[19 మార్చ్ 2026 శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా ‘ఉగాది వైశిష్ట్యము’ అనే వ్యాసం అందిస్తున్నారు డా. మైలవరపు లలితకుమారి.]
పండుగలు భారతీయ సంస్కృతీ, సాంప్రదాయాలకు, ఆచారాలకు కేంద్ర బిందువులు.
ప్రతి కుటుంబం, బంధువులు, మిత్రులు అందరూ కలిసిపోవడానికి ఈ పండుగలు ఉపకరిస్తాయి. అందువలన మానవుల మధ్య ఐకమత్యం ఏర్పడడమే కాక ఒక నూతన ఉత్సాహము, ఆనందము కలుగుతుంది ఆధ్యాత్మిక చింతన కూడా పరిఢవిల్లుతుంది. అంత గొప్ప నేపథ్యమున్నది పండుగలకు. తెలుగువారి పండుగలలో మొదటిది ఉగాది.
ఉగాది అనగా “ఉగస్య ఆది” ఉగాది. నక్షత్ర గమనం తెలియచెప్పేది ఉగాది. బ్రహ్మ సృష్టి ఆరంభించిన రోజు. ప్రపంచం పుట్టుకకు మొదటి రోజు కనుక ‘ఉగాది’ లేదా ‘యుగాది’ అని అంటారు. యుగం అంటే ‘రెండు’ లేదా ‘జంట’ అని అర్థం. ఉత్తరాయణం, దక్షిణాయణం అని సంవత్సరంలో రెండు అయనాలు మనకి కనిపిస్తాయి. కాలమే దైవస్వరూపం.
“ఋతూనాం కుసుమాకరః”
భగవద్గీతలో పరమాత్మ ఋతువులలో నేను వసంత ఋతువుని అన్నాడు. అందుకే పరమాత్మకు వసంతఋతువులో వచ్చే ఉగాదికి అవినాభావ సంబంధం ఉన్నది. చైత్ర శుద్ధ పాడ్యమినాడు అనగా ఉగాది రోజున బ్రహ్మసృష్టి ప్రారంభించినట్లు పురాణాలలో చెప్పబడింది. వేదాలను అపహరించిన సోమకుని విష్ణువు మత్స్యావతారమును ధరించి సంహరించిన రోజు ఉగాదిగా ప్రసిద్ధికెక్కింది. మనకు గల ఆరు ఋతువులలో శిశిరఋతువు ఆకులు రాలు కాలం.
“జాతస్య హి ధ్రువో మృత్యుః
ధ్రువం జన్మ మృతస్యచ”
అనే జీవనసత్యాన్ని తెలియజెబుతుంది.
మా ఇంట్లో శిశిర ఋతువుఛాయలు
శిశిర ఋతువులో రాలిన ఆకులు వసంతఋతువులో మరల చిగురిస్తాయి. జనన మరణచక్ర విన్యాసమే ఋతుపరిభ్రమణము. శిశిరం తరువాత వసంతం వస్తుంది. వసంత కాలంలో మోడయిన చెట్లన్ని చిగిర్చి ప్రకృతి శోభాయమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది.
వసంతశోభ
మావిచివురులు మేసిన కోయిలలు కుహూ కుహూరావాలతో పాడుతూ ఉంటాయి. ఉగాది నుండి తెలుగు సంవత్సరాలు ప్రారంభమవుతాయి. అందుకే ఉగాది తెలుగువారి మొదటి పండుగ. ఇవి మొత్తం అరవై సంవత్సరాలు. ఈ జరుపుకునే ‘పరాభవ’ నామ సంవత్సరము నలభైయవ వత్సరము.
ఈ నూతన సంవత్సరంలో పంచాంగ శ్రవణం ప్రధానమైనది. పంచాగమంటే తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణముల గమనము ద్వారా జనులు రాశిఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొని గ్రహశాంతులను జరిపించుకుంటారు. ఇందులో తిథి ఆదాయాన్ని, వారం ఆయువును, నక్షత్రం పాప ప్రక్షాళనను, యోగం వ్యాధినివారణ, కరణం పవిత్ర గంగానదిలో స్నానం చేసిన పుణ్యఫలాన్ని అందిస్తుందని నమ్ముతారు. అందుకే పంచాంగశ్రవణం గంగానదిలో స్నానం చేసిన పుణ్యఫలాన్నిస్తుందని పండిత వాక్కు. పంచాంగం కాలపురుషుడైన మహావిష్ణువుకు ప్రతిరూపం. నవగ్రహాలు సకలసౌఖ్యాలు కలుగచేస్తాయని దైవానుగ్రహం కలుగుతుందని పండితుల వాక్కు.
