[తెలుగు సాహిత్యం పట్ల కొన్ని తరాలలో ఆసక్తి రగిలించి, ఆధునిక తరానికి వ్యక్తిత్వ వికాస పాఠాలు చెప్తూ, యువతకు ఉత్తమ సాహిత్యం ద్వారా ఉత్తమ వ్యక్తిత్వాన్నివ్వాలని నిరంతరం తపించే యువభారతి సంస్థ స్థాపించి వచ్చే దసరాకు 60 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలుగు సాహిత్యానికి, సమాజానికి యువభారతి చేసిన సేవను తెలుగు పాఠకులకు పరిచయం చేసే ఉద్దేశంతో ప్రతి ఆదివారం సంచికలో యువభారతి ప్రచురించిన పుస్తకాల పరిచయం వుంటుంది. ఈ శీర్షిక వచ్చే విజయదశమి వరకూ సాగుతుంది.]
ఉపనిషత్సుధ
ఆత్మ నిత్యం. అదే సత్యం. మిగిలినదంతా అనిత్యం, అసత్యం. కానీ నిత్య సత్య సందీప్తమైన ఆత్మను, ఆస్థి చర్మమయమైన శరీరం ఆవరించి ఉన్నందున, ఆవరణలోనే ఆనందం ఉన్నట్లు అనిపిస్తుంది. అలా అనిపించే ఆనందాన్ని అధిగమించి, ఆవల కనిపించే ఆనందాన్ని ఆత్మగతం చేసుకోవడమే జీవిత పరమావధి. దీనినే మహర్షులు తపస్స్వాధ్యాయ సహకారాలతో సాధించారు. ఈ సాధన సంపత్తిని సామాన్య మానవులకు కూడా అందుబాటులో ఉండేటట్లు అందరికీ అర్ధమయ్యే భాషలో చెప్పాలని తత్త్వవేత్తలు ప్రయత్నించారు. ఆ ప్రయత్నానికి ప్రతిఫలమే ఉపనిషద్వాంగ్మయం.
యుగయుగాలుగా మహర్షులు చేసిన మహత్తరమైన మనో మంథనకు పర్యవసానంగా ఆవిర్భవించిన ఆలోచనామృతమే ఉపనిషత్సాహిత్యం. అందుకనే ఉపనిషత్తులలోని మాటలు మామూలు మాటలుగా కాక మంత్రాల మూటలుగా భావించడం భావయోగులకు భావ్యమని తోచింది.
వందకు మించిన ఉపనిషత్తులను వెలయించిన అక్షరభారతి – వేదమండలానికి క్షీరసాగరం లాంటిది. అందులోనుంచి అందుకోగలిగినంత అక్షరసుధను సేకరించి, అందరికీ అందించగలిగినంతవరకు అందించాలనే ఆరాటానికి అక్షరాకృతి ఈ ‘ఉపనిషత్సుధ’.
ఉపనిషత్తుల సారాన్ని వేదాంత పరిభాషలో కాకుండా త్యాగం – భోగం, ఇహం – పరం, అన్నం – ఆనందం లాంటి మామూలు మాటల్లో తెలుసుకోవడానికి క్రింద ఇవ్వబడిన link ను క్లిక్ చేసి ఈ పుస్తకాన్ని ఉచితంగానే చదువుకోండి.
https://archive.org/details/upanishath-sudha/mode/2up
లేదా క్రింద ఇవ్వబడిన QR code ను scan చేసినా ఆ పుస్తకాన్ని ఉచితంగా చదువుకోవచ్చు.
శ్రీ పత్రి అశ్వనీ కుమార్ గారి నివాసం నవీ ముంబై, మహారాష్ట్ర.
విద్యాభ్యాసం అంతా విజయవాడ లోనే జరిగింది. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుండి MBA పట్టా పుచ్చుకుని, ఉద్యోగార్ధం హైదరాబాద్ వచ్చిన తర్వాత యువభారతి సంస్థతో (1982) నలభై ఏళ్ళ అనుబంధం.
వృత్తిరీత్యా రిలయన్స్ ఇండస్ట్రీస్ లో Finance & Accounts లో Senior Management Team లో పనిచేసి 2016 లో పదవీ విరమణ చేసినా, ప్రవృత్తి మాత్రం – సంగీత సాహిత్యాలే. ప్రస్తుతం ఒక Youtube Channel కి Voice Over artiste గా, స్వరమాధురి సంగీత సంస్థకు అధ్యక్షునిగా వారి విశ్రాంత జీవితాన్ని బిజీ గా, ఆనందంగా గడుపుతున్నారు.