్రం వాకింగుకని లేచాడు.

Exit mobile version