[తుర్లపాటి నాగభూషణ రావు గారి ‘తుర్లపాటి జీవన సాఫల్య యాత్ర’ అనే రచనని పాఠకులకు అందిస్తున్నాము.]
మంచులో ముచ్చెమటలు:
వ్యాపార కిటుకులు తెలియకుండా దిగితే ఊబిలోకి కూరుకుపోయినట్లే. రూపాయిని అలవోకగా ఖర్చుపెట్టే వానికి ఆ రూపాయి నుంచి మరో రూపాయి సంపాదించడం ఎప్పటికీ తెలియదు. రూపాయిలో వంద పైసలున్నాయన్న స్పృహలేని వాడు బిజినెస్‌కి పనికి రాడని ఎక్కడో చదివాను. నా జీవితంలో ‘వ్యాపారం’ చుట్టూ తిరిగిన సంఘటనలు ఈ భాగం రచనలో ప్రస్తావిస్తున్నాను. ‘వ్యాపారం’ – అసలు ఈ పదం వినబడితే చాలు చమటలు పట్టేస్తాయి. ‘మంచులో ముచ్చెమటలు’ – సంఘటన కళ్లముందు కనబడుతుంటుంది.
కాలేజీలో చదువుకునే రోజుల్లోనే ఓ రోజున నా ఫ్రెండ్ విష్ణు పరుగులాంటి నడకతో వచ్చి, ‘ఒరేయ్ నీతో ముఖ్య విషయం మాట్లాడాలిరా..’ అన్నాడు.
ఇలా వాడు ముఖ్యవిషయం అన్నాడంటే ఏదో ఒక ప్రయోగానికి సిద్ధమయ్యాడనే అర్థం. వాడి ప్రయోగాలు కొన్ని సాంకేతిక పరమైనవి కాగా, మరి కొన్నేమో ఆర్థికపరమైనవి. అది, ఏదైనా సీరియస్‌గా మాట్లాడాలనుకుంటే మాత్రం మేమిద్దరం, నందిగామ – చందర్లపాడు రోడ్డులో నాగార్జున సాగర్ కాలువ గట్టు మీదకు వెళ్ళాల్సిందే. నందిగామలో పంట పొలాలు సాగర్ కొసభూముల క్రింద ఉన్నాయి. సాగర్ కాలువ నీళ్లు ఈ కొసభూములను ఎక్కువ కాలం తడపలేదు. కాలవలు త్రవ్వడానికి పెట్టిన ఖర్చు నీళ్లపాలైంది. అంతే.. దీంతో కాలవలు పూడుకుపోయాయి. ఇప్పుడైతే ఆ గట్టు కూడా లేదు. ఆ రోజుల్లో ఈ కాలువ మా కాలేజీ వెనుకవైపున ఆనుకునే వెళుతుండేది. దీంతో ఈ కాలువ గట్టు మీద చేరి బోలెడు కబుర్లు చెప్పుకోవడాలూ, లంచ్ బాక్స్‌లు తెరిచి చెట్ల క్రింద కూర్చుని తినడాలు వంటివి జరిగిపోతుండేవి. అలా సీరియస్ మేటర్ మాట్లాడుకోవాలంటే మాకున్న రెండు స్థలాల్లో ఈ కాలువ గట్టు ఒకటైతే, మరొకటి ఏటి ఒడ్డు. ఈ విషయం ‘రికార్డుల మోత’ భాగంలో చెప్పాను కదా.
‘సరే రా’ అన్నాను. వాడితో బయలుదేరాను. గాంధీ బొమ్మ దాటగానే వాడేమో నిప్పుల్లో కాల్చిన మొక్కజొన్న పొత్తులు ఓ నాలుగు కొన్నాడు. వీటితో పాటుగా ఉడకబెట్టిన వేరుశనగ కాయల ప్యాకెట్లు రెండు తీసుకున్నాడు. అంటే, దీని అర్థం – కనీసం ఓ గంట సేపు వాడు నాతో ఏదో చెప్పబోతున్నాడన్న మాట. లేకపోతే ఇంతగా చిరుతిళ్లు ఎందుకు? పరిస్థితి అర్థమైంది. ‘మిత్ర ధర్మం’ పాటిస్తూ వాడి వెంట నడిచాను.
వాడి బుర్ర నిండా బోలెడు ఆలోచనలు. అవి తెగ చిరాకు పెట్టినప్పుడల్లా బయటకు వెల్లగక్కడానికంటూ నా లాంటి మిత్రుడు ఒకడు ఉండాలి కదా. వినడమే కాదు, వాడి ఆలోచనలు కార్యరూపం దాల్చడంలోనూ నేను పాత్ర పోషించాల్సి వచ్చేది. బహుశా అలా జరిగి ఉండకపోతే ఇప్పుడు ఈ సంఘటన గురించి ప్రస్తావించాల్సిన అవసరమే ఉండేది కాదు.