ఈ ఐదింటిని లెక్కవేసి పండితులు మానవుల మంచి చెడులను మాత్రమేకాక దేశ భవిష్యత్తును కూడా పంచాంగశ్రవణంలో వివరిస్తారు. చైత్రశుధ్ధ పాడ్యమి నుంచి శ్రీరామనవమి వరకు వసంతనవరాత్రులు చెయ్యడం ఒక ఆచారం.
ఉగాది పండగ రోజున ప్రతి దేవాలయమునందు ప్రజాశ్రేయస్సు కొరకు పండితుల చేత వేదపఠనము, పంచాంగ శ్రవణము చేయబడుతుంది. ఆ తరువాత ఏ పనిని ప్రారంభించినా ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగుతాయని నమ్మకం. ఉగాది రోజున ప్రత్యేకంగా ఆరు రుచులతో కూడిన ప్రసాదాన్ని తీసుకుంటారు. ఆరు రకాల అనుభవాలను తెలియజేసేదే ఈ ఉగాది ప్రసాదం. ఇందులో వేపపువ్వు, బెల్లం, చింతపండు, ఉప్పు, మిరపకాయలు, వగరు (మామిడికాయ) మిళితమయి ఉంటాయి. ఈ రుచుల కలయిక వలె మనిషి మానవతా దృష్టి కలిగి అందరినీ సమభావంతో చూడాలన్నదే ఈ రుచులు మనకు తెలియజేస్తాయి. ఇందులో
వేపపువ్వు: చేదు – బాధ,
బెల్లం: తీపి – సంతోషం,
చింతపండు: పులుపు- విరక్తి ,
ఉప్పు: ఉప్పు – రుచి,
మిరపకాయలు: కారం – కోపం,
మామిడికాయ: వగరు – ఆశ్చర్యం
ప్రసాదంలో ఆరు రుచులు మిళితమై ఉంటాయి. ఈ షడ్రుచులను స్వీకరించటం వలన మనిషి ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోగలడనే విషయం మనకు చెబుతుంది. ఈ పండుగనాడు షడ్రుచులను స్వీకరించి అరిషడ్వర్గాలను ఎదుర్కోవాలి అనే బోధన అంతర్లీనంగా మనకు కనిపిస్తుంది.
సూర్యోదయానికి పూర్వమే లేచి అభ్యంగన స్నానమాచరించి, నూతన వస్త్రధారణము చేసి షడ్రుచుల ప్రసాదము స్వీకరించి దైవదర్శనం చేసుకుంటారు. ఆ తరువాత పురోహితులు చేసే వేదపఠనము, పంచాంగశ్రవణములను వింటారు. అంతేకాక కవికోకిలల కవిసమ్మేళనములతో పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు.
ఈ నూతన సంవత్సరం పరాభవ నామసంవత్సరం. ‘పర+అభవ’ అని మనం చెప్పుకోవాలి. భూమ్మీద పుట్టిన మానవుడు ఇహపరాలను గురించి ఆలోచిస్తాడు. పర అంటే భగవంతుని చేరు మార్గము. అభవ అంటే పుట్టుక లేనివాడు ఆ పరమేశ్వరుడు. పరాభవ అనగానే అవమానం అనుకుంటారు. కానీ పరాభవ అంటే పరమునకు సంబంధించిన అభవుడైన ఆ పరమేశ్వరుని ప్రతిరూపంగా మనం చెప్పుకోవచ్చ. “యద్భావం తద్భవతి” అన్నారు పెద్దలు. నీ ఆలోచనలు ఎలా ఉంటే జీవితం అలా నడుస్తుంది అని అర్థం. అందుకే ఈ సంవత్సరాన్ని ఈశ్వర సంవత్సరంగా భావించి
“గడపలను పచ్చని పసుపు
కుంకాలతో అలంకరించి
ద్వారాబంధానికి ఆకుపచ్చని
మామిడి తోరణాలను కట్టి
మమతానురాగ మధురిమలను
మనసంతా నింపుకొని
ఆనంద సంబరాలతో
పరాభవ నామ నూతన ఉగాదికి స్వాగతం పలుకుదాం.”
ఆ పర+అభవునినామస్మరణంతో సంవత్సరమంతా ఆనంద, సుఖశాంతులతో జీవిద్దాం.
