[చైత్రశ్రీ గారు రచించిన ‘ఉచిత సలహా’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక – బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో సాధారణ ప్రచురణకి ఎంపికైన కథ.]
రామాలయం పక్కన రచ్చమీద కూర్చుని ఉన్న చెంగయ్య చెవికి మైకులో అరణ్య కాండలో బంగారు మాయలేడి పద్యాలు వినబడతా ఉండాయి. అయి ఇంటా ఇంటా కళ్ళుమూసి రామాయణం లోపలికి ఎల్లిపోయినాడు.
అప్పుడే రచ్చకాడికి వచ్చి “ఏంది మావా ఇశేషాలు” అన్నాడు మేనల్లుడు శీను.
“నా కాడ ఏముండాయి అబయా” అంటూ నీరసంగా మాట్లాడాడు చెంగయ్య.
“ఏంది మావా కత, అట్టా డల్లుగా ఉండావు”
“ఎట్టా ఉండాను రా.. మామూలుగానే ఉండానే”
“మైకులో ఇంకా అరణ్య కాండే వస్తా ఉండాది.. నువ్వేమో ఉత్తర కాండలో భూమాత ఒడిలోకి భూజాత ఘట్టం లోకి ఎల్లినట్టుగా ఉండావే”
“ఒరేయ్ శీనా ఉదయాన్నించి ఈడే కుచ్చోనుండా, ఒక్క నాయాలు గూడా ఏమి రా చెంగా అట్టా ఉండావు అని అడిగిన పాపాన బోలా. నువ్వు మాత్రం మావ మొకం జూసి సెకన్లో పట్టేస్తావ్” అని అల్లుడిని పొగిడాడు చెంగయ్య.
“పొగిడింది సాలు గాని అసలు నీ బాదేందో సెప్పవయ్యా సామీ” అని శీను అనడంతో చెంగయ్య “నాకా సదువు లేదు నీ అత్త ఎర్రిబాగుల్దయిపోయా. నా బిడ్డని ఏం సదువు సదివిచ్చాలో తెలవక ఒకటే ఆలోశన అయిపొయుండాదిరా. కంటి మీద కునుకే లేదు. ఎవుర్ని అడగమంటావో నువ్వైనా సెప్పు” అని తన గోడు సెప్పుకున్నాడు.
“నేను గూడా నీలాగే లోకగ్యానం లేనోడినే మావా.. ఏదో కొంచెం సదువుకొని యగసాయమే సేస్కుంటుండా. నీ కూతురు లచ్చిమిని పది దాకా సదివిచ్చినావ్. తరవాత ఏమి సదువు సదివిచ్చాలా అనే కదా నీ దిగులు.”
“నీకేమిరా ఇరవై ఎకరాల ఆసామివి. వంద మందికి పని ఇస్తా ఉండావు. ఆ యమ్మినడిగితే నువ్వు అది సదవమంటే అది సదువుతా అంటా ఉండాది.”
“మావా.. నాకేమీ తెలవదు కానీ నా సలహాలు మాత్రం భలే పనిసేస్తాయ్. ముందు మనం లచ్చిమి జాతకం సూపించి ఏ సదువు సదివితే మేలో మురళీస్వామీ కాడికి బోదాం.”
“భలే అవుడియా ఇచ్చినావురా నాయాలా.. పద..! పోదాం.” అంటూ ఇద్దురూ స్వామి కాడికి బొయినారు. ఆ స్వామి పూజలో ఉండాడని గంట సేపు వాళ్ళ వరండాలో కుచ్చోని కుచ్చోని విసుగు పుట్టి చెంగయ్య “ఒరేయ్ శీనా.. ఏందిరా ఈ స్వామి.. అసలు ఇంట్లో ఉండాడో లేడో డవుటుగా ఉండాది. లోపలకి బోయి సూసి రాబో” అన్నాడు.
“యో.. ఏదో మేనమావవి గదా ఎల్ప్ సేద్దామని వస్తే.. నన్ను లోపలకి బంపించి శాపం బెట్టిస్తా. భలే ఓడివి గద మావా.”
