[శ్రీ గంగాధర్ వడ్లమన్నాటి రచించిన ‘ఉగాది పచ్చళ్ళు’ అనే కథని పాఠకులకి అందిస్తున్నాము.]
గబగబా స్నానం చేసి వచ్చి గజగజా వణుకుతూ బట్టలు వేసుకుని, “టిఫిన్ రెడీ చేశావా?” అరిచాడు మధు.
“రెడీ రెడీ, కానీ అంతకంటే ముందు కొంచెం ఉగాది పచ్చడి తినండి. ప్లీజ్” అంది లలిత.
“ఏడిసినట్టుంది, నేను టిఫిన్ గురించి అడిగితే, నువ్వు ఉగాది పచ్చడి గురించి చెప్తావేంటి, ముందు, వండి తగలేసిన టిఫిన్ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టు. తిని అఘోరిస్తాను. అసలే పేగులు ఆకలి రాగం పాడుతున్నాయి. కాస్త త్వరగా పట్రా పో” అంటూ కంచం తీసి ముందుపెట్టుకున్నాడు.
“అదీ, మరీ, అలా అయితే ఆ ఆకలి కేకలు కొంచెం ఓర్చుకోవాలి. ఎందుకంటే ఇవాళ నేనసలు టిఫిన్ ఏవీ చేయలేదు. కనుక ఉగాది పచ్చడినే టిఫిన్ తిన్నట్టు తినాలి. ఆ తర్వాత కూడా ఆకలి వేస్తే, ఈ పూటకి ఫుడ్ ఆర్డర్ పెట్టుకోండి.”
మధు వికారం మొహంతో, “అదేవిటి, అంత ఉదయాన్నే లేచి ఉగాది పచ్చడి మాత్రమే చేసావా? ఇన్ని గంటలు, ఇప్పటివరకు, ఇంత సమయం ఖర్చు పెట్టి, కేవలం అంటే కేవలం ఉగాది పచ్చడి మాత్రమే చేయడమేంటి?” ఆశ్చర్యంగా అడిగాడు
“అది ఎందుకు అడుగుతారులెండి. అదో పెద్ద కథ. అయినా తినబోతూ రుచి అడగడం ఎందుకూ, ఉండండి, మీ కోసం ఉగాది పచ్చడి తీసుకొస్తా” చెప్పి లోపలికి వెళ్ళింది.
‘రాను రాను దీని పిల్ల చేష్టలు పరాకాష్ఠకి చేరుతున్నాయ్. ఉగాది పచ్చడి కోసం టిఫిన్ చేయడం మానేసింది. ఏవిటో రాను, రాను ఆలోచన మాని మానులా తయారౌతోంది’ అనుకుంటూ ఉండగానే ఒక పెద్ద ట్రే లో చిన్న చిన్న గాజు గిన్నెలు దగ్గర దగ్గర ఓ పదింటిలో ఉగాది పచ్చడి తీసుకొచ్చి తన ముందు పెట్టింది.
కళ్ళు నులుముకుని, “ఇదేవిటి ఇన్ని కప్పులు కనిపిస్తున్నాయ్?” అని వాటి వంక మరోసారి పరీక్షగా చూసి, “ఇదేమిటే నీ మొహం మండా, నీ పిచ్చి మరీ పీక్స్‌కు చేరినట్టుంది. ఇన్ని గిన్నెల ఉగాది పచ్చడా? తినడానికా లేకపోతే తాగి పొట్టపగిలి చావడానికా! అయినా ఇన్ని గిన్నెలలో ఎందుకూ. అన్నీ కలిపి ఒకే గిన్నెలో, కాదు, కాదు, ఓ లోటాలో వేసి తీసుకు రావొచ్చు కదా! గట గటా తాగి మూతి తుడుచుకునేవాడ్ని” అన్నాడు చిరాగ్గా.
“అన్నీ కలిపి ఒకే దాంట్లో తీసుకు రావడానికి ఇది ఒక రకం ఉగాది పచ్చడి కాదు మై డియర్ హస్బెండ్.”
“ఒక రకం కాదా? మరి” అడిగాడు ఆశ్చర్యంగా కళ్ళు మిటకరిస్తూ.
“ఇవి రకరకాల ఉగాది పచ్చళ్ళు. ఇందులో ఒకటేమో పంచదారతో చేసింది, ఒకటేమో చాక్లెట్‍తో చేసింది, ఒకటేమో ఆర్గానిక్ బెల్లంతో చేసింది, ఒకటేమో నల్ల బెల్లంతో చేసింది, ఒకటి ఎర్రబెల్లంతో చేసింది, ఇంకోటి చాక్లెట్ సిరప్ కలిపి, తీపి వేయకుండా కేవలం చాక్లెట్ మాత్రమే వేసి చేసింది. మరోటి షుగర్ ఫ్రీ సిరప్ వేసి చేసింది. ఇలా రకరకాల ఉగాది పచ్చళ్ళు చేశాను.” చెప్పింది కొంచెం గర్వానికి పోతూ.
