Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అన్ఐడెంటిఫైడ్ లైటింగ్ ఆబ్జెక్ట్!

[శ్రీ శ్రీను పైండ్ల రచించిన ‘అన్ఐడెంటిఫైడ్ లైటింగ్ ఆబ్జెక్ట్!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

U.L.O.. అన్ఐడెంటిఫైడ్ లైటింగ్ ఆబ్జెక్ట్!

~
నింగిని తాకే అద్దాల మేడల నడుమ,
ఊపిరాడని ఈ రాతివనాల మధ్య,
ఎక్కడికి వెళ్ళాలో, ఏ తలుపు తట్టాలో తెలీక,
ఇరుక్కుపోయి వెలవెలబోయింది పండు వెన్నెల.
అమ్మ ఒడి దొరకని అనాథలా!

నియాన్ వెలుగుల హేళనకు,
కళ్ళు మిరుమిట్లు గొలిపే కృత్రిమ కాంతుల మధ్య,
దిష్టిబొమ్మలా మిగిలి,
ఏ బాల్కనీలోనో తల దాచుకోవాలని,
ఆరాటంతో పరిగెత్తి, అలసి సొలసి సొమ్మసిల్లి,
తన నీడలో తానే దాక్కుని.. భయంగా ఒదిగిపోయింది .

జనారణ్యంలో బిక్కుబిక్కుమనే ఈ వెండివెలుగు
పల్లెటూర్ల పొలిమేరల్లో ఎంత స్వేచ్ఛగా
ఊపిరి పీల్చుకునేదో!

చెట్ల కొమ్మల జల్లెడలోంచి జారి,
నిద్రిస్తున్న పెంకుటిళ్ళ చూరుల్నుంచి
మునివేళ్ళతో మట్టివాకిళ్ళలోకి చేరి,
సరిహద్దుల్లోని కొండకోనల నడుమ సేద తీరి..
చెరువు అలలపై వెండి జలతారు పరదాలై నాట్యమాడి,
పచ్చని సీమపై తెల్లని దుప్పటై, అందంగా పరుచుకునేది.

అలుపెరగని బతుకు పోరులో అది కేవలం వెలుగు కాదు.
అంతరాలను చెరిపేసి ఆత్మలను తడిపే అనురాగ స్పర్శ.
పగటి తాపాన్ని చల్లార్చే ఆ అమృతధారలో
లోకం మైమరచి సేద తీరేది.

కాలం పొరల్లో ఆ చంద్రిక వైభవం
ఎందుకిలా ఇంకిపోయిందో?

మట్టి పరిమళాలు ఆవిరై
పల్లెలూ, మనసులూ కఠిన రాతి కవచాలు తొడుక్కుంటున్న వేళ,
రియలెస్టేట్ వెంచర్ల గిరిగీతలతో,
స్వచ్ఛమైన కాంతిని భరించే శక్తిలేక,
కాంక్రీటు కీకరణ్యపు కోనకోనలు
చంద్రప్రభ ఊపిరిని కఠినంగా
నొక్కిపట్టినట్టే ఉన్నాయి.

తలుపులన్నీ మూసేశాక
ఎవరికీ అక్కర్లేని చుట్టంలా
గడప బయటే పడిగాపులుగాచి కాచి,
మౌనంగా రోదిస్తూ..
చివరికి నిశ్శబ్దంగా
కారుచీకటి కడుపులో
ఆ జాబిలి నవ్వు సమాధైపోతోంది.

ఇక్కడ వెన్నెల ఇప్పుడు..
అంతా మర్చిపోయిన నిర్లిప్త ప్రశాంతత!
యాంత్రిక జీవన శిలా సమాధిలో
సమాప్తమవుతున్న సహజానుభూతి!

Exit mobile version