Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

తుర్లపాటి జీవన సాఫల్య యాత్ర-28

[తుర్లపాటి నాగభూషణ రావు గారి ‘తుర్లపాటి జీవన సాఫల్య యాత్ర’ అనే రచనని పాఠకులకు అందిస్తున్నాము.]

రికార్డుల మోత:

కాలేజీ కుర్రాళ్ళిద్దరు ఒక గదిలో ఏదో సైన్స్ ప్రయోగం చేస్తున్నట్లున్నారు. ఒక గదిలో పొడవాటి విద్యుత్ తీగకు ఓ చివర బల్బ్ వెలుగుతోంది. వెలిగే ఆ బల్బ్ ఆధారంగా ఏదో ప్రయోగం చేస్తున్నట్లే కనబడుతోంది. కుర్రాళ్ళిద్దరి నుదుట చెమట పడుతోంది. అయినా వారు దాన్ని పట్టించుకోవడం లేదు. తాము చేపట్టిన ప్రయోగాన్ని త్వరత్వరగా ముగించాలని చాలా పట్టుదలతో పనిలో ఏకాగ్రత పెంచినట్లు వారి మొహాలు చూస్తుంటేనే అర్థమవుతోంది.

ఇంతకీ ఏమిటా సైన్స్ ప్రయోగం? ఎందుకంత హడావుడి? ఆ వివరాలు తెలుసుకోవాలంటే 70వ దశకం చివర్లో నందిగామలోని ఓ ఇంటి గది దగ్గరకు వెళ్ళాల్సిందే. పదండి.. మీరూ నా వెంట వెనక్కి నడవండి. అక్కడికే వెళదాము.

