[శ్రీ చిట్టత్తూరు మునిగోపాల్ రచించిన ‘తులసితీర్థం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక – బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో ₹ 2,000/- బహుమతి గెల్చుకున్న కథ.]
దబ్బుమని చప్పుడైంది. అయ్యో.. మునెక్క పొరక్కట్ట పట్టుకొని వొచ్చేసింది గావాల. కూర్చున్న చోటునుంచి గబుక్కుమని పైకి లేచియిపోయాడు శంకర్. ముడ్డి తడుముకున్నాడు.. జారిపోబోయే చడ్డీని ఎగేసుకొని పరిగెత్తేదానికి. నడుముదగ్గర బెల్టు బిగించిన ప్యాంటు వెనుక జేబులు తగిలాయి. అప్పుడు వచ్చాడు ఈ లోకంలోకి అతడు. అక్కడ మునెక్కా లేదు, ఆమి చేతిలో పొరకా లేదు. కానీ ఆమి కట్టించిన వినాయకుడి గుడి మాత్రం కాలాన్ని తట్టుకుని చెక్కు చెదరకుండా నిలబడి ఉంది. ఇప్పటిదాకా ఆ గుడి మెట్లమీదే శంకర్ కూర్చుని ఉండింది. పక్కనే పడిన బల్లి, చకచకా కదిలి గోడెక్కింది.
పల్చని చిరునవ్వు కదిలింది అతడి పెదవులపై. చుట్టూ చూశాడు, తన కంగారును ఎవరైనా గమనించారేమోనని. దూరంగా వో డాబా ఇంటిముందు ముందు దించిన రేకుల షెడ్డు కింద టీ బంకులో ఎవరో ఇద్దరుముగ్గురు మధ్య వయస్కులు కూర్చుని పిచ్చాపాటీ మాట్లాడుకుంటున్నారు. రోడ్డుకు అవతలి వైపు రెండస్తుల బిల్డింగ్ ముందు డ్రైవర్ కాబోలు ట్యాంకర్ అమర్చిన ట్రాక్టర్ కడుగుతున్నాడు. ఆ ట్యాంకర్ పైన బోరుకు కనెక్షన్ ఇచ్చిన పెద్ద పైపునుంచి నీళ్ళు దబదబా ట్యాంకర్‌లో పడుతున్నాయి. బేరం తగిలింది కాబోలు. ఆ పక్కనే కొంచెం దూరంలో ఉన్న వీధి కుళాయి చుట్టూ ఇరవైదాకా ప్లాస్టిక్ బిందెలు ఉడ్డగా పెట్టారు. వాకిళ్లలోంచి ఆడంగులు పనీపాటలు చేసుకుంటూనే అప్పుడప్పుడూ నీళ్ళు రాని కుళాయిని తొంగి చూస్తున్నారు.
మళ్ళీ అదే గుడి మెట్లమీద కూర్చున్నాడు శంకర్. ఒక చేతిలో చిన్న ఇత్తడి నీళ్ళ బకెట్టులో రాగిచెంబు వేసుకొని, రెండో చేతిలో పొరక్కట్ట పట్టుకొని గుడి కడిగి ముగ్గులు పెట్టడానికి విసవిసా నడిచి వస్తున్న మునెక్క రూపం కళ్ళముందు మెదిలింది.
ఎప్పుడూ తెల్లటి చీర, రవికలో ఉండేది మునెక్క. గుండ్రదనం ఎక్కువగా ఉండే కోల ముఖంలో ముక్కు స్ఫుటంగా కనిపించేది. అక్కడక్కడా నల్లగా మెరిసే తెల్ల జుట్టు. కళ్ళు చిన్నవే అయినా తీక్షణంగా ప్రకాశించేవి. నుదుటిన అడ్డనామాలుగా దిద్దిన విభూది లేకుండా ఎప్పుడూ చూడలేదు ఆమిని శంకర్. తనకు ఊహ తెలిసినప్పటినుంచీ ఆమి ఒంటికాయ సొంటికొమ్మే. ఎప్పుడూ శుచిగా శుభ్రంగా కనిపించే మునెక్క, మొగుడనే మానవుడు అవసరమే లేనట్టు కనిపించేది.