“ఒరే.. ఈ మేనమావ దైర్నం నీకు కొంసెం గూడా రాలేదే. పిరికి నాయాలా.”
“యో.. మాటలు సక్కంగా రానీ.. వీధి కుక్కని సూసి భయపడే నువ్వా.. నన్ను ఎగతాళి జేసేది.”
“అబ్బా.. ఎవుడ్రా కుక్కని జూసి భయపడతానని సెప్పినోడు. నువ్వు బుట్టక ముందు వందమందిని నరికినా.”
“యో.. కోతలు కోసింది సాలుగాని ఈ స్వామీ వచ్చేటట్టు లేడు. ఏమి సేద్దాం” అని శీను చెంగయ్యని అడిగేటప్పుడు మురళి స్వామి వాళ్ళ కుక్క భౌ భౌ అంటూ వరండాలోకి వచ్చేసరికి మావా అల్లుళ్లిద్దురూ స్వామి ఇంట్లోకి పరిగెత్తారు. అక్కడ స్వామి బట్టలు ఉతుక్కుంటూ కనబడ్డాడు. అవ్వాక్కైన ఇద్దురూ వరండాలోకి వచ్చి కూలబడ్డారు.
“ఏందిరా ఈ ఇడ్డూరం.. స్వామి గుడ్డలు ఉతకతున్నాడేందిరా శీనా..”
“పెద్దోళ్ళు అంతే మావా.. మనమే ఆడోళ్ళని సులకనగా జూసేది.. కష్టాలు బెట్టేది.. ఓళ్ళింట్లో ఇద్దురూ సమానమే.”
“పూజ అని సెప్పి ఈ స్వామి మనల్ని ఎంతసేపు కూర్సో బెట్టాడురా. కాసేపు అట్టా వచ్చి ఇట్టా సెప్పి పోవచ్చుగా.”
“మావా.. ఎవురి బాధలోళ్లకుంటాయి. ఆయన సమస్యలేవో మనకు తెల్వదు కదా.”
“ఆయన సమస్యలే పరిస్కారం సేసుకోలేనోడు నా లచ్చిమి జీవితం గురించి బాగా సెప్తాడా.”
“మావా.. ఈ సుట్టు పక్కల పది ఊళ్లలో ఈయన పేరు మారుమోగతా ఉండాది.. తెలుసునా నీకు.”
“సరే రమ్మనురా నాయనా.. ఉతికింది సాలు గాని.”
“యో.. గమ్మునుండుయా స్వామీ.. విన్నాడంటే శపించేస్తాడు” అని శీను అంటుండగా మురళి స్వామి వచ్చాడు.
శీనుని చూస్తూ “ఏమిరా వాగుడుకాయ్.. ఏంటి విషయం..” అన్నాడు స్వామి. శీను “మా లచ్చిమి జాతకం సూసి ఏమి సదవాలో సెప్తారని వచ్చుండాం” అనడంతో “లక్ష్మి జాతకం నేనే కదా రాసింది. జాతకం కాగితాలు ఇంట్లో ఉన్నాయా” అని అడిగాడు.
చెంగయ్య తల గీరుకుంటూ “మా ఇంటిది ఏడ బెట్టిందో తెలవదు సామీ. ఏమనుకోకుండా మళ్ళీ సూడండి సామీ” అన్నాడు.
“మీకు కాగితాల విలువ తెలియదు.. ఎప్పుడు మారుతారో మీరు” అంటూ మురళి స్వామి జాతకం చూశాడు.
“చెంగయ్యా.. లక్ష్మి జాతకం ప్రకారం ఇంజనీరింగ్ చదివితే వృద్ధిలోకి వస్తుందయ్యా” అని చెప్పి “డబ్బుతో కూడుకున్న చదువు అప్పులు చేయకు. నీ రాశి కి ఈ సంవత్సరం బాగోలేదు.” అంటూ సలహా ఇచ్చాడు మురళీ స్వామి.