సైన్స్ ప్రయోగం చేస్తున్న ఇద్దరు కాలేజీ కుర్రాళ్లలో నేనూ ఒకడ్ని. రెండో వాడు నా కాలేజీ మేట్ పార్థా. డిగ్రీ మా ఊరి కాలేజీలోనే చదువుతున్నాము. కెవీఆర్ కాలేజీలో మాది బీఎస్సీ ఫస్ట్ బ్యాచ్. ఇద్దరిదీ బోటనీ, జూవాలజీ, కెమిస్ట్రీ గూప్. సైన్స్ స్టూడెంట్స్‌కి ప్రాక్టికల్స్, రికార్డు వర్క్ తప్పనిసరి. అసలు రికార్డ్ బుక్స్ చేతిలో పట్టుకుని వెళుతుంటే మేమేదో గొప్ప శాస్త్రవేత్తలమైపోయినట్లు తెగ ఫీలయ్యేవాళ్లం. ఇంటర్ లో నైతే బైపీసీ వాళ్లమైన మేమంతా రేపో మాపో డాక్టర్లమైపోతామని కలలు కన్నాము. ‘ధనా ధన్’ అన్న భాగంలో దీని గురించి వ్రాశాను. డిగ్రీ చదివే రోజుల్లో ఆ కల నెమ్మదిగా చెదిరిపోయింది. ఇప్పుడైతే శాస్త్రవేత్త గానో, లేదా లెక్చరర్ గానో సెటిల్ అవ్వాలన్నదే ఆలోచన. శాస్త్రవేత కావాలని ఎందుకు అనుకున్నానంటే, ఆ రోజుల్లోనే మా ఫ్రెండ్స్‌లో కొంత మంది ఐన్‌స్టీన్ లాగానో, న్యూటన్ లాగానో, లేదంటే డార్విన్ లాగానో ఫోజులిస్తుండే వాళ్లు. కొంత మంది సైన్స్ లోనే రకరకాల ప్రయోగాల పట్ల ఆకర్షితులయ్యారు. వారి మాటలకు మేమూ శాస్త్ర ప్రయోగాల వైపు మొగ్గు చూపాము. మొదట్లో చెప్పిన మా ప్రయోగం గురించి వివరించే ముందు కాలేజీ ఐన్‌స్టీన్స్, డార్విన్స్ గురించి మరికాస్త చెప్పాల్సిందే మరి. మా బ్యాచ్ లోనే సూర్యనారాయణ చాలా చురుగ్గా ఆలోచించే వాళ్లలో ఒకడు. వాడో సారి ఆటల్లో ఉన్న మా దగ్గరకు వచ్చి, రాత్రి అత్యవసర సమావేశం ఉన్నదని చెవిలో ఊదాడు. వాడి టీమ్ సభ్యులను ఓ రహస్య ప్రాంతానికి రమ్మనమన్నాడు. ఆ టీమ్‌లో నేనూ ఒకడ్నే. సరే ఆ రహస్య సమావేశానికి బయలుదేరాము. అది ఎండాకాలం. పగటి పొద్దు ఎక్కువ. రాత్రి ఏడు దాటాకనే వాడు చెప్పిన రహస్య ప్రాంతానికి నేనూ విష్ణు బయలుదేరాము. అదేమీ నిజానికి అంత రహస్య ప్రాంతమేమీ కాదులేండి. అడపాదడపా వెళుతుండే మన్నేరే. ఏటి వొడ్డున నందిగామ పౌరులకు మంచి నీటి అవసరాల కోసం తవ్వించిన బావి దగ్గరకు రమ్మనమని చెప్పడంతో అక్కడికే నేరుగా చేరుకున్నాము. మేము ఈత ప్రాక్టీస్ చేసేదీ అక్కడే. అలాంటప్పుడే ఓ సారి నీటిలో మునిగిపోయాను. మునిగిపోతున్న నన్ను ఓ స్నేహితుడు రక్షించాడని – ‘ప్రాణ రక్షకుడు’ – అన్న భాగంలో చెప్పాను కదా. అదే ఆ ప్రాంతంలోనే ఇప్పుడు సూర్యనారాయణ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశాడు. మేము వెళ్ళేసరికి ఆకాశంలో నక్షత్రాలు మిలమిలా మెరిసిపోతున్నాయి. అమావాస్య దగ్గరి రోజులు కావడంతో చంద్రుడు ఎక్కడో రెస్ట్ తీసుకున్నట్టున్నాడు. సూర్యనారాయణ చాలా చురుకు అని చెప్పాను కదా. వాడి ఆలోచనలు అన్నీ ఎప్పుడు నా బోటి వాడి స్థాయికి మించే ఉంటాయి. నాలాంటి వాడు పుస్తక జ్ఞానంతోనే సరిపుచ్చుకుంటుంటే, వీడేమో అంతకంటే లోతైన విజ్ఞానం సంపాదించుకుని తానో గొప్ప శాస్త్రవేత్తగా ఫీలయ్యేవాడు. ఇతరత్రా సంగతులు ఏవీ గుర్తుంచుకోడు. కొన్ని సార్లు పిచ్చివాడిలా తిరుగుతుంటాడు. అలాగే మాట్లాడుతుంటాడు. ఏమిటో.. మాకైతే వాడి పోకడ అర్థమయ్యేది కాదు. అంతేనేమో మేధావుల ఆలోచనలు, అలాగే ఉంటాయోమో..

నేను చాలా పెద్దయ్యాక శ్రీ రామకృష్ణ పరమహంస గురించి చదువుతున్నప్పుడు, ఆయన్నీ లోకం పిచ్చివాడనే అందని తెలుసుకున్నాను. అప్పుడు ఈ సూర్యనారాయణ గుర్తుకు వచ్చాడు. ఆ తర్వాత వేమన చరిత్ర, షిర్డీ సాయిబాబా చరిత్ర చదువుతున్నప్పుడూ అలాగే అనిపించింది.

సూర్యనారాయణ వింత చేష్టలు చూసిన మాబోటి వారు వాడ్ని ‘ఎబ్ నార్మల్ క్రీచర్’గా పిలిచేవారం. ఈ విషయం వాడికి తెలిసినా మమ్మల్ని ఏమీ అనలేదు. పైపెచ్చు, ఓ నవ్వు నవ్వాడు. ఆ నవ్వులో మేమంతా అథమస్తులం అన్న భావం ఉందేమోనని వాడ్ని ఎగాదిగా చూసేవాళ్లం. సరే, సమావేశం ప్రారంభమైంది. సూర్యనారాయణ గొంతు సవరించుకుని అందుకున్నాడు..

‘ఓరేయ్, అలా ఆకాశం వైపు ఓసారి చూడండి. ఏం కనబడుతున్నాయి?’

