[శ్రీమతి పుట్టి నాగలక్ష్మి రచించిన ‘ఉద్యమ గీతం’ అనే కవితని అందిస్తున్నాము.]
తొలి స్వాతంత్ర పోరాటం
బంకించంద్రుని అంతర్మథనం
సృజించె ‘ఆనంద మఠం’.
సన్యాసుల స్వరాల పల్లవించిన గీతం
పాఠక హృదయాల నుత్తేజ పరిచిన గేయం.
వెల్లువైన జాతీయతాభావం
బెంగాల్‌లో హోరెత్తిన నినాదం
ఉద్యమానికే ఊపిరయిన వైనం.
వాడ వాడలా ఎల్లెడల ప్రతిధ్వనించె
మితవాద అతివాద తేడానే లేదయ్యె
హింసావాద, అహింసావాద బేధము లేదయ్యె.
దేశవిదేశాల్లో అందరినోటా ఈ మాటే
జాతీయపతాక నెక్కి కనువిందు చేసిందదే
దేశభక్తుల మనసంతా నిండిందదే.
బాపూజీకి మాతృస్తవమయింది
నేతాజీకి సేనా ప్రచార గీతమయింది
మేడమ్ కామాకి పత్రికయింది.
జాతీయోద్యమ యోధుల పలకరింపదే
స్వరాజ్యఫలం జాతీయగీతమయిందదే
అదే అదే అదే వందేమాతరం.