శీను “ఏందీ మావా.. డీలా పడిపోయావు” అన్నాడు.
“ఇంజనీరంటే నేను సదివిచ్చగలనా. అంత డబ్బు ఎట్టా తేవాలో నువ్వే సెప్పు” అని వాపోయాడు చెంగయ్య.
“గవర్మెంట్ కాలేజీలో సేర్చు. ఖర్చు తగ్గుతాది.”
“భలే ఓడివి రా.. ఈ చెంగయ్య కూతురు గవర్మెంట్ కాలేజీకి బోతే నా పొరువేం కావాలా”
“సరే రేపు పొద్దన్నే కాలేజీ కాడికి వెళదాం వచ్చేయ్.” అంటూ శీను ఇంటికెళ్ళిపోయినాడు.
చెంగయ్య ఇంటికి ఎల్లి లచ్చిమితో నీ సదువు కోసం ఎన్ని కట్టాలు పడాలో ఏమో అంటుంటే లచ్చిమి “సదివిస్తే సదివియ్ లేకపోతే వద్దు. నేనేమన్నా సదివి దేశాలు ఏలతానన్నానా” అని దెప్పిపొడిసింది.
తెల్లారతానే చెంగయ్య శీను ఇంటికి బొయ్యి “శీనా శీనా..” అన్నాడు. చెంగయ్య అక్క మంగమ్మ “ఏమిరా తెల్లారకముందే ఇట్టా వచ్చినావ్” అనింది.
“ఏమి లేదు మే.. నేను, శీనా కాలేజీ కాడికి బోవాళ్ళే” అన్నాడు చెంగయ్య.
“ఒరేయ్.. కాలేజీతో నీకేమి పని.. అయినా ఇంత పొద్దన్నే కాలేజీ ఉంటాదా. వోడు కొంచేపు తర్వాత లేస్తాడులే గాని అప్పుడొస్తాడు. నువ్వు ఈలోపు ఏదైనా పని చేసుకోబో” అని మంగమ్మ అనడంతో చెంగయ్య ‘ దీనికేమి తెలుసా నా బాధ. శీనడిని సదివిచ్చుంటే తెలుసుంటాది కష్టం.’ అనుకుంటూ వెళ్లి బెమ్మం గారి మఠంలో కూచ్చున్నాడు. ఆడ ఈరిగాడు అవుపడి “ఏందిరా ఏదో ఆలోశనగా ఉండావు” అన్నాడు. చెంగయ్య జరిగిన కథంతా సెప్పినాడు. ఈరిగాడు నవ్వి “కాలేజీ కాడికి బొయ్యి అడిగావనుకో వోళ్ళు ఎక్కువ ఫీజు ఉండేది సదివిచ్చమని సెప్తారు. అందుకే నువ్వు మన ఊర్లో సదువుకో వుండే వోళ్ళని అడుగు” అని సెప్పడంతో చెంగయ్య మళ్ళీ శీను కాడికి పరిగెత్తినాడు.
శీను టాక్టర్ కడగతా ఉండాడు.
“ఒరేయ్ శీనా టాక్టర్ మళ్ళి కడగచ్చులే గాని ముందు నీ మర్దాలు లచ్చిమి సంగతి సూడరా” అన్నాడు.
“కాలేజీకి బోదాం అంటిని గద మావా. మళ్ళీ ఏమైంది”
“మఠం కాడోళ్లు కాలేజీకి వొద్దు.. ఎవురైనా సదువుకున్న వోళ్ళని అడగమంటా ఉండారు.”
“వోల్ల మాటలెందుకింటావ్ మావా.. పది గంటలకి రాబో.. కాలేజీకి ఎళదాం.”
“అట్ట గాదులేరా.. ఎవురి కాడికి బోదామో సెప్పు”
“రామిరెడ్డి కొడుకు హేమంత్ కాడికి బోదామా?”
“నువ్వు యాడికి రమ్మంటే ఆడికి వస్తా” అంటూ మావా అల్లుళ్ళు హేమంత్ కాడికి ఎల్లినారు.