అక్కడికి వాడేమో ద్రోణుడి లాగానూ, మేమేమో శిష్యుల్లాగానూ అనుకుంటూ బుద్ధిగా అందరమూ ఒకే సారి తలలు పైకెత్తి ఆకాశం వైపు చూశాము. ఏముంది అక్కడ..?

చీకటి పడింది కదా, నక్షత్రాలు కనబడుతున్నాయి. వాటిలో కొన్ని విద్యుత్ దీపాల్లా ప్రకాశవంతంగా మెరిసిపోతుంటే, కొన్నేమో మసిబారిన బుడ్డి దీపాల్లా మినుకు మినుకుమంటున్నాయి.

అదే చెప్పాము. వాడు మళ్ళీ అందుకంటూ..

‘నిజమే. నక్షత్రాలే. కానీ మీకో విషయం తెలుసా, అవన్నీ మన సూర్యుడి లాంటివే. కాకపోతే చాలా దూరంగా ఉండటంతో అలా చాలా చిన్నవిగా కనబడుతున్నాయి.’

ఇదంతా మేమూ సైన్స్ బుక్‌లో చదువుకున్నదే కావడంతో – ‘మాకూ తెలుసులేవోయ్, ఇది చెప్పడానికేనా ఇక్కడి దాకా రప్పించావు’ – అంటూ తిరుగుబాటు చేసిన విద్యార్థుల్లా మాట్లాడాము.

‘అది కాదురా.. దూరాన చిన్నవిగా ఉన్న నక్షత్రాలను పెద్దవిగా చూడాలని లేదా మీకు?’

ఈ ప్రశ్నతో మాలో ఆసక్తి పెరిగింది.

‘అవును, చూడాలని ఉంది’ ముక్త కంఠంతో అన్నాము.

‘మరి అదే.. అందుకే నేనో ప్రయోగం తలపెట్టాను, అర్థం చేసుకోరూ’ –

వాడి ముఖం ఆ చీకట్లో కూడా వెయ్యి కాండిల్స్ బల్బ్‌లా వెలిగిపోవడం నేను గమనించాను.

‘ఏమిటా ప్రయోగం చెప్పరా, అందుకేనా ఇక్కడకు మమ్మల్ని పిలిపించావు’ – అన్నాడో మిత్రుడు.

అవును, అంటూ అప్పటికే తనతో తెచ్చుకున్న అల్యూమినియంతో చేసిన గొట్టం లాంటి పరికరాన్ని మా ముందు ఉంచాడు. మా ఊర్లో మాట్లు వేసే వాడి దగ్గర చేయించినట్లు మేము ఇట్టే పసిగట్టాము. అదే వాడితో అంటే..

‘మీరు అంతే ఆలోచించగలరు. ఇది టెలిస్కోప్’

ఆ మాటకు , ఒక్కసారిగా మాలో ఆశ్చర్యం ఎగిసింది. ‘ఏమిటీ!! టెక్స్ట్ బుక్‌లో చదివిన టెలిస్కోప్‌ని వీడు తయారు చేశాడా!!’ – ఆ క్షణంలో వాడి తెలివితేటలను మెచ్చుకోకుండా ఉండలేక పోయాము. ‘ఏదీ చూడనీ’- అంటూ ఒకడు అత్యుత్సాహంతో ఆ అల్యూమినయం గొట్టాన్ని లాక్కుని దాంట్లో నుంచి చూశాడు. ఓ ఐదారు సెకన్లు దొర్లగానే వాడి ముఖంలో నిరుత్సాహం చోటు చేసుకోవడం గమనించాను. ఎందుకంటే ఆ గొట్టంలో నుంచి కూడా ఆకాశం మామూలు కంటితో చూసినట్లే ఉంది. ఏ నక్షత్రం కూడా పెద్దదిగా కనిపించలేదు. ఆప్పుడు సూర్యనారాయణ, చావు కబురు చల్లగా చెప్పాడు..