అసలు ఆమి చరిత్రలో ఎప్పుడైనా సరే మొగుడనే వాడు ఉన్నాడా? లేడా? ఒకప్పుడుండి చచ్చిపోయాడా? లేక ఈమి శుచీ శుభ్రం భరించలేక దేశాలు పట్టిపోయాడా? ఏమో.. తెలియదు శంకర్‌కు. తెలిసింది మునెక్క, ఆమి కట్టించిన గుడి. గుడి అంటే పెద్దదేమీ కాదు. పదికి ఇరవై అడుగుల జాగా. అందులోనే చిన్న గర్భగుడి, దానికి అనుబంధంగా ఇంత వరండా. ఆ వరండాకు రెండు వైపులా ఒక మూరడెత్తు తిన్నెలు. పై కప్పుకు ఆలంబనగా అటుఇటు రెండేసి గుండ్రటి స్తంభాలు. బోదకసువు కప్పుతో మట్టి గుడిసిలుండే హోల్ తిమ్మసముద్రంలోనే ఆ కాలంలో, ఏకైక కాంక్రీట్ కట్టడం ఆ గుడి ఒక్కటే. ఆ ఊరి జనానికి అదో ప్రపంచ వింత.
నాలుగు వీధులుండే ఊళ్ళో రెండో వీధిలోని పాక్షికంగా పాడుబడ్డ బోద కసువు కప్పిన మట్టి ఇల్లు మునెక్క నివాసం. లంకంత పెరడు. నిండా వేప, కానుగా, తురాయి, ఉలీంద్రం.. ఏవేవో చెట్లు పొదలు. ఒంటరి బతుకు. పొద్దుపొద్దున్నే తలారా స్నానం చేసేది మునెక్క. ఒక చేతిలో నీళ్ళు నింపిన చిన్న ఇత్తడి బకెట్టు, రాగి చెంబు, రెండో చేతిలో పొరక్కట్ట పట్టుకుని గుడికి ఎల్లబారొచ్చేది.
ఇప్పుడు శంకర్ బెదిరింది, గుడి అరుగుమీద ఆమె కోపంతో చేసే పొరక శబ్దానికే. అంటే మునెక్క ఇప్పుడున్నదని కాదు. ఆలోచనల్లో ఆమిని ఆవాహన చేసుకుంటున్నాడని అర్థం. గుడి అరుగులపై ఎప్పుడూ పిలకాయలు ఆడుకునేవాళ్ళు. ఆ పక్కనే ఉండే గంగిరేణి చెట్టు మొగ్గలు తెచ్చి బొంగరాలు తిప్పేవాళ్ళు. పరిగి చెట్ల ఆకుల బూరలతో తొట్లలోని నీళ్ళను పీల్చకొచ్చి అరుగులు, మెట్లపై జుర్ మని ఊదేవాళ్ళు. శుచికి శుభ్రతకు ప్రాణాలిచ్చే మునెక్క ఇక అగ్గిమీద గుగ్గిలం అవుతుందంటే అవదూ. అదిగో అటువంటప్పుడు చేతిలోని పొరకను ఆమి ఆయుధంగా వాడేది. అంటే కొట్టేస్తుందని కాదు. అరుగుల మీద ఆ పొరకతో ఈడ్చిఈడ్చి బాదుతూ పిలకాయలను బెదరగొట్టి తరిమేసేది. ఆ అనుభవాలు శంకర్ కూ ఉన్నాయి. అందుకే ఆమి ఆలోచనల్లో మునిగి, ఎక్కడ పొరక దెబ్బ పడుతుందేమోనని ఉలికిపడి అదాటుగా లేవడం.