‘మనం కూడా డయిరీ పెడదాం రా’ – ఈ మాటలు వినగానే నేను ఉలిక్కి పడ్డాను. నోట్లో వేసుకున్న మొక్కజొన్న గింజలు, ఉలికిపాటు తెచ్చిన టెన్షన్‌కి అప్రయత్నంగా బయటకు జంప్ చేశాయి.
‘ఏంటీ!! డయిరీ ఫాం పెడదామా..’
‘అవున్రా. నీవు విన్నది నిజమే’
‘ఎలారా.. ఎలా పెడతాం?’ – డౌట్.
‘సింపుల్ రా.. – అడవిరావులపాడులో మీ ఇల్లుంది కదా..’
అంతే, నాకు సగం కథ అర్థమైంది. అడవిరావులపాడు గురించి వాడికి బాగా తెలుసు. అంతకు ముందు, కొన్నేళ్ల వరకు ఆ ఊర్లో మాకు పాడి-పంట ఉండేవి. ఇంటి చుట్టూ విశాలమైన ఆవరణ ఉండేది. పశువుల కోసం పెద్ద కొష్ఠమూ ఉండేది. వ్యవసాయం ఎత్తేశాక, ఆ పురాతాన ఇంటిని అద్దెకు ఇచ్చేశారు. అద్దెకు దిగిన వాడు ఏదో ఒకటి రెండు గేదలు పెంచుకుంటూ పాలవ్యాపారం చేసుకుంటున్నాడు. ఈ విషయమూ వాడికి తెలుసు. ఆ రోజల్లో సైకిళ్ల మీద రయ్యిరయ్యిన నందిగామ – అడవిరావులపాడు మధ్య షటిల్ సర్వీస్ చేస్తుండే వాళ్లం. అదో ఆనందం మాకు.
వాడు చెప్పుకు పోతున్నాడు..
‘సింపుల్ రా, మీ కొష్ఠం ఖాళీగానే ఉంది కదా. ఇక కావలసినందల్లా చక్కటి పాలిచ్చే ఆవులు. అవి ఎక్కడ దొరుకుతాయో నాకు తెలుసు. వాటిని కొనేద్దాం’
డయిరీ పెట్టడం ఎంతో సులువు అన్నట్లుగా ఉన్నాయి వాడి మాటలు. వ్యాపారంలో కష్టనష్టాలు తెలియని వయసు అది. ఆలోచనకీ ఆచరణకీ మధ్య ఆట్టే వ్యవధి ఉండకూడదన్న సిద్ధాంతం వాడిది.
నాలో ఉత్సాహం పుట్టుకొచ్చింది. ఇందుకు ముఖ్య కారణం, నాకు ఆవులన్నా, దూడలన్నా బోలెడు ఇష్టం ఉండటమే. వాటితో నాకున్న మధుర స్మృతులే. (ఇలాంటివి ఇప్పటికే అనేక సందర్భాల్లో నా యీ రచనలో ప్రస్తావించాను) ఈ బలహీనతే ఉత్సాహంగా మారి వాడి ‘ప్రాజెక్ట్ -5’ కి సపోర్ట్ చేయడానికి సిద్ధమయ్యాను. ప్రాజెక్ట్ 5 అని ఎందుకు అన్నానంటే వీడిలో బిజినెస్ ఆలోచనలు రావడం, నాతో చెప్పడం, నేను వాడికి సహకరించడం, బోల్తా కొట్టడం అప్పటికే నాలుగు సార్లు జరిగాయన్న మాట.
‘ఎమర్జెన్సీ లైట్ల’ కాంతిలో..:
ఓసారి విష్ణు తనకున్న సాంకేతిక జ్ఞానంతో ఎమర్జెన్సీ లైట్లు తయారు చేశాడు. వాడింట్లో ఒకటి, మా ఇంట్లో ఒకటి పెట్టాడు. నందిగామలో కరెంట్ పోతే ఒక పట్టాన వచ్చేది కాదు. ఊర్లోని వాళ్లు కరెంట్ కష్టాలతో సతమత మవుతున్న రోజులవి. ఒక్క నందిగామే కాదులేండి, అనేక చిన్నచిన్న పట్టణాల్లో పరిస్థతి ఇంతే. ఇక పల్లెటూర్ల సంగతి చెప్పనే అక్కర్లేదు. నందిగామలో షాపుల వాళ్లు కరెంట్ పోయినప్పుడల్లా బాగా ఇబ్బందులు పడేవారు. అలాంటప్పుడే ఎమర్జెన్సీ లైట్లు ఉన్నాయన్న సంగతి ఊర్లో కొంత మందికి తెలిసింది. విజయవాడ వెళ్ళి బాగా ఖరీదు పెట్టి వాటిని కొనుక్కొచ్చారు. ఈ విషయాలన్నీ మాకు తెలుసు. అయితే ఈ సమస్యకు పరిష్కారం కనుక్కోవాలన్న ఆలోచన మాత్రం విష్ణు గాడికే వచ్చింది. తక్కువ ధరకు ఎమర్జెన్సీ లైట్లు ఇవ్వగలిగితే బాగుంటుందన్నది వాడి ఆలోచన.