హేమంత్‌కి జరిగిన ఇషయమంతా సెప్పినాక హేమంత్ రామాయణమంతా ఇని సీతకి రాముడేమి అవుతాడు అన్నట్లు లచ్చిమికి అక్షరాలు రాయడమన్నా వచ్చా అన్నాడు. కూతుర్ని సులకన జేసే సరికి చెంగయ్య కి కోపం వచ్చి “నా కూతురు పది ప్యాసయ్యుండాది ఏమనుకుంటుండావో” అన్నాడు.
“నువ్వు ఇంజినీరింగ్ సదివిచ్చలేవు గాని ఆ యమ్మి సదువు ఎంత మాత్రమో నాకు తెలుసు. సి.ఇ.సి.లో జేర్చేయ్. ఇంటర్ తర్వాత డిగ్రీ చేసుకుంటాది” అని హేమంత్ లచ్చిమి సదువుని తెల్చేసాడు.
శీనుకి హేమంత్ మాటలు నచ్చలేదు.
“యో.. నీకు ముందే సెప్పా.. కాలేజీకి బోదామని.. నా మాట ఇంటావా.. ఈరిగాడు సెప్పినాడు, పోలిగాడు సెప్పినాడు అని వాగతా ఉంటావ్” అని మావని తిడుతూ కాలేజీ కాడికి బొయ్యినారు.
ప్రిన్సిపాల్ కాడికి బోతే ఆయన “ఇంజినీరింగ్ చదవాలంటే ఎం. పి. సి., డాక్టర్ చదవాలంటే బై. పి. సి, డిగ్రీ చాలు అనుకుంటే సి.ఇ.సి గ్రూప్ తీసుకోవాలి” అని సెప్పడంతో చెంగయ్య “ఏ గ్రూప్ తీసుకోమంటారు సార్?” అన్నాడు.
ప్రిన్సిపాల్ “మీ ఇష్టం సార్.. ఏ గ్రూప్ అయినా ఫీజు ఒక్కటే” అన్నాడు.
“మా ఈరిగాడు తక్కవ ఫీజులుండే గ్రూప్‌లు కూడా ఉంటాయన్నాడే” అడిగాడు చెంగయ్య.
దానికి ప్రిన్సిపాల్ “మా కాలేజీలో ఏ గ్రూప్ అయినా ఒకటే ఫీజు కట్టాల్సిందే” అన్నాడు.
శీను “మావా.. ఏ గ్రూప్ తీసుకోవాలో అర్థం కావడం లేదు గాని మన గుడ్డి అయ్యోరి బళ్ళో కొత్తగా ఒక సార్ వచ్చుండాడు. ఆయన్ని అడుగుదాం పద..” అంటూ గుడ్డి అయ్యోరి బడి కాడికి ఎళ్లారు.
కొత్త సార్‌కి జరిగిన కథనంతా సెప్పినారు. అంతా విని ఆయన “ముందు నీ కూతురిని తీసుకొని రా” అన్నాడు.
శీను ఎల్లి లచ్చిమి ని తీసుకొచ్చినాడు.
కొత్త సార్ లచ్చిమితో మాట్లాడి చివరికి ఆ యమ్మి కి డాక్టర్ సదవడం ఇష్టం అని తేల్సినాడు.
చెంగయ్య ‘ఇంజినీరింగ్‌కే స్వామి అప్పులవుతానన్నాడు. ఈయనేమో డాక్టర్ సదువుకి సేర్చమంటుండాడు. ఏమి సెయ్యాలబ్బా. జాతకం ప్రకారం సేర్చాలా, మా యమ్మికి ఇష్టమైన సదువులో సేర్చాలా’ ఆలోచిస్తూ కళ్ళు తిరిగి పడిపోయినాడు.
శీను, లచ్చిమి కలిసి ఇంటికి తీసుకొని బొయ్యి గంజి నీళ్లు తాగిచ్చినాక లేసి కూచ్చున్నాడు చెంగయ్య.
