Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఉపాధ్యాయ శిక్షణా గురువులు

[‘నన్ను ప్రభావితం చేసిన నా గురువు’ అనే శీర్షిక కోసం తమ ఉపాధ్యాయ శిక్షణా గురువుల గురించి వివరిస్తున్నారు శ్రీమతి దాసరి శివకుమారి.]

తెనాలి లోని హిందీ ప్రేమీమండలి మహా విద్యాలయం నాజరుపేటకే తలమానికంగా వున్నది. విశాలమైన ప్రాంగణంలో వుండి, మేం చదివేటప్పుడు కొన్ని పెంకుటిళ్ళు, కొన్ని భవనాల సముదాయంతో హుందాగా అలరారుతూ వుండేది. కాలక్రమేణా  అవి అన్నీ  భవంతులుగా రూపుదిద్దుకున్నవి. ఈ ప్రేమీమండలిలో ప్రాథమిక పరీక్ష నుండి, రాష్ట్రభాషా ప్రవీణ వరకు, ఆ తర్వాత ప్రవీణ పూర్తి చేసిన వారికి ‘హిందీ ప్రచారక్’ అను పేరుతో ఉపాధ్యాయ శిక్షణా తరగతులు ఒక ఏడాది పాటు జరిగేవి. అంతకు ముందు ప్రవీణకు ముందు పరీక్ష అయిన ‘విశారద’ పూర్తిచేసినవారికి కూడా జూనియర్ ఉపాధ్యాయ శిక్షణా తరగతులుండేవట.

బోయపాటి నాగేశ్వరరావు గారు, బోయపాటి సుభద్రాదేవి గారు

ఈ ప్రేమీమండలి మహావిద్యాలయాన్ని గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా బోయపాటి నాగేశ్వరరావు గారు, వారి ధర్మపత్ని బోయపాటి సుభద్రాదేవి గారు నిర్వహించేవారు. అదొక పవిత్రమైన స్థలంగా ఇప్పటికీ అనేకమంది భావిస్తూ వుంటారు. ఎందుకంటే భారత స్వాతంత్ర్య సంగ్రామ ఉద్యమ సమయంలో గాంధీజీ తెనాలిని 2, 3 సార్లు దర్శించారట. ఒకసారి అలా వచ్చినప్పుడు ఫ్రేమీమండలి వున్న స్థలంలో జాతీయ జెండాను ఆవిష్కరించారట. దానికి గుర్తుగా ఆ కొయ్య స్తంభాన్ని ఇప్పటికీ పదిలంగా భద్రపరిచారు. ఇప్పుడు కూడా సందర్భం వచ్చినపుడల్లా ఆ స్తంభం మీదే జాతీయపతాకాన్ని ఎగుర వేస్తూ వుంటారు. ఆ స్తంభానికి అనుకునే గాంధీజీ శిబిరాన్ని కూడా ప్రేమీమండలి వారే ఏర్పాటు చేశారు. ఆ శిబిరానికి ఒక విశేషత వున్నది. గాంధీజీ పుట్టిన ప్రాంతమైన పోరుబందరు నుండి కొంత మట్టిని తీసుకొచ్చి పవిత్రస్మృతి చిహ్నంగా సందర్శకుల కోసం దాచి ఉంచారు. ఆ శిబిరంలో ఒక చిన్న స్తూపం లాంటిది కట్టి దాని మీద గాంధీజీ విగ్రహాన్నుంచారు. మేం అక్కడ చదువుకునే రోజుల్లో రోజూ రాత్రి పూట భోజనం కాగానే ఆ శిబిరానికి వెళ్లి ‘రఘుపతి రాఘవ రాజారాం’ లాంటి కీర్తనలు పాడేవాళ్లం. ఆంధ్రా పారిస్, కళల కాణాచి అయిన తెనాలి పర్యటనలో చాలామంది ఈ గాంధీజీకి సంబంధించిన విశేషాలను గూడా తిలకించాలని కోరుకుంటారు.