విజయవాడ నుంచి కొనుక్కొచ్చిన ఎమర్జెన్సీ లైట్లేమో కొన్ని మొరాయించేవి. పాడైతే బాగు చేసేవాడు నందిగామలో లేడు. దీంతో కొన్న కొద్ది రోజులకే అవి కాస్తా అటకెక్కేవి. ఈ గడ్డు పరిస్థితులను చక్కబెడుతూ, తక్కువ ధరకే ఇవ్వడం కాకుండా పాడైతే బాగు చేసే వాళ్ళు మన ఊర్లోనే ఉంటే ఎంత ఊరటగా ఉంటుందో ..అన్న ఆలోచన వాడిని నిమిషం ఖాళీగా ఉంచలేదు. ఓ రోజున ఎమర్జెన్సీ లైట్ తయారు చేసి నాకు చూపించాడు. దాని ఖరీదు మార్కెట్ దానికంటే సగం కూడా ఉండదని చెప్పాడు. అయితే వాడెంతగా చెప్పినా నందిగామలో ఈ చీప్ సరుకు కొనడానికి పెద్దగా ఎవ్వరూ ఇంటరెస్ట్ చూపలేదు. పైగా, ఏదో మోసం ఉందనీ, లేకపోతే ఇంత చవకగా ఎలా ఇస్తాడన్న పుకారు వ్యాపించింది. దీంతో తన ప్రాడక్ట్ ప్రచారానికి ఓ నాలుగు ఎమర్జెన్సీ లైట్లు తీసుకుని గుడివాడకు బయలుదేరాడు. గుడివాడనే ఎందుకు ఎంచుకున్నాడో నాకు అప్పుడు తెలియలేదు. నిజానికి ఇప్పటికి కూడా తెలియదు. అలా బయలుదేరుతూ పిల్లిని (అదేనండి నన్ను) చంకన పెట్టుకుని వెళ్ళాడు. నా ఆరోగ్యం అంతంత మాత్రం. తరచూ జలుబు చేస్తుండేది. పైగా ఎండల్లో ఎక్కువ సేపు తిరగలేను. మనకు ఎండ పడదు. అలా అని వానా పడదు. చలి సంగతి చెప్పనే అక్కర్లేదు. అలాంటి నన్ను వ్యాపార ప్రచారానికి తీసుకువెళ్లడం వాడు చేసిన అతి పెద్ద సాహసం.
అది ఎండాకాలం. అప్పుడే కదా మరి కరెంట్ తరచుగా పోయేది. ఎమర్జెన్సీ లైట్ల అమ్మకానికి అదే కదా సీజన్. అందుకే మండే మే నెలలో గుడివాడ ముహూర్తం పెట్టాడు వాడు. బస్సు ఎక్కి వెళుతుంటేనే వడగాలి దంచి కొడుతోంది. గుడివాడలో దిగి ఓ రెండు బజార్లు తిరిగామో లేదో నా ముఖం మాడిపోయింది. చమటలు కారిపోవడంతో స్పృహ తప్పే పరిస్థితి వచ్చేసింది. అదే వాడితో చెబితే నన్ను నీడపెట్టున కూర్చోబెట్టి గోళీ షోడా కొట్టించి ఇచ్చాడు. అయినా తేరుకోలేదు. పైగా కళ్లు తిరుగుతున్నాయి. దీంతో వాడు ఆలోచనలో పడ్డాడు. వెంటనే వాకబు చేసి ఓ లాడ్జిలో రూమ్ తీసుకున్నాడు. వాడిలోని ‘క్రైసెస్ మేనేజ్మెంట్’ లక్షణాన్ని అప్పట్లో గుర్తించలేదు కానీ, ఇప్పుడనిపిస్తోంది, వాడు ఓ మాంచి కంపెనీకి సీఈఓ కావాల్సిన వాడని. సరే, రూమ్‌లో ఫ్యాన్ క్రింద కాసేపు పడుకున్నాక, కొబ్బరి నీళ్లు త్రాగాక కాస్త నెమ్మదించింది. అప్పుడు అనుకున్నా, నా వల్ల వీడికెన్ని కష్టాలు వచ్చాయో కదా.. అని. అంతే కాదు, నిజమైన మిత్రుడు ఎలా రక్షిస్తాడో కూడా మరోసారి తెలుసుకున్నాను. నేను లాడ్జి రూమ్‌లో ఉంటే, వాడేమో వ్యాపార ప్రచారం కోసం షాపుల వాళ్లతో మాట్లాడి నాలుగు ఎమర్జెన్సీ లైట్లను బుక్ చేసుకొచ్చాడు.
ఓ గంట గడిచాక నేను మామూలు మనిషిని అయ్యాను. తిరుగు ప్రయాణమయ్యాము. లాడ్జి వాడు గంటల లెక్కన రూమ్‌లు ఇవ్వడు కదా. రోజు అద్దే తీసుకున్నట్లున్నాడు.