అలాగని మునెక్క ఏనాడూ ఒక్క చిన్న దెబ్బయినా పిలకాయల వొంటిమీద వేసింది లేదు. పైగా చెల్లాచెదురై దూరదూరంగా బెదురుతూ నిలబడి చూస్తున్న వాళ్ళను పిల్చి మరీ దేవుడికి నైవేద్యం పెట్టిన శనగలు, బెల్లం పందేరం చేసేది. “గుడిలో చెత్తలు ఎయ్యబాకండ్రా మీకు పున్నిం వుంటాది. ఊడ్చి ఊడ్చి నా నడుములు పడిపోతా వుండాయి. కోనంగి ఆటలాడితే ఏవొస్తాది? సదువుకోండ్రా, బాగుపడ్తారు.” అని బతిమాలేది. “నా మాటినకుండా ఏసినారో, ఇదిగో దీంతో ఈపు ఇమానం మోత మోగిస్తా.” అంతలోనే పొరక్కట్ట తిరగేసేది. “అయినా ఆ రామ్మందిరం సపారలో చీట్లాట పొరంబోకు ముండెదవల మజ్జన మీకు అచ్చరమ్ముక్కలు యాడ అబ్బతాయిలే..” అని నిట్టూర్పులు విడిచేది.
పిలకాయలు బెదిరినట్టే వుండేవాళ్ళు కానీ.. మళ్ళీ ఆమి అటు తిరగ్గానే కోతులుగా మారిపొయ్యేవాళ్ళు.
ఇప్పుడనిపిస్తోంది శంకర్‌కు.. నిజానికి మునెక్క పిలకాయల కోతిచేష్టలనే ఇష్టపడేదేమో అని. వాళ్ళు అల్లరి చేసినందుకే పిలిచి మరీ పప్పు బెల్లాలు పంచేదేమో. కానీ పిలకాయలు చదువుకుని బాగుపడాలన్న ఆమి తపన అప్పుడు అర్థమవలా.
“యావూరబయా మనదే.” మాట వినిపించి తల తిప్పాడు శంకర్.
“నువ్వు ఎంగటముని బావ కొడుకివి గదా..” బదులిచ్చేలోగానే ఆయనే తేరిపార జూసి అన్నాడు.
“అవున్నా నిజిమే, నేను ఎంగటముని గారి కొడుకునే.” చెప్పాడు.
“ఓరోరి నువ్వట్రా శంకా, యాడుండావు, ఎట్టా వుండావు? కాదబయా, నాయిన చావుకు చెప్పకనే పోతివి గదరా. అనాక నెల్లాళ్ళకో ఏమో సాయిబంగడి కాడ, మీ అత్త రత్నక్క కొడుకు కనిపిచ్చి చెబ్తే తెలిసొచ్చే. ఊరిడిసిపెట్టి కాలాస్త్రి జేరినాక మళ్ళీ ఇదే రాడం నువ్వు. యాం పనిమీదొచ్చినావు? ” పక్కనే కూర్చుని గబగబా గుక్క తిప్పుకోకుండా ప్రశ్నలు వేశాడు. ఆ మాట్లాడే విధానం, తొందరపాటు చూశాక గుర్తుకొచ్చింది, ఆయన్న నాయన సావాసగాడు శీనన్న.
పిలకాయల చదువులకోసమని నాయన ఊరిడిసిపెట్టి కుటుంబరాన్ని దీసుకొని కాలాస్త్రి జేరాడు. ఒళ్ళు బాగాలేక పడవపడి చచ్చిపొయ్యి ఏడాదయింది. ఈ ఊళ్ళో రెండు గుంటల నేల నాయన పేరుమీద ఉండాది. ఇన్నాళ్ళకు తీరింది రావడానికి. దాన్ని అయినకాడికి తెగనమ్మేసి దుడ్లు జేసుకుందామని అతడి ప్రయత్నం. అదే చెప్పాడు.