డబ్బు కంటే సదువే ముఖ్యం అని చెంగయ్య బై.పి.సి. లో సేర్చేద్దామని నిర్ణయించుకొని శీనుని పిలిసి “ఒరేయ్ అబయా.. ఆ యమ్మికి ఇష్టమైన సదువే సదివిచ్చాలనుకుంటుండా” అంటూ సేతిలో సెయ్యేసి “నిన్ను నమ్ముకొనే దాని జీవితాన్ని వెలుతురింటిలోకి నెడుతుండా, నీ మేనమావ ప్యాణాల్తో బతికుంటే తిరిగిస్తాడనుకో.. అవసరానికి డబ్బు సాయం సెయ్యిరా సాలు..” అని శీను అరచేతులు కన్నీటితో తడిపే సరికి “యాంది మావా..అట్టా యాడస్తుండావు..నీకు సాయం సేసే పూచీ నాది” అని ఇంటి బాట పట్టాడు.
నులక మంచం మీద నిద్రలో ఉన్న చెంగయ్య ఉలిక్కి పడి లేశాడు. రకరకాల కలలు అందరి సలహాలు తన బుర్రని అనుమానాల సమ్మెటై బద్దలు కొడుతున్నాయి. ‘ఈ సలహాలిచ్చే వాళ్ళు నా స్థానంలో ఉండి ఎందుకు ఆలోసించడం లేదు. నా స్తోమతెంత.. వాళ్ళు సెప్పే సలహాల స్తోమతెంత’ అనుకుంటూ మళ్ళీ పడుకున్నాడు.
నిద్ర లేచాక గంపెడు సలహాల్లో ఒకటైనా పాటించక పోతే ఎట్టా.. బై.పి.సి. లోనే సేర్చుదాం అని శీనుని వెంటపెట్టుకొని వెళ్లి చివరికి లచ్చిమిని బైపీసీ లోనే చేర్చాడు.
చెంగయ్య అప్పులు తీర్చాలని పనికి వెళ్తూ చాలా కష్టపడుతున్నాడు. లచ్చిమి బాగా చదువుతా ఉన్నాను అని చెప్తూ రోజూ కాలేజీకి వెళ్లి వస్తా ఉంది. పరీక్షలు దగ్గర పడ్డాయి. చెంగయ్య లచ్చిమి దగ్గరికి వచ్చి “అమ్మా.. పరిచ్చలు బాగా రాసి నా పేరు నిలబెట్టాలా” అన్నాడు. లచ్చిమి “అట్నే.. నాయనా” అంటూ పరీక్షలు ధీమాగా రాసింది.
ఓరోజు సాయంత్రం చెంగయ్య పొలం నుంచి వచ్చేసరికి ఇంటికి ఎవరో వచ్చి ఉన్నారు. చెంగయ్య ఎగ్గట్టిన లుంగీని విప్పుకుంటూ ఇంట్లోకి వెళ్లాడు. చెంగయ్య భార్య బంధువర్గం వచ్చి ఉంది. చెంగయ్య లోపలికెళ్లి బాగుండారా అని పలకరించి యాంది కత.. ఊరక రారు మగానుభావులని.. అని ఎటకారం సేసేసరికి వచ్చిన వాళ్లలో ఒకరు “ఏమి లేదు చెంగా లచ్చిమిని మా సూరి గాడికి అడగదామని వచ్చినామ్” అన్నాడు.
ఆ మాటతో చెంగయ్య కోపం కట్టలు తెంచుకొంది. “లచ్చిమికి పెళ్లి సేస్తానని సెప్పిన నావర్ధా నాయాలు ఎవుడూ.. నా బిడ్డ డాకట్టరు సదవతా ఉంటే..” అని విసురుగా అన్నాడు.
