[సుధా కళ్యాణి ఆచంట గారు రచించిన ‘ఉన్నతి దిక్కుగా’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
ఓ ఆడపిల్లా, వెనకడుగు వేయకలా
ఉన్నారులే ఇంకా మిగిలున్నారులే
నీ విలువ తెలిసున్న సదాచార సంపన్నులు!
పుట్టుకతోనే నీ ఉనికిని లోకువ కడుతున్నా
తోడుగా నిలిచేటి సహృదయం అండగా
వేవేల అడుగులు ముందుకు వేయాలి కన్నా!
నీ విజయం నీ చేతిలోనే దాగుందంటూ
తగిన విద్యను నేర్చి విలువను పెంచుకుంటూ
ఆటంకాల వెంబడి కొంగ్రొత్త దారులు వేసుకుంటూ
నీ ధైర్యమే నీ కలల నారుమడిని చిగురింపచేయగా
ఓ ఆడపిల్లా, నీ ఉన్నతి దిక్కుగా
కనిపించని రెక్కలున్న విహంగమై సాగిపోవాలి!
ఇంటా బయటా విలువను పెంచుకుంటూ
ఎగసే కీర్తి పతాకవై నీవిక మెరిసిపోవాలి!