‘ఓరేయ్, టెలిస్కోప్ ఇంకా పూర్తిగా తయారు కాలేదురా. దానికి లెన్స్‌లు బిగించాలి. విజయవాడ నుంచి తెప్పిస్తున్నాను’

మాకు తెక్కరేగింది. మా బ్యాచోళ్లలో నా బోటి సౌమ్య జాతి మౌనంగా ఉన్నా, అసహన జాతి ఊరుకుంటుందా.. హింసాత్మక చర్యలకు దిగింది. వాడిని ఉతికి ఆరేసింది. సరిగా అప్పుడే – ఏట్లో బట్టలు ఉతికి ఆరేసి. సరిగా ఆ సమయంలోనే మూటలు గట్టుకుని వెళుతున్న చాకలోళ్లు (ఆ రోజుల్లో అలాగే పిలిచే వారు) మా దగ్గరకు వచ్చి – ‘ఏమైందీ.. పాము ఏదైనా కనిపించిందా..’ అంటూ ఆరా తీశారు. తర్వాత విషయం తెలుసుకుని వారూ నవ్వుకుంటూ సాగిపోయారు.

ఆ గొట్టాన్ని తప్ప, పూర్తి స్థాయి టెలిస్కోప్‌ని సూర్యనారాయణ తయారు చేసి మాకు చూపించలేదు. ఆ రోజుల్లో వాడిని ఐన్‌స్టీన్ అనుకున్న వాళ్లమే ఆ తర్వాత పిచ్చివాడు అన్న ముద్ర కూడా వేశాము. కాలేజీ చదువు తర్వాత వాడెక్కడ సెటిల్ అయ్యాడో నాకు తెలియదు. కానీ పెద్దయ్యాక వాడి ఆలోచన, సైన్స్ ప్రయోగాల పట్ల వాడిలోని సృజనాత్మకత తలుచుకున్నప్పుడు వాడ్ని చాలా సందర్భాల్లో మెచ్చుకున్నాను.

న్యూటన్ ట్రీ:

న్యూటన్ మహాశయుడు భూమికి ఆకర్షణ శక్తి ఉన్నదని గుర్తించిన శాస్త్రవేత్త. ఓసారి ఆయన Woolsthorpe లోని ఇంటి పెరట్లో ఉన్న ఆపిల్ చెట్టు క్రింద కూర్చుని ఏదో ఆలోచనల్లో ఉంటే ఆపిల్ పండు నేల రాలి పడటాన్ని గమనించాడు. చెట్టు మీద ఉన్న కాయ నేలమీద పడటానికి కారణం ఏమిటన్న ఆలోచనే భూమ్యాకర్షణ సిద్ధాంతానికి దారి తీసింది. ఆ తర్వాతి కాలంలో ఆ చెట్టు నేలకొరిగినా న్యూటన్ మీద ఉన్న ప్రేమతో దాని కొమ్మను డ్రాప్ట్ చేసి ఆయన చదువుకుని, ఎన్నో ప్రయోగాలు చేసిన ట్రినిటీ కాలేజీ (Cambridge University) లో నాటారు. ఆ చెట్టునే ఇప్పుడు సందర్శకులు చూసి వస్తుంటారు.

2022లో మేము నాలుగో సారి యు.కె వెళ్ళినప్పుడు Cambridge University చూడటానికని వెళ్ళాము. Cam అంటే నది పేరట. ఆ నది దాటడానికి వంతెన కట్టారు. అదే Cambridge. ఒకప్పుడు ఒకటే బ్రిడ్జ్ ఉండేదట. ఆ తర్వాత అనేక వంతెనలు వచ్చేశాయి. ఈ నదిలో పడవ మీద వెళుతుంటే ఒక వైపున వరుసగా యూనివర్శిటీ కాలేజీలు కనిపించాయి.

ఒకటి ట్రినిటీ కాలేజీ దగ్గరకు వెళ్ళాము. ఈ కాలేజీ ఆవరణలోనే మేము ఆపిల్ చెట్టు చూశాము. న్యూటన్ ఆలోచనకు కారణమైన చెట్టు ఇదే కాకపోయినా, ఆ చోటు కూడా ఇదే కాకపోయినా సందర్శకులు మాత్రం ఎంతో ఆసక్తిగా ఈ చెట్టు దగ్గర ఫోటోలు దిగుతున్నారు. కాకపోతే అసలు చెట్టు కొమ్మని డ్రాప్ట్ చేయడంతో దాని లక్షణాలే దీనికి ఉన్నాయట. ఒక శాస్త్రవేత్తకి ఆలోచనలు రేకెత్తించిన చెట్టు అంటే మాటలా మరి. ఆ బ్రీడే వేరు.