దానికి ఓ పెద్దాయన “ఒరేయ్ చెంగా.. మన తాహత్తు ఏందీ.. నీ మాటలేంది.. జరిగే పనులు సూడరా.. మంచి సంబంధం వచ్చినప్పుడే కానిచ్చియాల్రా..” అనడంతో చెంగయ్య “అయ్యా.. మహానుభావా.. మేము ఇప్పుడు పెళ్లి సెయ్యం దయసేయండి” అంటూ వాళ్ళని ఇంట్లోంచి వెళ్లగొట్టాడు. భార్యని “ఏమేవ్.. పిచ్చి మొహమా.. నీకు తెలవదా బిడ్డ సదువుతా ఉండాదని.. పెళ్లిసూపులుకి రెడీ సేసేశావ్” అని తిట్టిపోశాడు. ఎంత ఎగిరినా చెంగయ్య ఆలోచనలో పడ్డాడు. సదివిద్దామా పెళ్లి సేసేద్దామా అని అదే ఆలోచనలోనే ఉంటూ తిండి కూడా సరిగా తినడం లేదు.
కొన్ని రోజులకి రిజల్ట్స్ వచ్చాయి. లచ్చిమి రెండు సబ్జెక్ట్‌లు తప్పింది. ఇంకేముంది చెంగయ్య అగ్గి మీద గుగ్గిళం అయ్యాడు. లచ్చిమి ఒకటే ఏడుపు.. నేను బాగానే రాశాను ఎందుకు ఫెయిల్ అయ్యానో అర్థం కావడం లేదంటూ వాపోయింది. చెంగయ్య లచ్చిమిని గొడ్డుని బాదినట్టు బాదడంతో శీను వచ్చాడు. “నీ యవ్వారం ఏమి బాగాలేదు మావా.. అంతా నీ ఇట్టమొచ్చినట్టే జరగాలంటే ఎట్టా.. ఆత్రేయ గారు సెప్పినట్టు.. అనుకున్నామని జరగవు అన్నీ.. అనుకోలేదని ఆగవు కొన్ని.. సెట్టు నాటడమే మన పని.. ఫలితం మన సేతిల్లో ఉండదు. నీకు తెల్వంది గాదు” అనడంతో సల్లబడ్డాడు.
“ఇప్పుడేమి సెయ్యాలో అర్ధం కావడం లేదబయా..” అన్నాడు. “ఏముంది ఆ యమ్మి కట్టి రాసి పాసవుద్దిలే గాని.. నువ్వు నీ పని జేసుకో” అంటూ శీను వెళ్ళిపోయాడు.
చెంగయ్యకి మొదటి నుంచి తను సేసిన వన్నీ కళ్ళ ముందు మెదిలాయి. వెంటనే శీను కాడికి బొయ్యి “అల్లుడూ.. నేను సదివిచ్చ లేను గాని పెళ్లి జేసేస్తానురా” అన్నాడు. శీను “అట్నే సెయ్యి మావా.. పోలీసు లొచ్చి బొక్కలో వేస్తారు.” అనడంతో “ఎందుకు..” అన్నాడు చెంగయ్య.
“ఆ యమ్మికి పజ్జెనిమిదేండ్లు ఇంకా నిండలా.. పోలీసులకి తెలిస్తే అంతే సంగతులు” అన్నాడు శీను.
‘సరేలే.. ఈ సదువు అవనీ.. తర్వాత సూద్దాం’ అనుకుంటూ చెంగయ్య పని చేసుకుంటూ బతికాడు. లచ్చిమి మొత్తానికి ఇంటర్ రెండేళ్లు పూర్తి చేసేసింది.
లచ్చిమి చెంగయ్య కాడికి వచ్చి “నాయనా.. నన్ను డాక్టర్ సదివిస్తావా..” అని అడిగింది.
“నాకు అంత ధైర్యము, తాహత్తు లేవు తల్లి. అందరినీ అడిగి ఉచిత సలహాలన్నీ పాటించి ఇంత దూరం వచ్చా. అంతా మన మంచికే. ఇంక సలహాలు ఎవుర్నీ అడగను. నేను ఆలోసించి సెప్తాలే.” అని లచ్చిమికి సెప్పి పంపినాడు.