“నాయిన చచ్చిపొయ్యినప్పుడు పనుల్నా. నేనొక్కణ్నే కదానా సంబాళించుకోవాలి. మీకే కాదు, చాలా మందికి చెప్పలేకపొయ్యినాను. నన్ను మన్నించాల. పిలకాయిలు ఇద్దరూ కాలేజీ చదువులకు వొచ్చినారనా. ఫీజులకు చాలా ఇబ్బందిగా ఉండాది. ఇక్కడ రొండు గుంటల నేల ఉండాది కదా నాయన పేరుమింద. దాన్ని బేరం పెడదామని వొచ్చినా. మీకోసరం ఊళ్ళో అడిగితే, చేలోకి ఎల్లబారారని చెప్పినారు. మీకోసరమే ఈడ ఎదురుజూస్తా ఉండా.”
“మునెమ్మ పుణ్యాత్మురాలు. ఆమికి దండం బెట్టుకోల.” ఆకాశం దిక్కు తలయెత్తి రెండు చేతులూ జోడించినాడు శీనన్న.
తను మాట్లాడే సబ్జక్టు ఏంది? ఆయన్న మాట్లాడే తీరేందీ? అతడికి కోపమొచ్చింది గానీ తమాయించుకొన్నాడు. “అవున్నా, ఈ గుడి కట్టిచ్చి చచ్చేంత వరకూ దేవుణ్ణి సేవ జేసుకుంటానే బతికిందంట గదా.” వెనక్కు దిరిగి గర్భగుడి ముందు గోడకు తగిలించిన ఆమి ఫోటోకు శంకర్ కూడా దణ్ణం పెట్టాడు.
ఒకసారి అతడి దిక్కు జూసి పైకి లేచాడు శీనన్న. “రా అబయా ఇంటికి పోదాం. కాపీ దాగతా మాట్లాడుకొందాం.” పిలిచాడు.
ఊళ్ళో ఆయన్నే దిక్కు, నేల అమ్మిపెట్టడానికి శంకర్‌కు. కాదనకుండా లేచాడు. ఇద్దరూ పక్కపక్కనే నడుస్తున్నారు. శంకర్‌ను గుర్తుపట్టినవాళ్ళు పలకరిస్తున్నారు. లేనివాళ్ళు ఎవరీ కొత్త మనిషి అన్నట్టు చూస్తున్నారు.
మునెక్క జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల.. అని రాసిన ఆర్చి ఎదురవడంతో హఠాత్తుగా ఆగిపోయాడు శంకర్.
“ఆ బోర్డులో ఉండే పేరు గుడి మునెమ్మదే. ఈ బడి ఉండే నేల ఆయమ్మ ఇంటి జాగానే. పుణ్యాత్మురాలు.” చెప్పాడు శీనన్న.
“ఆడపిలకాయిలను పక్కూరికి పంపించేది లేదని ఊళ్ళోవాళ్ళం మొండికేస్తే ఆమి ఈ బూమి దానం జేసింది. ఇక్కడ సదువుకున్న నా కూతురు, బెంగ్లూరులో కంప్యూటర్ ఉజ్జోగం జేస్తా వుండాది. జయమ్మ కూతురు గూడా ఈడే సదువుకోని ఒగరు టీచరుగా వుండాది.” ఆయన్నే మళ్ళీ చెప్పాడు.
ఎక్కడో ముల్లుతో గుచ్చినట్టయింది. “అవునా..” లో గొంతుకతో అన్నాడు.
“ఊరి దాహం తీరనేలేదన్న మనేదతోనే ఎళ్లిపొయ్యిందాయమ్మ. కడాకు ఆమి గొంతులో తులసితీర్థం పొయ్యడానికి అయినవాళ్ళు గూడా దగ్గర లేకండా పాయె. ఉండే చారెడు ఇంటి జాగా బడికి ఇచ్చేసిందని కోపానికొచ్చినారు.” నిట్టూర్చాడు శీనన్న.