ఈ చెట్టు దగ్గరే నేను ఫోటో తీసుకున్నాను. అప్పుడే మా కాలేజీ న్యూటన్లు, ఐన్‌స్టీన్లు గుర్తుకొచ్చారు.

గ్రహణాలు:

ఆకాశంలో నక్షత్రాల్లా మెరుస్తూ కనిపించే వాటిలో కొన్ని గ్రహాలు కూడా ఉంటాయి. అలా కనిపించేవి మన సౌరకుటుంబంలోని గ్రహాలే. అంటే బుధుడు, కుజుడు, గురుడు లాంటి వారే. మన భూమికి దగ్గర్లోనే ఉన్న ఉపగ్రహం చంద్రుడు. ఇలాంటి ఎన్నో విశేషాలు ఆ రోజుల్లో చాలా ఆశ్చర్యంగా తెలుసుకున్నాము. నందిగామ లైబ్రరీకి వెళ్ళి ‘ఆస్ట్రానమీ బుక్స్ ఉన్నాయా’ అని అడిగితే అలాంటివేవీ లేవు అని చెప్పేశారు. దీంతో విజయవాడలో విశాలాంద్ర బుక్ హౌస్, లేదా నవోదయం బుక్ షాప్‌కో వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్స్ ఇలాంటి పుస్తకాలు కొనుక్కుని వచ్చేవారు. అలా మేమే మాకు ఆసక్తి ఉన్న బుక్స్‌తో లైబ్రరీగా ఏర్పాటు చేసుకుని రొటేట్ చేసుకునే వాళ్లం. చంద్రగ్రహణమో, సూర్యగ్రహణమో వచ్చిందంటే చాలు, మా ‘బుక్స్ బ్యాచ్’ ఓ చోట మీటింగ్ పెట్టుకుని గ్రహణాలు ఎలా వస్తాయి, పూర్వం వాటిని చూసి ఆది మానవులు ఎంతగా కంగారు పడ్డారు, గ్రహణాల చుట్టూ ఉన్న మూఢనమ్మకాలేమిటి? వంటి అంశాలపై గంటల కొద్దీ మాట్లాడుకునే వాళ్లం. అలాంటప్పుడే నాకు తెలియని బోలెడు సైన్స్ విషయాలు తెలిసేవి. ఇంటికి చేరాక గ్రహణాల గురించి క్లాస్‌లు పీకేవాడ్ని. పాపం ఇంట్లో వాళ్లు కూడా శ్రద్ధగా వినేవాళ్లు. లేదా వినినట్లు నటించే వాళ్లు. ఇప్పుడంటే ఆరేడేళ్ల పిల్లాడు కూడా గ్రహణాలు ఎలా వస్తునాయో ఇట్టే చెప్పేస్తున్నాడు. యుకెలో ఉన్న మా మనవడు విరాజ్ ఆ వయుసులోనే సైన్స్ సబ్జెక్ట్ లోని అంశాల గురించి మాట్లాడుతుంటే ముసలి వయసులో ఉన్న నేను బోలెడు ఆశ్చర్యపోయాను. ఒకప్పుడు విషయ సేకరణ కోసం చాలా కష్టపడాల్సి వచ్చేది. కాని ఇప్పుడు గూగుల్ ‘మాత’ దయ వల్ల క్షణాల్లో సమాచారం అందుతుంది. ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ టూల్స్ (ఉదాహరణకు మెటా ఏఐ) వచ్చేశాయి. ఇలాంటి సౌకర్యాలు నేను కూడా ఉపయోగించుకుంటానని ఏనాడూ అనుకోలేదు. ఆరు పదులు దాటిన వయసులో లైబ్రరీకి వెళ్లకుండా, ఇంట్లోని పుస్తకాలను కూడా కనీసం తెరవకుండా కూర్చున్న చోటు నుంచి కదలకుండానే విషయ సేకరణ చేయగలుగుతున్నాను. అనేకానేక సందేహాలను ఏఐ (కృత్రిమ మేధ) ద్వారా రాబట్టగలుగుతున్నాను. దీంతో నా పని సులువవుతున్నది. తెలుసుకోవాలన్న తపన ఉండాలే కానీ ఈ ఆధునిక సాంకేతిక ప్రపంచ ద్వారాలు తెరిచే ఉంటాయి. కనబడుతున్నాయి. ఏమిటో ఎక్కడికో వెళ్ళిపోతున్నాను.

