Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఉడిపి శ్రీకృష్ణ ఆలయ సందర్శనం

[ఉడిపి లోని శ్రీ కృష్ణ ఆలయం సందర్శించి ఆ అనుభవాలను పాఠకులతో పంచుకుంటున్నారు డా. మజ్జి భారతి.]

ర్ణాటక రాష్ట్రంలోని, ఉడిపి పట్టణంలో, అరేబియా మహాసముద్రానికి చేరువలో, ఉన్న ఈ సుప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం శ్రీకృష్ణునికి అంకితం చేయబడింది. నాలుగు ప్రధానమైన శ్రీకృష్ణ దేవాలయాలలో ఇది ఒకటిగా చెప్పబడుతుంది (మధుర, ద్వారక, గురువాయూర్ మిగిలినవి). 13వ శతాబ్దంలో, ద్వైతమతాన్ని వ్యాప్తి చేసిన మధ్వాచార్యుల వారిచే, విగ్రహం ప్రతిష్టించబడిందని తెలుస్తుంది. ఈ ఆలయమున్న శ్రీకృష్ణమఠంలో వీరాంజనేయ స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, పంచముఖ ఆంజనేయ స్వామి నవగ్రహాల ఉపాలయాలు, గోశాల, అన్నదాన సత్రం, ప్రక్కగా మాధవతీర్థం, ఆ తీర్థం మధ్యలో మంటపం, అందులో మధ్వాచార్యుల విగ్రహం ఉంటాయి.

శ్రీకృష్ణుడు బాలకృష్ణునిగా, రెండడుగుల ఎత్తుతో, అరమోడ్పు కళ్ళతో, నిలువు బొట్టుతో, ఒక చేతిలో కవ్వం, ఇంకొక చేతిలో తాడుతో సర్వాలంకార శోభితుడై మనకు దర్శనమిస్తాడు. రోజుకి 9 సార్లు సేవలు జరుగుతాయి. ప్రతిరోజు రాత్రి 7: 30 కి, వెండిరథం మీద స్వామిని ఊరేగిస్తారు. దర్శనానికి వచ్చే మగవారు, షర్టు తీసివేసి లోపలికి వెళ్ళాలి. సెల్ ఫోన్లను ఎలౌ చేశారు గాని, ఫోటోలు తియ్యకూడదు. ఆలయం ఉదయం నాలుగున్నర నుండి రాత్రి 9: 30 వరకు తెరిచే ఉంటుంది. క్రిందటి సంవత్సరం వెళ్ళినప్పుడు, ప్రత్యేక దర్శన టికెట్లు లేవు గాని, ఇప్పుడు 500/- రూపాయల టిక్కెట్టు ఉంది.

రుక్మిణీదేవి, బాల శ్రీకృష్ణుని విగ్రహాన్ని విశ్వకర్మతో చేయించినదని, ద్వారక సముద్రంలో మునిగిపోయాక, 13శతాబ్దంలో మధ్వాచార్యుల వారికి దొరకగా ప్రతిష్టించారని భక్తుల విశ్వాసం.

ఇక్కడ విశేషంగా చెప్పుకోవలసినది ఏమిటంటే తూర్పు దిక్కుకు అభిముఖంగా ఉండే స్వామి, తన భక్తుడైన కనకదాసుకి వర్ణవివక్ష కారణంగా దర్శనం లభించకపోతే, ఆలయం వెనుక భాగంలో విలపిస్తున్న అతనికి దర్శనమిచ్చేందుకు,  స్వామి వెనుకకు తిరిగారని, పశ్చిమగోడ కూలి, రంధ్రమేర్పడి కనకదాసుకు దర్శనం కలిగించారని ప్రతీతి. అందుకనే ఆ గోపురాన్ని కనక గోపురమని పిలుస్తారు. ఆ గోపురం నుండి కనకదాసు కిండి (కిటికీ) ద్వారా మనం స్వామిని దర్శించవచ్చు. గోపురానికి ప్రక్కగా గరుడుని విగ్రహం, గోపురమెదురుగా కనకదాసు విగ్రహముంటుంది.