ఆ మాట ఎక్కడో దబ్బనంలా పొడిచింది శంకర్‌ను. తన చిన్నప్పుడే ఎండిపోయిన ఊళ్ళోని రెండు బావులు, జల సరిగా పడని చేతిబోరు, అడుగంటిన నేలాబావిలోకి బాగా వంగిపోయి ఊటను దబర్లతో దోర్చుకుంటున్న ఆడవాళ్ళు.. గిర్రున తిరిగారు.
“అనా కాలాస్త్రికి తిరుగు బస్సు ఎన్ని గంటలకు?” అడిగాడు నడవడం ఆపి.
“ఇంగో పదైదు నిమిషాల్లో ఉండాదబయా. పన్నెండవతా ఉండాదా ఇప్పుడు. మళ్ళీ మజ్జానం రొండు గంటలకు ఇంగొకటి. మొన్న నీళ్ళు జూసేవోళ్ళను పంపించ్చినావు గదా. నీ బూమిలో నూరూ, నూటాబై అడుగుల్లోనే నీళ్ళు పడతాయని ఊరందరికీ తెల్సిపొయ్యింది. రేటు గూడా బాగానే వొస్తాది. బేరం మాట్లాడి సెటిల్ జేసేద్దాం తాళు.” చెప్పాడు శీనన్న.
“లేదునా, ఇప్పుడే గుర్తుకొచ్చింది. కాలాస్త్రిలో అర్జంటు పని వుండాది. మళ్ళీ ఎప్పుడైనా చూద్దాంలేనా.” వారిస్తున్నా వినకుండా రోడ్డుమీదికి వచ్చేశాడు శంకర్. మరో పది నిమిషాలకల్లా బస్సెక్కాడు.
“నాయనా మునెమ్మ వొచ్చిందిరా తెల్లారి ఇంటికి. శీనడు కూడా ఆమితో ఉండాడు. మనూళ్ళో బోర్లు, బాయిలు ఎండిపొయ్యి గుక్కడు నీళ్ళకి అల్లాడిపోతా వుండారంట. టెంకాయ శాస్త్రం చూపిస్తే మన బూమిలో దప్ప ఇంగెక్కడా నీళ్ళు పడవనేసినారంట. బోరేపించేదానికి దుడ్లు గూడా పెట్టుకుంటానని చెప్పింది. నువ్వు ‘వూ’.. అంటే నేను మాటిస్తాను. మనం బతికొచ్చిన ఊరురా. దాహం తీరిస్తే ఊరోళ్ళ దీవినలతో మన కుటుంబరం సల్లగా ఉంటాది..” చచ్చిపోవడానికి రెండు నెల్ల ముందు పడకలో రొప్పుతూ నాయన అన్న మాటలు రీ సౌండులో వినిపిస్తున్నాయి.
“నాయన్నాయనా గుక్కడు తులసితీర్థం గొంతులో పొయ్యిరా.., నీకు పున్నెముంటాది.” గుడి మెట్లమింద కొనఊపిరితో కొటుకులాడుతున్న మునెక్క.. ఎండిన పెదాలతో దీనంగా వేడుకుంటోంది.
శ్రీ చిట్టత్తూరు మునిగోపాల్ పుట్టింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి చిత్తూరు జిల్లా (ప్రస్తుతం: తిరుపతి జిల్లా), శ్రీకాళహస్తి సమీపంలోని తిమ్మసముద్రం అనే చిన్న గ్రామం. చదివింది శ్రీకాళహస్తి. ప్రస్తుత నివాసం చిత్తూరు జిల్లా కుప్పం. ఒక ప్రముఖ దినపత్రికలో విలేకరిగా పనిచేస్తున్నారు. సాహిత్యమంటే మక్కువ ఎక్కువ. గత మూడునాలుగేళ్ల నుంచి కథలు రాస్తున్నారు. ఆంధ్రజ్యోతి, వార్త దినపత్రికల ఆదివారం ప్రత్యేక అనుబంధాలు, సారంగ, ఈమాట, నెచ్చెలి, సంచిక, కౌముది, గోతెలుగు. కామ్ వంటి ప్రముఖ వెబ్ పత్రికల్లో పలు కథలు ప్రచురితం.