సరే, మా ఇంట్లోని గదిలో పార్థా, నేను చేస్తున్న ఆ ప్రయోగం గురించి పూర్తి చేయలేదు కదా, అందుకే మళ్ళీ అక్కడకి వెళదాము..

ట్రేసింగ్ టెక్నిక్:

నిజానికి మేము చేస్తున్నది సైన్స్ ప్రయోగం కాదు. బొమ్మలు ట్రేసింగ్ చేస్తున్నాము. బోటనీ, జూవాలజీ రికార్డ్‌ల్లో బోలెడు బొమ్మలు వేయాల్సి వచ్చింది. అన్ని బొమ్మలు మామూలుగా వేయాలంటే చాలా ప్రాక్టీస్ కావాలి. మేము కోతి బొమ్మ వేయబోతే అది కొంగై కూర్చునేది. మరో నెలలోనే ప్రాక్టికల్స్ ఫైనల్ ఎగ్జామ్స్. అంటే తొందర్లోనే రికార్డ్ బుక్స్ సబ్మిట్ చేయాలి. నాకు గుర్తున్నంత వరకు రికార్డ్ వర్క్‌కి ఐదు మార్కులు ఉంటాయి.

టైము ముంచుకొస్తున్నది.

బోలెడు బొమ్మలున్నాయి వేయడానికి.

వాటి ప్రక్కన నోట్స్ వ్రాయాలి. కానీ ఎలా పూర్తి చేయాలో తెలియక కంగారు పడుతుంటే, మా విష్ణు గాడు ఈ ట్రేసింగ్ టెక్నిక్ చెప్పాడు. ‘ట్రేసింగ్ అంటే బొమ్మను సునాయాసంగా కాపీ చేయడమేరా. దీనికి కావాలసిన ముడి సరుకు..’ అంటూ చెప్పుకుపోతున్నాడు..

  1. మన ఇంట్లోనే మూలన పడేసిన పెద్ద ఫోటో ప్రేమ్‌లో నుంచి అద్దం జాగ్రత్తగా బయటకు తీసి ఉంచుకోవాలి.
  2. మన ఇంట్లోనే ఉన్న పదో, ఇరవయ్యే పుస్తకాలు తీసుకోవాలి.
  3. ఎలక్ట్రిక్ బల్బ్. (మాంచి ప్రకాశవంతమైనది)
  4. బల్బ్ వెలిగించడానికి అవసరమైన వైర్, హోల్డర్, ప్లగ్ పిన్.

అంతే. ఇవి సమకూర్చుకుంటే ఇంట్లోనే కూర్చుని హాయిగా ఎలాంటి బొమ్మ అయినా (ఏనుగు, డైనోసార్, తొండ, గద్ద, పెద్దపెద్ద వృక్షాలు, వాటి అంతర్గత భాగాలు వంటివి) సునాయాసంగా గీసేయవచ్చు. ట్రేసింగ్ టెక్నిక్‌తో అతి తక్కువ సమయంలోనే క్వాలిటీ బొమ్మలతో రికార్డ్ బుక్స్ సబ్మిట్ చేయవచ్చు. ఫుల్ మార్క్స్ కొట్టేయవచ్చు. ఇదీ మా విష్ణు గాడి ప్లాన్. ట్రేసింగ్ టెక్నిక్ ఏర్పాట్లన్నీ వాడే పూర్తి చేసి ట్రయల్‌గా ఒకటి రెండు బొమ్మలు వేసి (కాపీ చేసి) చూపించి, ‘ఇక మీరు కానివ్వండిరా’ అంటూ వాడు తుర్రుమన్నాడు. అదిగో అప్పుడు మొదలైంది మా ట్రేసింగ్ యజ్ఞం.