ఈ మహావిద్యాలయింలో వేలమంది విద్యార్థులు తమ హిందీ పరీక్షలను పూర్తి చేసుకున్నారు. ఎవరికైనా ఆసక్తి వుంటే ‘మెట్రిక్’ లాంటి వాటిలో కూడా శిక్షణ ఇప్పించేవారు. దూరప్రాంతాల విద్యార్థులు ఇక్కడి వసతి గృహాలలో వుండి తమ విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకుని వెళ్ళేవాళ్లు, బోయపాటి దంపతులు తమ విద్యార్థులను కుటుంబ సభ్యులుగా చూసుకునేవారు. మా ‘ప్రచారక్’ బ్రెయినింగ్ క్లాసులకు బోయపాటి దంపతులే కాక, సత్యనారాయణ మాస్టారు, సీతామహాలక్ష్మి టీచరు గారు కూడా వచ్చి బోధించేవారు. బోయపాటి నాగేశ్వరావు గారే కాలేజీ ప్రిన్సిపాల్ గారు కూడా. ఖద్దరు బట్టల్లో నిండుగా, గంభీరంగా వుండేవారు. మాకు తరగతులు నిర్వహించేటప్పుడు సిలబస్‌తో పాటు, ‘వార్ధా’ ఆశ్రమంలో వున్నప్పటి అనుభవాలను గురించి కూడా చెప్పేవారు. మాకు సభా పిరికితనం, భవిష్యత్తులో బోధనాసమయంలో తడబాటు లేకుండా వుండటానికి, వారు అప్పుడప్పుడూ డిబేట్ కార్యాక్రమాలు ఏర్పాటు చేసేవారు. ఎవరైనా భయపడుతూ వుంటే “ఆఁ,  ఆఁ, నీ గొంతు గట్టిగానే విన్పిస్తున్నది. ఈ రోజుకు రెండు వాక్యాలు చెప్పు. మరో వారంలో పూర్తి ఉపన్యాసం చెప్దువుగాని” అంటూ ప్రోత్సహించేవారు. ప్రిన్స్‌పాల్ గారితో పాటు అప్పుడప్పుడు సత్యనారాయణ మాస్టరు కూడా ఇలాంటి కార్యక్రమాలు చూసేవారు. సీతామహలక్ష్మి టీచరుగారు, అప్పటికింకా అవివాహితగా వున్నారు. బాగా నెమ్మదిగా వుండేవారు. ఇక మా సుభద్రాదేవి గారి విషయాని కొస్తే ఎన్నో విషయాలు గుర్తుకొస్తాయి. ఆమె కూడా ‘వార్ధా’ ఆశ్రమంలో వుండి వచ్చిన స్త్రీమూర్తి. ఆ ప్రభావంతో గాంధీజీ గారంటే ఈ దంపతులు ఎంతో గౌరవం, భక్తి ప్రపత్తులతో వుండేవారు. ఆ భావనతోనే తమ పిల్లలకు మోహన్ అనీ, కస్తూరి అనీ పేర్లు పెట్టుకున్నారు. సుభద్రాదేవిగారు మా తరగతులకు ఎప్పుడూ, సన్నని మెత్తని పట్టు చీరల్లో వచ్చేవారు. ఎర్రని దేహచ్ఛాయలో వుండేవారు, నల్లనిజుట్టు ముడి వేసుకొని, భుజాల చుట్టూ కొంగు కప్పుకుని క్లాసురూమ్‌కి వచ్చేవారు. ఆమె ముడి అంజలీదేవి తెలుగు సినిమాల్లో సీతాదేవి పాత్ర కోసం వేసుకున్న వరుసల వరుసల జుట్టు ముడిలాగే అన్పించేది. మెత్తని కంఠంతో, మృదు మధురంగా, వినసొంపుగా, పాఠం చెప్తూ తరగతి నలువైపులా చూస్తూ నవ్వుతూ ఆ పిరియడ్ పూర్తి చేసేవారు. నేను కూడా భవిష్యత్తులో అలాగే అచ్చంగా హిందీలో మాట్లాడుతూ విద్యార్థులకు పాఠం చెప్పాలి అని బలంగా అన్పించేది. ఆమె ప్రభావం – నేను కొన్ని రేడియో కార్యక్రమాలలో పాల్గొనేటట్లు చేసింది.