“కొంచెం ఎలకల మందో, ఎండ్రినో, కుంకుడు పులుసో వేసి కూడా చేయలేకపోయావా?” అని పళ్ళు పట పటా కొరికి, “అయినా ఇన్ని రకాలు ఎందుకు చేసినట్టు” అడిగాడు చిరాగ్గా.
“పోటీలకు వెళ్లడానికీ, పోటీలో గెలవడానికీనూ” పళ్ళన్నీ బయటపెడుతూ చెప్పింది.
“గెలవడం ఏంటి?” అడిగాడు ఆవదం మొహంతో.
“అదే, ఉగాది పచ్చడి పోటీలు మన అపార్ట్‌మెంట్లో జరుగుతున్నాయి. మన ప్రెసిడెంట్ గారు ఉగాది పచ్చడి పోటీ నిర్వహిస్తున్నారు. గెలిచిన వారికి పదివేలు బహుమతి కూడాను. కనుక నేను, కొత్తగా ఆలోచించి, ఉగాది పచ్చళ్ళలో ఇన్ని రకాలు చేశాను, వెరైటీగా. ఎందుకంటే పక్కాగా బహుమతి నాకే రావాలి కదా. అందుకని, వీటన్నిటిని రుచి చూసి మీరు ఏది బాగుందని కన్ఫర్మ్ చేస్తారో, దాన్ని నేను ఈ పోటీలో పెడతాను. ఎలా ఉంది నా ప్లాన్?” అడిగింది ఉత్సాహంగా.
“చాలా దరిద్రంగా ఉంది. అయినా నేనెందుకు తినడం? నువ్వే రుచి చూసి తెలుసుకోవచ్చు కదా” అడిగాడు.
“నేను చేసుకున్నది నాకు ఎలాగో నచ్చుతుంది. కనుక ఏది బావుందో సరిగా జడ్జ్ చేయలేక పోవచ్చు. అందుకనే, ఈ సువర్ణ అవకాశం మీకు ఇచ్చాను”. చెప్పింది అందులోంచి ఓ గిన్నె తీసి మధుకి అందిస్తూ.
“అలాగా, అయితే వెళ్ళి ఉగాది పచ్చళ్ళు రుచి చూడటానికి ఒక చిన్న స్పూన్ పట్టుకురా” చెప్పాడు వాటి వంక భయంగా చూస్తూ.
“తీసుకొని తిని ఎలా ఉందో చెప్పండి” అంటూ చిన్న గరిట అందించింది.
ఇక తప్పదన్నట్టు, కొంచెం తిని తినగానే వాక్, వాక్ అంటూ వాంతు చేసుకోబోయి తమాయించుకున్నాడు. తర్వాత పంచదారతో చేసిన పచ్చడి రుచి చూసి, బుర్ర బర బరా గోక్కున్నాడు. తర్వాత చాక్లెట్ తో చేసిన పచ్చడి తిని, పొట్ట, చేతులు, చాతీ గోక్కుంటూ, “ఈ రకం తిన్నాక ఎలర్జీ వచ్చినట్టుందే”, అని దువ్వెనతో ఒళ్ళు గోక్కున్నాడు. తర్వాత, ఇలా కాదు అని కళ్ళు మూసుకుని, అన్నీ ఒక్కో స్పూన్ గబ, గబా రుచి చూసాడు.
తర్వాత కళ్ళు తెరిచి, “అన్నిటిలోకి ఆ పంచదారతో చేసినదే నయం” చెప్పాడు.
“ఆర్ యు ష్యూర్? లేకపోతే మళ్ళీ రుచి చూస్తారా?” అడిగింది
ఒక్కసారే ఎగిరిపడి, “నీ కడుపు మాడా మళ్ళీనా! నేను చచ్చినా మళ్ళీ రుచి చూడను. ఈ పచ్చడి బాగుంది, ఈ పచ్చడ్ని పోటీలో పెట్టు, తప్పక బహుమతి వస్తుంది” చెప్పాడు కరాకండిగా
“సర్లేండి” చెప్పి, “ఏమైంది?” అడిగింది కొంచెం కడుపు పట్టుకు ఇబ్బంది పడుతున్న మధు వంక చూస్తూ.
“ఉదయం దిన పత్రిక, రాశిఫలాలలో ఉదర సమస్యలు ఉగాది రోజు ఎదురవుతాయి, జాగ్రత్తగా ఉండండి అన్నప్పుడే నేను ఈ ఉగాది పచ్చడికి దూరంగా ఉండవలసింది. ఇప్పుడు ఆ ఉదర సమస్యలు బేషుగ్గా మొదలయ్యాయి”. అంటూ కడుపు చేత్తో పట్టుకుని బాత్రూం వైపు పరుగు తీశాడు.
‘అయ్యో బహుమతి వస్తుందనుకుంటే ఇలా ఎలా జరిగింది’ అనుకుని వాచీ చూసుకుని, ‘టైమ్ అయిపోతోంది పోటీకి వెళ్ళాలి’ అని గిన్నెతో పరుగుతీసింది లలిత.
