Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తుది విజయం ఎవ్వరిది?

[సుధా కళ్యాణి ఆచంట గారు రచించిన ‘తుది విజయం ఎవ్వరిది?’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

వేవేల ఏళ్ళ మన చరిత్ర
ఎన్ని పాఠాలు నేర్పినా
శాంతి పాఠాలు నేర్చుటలో
మనిషికెపుడూ నిండు సున్నా!

శిశిరంతో శిధిలమైన తరువులు
వసంతంతో మరలా విరబూయాలని
ప్రతి ఏటా ప్రకృతి నేర్పే పాఠం
అహం పొరలు కప్పేసిన
మనిషి కంటికి కనిపించునా?

సుస్థిర శాంతి సౌఖ్యాలతోనే
అభివృద్ధి సాకారమవుతుందని
గెలుపు పాఠాలు ఎన్ని వల్లె వేస్తున్నా
బధిర శంఖారావంలా నిష్ఫలమవుతుంటే
ఎవరూ గెలవని యుద్ధాలు ఆగేనా!

తుపాకీ చేత పట్టిన హృదయానికైనా
బ్రతకాలనే కాంక్ష కలవరపెడుతుంటే
ఏ ఒక్కరి అధికార కాంక్షకో
ప్రపంచమే రణరంగంగా మారుతుంటే
తుది విజయం ఎవ్వరిదో తెలిసేనా?

యుద్ధ మేఘాలతో తడిసిపోతున్న
మన అవని ఆవేదన తీరేలా
ప్రతి మనిషిలో పసి హృదయాన్ని
మరలా తట్టిలేపేలా మానవత్వమనే
క్రొత్త విత్తనాన్ని ఓ సారి నాటి చూద్దాం.

మతమేదయినా, జాతి ఏదయినా
వసుధకు మనమంతా చుట్టాలమని
ప్రకృతిలో మనమూ ఒక భాగమని
విచక్షణతో కలిసి సాగిపోదామని
రేపటికై శుభాశీస్సులు పలికేద్దాం.

యుద్ధం మిగిల్చిన గుండెకోతకు వీడ్కోలుగా
ఆశలు అగరు ధూపంలా వెలిగిద్దాం!

Exit mobile version