ఈ సంవత్సరం ఏప్రిల్ నాల్గవ తేదీన, మేము ఉడిపి చేరేటప్పటికి రాత్రి 7: 30 అయింది. చాలా పెద్ద క్యూలైన్లు, గీతామందిరం దాటి ఉన్నాయి. లైన్లో ఉంటే దర్శనమవుతుందో లేదోనన్న భయంతో 500/- టికెట్ తీసుకుంటే, 20 నిమిషాల్లో దర్శనమైంది. స్వామి బంగారు కవచాన్ని ధరించి, ధగధగా మెరిసిపోతున్నారు. గర్భగుడి గోడలు దీపాలతో అలంకరించబడ్డాయి.
ఇంకొక దర్శనం చేసుకుందామని మరలా స్పెషల్ క్యూలో జాయినై, ఆలయ ముందుభాగానికి వచ్చేసరికి, రథోత్సవం జరగడంతో లైన్లను ఆపారు. మేళతాళాలు, దివిటీలతో అందరూ ముందు రాగా అలంకరించిన పెద్ద రథం ఆలయ ముందుభాగానికి వచ్చి ఆగింది. (క్రిందటి సంవత్సరం వెళ్ళినప్పుడు, ప్రతిరోజూ జరిగే వెండి రథోత్సవాన్ని చూసాం. గాని ఈ పెద్ద రథోత్సవాన్ని చూడడం జరగలేదు) సుమారు 30 అడుగుల ఎత్తైన రథానికి, 20 అడుగుల ఎత్తైన మెటల్ నిచ్చెనను వేసి, స్వామి ఉత్సవమూర్తిని దించి, గర్భగుడి ముందున్న అలంకార మంటపానికి తోడ్కొని, ఉయ్యాలసేవను మొదలుపెట్టాక, అంతవరకు ఆపిన దర్శనాలను పునరుద్ధరించారు. స్వామికి ఉయ్యాల సేవ చేస్తుంటే, ముందుకెళ్లి వీక్షించాం. తర్వాత దర్శనం చేసుకుని బయటకు వచ్చాం. స్పెషల్ టికెట్టుకు శ్రీకృష్ణుని ఫోటో, ప్రసాదం ఇచ్చారు. ఆలయంలోని అన్న ప్రసాదం తీసుకొని, రాత్రి 10 గంటలకు, మెయిన్ గేటుకు ఎదురుగా ఉన్న శ్రీనివాస రెసిడెన్సిలో బస చేసాం.

గర్భగుడిలోనికి పూజారులకు తప్ప వేరే వారికి ప్రవేశం లేదు. భక్తులు గర్భగుడికి ముందున్న నవరంధ్ర కిటికీ గుండానే స్వామిని వీక్షించాలి. నవరంధ్రాల కిండి (కిటికీ) బంగారంతో తాపడం చేయబడి, దాని దిగువభాగాన కుడివైపు హనుమ, ఎడమవైపు గరుడుని మూర్తులుంటే, కిటికీ పైభాగంలో అటు, ఇటు ఉభయ దేవేరులతో స్వామి, మిగిలిన కిటికీ ద్వారభాగంలో దశావతారాలు ఉన్నాయి. గర్భగుడి మొత్తం ఇత్తడితో చేయబడి, గోడలు వెలుపలి వైపున ఐదు వరుసల ప్రమిదలతో కూడి ఉంటాయి. ప్రతిరోజు రాత్రి గర్భగుడి మొత్తం దీపాలతో వెలుగులీనుతూ ఉంటుంది.