‘నాలుగు ఆర్డర్ల వల్ల ఎంత లాభం వస్తుందిరా..’ అని అడిగాను. వాడేమో లెక్క గట్టి చెప్పాడు. అప్పుడు నాకో విషయం అర్థమైంది. లాభం కంటే లాడ్జి బిల్లు ఎక్కువైందని. లాభమా? నష్టమా?? ఎంత శాతం? వంటి లెక్కలు మన బుర్రకు ఎక్కలేదు కనుక బస్సులో తిరిగి వస్తూ.. ‘గుడివాడ వెళ్ళాను..’ అంటూ హమ్ చేస్తూ నందిగామ చేరాను. మనతో పెట్టుకుంటే ఇట్లాగే ఉంటుంది మరి.
తెరుచుకోని తలుపు:
అలాంటి నన్ను కలుపుకుని మరో ప్రయోగానికి దిగడం చూస్తుంటే వాడిలోని వ్యాపారస్థుడి లక్షణం మీదనే నాకు పెద్ద డౌట్ వచ్చేసింది.
విష్ణు చెప్పుకుపోతున్నాడు. డయిరీ ఫాం పెట్టాలంటే మనం ఇప్పటికే రన్నింగ్ లో ఉన్న డయిరీని ఓ సారి చూసి రావాలన్నాడు. అందుకూ వాడో ప్లాన్ గీశాడు. సంగం డయిరీలో పనిచేసే ఓ కుర్రాడు మా ఊర్లోనే ఉన్నాడు. వాడి సాయం తీసుకుని సంగం బయలుదేరాము. అది ఎండాకాలం కాదు. కనుక నేనూ హ్యాపీగా వాడిని అనుసరించాను.
సంగం డయిరీ ఫాం లో పాలు నిలవ చేసే పద్ధతి చూసి నాకెంతో ఆశ్చర్యమేసింది. కూలింగ్ గదుల్లో పాలను, పాల ఉత్పత్తులను నిలవ చేయడానికి పెద్ద గదే ఉంది. ఆ గది తలుపు చాలా మందంగా (ఐదారు అంగుళాల మందం) ఉంది. తలుపుకి తగ్గట్లుగానే దాని తాళం చెవి కూడా విచిత్రంగానే ఉంది. అదేదో గూఢచారి సినిమాలో విలన్ గాడి డెన్‌లో తలుపు తెరవడానికి వాడే తాళం చెవిలాగానే లాగానే ఉంది ఇది కూడానూ. ఓ సన్నటి పొడవాటి ఇనుప కడ్డీనే తాళం చెవి అని చెప్పాడు నందిగామ కుర్రాడు. ఆ కడ్డీని తలుపు రంధ్రంలో దూర్చి ఓ పద్ధతి ప్రకారం తిప్పితే తలుపు తెరుచుకుంటుందని చెబుతూ తలుపు తీశాడు. ‘అబ్బో వీడికి ఎన్ని తెలుసో’ అని మేమిద్దరం ఆశ్చర్యపోయాము. తలుపు తెరుచుకోగానే ఎవరో వాడిని పిలవడం, వాడేమో ‘ఇప్పుడే వస్తాన్రా.. మీరు లోపలకు వెళ్ళి చూడండి’ అంటూ తుర్రుమన్నాడు. తలుపు పూర్తిగా తెరుచుకోవడంతో లోపలి నుంచి చల్లటి గాలి ఈడ్చి ముఖం మీద తన్నినట్లు వీస్తున్నది. ఈ చల్లటి గాలి మొదట్లో ఆనందం కలిగించినా ఆ తర్వాత తెగ భయపెట్టింది. ఎంతగా అంటే మంచులో ముచ్చెమటలు పోసేటంతగా.
మేము లోపలకు అడుగు పెట్టగానే తలుపు మూసుకు పోయింది. మేము పెద్దగా పట్టించుకోలేదు. లోపల కూలింగ్ ఎఫెక్ట్ పద్ధతులను, పరికరాలను ఆశ్చర్యంగా, పరిశీలనగా చూస్తున్నాము. ‘మనం కూడా ఇలాంటి డయిరీ పెట్టాల్రా’ అంటూ మా వాడేమో చెప్పుకుపోతున్నాడు. నేనూ మొదట్లో ఉత్సాహంగా వింటున్నా, నెమ్మది నెమ్మదిగా ఆ చలికి గజగజా వణకి పోవడం మొదలెట్టాను. కాసేపటికి వాడి పరిస్థితి అంతే. నందిగామ కుర్రాడు రాలేదు. సరే, బయటకు వెళ్ళిపోదాం అనుకున్నాము. తలుపు తీయడం కుదరలేదు. ఎందుకంటే తలుపు ఆటోమాటిక్‌గా లాక్ అయింది. దాన్ని తెరవడానికి ఆ కుర్రాడు వాడిన ఇనుప కడ్డీ ఏమో బయటనే ఉండిపోయింది. అంతే పరిస్థితి అర్థమైంది. వాడు వచ్చి తలుపు తెరిస్తేనే మేము బయటపడేది. లేకపోతే..
