[హరిచందన్ గారు రచించిన ‘ఉండలేను మరి’ అనే కవితని అందిస్తున్నాము.]
ఆగని వాహనాల రద్దీతో
సంకుచితమైన మార్గాలు
ఉన్న ఈ నగరాన్ని కాస్త
క్షమించవచ్చు.. అవసరం కనుక
తెగని కాలుష్యమేఘాలతో
నా ఊపిరిదిబ్బడను నిరంతరం
పొదిగే ఈ పట్టణాన్ని కాస్త
క్షమించవచ్చు.. సమిష్టి కనుక
పోగులాంటి నర్మగర్భపు మాటలతో
మీరిన లౌక్యపు కుఱ్ఱచేష్టలతో
కుఱచైనా ఈ పురాన్ని.. ఇంక్కాస్త
క్షమించవచ్చు.. పథమదే కనుక
సాగిపోతున్న ముఱికికాలువను కూడా
సుగంధం చేస్తున్న పారిజాతము
తపఃపరిమళం పంచుతున్న వాలఖిల్యుల్లాంటి పున్నాగ
ఐమూలగానే ఉన్న ఈ పత్తనాన్ని
ఇప్పుడు
ప్రేమించకుండా..
ఆరాధించకుండా..
అబ్బురపడకుండా..
ఉండలేను మరి