దాని ఎదురుగా ఉన్న అలంకార మంటపం, బంగారంతో తాపడం చేయబడి ఉంది. ఈ మంటప ముందుభాగంలో, దిగువన కుడివైపు హనుమ, ఎడమవైపు గరుడుని మూర్తులున్నాయి. మంటపానికి కుడివైపు కాస్త దూరంలో, బంగారు రథం, అందులో అర్జునునికి గీతోపదేశం చేస్తున్న కృష్ణుడు, రథానికి వెనుకగా గరుడుని ఉపాలయముంటే, దానికెదురుగా మంటపానికి కుడివైపు హనుమ ఉపాలయముంది. ఆ మధ్య స్థలం ఎత్తైన అరుగుతో, భక్తులు కూర్చుని పారాయణం చేసుకోవడానికి వీలుగా ఉంది.

అలంకార మంటపమెదురుగా కనకదాసు కిటికీ, అక్కడ నుండి చూస్తే కాస్త దూరంలో ఉన్న కనకదాసు విగ్రహం కనిపిస్తాయి.

ఆలయానికి రెండు ప్రవేశ ద్వారాలున్నాయి. దక్షిణాభిముఖంగా ఉన్న ప్రవేశం ద్వారానే ఉత్సవమూర్తిని తీసుకువెళ్లడం, తీసుకురావడం జరుగుతుంది. ఈ ద్వారం ఎదురుగా చంద్రమౌళీశ్వర ఆలయముంటే, ఈ ద్వారం దగ్గర నిలబడి మఠం లోపలికి చూస్తే ఎదురుగా మధ్వాచార్య సభామంటపం, అందులోని మధ్వాచార్యుల విగ్రహం కనిపిస్తాయి.

ఉచితదర్శన లైన్లు పుష్కరిణి చుట్టూ తిరగకుండా, గరుడుని ఉపాలయం పక్కనుండి వస్తున్నాయి.

మరుసటి రోజు ఉదయాన్నే (5.45 am) దర్శనానికి వెళ్లిన సమయంలో అభిషేకం జరుగుతుంది. అభిషేక సమయంలో స్వామివారు అలంకారం లేకుండా ఉంటారు. అభిషేకమయ్యాక తెర వేసి, దర్శనాన్ని ఆపారు. తెర తొలగించాక చూస్తే, పొడవైన తెల్లని పూలమాలతో అలంకృతులైన స్వామి దర్శనమిచ్చారు. అక్కడే కాసేపు కూర్చొని, మరలా దర్శనానికి వెళ్తే, నుదుట తిరునామం, అలంకరించిన కళ్ళతో మూడవసారి దర్శనమిచ్చారు. తెరవేసి అలంకారం చేసి, తెర తీసి భక్తులకు దర్శనమిప్పిస్తారు. అలా, ప్రతి అలంకారానికి తెరవేయడం, తెరతియ్యడం జరుగుతుంది.

రాత్రి చూసిన రథోత్సవం, ఉయ్యాలసేవ,  ఇప్పుడు చూసిన అభిషేకం, అలంకారం- వీటితో మనసు ఉల్లాసభరితమైంది.

దర్శనయ్యాక, కుడివైపు తిరిగితే మధ్వాచార్యుల మంటపముంటుంది. పీఠాధిపతులకు, శిష్యులకు తప్ప వేరే వారికి ప్రవేశముండదిక్కడ. దాటి ముందుకెళ్తే వీరాంజనేయ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉపాలయాలు ఒక గదిలో ఉంటాయి. అక్కడ నుండి ముందుకొస్తే నవగ్రహాలు, పంచముఖ ఆంజనేయస్వామి ఉపాలయాలు, వాటి ఎదురుగా శ్రీకృష్ణ మందిరం (ఇక్కడే ఫోటో, ప్రసాదం ఇస్తారు), తర్వాత మధ్వాచార్యుల సభామంటపం, దాని ప్రక్కనుండి లోపలికి వెళ్తే, బృందావనం వస్తుంది. అక్కడంతా గురువుల సన్నిధులున్నాయి. అవి దాటుకుని ముందుకెళ్తే, పెద్ద రావిచెట్టు, దాని ఎదురుగా 11 వరుసలలో వందల సంఖ్యలో నాగదేవతల ప్రతిమలున్నాయి. (కిందటిసారి వచ్చినప్పుడు ఇవన్నీ చూడడం జరగలేదు)