తలుచుకుంటేనే భయం వేస్తున్నది. ఆ భయం చెమట రూపంలో కారిపోతున్నది. కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. వాడేమో తలుపు లాగి తెరవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈలోగా నాకు ఆ ప్రక్కనే స్విచ్ బోర్డు కనిపించింది. ప్రతి స్విచ్ కి పైన ఓ రంగు బల్బు వెలుగుతోంది. ఇలా నాలుగైదు స్విచ్చులు, వాటి మీద రకరకాల రంగుల్లో లైట్లు వెలుగుతుండటం గమనించాను. ఇలాంటి దృశ్యాలు కూడా నేను గూఢచారి సినిమాల్లో చూశాను కదా. అంత చల్లదనంలోనూ బుర్రలో ఏదో మూల మెరుపు మెరిసింది. అంతే ఆ స్విచ్ బోర్డ్ దగ్గరకు వెళ్ళి రంగురంగు బల్బులకు దిగువనే ఉన్న స్విచ్‌లు నొక్కడం మొదలుపెట్టాను. ఆశ్చర్యం!! అందులో ఒక స్విచ్ నొక్కగానే తలుపు తెరుచుకుంది. విష్ణు గాడు తలుపు లాగుడు పని ఆపక పోవడంతో ఉన్నట్లుండి తలుపు తెరుచుకోవడం వాడూ ఆశ్చర్యపోయాడు. నా వైపు మెచ్చుకోలుగా చూసి బయటకు లాక్కెళ్ళాడు. అప్పుడొచ్చాడు నందిగామ కుర్రాడు. విషయం చెబితే, ‘పెద్ద గండం తప్పింది లేరా, ఇక వెళ్లండి’ అంటూ సాగనంపాడు.
ఇప్పటికీ ఈ సంఘటన తలుచుకుంటే ముచ్చెమటలు పట్టడం మా ఇద్దరికీ మామూలే. మొన్నీ మధ్యనే వాడితో ఫోన్లో మాట్లాడుతుంటే ఈ సంఘటన గుర్తు చేశాడు.
ఇంత జరిగినా వాడు తన ప్రయత్నం మానలేదు. డయిరీ పెట్టాలన్న వాడి ఆలోచన స్ట్రాంగ్ గానే ఉంది. అడవిరావులపాడుకి వెళ్ళి ఆవులను కట్టేయడానికి, వాటికి మేత సమకూర్చడానికి కావలసిన ఏర్పాట్లు చేయాలనుకున్నాము. పెద్దపెద్ద బొంగులు, తాటాకులు వంటివి ఆర్డర్ ఇచ్చాడు. కొని తీసుకువచ్చే ముప్పయి ఆవులకు ఉన్న కొష్ఠం చాలదనీ, దాన్ని పెంచాలన్నది వాడి ఆలోచన. ప్రాజెక్ట్ ప్రారంభించకుండానే extension అన్న మాట. ఏమిటో.. వాడి స్పీడ్ నాకు అర్థం కాలేదు. సరిగా అప్పుడే ఇంట్లో వాళ్ళకు తెలిసి బ్రేక్ మీద బ్రేక్‌లు వేశారు. ‘ప్రాజెక్ట్ 5’ అటకెక్కింది. ఓ వ్యాపారి ‘ఇథనాల్’ ఇంధనం లాగా ఆవిరైపోయాడు.
వ్యాపారం మొదలు పెట్టాలంటే డబ్బు కావాలి. ఆ పైన ఇంట్లో వాళ్ల సపోర్ట్ కావాలి. ఈ రెంటి కన్నా ముఖ్యమైనది వ్యాపారం చేసే లక్షణం ఉండాలి. ఇవేవీ లేకుండా వ్యాపారమంటూ దిగడం చేతులు కాల్చుకోవడం మా లాగానే చాలా మంది చేస్తుంటారు. ఆర్థిక అవసరం వచ్చిందని వ్యాపారంలోకి దిగకూడదు. వ్యాపారంతో అవసరాలు తీర్చుకోవాలన్న ఆర్థిక సూత్రం మాకు ఎవరు చెబుతారు? ఒక వేళ చెప్పినా మేము వినం కదా.
వ్యాపార వాసన:
నందిగామలో ఇల్లు మెయిన్ రోడ్డుకు దగ్గరే. విష్ణు గాడిదైతే మెయిన్ రోడ్ మీదనే. దీంతో రోజూ వ్యాపారస్థులతోనూ వారి పిల్లలతోనూ బాగానే పరిచయాలు ఉండేవి. వైశ్యులే ఎక్కువగా వ్యాపారస్థులుగా మెయిన్ బజార్లో చలమణి అవుతున్నారు. ఈ పరిస్థితి ఇప్పటికీ మారలేదనుకోండి. అయితే, వ్యాపారం వారే చేస్తున్న ఆ రోజుల్లో ఎక్కువగా షాప్ ఓనర్లు, ఆ ఇంటి జాగా వాళ్లు మాత్రం ఎక్కువగా బ్రాహ్మణ కుటుంబాల వారే. దీంతో వైశ్యులకీ బ్రాహ్మణులకి చక్కటి సంబంధాలే ఉండేవి. ఇప్పటికీ అలాగే ఉన్నా, బ్రాహ్మణ కుటుంబాల్లో చాలా మంది తమ ఇంటి స్థలాలను అమ్మేసుకోవడంతో పరిస్థితి మారుతోంది. ఇప్పుడు వైశ్యులే ఆ స్థలాలకు షాపులకు ఓనర్లుగా ఉంటూ ఆర్థికంగా బలపడ్డారు. మారుతున్న కాలానికి తగ్గట్లుగానే పెంకుటిళ్ల స్థానంలో డాబాలు వెలిశాయి. ఇప్పుడు రోజూ కోట్ల రూపాయల వ్యాపారం మెయిన్ బజార్లో నడుస్తోంది.