సలహాలు ఎవర్నీ అడగకుండా రేడియో వింటూ ఆలోసిస్తూ ఉండగా తళుక్కున ఒక ఐడియా తట్టేసింది. అదే మంచిదనుకుని శీను కాడికి బొయ్యి “ఒరేయ్ అబయా.. ఇంటి దాకా రారా” అన్నాడు.
శీను టెన్షన్ పడుతూ “యామైంది మావా..” అంటూ చెంగయ్య ఇంటికెళ్ళాడు.
చెంగయ్య శీనుని కూచ్చోబెట్టి లచ్చిమిని తీసుకొచ్చి “శీనా.. పజ్జెనిమిదేళ్లు నిండేదాకా పెళ్లి సేయగూడదు అన్నావుగా. ఇప్పుడు దీనికి పెళ్లి జేసేద్దామనుకుంటుండా” అన్నాడు.
“డాక్టర్ సదివిస్తానంటివి గదా మావ” అన్నాడు శీను.
“మన తోకెంతో అంతే ఇసురు కోవాలని ఇప్పుడు తెలుసుకున్నా. డాక్టర్ కాకపోయినా మా లచ్చిమిని నర్స్ చదివిద్దామనుకుంటుండా” అన్నాడు చెంగయ్య.
“పెళ్లి జేస్తానంటుండావ్, నర్సు చదివిస్తానంటుండావ్.. నాకేమి అర్ధం కావడం లేదు మావ. ఇవన్నీ నాకెందుకు సెప్తుండావ్” అని అయోమయంగా అడిగాడు శీను.
“నీ కన్నా మంచి అల్లుడు నాకు పెపంచంలో యాడా దొరకడు. మా లచ్చిమి నీకు ఇష్టమైతే నీకు ఇచ్చి పెళ్లి చేసేస్తా అల్లుడా.. ఆ యమ్మిని నర్స్ చేస్తావో, డాకట్టర్ చేస్తావో నీ ఇష్టం” అంటూ చెంగయ్య తన బుర్రలోని బాంబును పేల్చాడు.
శీను ఆ మాటలు విని షాక్ అయ్యి.. ‘మా చెంగ మావ ఇంత తెలివైనోడా’ అనుకుంటూ “మావా ఈ ఉచిత సలహా ఎవురిచ్చారు” అని అడిగాడు.
చెంగయ్య “ఆ యమ్మి సదువు కోసం అందరి ఉచిత సలహాలు ఇని ఇని మనకు అనుకూలమైనదేదో అది సేస్తేనే మనకు మేలు అని తెలుసుకున్నా. మనకేది మేలో మనకే తెలిసినప్పుడు అందరిని అడిగి తికమక పడడం దేనికి. అందుకే నేనే సొంతంగా ఈ నిర్ణయం తీసుకున్నా” అన్నాడు.
శీను “సరే మావా.. అమ్మని వచ్చి అడుగు..” అన్నాడు.
“భలే వోడివే.. నీకు లచ్చిమి అంటే ఇష్టమా కాదా చెప్పు.. అట్నే మాయక్కతో నేను మాట్లాడుకుంటా” అన్నాడు చెంగయ్య.
శీను “ఇష్టమేలే మావా” అని సిగ్గు పడుతూ వెళ్ళిపోయాడు.
లచ్చిమి, శీనుల పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతూ ఉండగా చెంగయ్యతో పక్కింటి చలపతి “ఒరేయ్ చెంగా.. పెళ్లి అయిపోయిందని సంకలు గుద్దుకోకు.. మీ యక్క సంగతి నీకు తెల్వదు. లచ్చిమిని జాగ్రత్తగా ఉండమని సెప్పు” అన్నాడు.
చెంగయ్య “మీకేమి పని ఉండదేంట్రా.. ఊరికే పనికి రాని సలహాలు ఇస్తా ఉంటారు. మా యక్క గురించి ఒకరు సెప్తే తెలుసుకొనే స్థితిలో లేను లేరా” అంటూ కూతురు అల్లుడిని చూసుకుంటూ మురిసిపోయాడు.
(సమాప్తం)