 చంద్రమౌళీశ్వర ఆలయం: దక్షిణ ద్వారానికి ఎదురుగా చంద్రమౌళీశ్వర ఆలయం ఉంటుంది. ఐదారు మెట్లు దిగి క్రిందకి వెళ్లవలసి ఉంటుంది.  చంద్రుడు శాపనివృత్తి కోసం ఈశ్వరుని ఈ ఆలయంలోనే ఆరాధించాడు కాబట్టి, ఇది చంద్రమౌళీశ్వర ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఇందులో నవగ్రహ కూటమి, ఉసిరిక చెట్టు, తులసి కోట ప్రత్యేకంగా ఉన్నాయి.

అనంతేశ్వర ఆలయం:  దాని పక్కనే 1000 సంవత్సరాల నాటి అనంతేశ్వర ఆలయముంది. ఈ ఆలయంలో పరుశురాముడు శివునిగా పూజలందుకుంటారు. ఈ ఆలయంలో శివలింగం ఎత్తైన పీఠంమీద ఉండి, భక్తులకు చక్కగా దర్శనమవుతుంది. ఆలయానికి గోపురం లేకుండా, అండాకారంలో ఉంటుంది. ప్రదక్షిణాలు చెయ్యడానికి వీలుగా ఆలయం చుట్టూ స్థలం, దాని చుట్టూ కారిడార్ ఉంటాయి. వెనక వైపు కారిడార్ లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయముంది.

గీతామందిరాన్ని దాటి, మఠంలోనే వున్న గోశాల ముందునుండి కెళ్తే, పుష్కరిణి (మాధవ తీర్థం) వస్తుంది. అక్కడ కర్ర దుంగలను నీట్ గా కట్ చేసి రథం ఆకారంలో పేర్చారు. పుష్కరిణి దాటి ముందుకెళ్తే వరుసగా మఠాలు వస్తాయి. ఒక మఠంలోకి వెళ్ళాం. మఠం మధ్యలో ఆలయం, చుట్టూ ప్రదక్షిణా మార్గం, దాని చుట్టూ ఎత్తైన వరండా, ఆ లోపల గదులున్నాయి.

కనకదాసు విగ్రహానికి ఎదురుగా ఉన్న మఠంలోకి కూడా వెళ్లి చూశాం. అక్కడ ఆలయం మూసి ఉంది గాని, ఆలయం ముందున్న వరండాపై, రథంపై కృష్ణార్జునులు, ఇంకా వివిధ దేవతామూర్తుల ప్రతిమలతో, చాలా అందంగా అలంకరించబడి ఉంది.

కనకదాసు కిటికీ దగ్గర ఎత్తైన గోపురం, దాని ప్రక్కన చిన్న సభామంటపం, ఎదురుగా విశాలమైన మాడవీధి ఉన్నాయి. వీధి చివర రాఘవేంద్రస్వామి మఠం, అందులో గర్భగుడి, చుట్టూ ప్రదక్షిణా మార్గం,  గర్భగుడికి ఎడమవైపు గోశాల ఉన్నాయి.

కనక గోపురానికి ఎడమవైపు అనంతేశ్వర ఆలయముంటుంది. ఇక్కడ స్వామి హరిహరుడిగా కొలువబడతాడు. అనంతేశ్వర గర్భగుడి చుట్టూ విశాలమైన ప్రదక్షిణామార్గం, దాని చుట్టూ ఎతైన వరండా, లోపల గదులు కనిపిస్తున్నాయి. ఆలయానికి వెనుక ప్రసన్న సోమేశ్వర, అయ్యప్పస్వామి ఉపాలయాలున్నాయి.

ఆలయానికి దగ్గరలోనే యాత్రానివాస్ ఉంది. ఆన్లైన్ బుకింగ్ ఉండదు. డైరెక్టుగా వెళ్లి, రూములు బుక్ చేసుకోవాలి. దీని ఎదురుగా కొత్తగా పెద్ద ఆర్చ్ కట్టారు. దీనికి సమీపంలో పార్కింగ్ ప్లేసులు, ప్రైవేటు లాడ్జీలు చాలా ఉన్నాయి.

