[కొండూరు వేంకటేశ్వర శర్మ గారు రచించిన ‘ఉనికే తెలియని నేను’ అనే కవితని అందిస్తున్నాము.]
ఉనికే తెలియని నేను
నీ గర్భంలో ఒదిగాను
లోకమే తెలియని నాకు
ఊపిరై నిలిచావు నీవు
నాకైన తొలి బంధం నువ్వే
నాకున్న తొలి ప్రేమ నువ్వే
కదులుతూ మెదులుతూ నేను
ప్రతి కదలికకు మురిసావు నువ్వు
అటు ఇటు తిరుగుతూ నేను
నా అల్లరికే మైమరచావు నువ్వు
ఊసులాడుతుంటే ఊ ఊలు కొట్టాను
నా కేరింతలే కనువిందయ్యాయి నీకు
ఆటల మాటున ‘అత్తా’ అని పలికాను
తబ్బిబ్బై నన్ను హత్తుకుని ముద్దాడావు
తూలుతూ తూగుతూ నేను
మురిసిపోతూ చూసావు నీవు
నిలవడం నేర్చాను నేను
చేయి పట్టి నడిపావు నువ్వు
పడుతూ లేస్తూ ఏడుస్తూ నేను
ఆడి పాడి నవ్వించావు నువ్వు
నడవడం నేర్చిన నేను
విడవడం తెలుసుకోలేదు
ఎదగడం నేర్చిన నేను
ఎన్నటికి నిన్ను మరవలేను అమ్మా!