నేను కూడా హాస్టల్లోనే వుండి నా ‘ప్రచారక్’ ట్రెయినింగ్ పూర్తి చేసుకున్నాను.  విద్యార్థులకూ, విద్యార్థినులకు వేరువేరు హాస్టల్స్ ఉండేవి. బోయపాటి దంపతుల నివాసం కూడా అక్కడే కాబట్టి చీటికీ మాటికీ వెళ్ళి ఏ చిన్న సందేహమున్నా సుభద్రాదేవి గారి దగ్గరే సలహా తీసుకునేవాళ్లం. ఎప్పుడైనా షాపింగ్‌కు వెళ్లాలంటే మేడమ్ గారి పర్మిషన్ తీసుకొని నలుగైదుగురం కలసి వెళ్లి వచ్చేవాళ్లం, రాత్రి పూట హాస్టల్లో చదువుకుంటుంటే మధ్య మధ్య కొందరు కబుర్ల లోకి వెళ్ళేవాళ్లం. మేడమ్ గారు నిశ్శబ్దంగా తలుపు తీసుకుని హాస్టల్ లోపలికొచ్చేవారు. ఆమె లోపలికి వచ్చేవరకూ ఎవరికీ తెలిసేది కాదు. విచిత్రంగా ఆ సంవత్సర కాలంలో ఆమె రాకపోకలని మేమెవరమూ కనిపెట్టలేకపొయ్యాము. అలా వచ్చిన ఆమెను చూసి మేము మౌనంగా గోడకు బల్లుల్లా కరుచుకుపోయేవాళ్ళం. రాత్రిపూట బోజనానంతరం ఎవరైనా భజన కార్యక్రమానికి రాకపోతే మర్నాడు చురకలు వేసేవాళ్ళు. ప్రిన్సిపాల్ గారిని ఏమైనా అడగటానికి అందరికీ భయమే. అందరికీ అమ్మ సుభద్రమ్మే మా అందరి తరుపున వారిని కనుక్కుని చెప్పేవారు.

దేశ రక్షణ నిధికి, వరదబాధితులను ఎప్పుడైనా ప్రేమీమండలి నుండి ఆర్థిక సహాయం పంపాల్సి వచ్చినప్పుడు మా విద్యార్థులకు ఎన్నో జాగ్రత్తలు చెప్పి తెలిసిన వారి దగ్గరకు ధన సేకరణకు పంపేవారు. విశాఖ ఉక్కు పోరాటముప్పుడు తాను స్వయంగా ముందుండి మమ్మల్ని ర్యాలీలకు తీసుకెళ్ళి తీసుకొచ్చేవారు. “ధైర్యంగా స్లోగన్లు ఇవ్వండి” అంటూ ప్రోత్సహించేవారు.

హాస్టల్ నుండి ఏదైనా పని ఉండి ఇంటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు మేడమ్ గారి పర్మిషన్ కోసం వెళ్ళేవాళ్లం. భర్తా, పిల్లలు వున్న గృహిణులతో ఇలా అనేవారు – “బాధ్యతలున్న మీలాంటి వారిని నేను ఎప్పుడూ కాదనను. వెళ్లి రండి” అంటూ చిరునవ్వుతో పంపేవారు. మెస్ లోని భోజనం గురించి ఎవరైనా ఫిర్యాదు చేసినా “నేను వంటవారికి చెప్తాను. మీరూ కొంత సర్దుకోవాలి” అంటూ ఎవరికి చెప్పేవి వారికి చెప్పి ఒప్పించేవారు. మాది సమీప గ్రామం కాబట్టి మా అమ్మగారు ఉలవచారు, గడ్డజున్ను లాంటివి తయారుచేసి మా తమ్మడి కిచ్చి హాస్టల్ పిల్లలందరికీ సరిపోయేలా పంపేవారు. కొంతమంది దూర ప్రాంతాల విద్యార్థులు ఇంటికెళ్లి వచ్చేటప్పుడు ఎక్కువ డబ్బు తెచ్చుకుంటే దాని దాపరికమూ మేడమ్ గారి దగ్గరే, వారికి అవసరమొచ్చినప్పుడు కొంత కొంత తీసుకొని వాడుకునేవారు. ఆ లెక్కలన్నీ మేడమ్ గారు బాగా గుర్తుపెట్టుకునేవారు. ఆనాడు తెనాలిలో ‘మహిళా మండలి’ చాలా చురుగ్గా తమ కార్యకలాపాలు నిర్వహిస్తూ వుండేది. ఆ మహిళా మండలి కార్యదర్శిగా కూడా మేడమ్ గారు పనిచేసేవారు. నాలాంటి ఎన్నో వేలమంది ప్రేమీమండలిలో విద్యాభ్యాసం చేశారు. మరెంతోమంది ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసుకుని హిందీ ఉపాధ్యాయులయ్యారు. ఎన్నో దశాబ్దాల బ్యాచ్‌ల ఫోటోలు తీసి ఈనాటికీ వాటిని భద్రపరిచారు. ప్రేమీమండలి జ్ఞాపకాలు తవ్వుకుంటూ పోతే మంచి నీటి చెలమల్లాగా అవి ఊరుతానే వుంటాయి.