పకజ క్షేత్రం: ద్వైత మతాన్ని అందించిన మధ్వాచార్యుల వారు జన్మించి, తిరుగాడిన గృహం ఈ పకజ క్షేత్రం. ఉడిపికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఊరికి ఆటోలు, టాక్సీలు దొరుకుతాయి. ఈ ఇంట్లో అనంత పద్మనాభ ఆలయం, మధ్వాచార్యుల వారి పాదపుత్రలు చిన్నప్పుడు వాడిన వస్తువులు అక్షరాభ్యాస శిలాఫలకం, ఇంటి వెనుక భాగంలో వాసుదేవ తీర్థం, చింత చెట్టు ( చింతగింజల నిచ్చే తండ్రిగారి రుణాన్ని మధ్వాచార్యుల వారు తీర్చారని, ఇక్కడ చింత గింజలను ప్రసాదంగా ఇస్తారు), ధ్యానం చేసుకునే పెద్ద హాలు ఉంటాయి.

ఇక్కడకు దగ్గరలో కుంజూరు గిరి మీద దుర్గాదేవి ఆలయం, ఆ సమీపంలో బాణతీర్థం ఉంటాయి. పుంజూరు గిరికి ఎదురుగా ఉన్న కొండపై పరశురామ ఆలయం, అక్కడ సంవత్సరం పొడుగునా నీరు ఊరే గదాతీర్థం ఉంటాయి.

అలాగే ఉడిపి సమీపంలో చాలా బీచ్ లు –డెల్టా, కాపు, మట్టు (ఈ సాగర జలాల్లో ఉండే సూక్ష్మజీవులు మెరిసే లక్షణం కలిగి ఉండడం వలన రాత్రి వేళల్లో సముద్ర జలాలు మెరుస్తూ కనిపిస్తాయట), మాల్పే (ఈ బీచ్ లో, సముద్రం లోపలికి నడిచి వెళ్లేందుకు నడక మార్గముంటుంది. ఈ మార్గానికి ఒకవైపు మాల్పే నది, ఇంకొక వైపు అరేబియన్ సముద్రం, నది చుట్టూ పచ్చని కొబ్బరి తోటలు, సముద్ర సాగరం వైపు దూరంగా చూస్తే సెయింట్ మేరీ ద్వీపం… చూడడానికి వ్యూ చాలా బాగుంటుంది. ఇక్కడకి దగ్గరలోనే ఫిషింగ్ హార్బరుంటుంది) బీచ్ లు ఉంటాయి.

క్రిందటి సంవత్సరం వచ్చినప్పుడు వీటన్నిటిని సందర్శించడం జరిగింది.

 బీచ్ లను చాలా శుభ్రంగా మెయింటైన్ చేస్తున్నారు. త్రోవకు ఇరువైపులా పచ్చని చెట్లతో ప్రయాణ మాసాంతం ఆహ్లాదంగా ఉంటుంది. బీచ్ లో దిగి ఆడుకోనివ్వరు. దూరం నుండి చూసి ఎంజాయ్ చెయ్యాల్సిందే. ఇక్కడ రూల్సుని చాలా స్ట్రిక్టుగా ఫాలో అవుతారు.

ఈ యాత్రలో పకజక్షేత్రం, బీచ్ లను సందర్శించకపోయినా, శ్రీకృష్ణుని రథోత్సవాన్ని, ఉయ్యాల సేవను, అభిషేకం చేస్తున్నప్పుడు దర్శనం చేసుకోవడమే కాకుండా, అనేకసార్లు దర్శనం చేసుకోవడం, అన్న ప్రసాదాన్ని స్వీకరించడం మాకు మరపురాని అనుభూతులనిచ్చాయి.

ఉడిపి ప్రయాణాన్ని రెండురోజులు పెట్టుకుంటే, పైన చెప్పినవన్నీ చక్కగా సందర్శించవచ్చు.

Exit mobile version