Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

విశాఖ ఉక్కుకు సంఘీభావంగా కవనం

[‘ఉక్కు కవనం’ అనే కవితా సంకలనాన్ని సంచిక పాఠకులకు పరిచయం చేస్తున్నారు శ్రీ చలపాక ప్రకాష్]

‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు’ అనే నినాదంతో ఎందరో చేసిన త్యాగాలు, పోరాటాల ఫలితంగా బంగాళాఖాతం ఒడ్డున నిలిచిన విశాఖ ఉక్కు ఆధునిక వాణిజ్య రంగానికి కల్పతరువు. ఎన్నో ఏళ్లుగా ఎందరో ఉద్యోగులకు ఉపాధి కల్పిస్తూ విశాఖ నగరానికి, రాష్ట్రానికి తలమానికంగా ఉన్న విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేసే కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకిస్తూ, ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు, రాజకీయ పార్టీలు విశాఖకు అండగా నిలిచిన సందర్భంలో, కవులు కూడా విశాఖ ఉక్కు కు సంఘీభావంగా కవిత్వం రాశారు, కవితా సంకనాలు వేశారు.

అందులో ఒకటి ఈ ‘ఉక్కు కవనం’ కవితా సంకలనం. దీనిని పశ్చిమగోదావరి జిల్లా అరసం శాఖ ప్రచురించింది. మొత్తం 23 కవితలు ఉన్న ఈ సంకలనంలో కవులందరూ ముక్తకంఠంతో కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించారు. శైలిపరంగా కవిత్వ స్థాయిల్లో తేడా ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరూ విశాఖ ఉక్కుకు అండగా నిలుస్తామని, దాని వెనుక ఉన్న కుట్రలో కుతంత్రాలు ఛేదిస్తూ, విశాఖ ఉక్కు వెనుక ఎందరో జీవితాలు ముడిపడి ఉన్న విషయాన్ని అందరికీ అర్థమయ్యేటట్లు కవిత్వీకరించారు ఇందులోని కవులు. కవి ఉప్పెన ‘ఉక్కు హక్కు పోరుకు సై’ శీర్షికలో “ఉక్కుపోతుంది రా తమ్ముడా/మన హక్కు పోతున్నది చెల్లెలా/మన త్యాగాల ఫలితాన్ని తమ్ముడా/తన్నుకు పోతుండ్రు చెల్లెలా/తాతలు తండ్రులు త్యాగాలు చేశారు/పోరాటాలు చేసి ప్రాణాలు ఇచ్చారు/వైజాగ్ స్టీల్ను సాధించి తెచ్చారు/ బ్రతుకు పోతుందిరా తమ్ముడా/మన మెత్కు పోతున్నది చెల్లెలా/ లక్షలాదిమంది తమ్ముడా/వీధిన పడుతుండ్రు చెల్లెలా’’ అంటూ అందరికీ అర్థమయ్యేలా ఉద్యమ స్వరాన్ని పెంచారు.

ఎంఎస్ రాజు ‘సజీవ దహనం’ అనే కవితలో “మోజంతా తీరాక/కట్న కానుకలు గుర్తొచ్చినట్టు/నచ్చినదంతా నంజుకు తినేసి/ఇప్పుడు నష్టాలు అంటున్నారు” అంటూ వాస్తవాన్ని నిక్కచ్చిగా చెప్పారు.

హైమావతి సత్య ‘మేధావులకు విన్నపం’ అనే శీర్షికలో “విశాఖ నగర శిఖలో/నాగరంలో బాసిల్లిన స్టిల్ ప్లాంట్/నేడు నిరాహార దీక్షలతో, బందులతో/మరోసారి రణస్థలిగా మారింది” అని ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితిని కళ్ళకు కట్టినట్లు చెప్పారు.

డాక్టర్ ఎన్ ఈశ్వర్ రెడ్డి ‘నాడు- నేడు’ అనే శీర్షికలో “నాడు/్జాతి కోసంఆర్థిక ఆదాయ ఉపాధి సంస్థలను/జాతీయం చేసేవారు/నేడు/ కార్పొరేట్ల కోసం/జాతి ప్రయోజనాలను/తాకట్టు పెడుతున్నారు” అంటూ నేటి కేంద్ర ప్రభుత్వం తీరును ఎండగట్టారు.

బంగారు వి. బి. ఆచార్యులు ‘ఉక్కు సత్తా చాటరా’ అనే శీర్షికలో “పాలకుల మెడలు వంచి/అధికారపు బలుపు దింప/సమాయత్తమవ్వరా/సమర శంఖమూదరా/ఉద్యమించరా తమ్ముడా/ఉద్యమాల చరిత్రతో/ఉరకలెత్త నీ రక్తము/ ఉద్యమించు తమ్ముడా/ఉక్కు పిడికిలెత్తరా/ఉక్కు సత్తా చాటరా” అంటూ పిలుపునిచ్చారు.

ప్రైవేటీకరణ బాట పడుతున్న కేంద్ర ప్రభుత్వ విధానాలలో విశాఖ ఉక్కు తరలిపోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత కవులు, రచయితలదే కాదు.. ప్రతి తెలుగు వాడి గుండె చప్పుడుది. సంఘీభావం ప్రకటించిన అవసరం తక్షణం మన ముందు ఉన్నది.

***

ఉక్కు కవనం (కవితా సంకలనం)

ప్రచురణ: అరసం పశ్చిమగోదావరి జిల్లా శాఖ,

పుటలు: 74

వెల: 60 రూపాయలు

ప్రతులకు: బొల్లినేని నాగార్జునసాగర్,

మధ్యాహ్నపు వారి గూడెం,

పశ్చిమగోదావరి జిల్లా, సెల్ నెంబర్: 96764 25951.

Exit mobile version