నాకు వ్యాపారుల పిల్లలతో స్నేహం ఉన్నప్పటికీ వారి ‘వ్యాపార వాసన’ మాత్రం ఒంట బట్టలేదు. డబ్బులు ఖర్చు పెట్టడంలో నాది మా నాన్నగారి పోలికే. జేబులో డబ్బులు ఉంటే మాత్రం సాయం చేసే తత్వం వారి నుంచే అబ్బంది. నాన్నగారి దగ్గరకు ఎవరైనా వస్తే, ఒట్టి చేతులతో పోనిచ్చే వారు కారు. అలా అని విచ్చలవిడిగా దానాలు చేసేటంతటి సంపాదన లేదనుకోండి. కాకపోతే ఉన్నంతలో స్థాయికి తగ్గట్లు దాన ధర్మాలు చేసేవారు. నేను పుట్టిన ఊరు (అడవిరావులపాడు) నుంచి ఓ సారి కొంత మంది వచ్చారు. ఊర్లో చర్చ్ కడుతున్నామనీ, తమ వంతు సాయం చేయమని నాన్నగారికి వారు విన్నవించారు. వెంటనే నాన్నగారు జేబులో ఉన్న డబ్బు తీసి వారికి ఇచ్చారు. అది అక్షరాలా రెండు వందల రూపాయలు. ఆ రోజుల్లో (1970 తొలినాళ్లలో) ఇది తక్కువ ఎమౌంట్ ఏమీ కాదు. అయితే ఇక్కడ నేను గమనించింది, డబ్బు ఎంత ఇచ్చారని కాదు. తమ మతం కాని వారు వచ్చి ప్రార్థనా మందిరం కట్టుకుంటానంటే చందా ఇవ్వడానికి అందునా జేబులో ఉన్నదంతా ఇవ్వడానికి ఎంత గొప్ప మనసు ఉండాలి. అదే నన్ను అబ్బురపరచింది. ఆ సమయంలో నాన్న ఓ ధర్మదాతగా కనిపించారు. ఈ లక్షణం వల్లనే నాన్నగారికి మంచి పేరు వచ్చింది. అందుకే ఇప్పటికీ నేను మా ఊరు వెళితే – ‘మల్లేశం గారి అబ్బాయి’ అనే అంటుంటారు. మా నాన్నగారిని ఊర్లో మల్లేశం గారనే అంటారు. దొరగారు అని కూడా పిలుస్తారు. వారి అబ్బాయి అయిన నన్ను చిన్నబ్బాయి గారు అని ఇప్పటికీ కొందరు పిలుస్తుంటారు. అగ్రహారాలు పోయినా, దొరతనం ఛాయలు లేకపోయినా ఆనాడు మేమందుకున్న గౌరవంలో ఆవగింజతైనా ఇంకా మిగిలి ఉన్నంది కనుకనే ఇప్పటికీ వీలు చిక్కినప్పుడల్లా నేను మా ఊరు వెళుతుంటాను. ఈ మధ్య అక్కడి శివాలయంతో ఆధ్యాత్మిక బంధం ఏర్పడింది. ఇప్పటికే కార్తీక మాసంలో లక్షపత్రి పూజ, పార్వతీ కల్యాణం వంటి కార్యక్రమాల్లో క్రమం తప్పకుండా పాల్గొంటున్నాను. ఇది నాలోని ఆధ్యాత్మిక శక్తిని పెంచుతోంది. ఏదో అద్భుత శక్తి నన్ను నడిపిస్తోందన్న భావన పెరగసాగింది. అందుకేనేమో ఆ ఊర్లోనే ఎలుక పిల్లలా పుట్టిన నేను ఇప్పుడిలా ‘జీవన రాగాలు’ పలికించగలుగుతున్నాను. సరే, ఆధ్యాత్మిక విశేషాలు మరో సారి ప్రస్తావిస్తాను.
