[19 మార్చ్ 2026 శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా తాటికోల పద్మావతి గారు రచించిన ‘ఉగాది’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
ఉగాది అంటేనే ప్రకృతికే చైతన్యం
చెట్లు, చేమలు చిగురించి
నూతనత్వాన్ని సంతరించుకుంటాయి
గున్న మామిడిలో దాగిన కోకిలమ్మ
లేత చిగురులు తిని మత్తుగా కూస్తుంది
పచ్చని తోరణాలు అలంకరించుకున్న
గడపలు ఆమనిని ఆహ్వానించే వేళ
ఉగాది లక్ష్మిని స్వాగతిస్తాయి
భూమాతకు వేప పూల పాన్పు వేసి
కోయిలమ్మ పాడే జోల పాటలు
షడ్రుచులు ఉగాది పచ్చడి
ఆనందోత్సాహాలతో ఆమని పులకించే వేళ
ప్రకృతి జీవితం పచ్చగా ఉంటేనే
జనజీవనం పచ్చగా ఉంటుంది
సిరులొలికే సంపదల కన్నా
రక్త సంబంధాల అనుబంధాలు
కలగలుపు కొంటేనే
మనసులు చిగురిస్తాయి
షడ్రుచులు ఉగాది పచ్చడిలా
ఆరు రుతువుల ఆమని
జీవితంలో కష్టసుఖాలను పంచుకున్నట్లు
చేదు జ్ఞాపకాలను వదిలి
మధురస్మృతులతో మెలగాలి
పరాభవమా!
పరాభవాలు చేయక
మా అపరాధాలు మన్నించు
జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలను
సమానంగా స్వీకరించగల స్థితప్రజ్ఞత
సాధించడమే ఉగాది
ఆచార సాంప్రదాయాలను దాగివున్న
శాస్త్రీయత ఆరోగ్యాన్ని ప్రసాదించే వేప పువ్వు
ఎల కోయిల పాటలు
చిరుమామిళ్ల పూతలు
పొగరు మధుపాల సొగసులు
మల్లయ్య పవనాల ఊసులు
మరువజాలము నవ వసంతుని లీలలు
శిశిరానికి వీడ్కోలు ఇచ్చి
వసంతానికి స్వాగతం పలుకుదాం