ఈనాడు కాలగర్భంలో బోయపాటి దంపతులు కలిసిపోయారు. కాని వారి కోడలు అరుణ గారు, వారి కుమార్తె కస్తూరి గారు వారి భర్త శ్రీనివాస్ గార్ల ఆధ్వర్యంలో ఈనాటికీ ప్రేమీమండలి కార్యక్రమాలు నడుపబడుతూనే వున్నాయి. ప్రేమీమండలి లోని చదువంతా దక్షిణ భారత హిందీ ప్రచార సభకు అనుబంధంగా వుంటుంది. రానురాను సిలబస్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి. దాని వలన టీచర్ బ్రెయినింగ్ క్లాసులు మూతబడ్డాయి. ప్రతి సంవత్సరమూ అక్టోబరు రెండవ తారీఖున గాంధీ జయంతిని ఇక్కడ ఘనంగా జరుపుతారు,

బోయపాటి నాగేశ్వర్రావు, బోయపాటి సుభద్రాదేవి దంపతుల హిందీ ప్రచార గురుపీఠం స్థాపించబడినది. దీని నిర్వహణంతా వారి కుటుంబ సభ్యులే జరుపుతున్నారు. ఈ పీఠం ఏటా పురస్కార ప్రదానం కూడా చేస్తున్నది. ప్రతి సంవత్సరం అక్టోబరు రెండున

ఒక కాలేజీ హిందీ అధ్యాపకుని లేదా ప్రిన్సిపాల్‌ని, ఒక హైస్కూల్ హిందీ ఉపాధ్యాయుడిని ఎన్నుకొని వారికి గురుదంపతులు హిందీ ప్రచార గురుపీఠ పురస్కారాలు, నగదు, ప్రశంసాపత్రంతో కూడిన ఒక జ్ఞాపిక – ఇంకను తదితర విధంగా ఘనంగా సత్కారం జరుపుతున్నారు. 2020వ సంవత్సరంలో అలాంటి ఘన పురస్కారాన్ని అందుకునే భాగ్యం నాకు కల్గింది. అక్టోబర్ రెండున  గొప్ప సభాకార్యక్రమం వుంటుంది. సభకు వచ్చిన అతిథులందరికీ గాంధీ శిఖర దర్శనం, జండా వందన కార్యక్రమంలో పాల్గొనే అవకాశం, ఆతిథ్యం కల్పించబడుతున్నది. ఇలా హిందీ ప్రచార రాష్ట్రస్థాయి పురస్కారాలను, ఒక గురుపీఠం ద్వారా అందించటం చాలా అరుధైన విశేషంగా చెప్చుకోవాలి.

ఆ గురు దంపతుల ప్రభావం నాలాంటి ఎందరో హిందీ ప్రేమికులపై గాఢంగా పడింది. ఆ ప్రభావం వలనే కావచ్చు, నా రచనల్లో తరచూ; ముఖ్యంగా ‘అమ్మకు వందనం’ నవలలో గాంధీజీ ఆశయాలు కనపడతాయి. ఈ నవలకి కడపలోని కవితా జాతీయ సాహిత్య పురస్కారాలలు, కందుకూరి నవలా పురస్కారం లభించింది.

నా రచనలతో పాటు ఎంతో మంది రచనలను, మా ప్రేమీమండలి మహావిద్యాలయం గ్రంథాలయంలో పాఠకుల కోసం సేకరించి వుంచారు. నేను వ్రాసిన ‘ధమ్మం శరణం గచ్ఛామి’ అను హిందీ అనువాద నవలను ఈ మాహావిద్యాలయం లోనే ఆవిష్కరింపజేసుకున్నాను.

మరోసారి ఆ పుణ్య దంపతులకు నమస్సుమాంజలులు.

Exit mobile version