స్నేహం – వ్యాపార కిటుకు:
వ్యాపారస్థుల పిల్లలతో స్నేహాలు ఉన్నా ఏనాడూ వారు వ్యాపార కిటుకులు మాత్రం చెప్పలేదు. ఇలా చెప్పకపోవడమన్నది – బహుశా బ్రాహ్మణ కుటుంబాల్లోని లక్షణాల్లాగానే, వైశ్యుల కుటుంబాల్లో ఇది అనువంశకంగా వస్తున్న లక్షణమేమో. ఏమో.. వీళ్లు ఎంతైనా మాట్లాడతారు, కానీ వ్యాపారం ఎలా చేస్తున్నారని అడిగితే మాత్రం – ‘ఏదో పది పైసల లాభం అంతే..’ అంటూ తప్పించేస్తారు.
చందమామ కథ:
ఓసారి చందమామలో ఓ కథ చదివాను. అందులో వ్యాపార కిటుకు గురించి రచయిత బలేగా రాశాడు.
ఒక వ్యాపారి తన పిల్లలకు వ్యాపార లక్షణాలు నేర్పాలని ఓసారి ఇద్దరినీ పిలిచి చెరో 50 పైసలు ఇచ్చాడు. పెద్దవాడేమో ఆ 50 పైసలు తీసుకుని కిళ్ళీలు కట్టే వాడి దగ్గర నుంచి రెండు కిల్లీలు కొన్నాడు. వాటిని మరో బజారుకి వెళ్ళి ఒక్కొక్కటి 30 పైసల చొప్పున అమ్మాడు. ఇతగాడికి ఆ రెండు కిల్లాల అమ్మకం వల్ల పది పైసలు లాభం వచ్చింది. వాడు సంతోషంగా నాన్న దగ్గరకు వెళ్ళి లాభం సంగతి చెప్పాడు. ఇక రెండో వాడు తమల పాకులు, వక్క, సున్నం వంటి ముడి సరుకుని కొని ఓ పది కిల్లీలు తయారు చేసి అన్న అమ్మిన బజారులోనే ఒక్కొక్కటి 30 పైసల చొప్పునే అమ్మి లాభం తీసుకొచ్చి నాన్నకి చూపించాడు. ఎక్కువ లాభం తీసుకువచ్చిన చిన్న కొడుకుకే తండ్రి తన వ్యాపారం అప్పగించి, ‘ఇదిరా వ్యాపార లక్షణమంటే’ అని పెద్దోడికి క్లాస్ పీకాడు.
ఇలాంటి కిటుకులు తెలియకుండా, అసలు వ్యాపారం పట్ల పెద్దగా ఆసక్తి లేకపోయినా అందులోకి దిగితే బ్యాంక్ బాలెన్స్ పడిపోవడం ఖాయం. లాభం మాట అటుంచితే పెట్టుబడి తిరిగి రాకపోవడంతో చేతులెత్తేసే పరిస్థితి వస్తుంది. బిజినెస్ చేసే వారంతా లక్షలు గడిస్తారన్నది కేవలం అపోహ మాత్రమే. బిజినెస్ చేస్తున్న వారంతా అంబానీలు కాలేరు. కడుపు నింపుకోవడానికీ కుటుంబాన్ని పోషించడానికి ఎంతో కష్టపడుతూ బిజినెస్ చేస్తున్న వారిని కూడా నేను చూశాను. జీవితంలో ఆటుపోటులున్నట్లే బిజినెస్ లోనూ ఉంటాయి. సక్సెస్ స్టోరీస్ కంటే ఫెయిల్యూర్ స్టోరీసే ఎక్కువ. అందుకే బిజినెస్ లోకి దిగే ముందు సక్సెస్ స్టోరీస్‌తో పాటుగా ఫెయిల్యూరైన వారి గురించి కూడా తెలుసుకోవాలి. ప్రతి విజయానికి బలమైన కారణాలు ఉన్నట్లే ప్రతి ఓటమికి అంతే స్థాయిలో కారణాలు ఉంటాయి. ఒక ఆలోచన మనల్ని గెలుపు దారిలో తీసుకుపోవచ్చు, అలాగే ఓటమి అంచుకూ లాక్కెళ్లవచ్చు.
కలసిరాని వ్యాపారం:
నా జీవితంలో బిజినెస్ కలిసి రాలేదు. ఒకటి రెండు సార్లు చేసిన ప్రయత్నాలతో చేతులు బాగానే కాలాయి. బతుకు జీవుడా అంటూ ఒడ్డున పడ్డాను. ఓ సారి బంధువుల ప్రోత్సాహంతోనూ మరో సారి స్నేహితుల ప్రోద్భలంతోనూ పెట్టిన చిరు వ్యాపారాలు బోల్తా కొట్టాయి. అన్ని ఉద్యోగాలు మనకు సెట్ కానట్లే అన్ని రకాల వ్యాపారాలు మనకు లాభసాటిగా ఉండవన్న సత్యం తెలుసుకునే లోపే నష్టం ఆముదం ‘జిడ్డులా’ పట్టేసింది. దాన్ని వదిలించుకోవడానికి చాలానే కష్టపడాల్సి వచ్చింది. జీవితంలోని ప్రతి అడుగు మనల్ని సక్సెస్ వైపు తీసుకు వెళ్లదు. ముళ్లబాట కూడా తొక్కాల్సి వస్తుంది. అందుకే ఆత్రేయ ఇలా అన్నారు..