పుస్తకాల దొంతరలు అటూ ఇటూ ఉంచి, దాని మీద ముందుగానే సిద్ధం చేసుకున్న ఫోటో ఫ్రేమ్ అద్దాన్ని పరిచాము. అంటే పుస్తకాల దొంతరలు స్తంభాల్లా ఉండటంతో వాటి మీద ఈ ప్రేమ్ అద్దం నిలుస్తుంది. పైగా దాని క్రింద విద్యుత్ బల్బ్ వెలిగేలా చూడవచ్చు. బల్బ్ కాంతి అద్దం నుంచి పైకి వచ్చేలా చూశాము. టెక్స్ట్ బుక్ లోని ఒరిజనల్ బొమ్మ ఉన్న పేజీని జాగ్రత్తగా అద్దం మీద పరచి, దాని మీద రికార్డ్ షీట్ పరిచాము. విద్యుత్ కాంతి కారణంగా బొమ్మ మా రికార్డ్ షీట్ మీద స్పష్టంగా కనబడుతోంది. ఇది చాలు పెన్సిల్ తీసుకుని ట్రెసింగ్ చేయడానికి.

సరే, పరీక్షకు ఓ వారం రోజుల ముందే జువాలజీ రికార్డ్ బుక్‌ని మాష్టారికి అందజేశాము. ఆయనోసారి రికార్డ్ బుక్ అంతా తిరగేసి, మావైపు అదోలా చూశారు. మేము ఆ కాసేపు చాలా అమాయకంగా ఫోజిచ్చాము. ఏమనుకున్నారో ఏమో, సంతకం చేసి ఇచ్చారు. టెక్స్ట్ బుక్‌లో ఏ సైజ్‌లో బొమ్మ ఉంటే సరిగా అదే సైజ్‌లో రికార్డ్ బుక్‌లో మేము బొమ్మలు వేయడం, పైగా అంత బాగా వేయడం చూసిన మాష్టారుకి అసలు సంగతి అర్థమైంది. స్టాప్ రూమ్‌లో ఇది ఓ చర్చనీయాంశమైందని ఆ తర్వాత తెలిసింది. మిగతా సబ్జెక్ట్స్ మాష్టార్లు చూసిచూడనట్లు సంతకాలు చేసేశారు.

అలా రికార్డ్‌ల గండం గడిచింది. అయితే ట్రేసింగ్ విషయం స్టాప్ రూమ్‌తో ఆగలేదు. కాలేజీ అంతా పాకిపోయింది.. దీంతో కాలేజీలో మా రికార్డుల బాగోతం టపాకాయల్లా మోత మోగాయి. ఇదంతా ఇప్పుడు తలచుకుంటే నవ్వు వస్తుంది.

రికార్డులు సమయానికి పూర్తి చేయలేక నేనూ పార్థా పడిన టెన్షన్ అంతా ఇంతా కాదు. చివరకు ట్రేసింగ్ టెక్నిక్‌తో తొలిగిపోయింది. అయినప్పటికీ ఆ టెన్షన్ ఎక్కడో ఇప్పటికీ మెదడులో పాతుకుపోయినట్లే ఉంది. లేకపోతే, అప్పుడప్పుడు కలలో రికార్డు బుక్స్ ఎందుకు వస్తాయి?

అలా రికార్డ్ బుక్స్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్న ఆ రోజుల్లోనే మా ఫ్రెండొకడు గిన్నిస్ బుక్ గురించి చెప్పాడు. దీంతో నా ఆలోచనలు అటు మళ్లాయి. ఎప్పటికైనా గిన్నిస్ బుక్‌లో రికార్డ్ నమోదు అయ్యేలా చూడాలనుకున్నాను. అయితే ఇంత వరకు ఆ కోరిక తీరలేదు. గిన్నిస్ బుక్ అనగానే నాకో విషయం గుర్తుకు వస్తున్నది. మా అబ్బాయి (రాజేష్)కి ఐదారేళ్లప్పుడు దీని గురించి చెబుతూ, ‘అదో బుక్ రా దాంట్లో పేరు ఎక్కితే చాలా గొప్ప’ అని చెప్పాను. అప్పుడు వాడో గమ్మత్తు చేశాడు. ఇంట్లో ఉన్న గిన్నె తీసుకు వచ్చి, దాని మీద బుక్ పెట్టాడు. ఆ బుక్ మీద ఓ తెల్లకాగితం ఉంచాడు. ఆ కాగితం మీద రాజేష్ అని వ్రాశాడు. ‘ఏమిట్రా ఇది?’ అని వాళ్ళ అమ్మ అడిగితే, ‘ఇది గిన్నె, అది బుక్. ఇదిగో నా పేరు.. అంటే గిన్నిస్ బుక్ లోకి ఎక్కేశా’ అంటూ తెగ సంబరపడ్డాడు. అలాగే ఓ సారి మా మామగారు (మన్నవ గిరిధర రావు గారు) ఇంటికి వచ్చినప్పుడు మా వాడు ఇంగ్లీష్ అక్షరాల గురించి చెబుతూ, ‘తాతా, ఇది ఐ అంటూ ములక్కాడ ముక్కనీ, ఇదేమో ఓ’ అంటూ టమోటాని చూపించాడు. వీడి తెలివితేటలకు తాతగారు మురిసిపోయారు. ఆ తర్వాత చాలాకాలానికి నేను నా మనవళ్ల తెలివితేటలు చూస్తూ ఇప్పటికే అనేక సార్లు మురిసిపోయాను.

తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్:

గిన్నిస్ బుక్ ఎక్కాలన్న ఆ కోరిక తీరలేదు కానీ, తరంగా ఆన్‌లైన్ రేడియో స్టేషన్‌లో నేను ప్రోగ్రామ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నప్పుడు భారతీయ సినిమాకు వందేళ్ల సందర్భంగా వంద గంటల పాటు నిరంతరాయంగా వంద కార్యక్రమాలు ప్రసారం చేశాము. ఈ వినూత్న ప్రయోగానికి గుర్తింపుగా మెగా ఈవెంట్‌గా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ లోకి ఎక్కింది. అప్పుడు నాకెంతో సంతేషమేసింది.

మా చైర్మన్ మోహన్ వెలిగండ్ల (అమెరికా) గారి ఆలోచనను అందుకుని చక్కటి టీమ్ వర్క్‌తో వంద గంటలపాటు వివిధ కార్యక్రమాలను ప్రసారం చేశాము. ముందుగా – తొలి మూకీ చిత్రం భక్త ప్రహ్లాద మీద. రెంటాల జయదేవ్ గారిని స్టూడియోకి పిలిపించి కార్యక్రమం ప్రసారం చేశాము. దాదాపు రెండు రోజుల పాటు రేయనకా, పగలనకా స్టూడియోలేనే ఉండిపోయాను. రాత్రి పూట కార్యక్రమాలను అమెరికా నుంచి సిహెచ్ శ్రీనివాస్ గారు పర్యవేక్షించారు. పగటి పూట నేను ఆ బాధ్యత తీసుకునేవాడ్ని. దీనితో పాటు మెగా ఈవెంట్ సక్సెస్ అయ్యేలా చూసే బాధ్యత నాదే కావడంతో శుభం కార్డ్ పడేదాకా కంటిమీద కునుకు లేదు. అందరి సమిష్టి కృషి ఫలితమే ఈ రికార్డ్. దీంతో పడిన కష్టం మరచిపోయాను. అందిన అవార్డులు, ప్రశంసలు నాకూ, నా టీమ్‌కు అమితానందాన్ని కలిగించాయి. ఇదో స్ఫూర్తిగా నిలిచింది. వంద గంటల పాటు ప్రసారం అయ్యాక 101వ గంటగా అభినందనల కార్యక్రమం నిర్వహించాము. ఆ కార్యక్రమానికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ ప్రతినిధి వచ్చి ఆ రికార్డ్‌ని లైవ్‌లో చదివి వినిపించారు. ఆ సంఘటన ఎప్పుడు తలుచుకున్నా ఆనందం వేస్తునే ఉంటుంది.

వయసు మీద పడుతోంది. ఓపిక తగ్గిపోతున్నది. ఆలోచనలు మందగిస్తునాయి. అలాంటప్పుడు పాత జ్ఞాపకాల పుస్తకం తెరిచి చూస్తే నూతనోత్సాహం వస్తుంది. మన మీద మనకు విశ్వాసం కలుగుతుంది. చేతనైన పనులు చేపట్టి సంతోషంగా ముందుకు నడవడానికి సరిపడా ‘టానిక్’ అందుబాటులోకి వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. అందుకే ఈ విశేషాలు మీతో పంచుకున్నాను.

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version