‘బతుకు పూల బాట కాదు,
అది పరవశించి పాడుకునే పాట కాదు..
దోబూచులాడుతుంది విధి మనతో,
దొంగాటలాడుతుంది మనసులతో,
కనిపించే నవ్వులన్నీ నవ్వులు కావు,
అవి బతుకు తెరువు కోసం పెదవులాడు కల్లలు’ –
ఈ పాట వింటున్నప్పుడల్లా నేను తొక్కిన తప్పుడు బాటలు గుర్తుకు వస్తుంటాయి. కష్టాలు వచ్చినప్పుడే దేవుడు గుర్తుకు వస్తాడు. మనిషిలో ఆధ్యాత్మిక చింతన మొగ్గ తొడుగుతుంది. అది మానసిక వికాసానికి దారితీస్తుంది. ఉన్నదానితో సంతృప్తి చెందడం అలవరుచుకుంటాము. ఇక్కడ కూడా ఆత్రేయ వ్రాసిన పై పాటలోని రెండవ చరణం గుర్తుచేసుకోవాల్సిందే..
‘చీకటిలో వెలుగును చూడనేర్చుకో..
చమటలో స్వర్గాన్ని సృష్టి చేసుకో,
విధి వ్రాసిన వ్రాతలకు విరుగుడొక్కటే,
పదిమందితోటి పంచుకునే రోజు వచ్చుటే, ఆ రోజు వచ్చులే’
నిజమే, ఆ రోజు వచ్చింది. అందుకే ఇదంతా మీకు చెప్పగలుగుతున్నాను.
(మళ్ళీ కలుద్దాం)
శీ తుర్లపాటి నాగభూషణ రావు రచయిత, సీనియర్ జర్నలిస్ట్. తెలుగు భాషాభిమాని. కృష్ణా జిల్లా (ప్రస్తుత ఎన్టీ ఆర్ జిల్లా) అడవి రావులపాడు గ్రామంలో 1957లో కనీసం కరెంట్ సౌకర్యం లేని పల్లెలో పుట్టి మిడిమిడి చదువులతోనే అంచలంచలుగా ఎదిగారు. 1980లో సైన్స్‌లో మాస్టర్ డిగ్రీ పొంది, అనంతరం జర్నలిజం పట్ల ఆకర్షితులై అనేక పత్రికలు, టివీ సంస్థల్లో వివిధ ఉన్నత హోదాల్లో పనిచేశారు. తెలుగు భాష పట్ల మక్కువతో వందలాదిగా విశిష్ట రచనలు చేసి పలువురి ప్రశంసలందుకున్నారు.
అదిగో హరివిల్లు (ఆకాశవాణి రూపకం), గంగ పుత్రుల వ్యథ, ఇస్లామిక్ కట్టడాలలో హిందూ శిల్ప శైలి (పరిశోధనాత్మక కథనం), గ్రామదేవతల పుట్టుక – సామాజిక అవసరాలు, క్రికెటానందం, నరుడే వోనరుడైతే (ఆకాశవాణి హాస్య నాటిక), సెలవుపెట్టి చూడు (ఆకాశవాణి హాస్య నాటిక), ఒక్క క్షణం (ఆకాశవాణి రూపకం), పంచతంత్రం (పంచ భూతాలు – పర్యావరణం), మంచి పాటలు – మనసులోని మాటలు, నిప్పు రవ్వ (డాక్యుమెంటరీ), బరువుల బాల్యం (ఆడపిల్లల వ్యథలు), బాలికలతో మరణమృదంగం, సూట్‌కేస్ (ఆంధ్రప్రభ కథ), తెలుగు భాషా పరిణామక్రమం – సోషల్ మీడియా పాత్ర (పరిశోధన పత్రం), చిదంబర రహస్యం – ఒక వినూత్న కోణం (పరిశోధనాత్మక రచన), భారత దేశ స్వాతంత్ర్యోద్యమం – తెలుగు తేజం పింగళి వెంకయ్య (పరిశోధన పత్రం), 90 ఏళ్ళ టాకీ: తెలుగు సినిమాకు పట్టాభిషేకం – ఒక పరిశీలన (రాబోయే రచన) ముఖ్యమైన రచనలు.
శ్రీ రామకృష్ణ పరమహంస , శ్రీ షిర్డీ సాయిబాబా, గిరీశం, శ్రీ రాఘవేంద్ర స్వామి – ఏకపాత్రలు రచించి, పాత్రలు పోషించారు.
ఓపెన్ హేమెర్ – చీకట్లో పరివర్తన – ప్రత్యేక కథనం.
40 ఏళ్ళుగా అనేక విశిష్ట రచనలు చేసి అనేక పురస్కారాలను, ప్రశంసలను అందుకున్న తుర్లపాటి అనన్య సేవలకు గుర్తింపుగా ఈ మధ్యనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీరిని తెలుగు భాషారత్న జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించింది.