[శ్రీరామనవమి సందర్భంగా ‘ఉర్దూ కావ్య సాహిత్యంలో రాముడు, రామాయణం’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము.]
హై రామ్ కె వజూద్ పే హిందోస్థాన్ కో నాజ్
అహ్ల్-ఎ-నజర్ సమఝతే హైఁ ఇమామ్-ఎ-హింద్
ఎజాజ్ చరాగ్-ఎ-హిదాయత్ కా హై యహీ
రోషన్ తర్ ఆజ్ సహర్ హై జమానే మే షామ్-ఎ-హింద్
భారతదేశానికి అస్తిత్వం రాముడు. రాముడి పట్ల సమస్త దేశం గర్విస్తుంది. జ్ఞానులు రాముడిని భారతీయ ధర్మానికి ప్రతీకగా భావిస్తారు. ప్రపంచానికి మార్గదర్శనం చేసే వెలుతురు రాముడు. రాముడిచ్చే సందేశపు వెలుగు ప్రాతః సంధ్యా సమయాల వెలుగుకన్నా అధికం.
ఈ కవిత రాసింది డాక్టర్ మహమ్మద్ ఇక్బాల్. ‘సారే జహాసే అచ్ఛా’ గీతం రాసిన ఇక్బాల్ భారతదేశపు అస్తిత్వం రాముడని భావించాడు. ప్రకటించాడు.. ‘అహ్ల్-ఎ-నజర్’ అంటే జ్ఞానదృష్టి కలిగిన వారు రాముడిని ‘ఇమామ్ ఎ-హింద్’ గా భావిస్తారని అన్నాను. ‘ఇమామ్’ అంటే మత గురువు. ‘ఇమామ్ ఎ-హింద్’ అంటే హిందూ దేశానికి మత గురువు అని అర్థం. భారతీయ ధర్మానికి గురువు అన్నది ‘ఇమామ్ ఎ-హింద్’ అర్థం.
‘ఇక్బాల్’ మాత్రమే కాదు, జాఫర్ అలీ ఖాన్ ‘శ్రీరామచంద్ర’ అన్న కవితలో కూడా ఈ దేశానికి అస్తిత్వం రాముడని స్పష్టంగా ప్రకటించాడు.
నక్ష్-ఎ-తెహ్‍జీబ్-హునూద్ అబ్ భీ నుమయా హై అగర్
తో వో సీతా సే హై, లక్ష్మణ్ సే హై ఔర్ రామ్ సే హై
‘నక్ష్-ఎ-తెహ్‍జీబ్-హునూద్’ అంటే భారతీయ సభ్యతకు నిదర్శనం. ఈ సభ్యత ఇప్పటికి కూడా ప్రదర్శితమవటానికి కారణం రాముడు, లక్ష్మణుడు, సీతలు మాత్రమే. వీరి వల్లనే భారతీయ సభ్యత, సంస్కృతులు సజీవంగా ఉన్నాయి.
‘సాఘర్ నిజామీ’ అయితే ఇంకో అడుగు ముందుకు వేశాడు.
హిందూవోం కే దిల్ మే బాకీ హై మొహబ్బత్ రామ్ కీ
మిట్ నహీ సక్తీ ఖయామత్ తక్ హుకుమత్ రామ్ కీ
జిందగీ కీ రూహ్ థా రూహానియత్ కీ షాన్ థా
వో ముజస్సమ్ రూప్ మే ఇన్‍సాన్ కీ ఇర్ఫాన్ థా
‘రామ్’ అన్న కవితలో రాముడిని హిందూ దేశ వాసుల హృదయంలో ‘ప్రేమ’ భావన అన్నాడు. రాముడి రాజ్యం యుగాంతం అయినా అంతం కాదన్నాడు. జీవితం రూపం రాముడు. ఆత్మ రాముడు. మానవ రూపం ధరించిన ‘బ్రహ్మజ్ఞానం’ రాముడు అన్నాడు సాఘర్ నిజామీ.
‘జై శ్రీరామ్’ అన్న నినాదం ఒక ‘యుద్ధ నాదం’లా, అనకూడని మాటలా మనుషులకు ఆగ్రహావేశాలు కలిగిస్తున్న నేటి సమాజం ఒక్కసారి వెనుతిరిగి ఆనాటి కవుల భావనలను గమనిస్తే మత ఛాందస భావాలకు పెద్ద పీట వేసినట్టుగా భావిస్తున్న ఆ కాలంలోనే ఇప్పటి కన్నా అవగాహన, స్నేహపూరిత వాతావరణం, పరస్పర గౌరవాభిమానాలు నెలకొన్నాయనిపిస్తుంది. ఈ దేశంలో స్నేహ సౌభ్రాతృత్వ సమైక్య భావనలు వెల్లివిరియాలన్న ఆకాంక్షతో ఒక్కసారి వెనుతిరిగి ‘మత ఛాందస భావనల ఉద్విగ్నతల కాలం’లా భావిస్తున్న ఆ కాలంలో ముస్లిం కవులు రాముడిని, రామాయణాన్ని ఏ రకంగా అర్థం చేసుకున్నారు? తమ కవితలలో రాముడిని ఎలా ప్రదర్శించారు అన్నది పరిశీలించాల్సి ఉంటుంది.
రాముడిని, రామాయణాన్ని ఆధునిక మేధావులు మత దృష్టితో అర్థం చేసుకుని విమర్శలు కురిపిస్తారు. తక్కువ చేసి చూపాలని ప్రయతిస్తారు. కానీ భారతదేశంలో అడుగుపెట్టిన ఇస్లామీ మేధావులు రాముడిని, రామాయణాన్ని అర్థం చేసుకోవాలని ప్రయత్నించారు. నైతిక విలువలు, ఉత్తమ ప్రవర్తనకు మర్యాదా పురుషోత్తముడిని ప్రతీకగా గ్రహించారు. రాముడిని అర్ధం చేసుకోవటం ద్వారా భారతీయాత్మ గురించి అవగాహన సాధించాలని ప్రయత్నించారు. సమన్వయం సాధించాలని తపించారు.
ఇస్లామీయులు భారత్‍లో అడుగుపెట్టినప్పటినుంచీ ఈ ధర్మాన్ని అర్థం చేసుకోవాలని ప్రయత్నస్తూనే ఉన్నారు. ఇటీవలి పరిశోధనల ప్రకారం ఖిల్జీ, తుగ్లక్‍ల కాలం నుంచి రామాయణాన్ని పర్షియన్ భాషలోని అనువదించే ప్రయత్నాలు ఆరంభమయ్యాయి. కానీ, అవి ప్రస్తుతం లభ్యమవటం లేదు. ‘ముంతఖాబ్-ఉత్-తవారిఖ్’లో అబ్దుల్ ఖాదిరి బదాయూని ఈ విషయాన్ని ప్రస్తావించాడు. జహంగీర్ కాలంలో ముల్లా సాద్-అల్లాహ్ మసీహ్ వెరాన్వీ రామాయణాన్ని పర్షియన్ భాషలోకి అనువదించాడు. ఫరూఖ్ సయ్యద్ కాలంలో కూడా రామాయణం పర్షియన్ భాషలోకి తర్జుమా అయింది.
రాజకీయంగా పరిస్థితులు చక్కబడి కాస్త శాంతి వాతావరణం నెలకొనగానే ఇస్లామీ పండితులు రామాయణాన్ని పర్షియన్ భాష లోకి, ఉర్దూ భాష లోకి అనువదించటం ప్రారంభించారు. పవిత్ర ఖురాన్ కన్నా ముందు ‘రామాయణం’ ఉర్దూ భాషలోకి తర్జుమా అయింది. ఉర్దూలో ఖురాన్ అనువాద రచనలు ఎన్ని ఉన్నాయో, రామాయణ అనువాదాలు కూడా అన్ని ఉన్నాయి.
మొఘల్ రాజు జలాలుద్దీన్ అక్బర్ ఆదేశానుసారం మౌలానా అబ్దుల్ ఖాదిర్ బదాయుని రామాయణాన్ని పర్షియన్ భాష లోకి అనువదించాడు. ఆయనకు నాలుగేళ్ళు పట్టింది అనువాదం పూర్తి చేసేందుకు. అయిష్టంగానే అనువదించినా పుస్తకాన్ని మాత్రం అందంగా తయారు చేశారు. దాదాపుగా 176 చిత్రలేఖనాలున్నాయా పుస్తకంలో. ప్రస్తుతం ఈ పుస్తకం జైపూర్ లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో ఉంది..
అక్బర్ తల్లి ‘హమీదా బాను’ వద్ద ‘రామాయణ-ఇ-మసీహీ’ అన్న పద్య రూపంలోని రామాయణానువాద పుస్తకం ఉండేది. ‘హమీదా బాను’ పుస్తక ప్రేమిక. ‘దారా షుహో’ కూడా రామాయణాన్ని అనువదించాడు, ‘నజ్మ్ ఖుష్తార్’ అన్న పేరుతో. ఇక్కటికి పర్షియన్ భాషలో దాదాపుగా 23 రామాయణాలు లభిస్తున్నాయి.
భారతదేశ చరిత్రలో 12 నుండి 17వ శతాబ్దాన్ని ‘భక్తియుగం’గా పరిగణిస్తారు. ఈ సమయంలో ఇస్లాం భారతీయ ధర్మం అనే రెండు విభిన్నమైన సముద్రాలు కలవటం వల్ల సమాజంలో సంభవించిన సంఘర్షణ ఫలితంగా రెండు ధర్మాల నడుమ సమన్వయ సాధన దిశగా మేధావులు, కళాకారులు, ధార్మికులు ప్రయాణించారు. ఈ దిశ వైపు సమాజం ప్రయాణించటంలో ‘సూఫీ’లు ఓ వైపు, ‘సంత్’లు మరోవైపు ప్రధాన పాత్ర పోషించారు. కత్తితో దేశాన్ని గెలవచ్చేమో కానీ ప్రజల హృదయాలను దోచుకోలేమని గ్రహించిన ఇస్లామీయులు ‘సూఫీ’ల ప్రేమ తత్వానికి ప్రాధాన్యం ఇవ్వటంతో ఇస్లాం, భారతీయ ధర్మాల సమన్వయ సాధన దిశగా ‘నిర్గుణ’ సంప్రదాయం తెరపైకి వచ్చింది.
నిర్గుణ సంప్రదాయాన్ని అనుసరించే ముస్లింలు భారతదేశంలో రాముడి ప్రాధాన్యాన్ని అర్థం చేసుకున్నారు. కబీర్, దాదు, రఖాఖ్, జయాసి, రహీమ్ దాస్, వాజిద్ షేక్, అలమ్, ముబారక్ వంటి వారంతా రామభక్తులే!
కబీర్‍కు రామ నామ జప మంత్రం అతని గురువు రామానంద నుండి అందింది.
‘నిర్గణ్ రామ్ నిర్గుణ్ రామ్ జపహు రే భాయి, అవగతి కీ గతి లఖీ న జాయి, చారీ వేద్ జాకే సుమృత్ పురాణాం, సౌ వ్యాకరణాం మరమ్ న జానామ్’
రజాబ్ అలీ ఖాన్ పఠాన్ ‘సేవక్ రామ్ కారే, సద్గురు కీ సున్ ధారి, రామ్ నామ్ ఉత్ రఖియే భాయీ, ఆతమ్ తత్త్వ ఉబారీ’ అన్నాడు. రామ్ రహీమ్, కేశవ్ కరీమ్‍ల నడుమ స్నేహ సౌభ్రాతృత్వ భావనలను సాధించేది ‘రామ ప్రేమ’ ఒక్కటే అని ప్రకటించాడు. నిరంతరం రామ నామ జపం తప్ప మరో మార్గం లేదని బోధించాడు.
‘రజ్జబ్ పావన్ ప్రేమ్ హై, కంచన్ ఆతమ్ రామ్, గత్ మిలా వై దుహిన్ కో, ప్రేమ్ కరే యహ కామ్’
నిరంతరం రామ నామ జపం చేస్తూ తరించాడు వాజిద్.
‘రామ్ నామ్ కీ లూట్ ఫబీ హై జీవ్ కూ, నిస్ వాసర్ వాజిద్ సుమరతా జీవ్ కూ।
కహియో జాయ్ సలామ్, హమారీ రామ్ కో, నైన్ రహే ఝాడ్ లాయ్ తుమ్హారీ నామ్ లో।’
అక్బర్ దర్బారు లోని రహీమ్ దాస్‍గా పేరు పొందిన అబ్దుల్ రహిమ్ ఖాన్‌ఖానా, తులసీదాస్‍కు సన్నిహితుడు. సంస్కృతంలోని రామాయణాన్ని మాండలికంలోకి తర్జుమా చేసినందుకు తులసీదాస్ పై కొందరు కక్ష గడితే, రహీమ్ దాసు, తులసీదాసుకు మసీదులో రక్షణనిచ్చాడు. ఈ సంఘటనను తులసీదాసు దోహా రూపంలో చెప్తాడు.
తులసీ సర్‍నామ్ గులామ్ హై రామ్ కో, జాకో రుబై సో కహే కభు ఓవూ।
మాంగీ కై ఖైబో, మసీత్ కో సోయిబో, లౌబొకౌ ఎకు నా దైబెకో దోవూ।
(నేను రాముడి దాసుడను. మీరేమైనా అనుకోండి, నాకేం పట్టింపు లేదు. నేను అడుక్కుంటాను, తింటాను, మసీదులో నిద్రిస్తాను)
మధ్య యుగ ‘సంత్’లు స్థానిక మాండలికంలో ‘దోహా’లు రచిస్తూ మత సామరస్యం కోసం పాటుపడ్డారు.
19వ శతాబ్దంలో మీర్జా మజహర్ జూన్-ఎ-జా అయితే భగవంతుడిని పరమేశ్వర్ అన్నా రామ్ అన్నా ఒకటే అన్నాడు. చివరి ముఘల్ రాజు బహదూర్ షా జాఫర్ ‘రామ్‍లీలా’ ఉత్సవాలలో క్రమం తప్పకుండా పాల్గొనేవాడు. వారణాసిని దర్శించిన ఘాలిబ్ అయితే,”ఈ నగరంలో పిల్లలందరూ రామ లక్ష్మణుల్లా కనిపిస్తున్నారు. నా శత్రువులు నన్ను హేళన చేస్తారన్న భయం లేకపోతే నేనే జంధ్యం ధరించి, నుదుట తిలకంతో గంగానది ఒడ్డున కూర్చునే వాడిని” అన్నాడు.
ఘాలిబ్ స్నేహితుడు అల్తాఫ్ హుస్సేన్ హాలి రామాయణాన్ని మధురంగా వర్ణించాడు.
రాముడిని ‘హబ్-ఎ-వతన్’ అన్నాడు.
“పావ్ ఉఠా థా ఉస్కా బన్ కీ తరఫ్, ఔర్ ఖీంచ్తా థా దిల్ వతన్ కీ తరఫ్, గుజ్రే ఘుర్బత్ మే ఇస్ ఖదర్ మ్మో సాల్ పర్ న భూలా అయోధ్యాకా ఖయాల్, తీర్ ఏక్ దిల్ మే ఆకె లగ్తా థా అతీ థీ జబ్ అయోధ్యా కా హవా”
రాముడు అరణ్యవాసానికి వెళ్తున్నా, అయోధ్య జ్ఞాపకం వచ్చినప్పుడల్లా హృదయంలొ బాణాలు గుచ్చుకున్నంత బాధ కలిగేది రాముడికి.
17వ శతాబ్దం చివరికల్లా దేశంలో ఉర్దూ ప్రధాన భాష అయింది. పర్షియన్ భాష ఉపయోగం వెనుకబడింది. అరబిక్, పర్షియన్, హిందీ భాషల పదాలతో ఉర్దూ పరిపుష్టమయింది. నిజానికి ఘాలిబ్ కాలానికి ఉర్దూ ఉచ్చ స్థాయికి చేరుకుంటుంటే, పర్షియన్ దిగజారుతోంది. ఘాలిబ్‍కు వ్యక్తిగతంగా పర్షియన్‌పై మోజు ఉన్నా, ఉర్దూ గజల్ కవిగా పెద్ద పేరు సాధించాడు. ఉర్దూ భాష ప్రాధాన్యం పెరగటంతో, ఉర్దూ లోకి రామాయణం తర్జుమా జోరందుకుంది. ఉల్ఫత్ రామాయణ్, రహమత్ రామాయన్, జ్వాలా ప్రసాద్ బర్గ్ రామాయణ్, సాహిర్ రామాయణ్ వంటి అనేక రామాయణాలు ఉర్దూలో అందుబాటు లోకి వచ్చాయి. రామాయణాన్ని ఉర్దూ లోకి అనువదించిన వారిలో హరినారాయణ్ శర్మ, బన్సారీ లాల్ షోలా, మహాత్మా శివబ్రత్ లాల్ వంటి వారు కూడా ఉన్నారు.
సంపూర్ణ రామాయణాన్ని కాక, రామాయణంలోని సంఘటనలను ఆధారం చేసుకుని పలువురు ఉర్దూ కవులు స్వతంత్ర కవితలను సృజించారు. జగన్నాథ్ ఖుస్తార్, శంకర్ దయాల్ ఫర్హత్, ద్వారకా ప్రసాద్, ఊఫక్ లఖ్నవీ, మౌల్వీ బాధ్షాహ్ హుస్సేన్ రబ్జా లక్నవీ, అస్థర్ హుస్సేన్ ఖాన్ ‘నజీర్ లూధియాన్వీ’ వంటి ఉర్దూ కవులు రామాయణాన్ని ఉర్దూ కవితల్లో ప్రదర్శించారు.
మౌల్వీ బాద్షాహ్ హసన్ రాణా రచించిన రామాయణాన్ని బికనేర్ లో దసరా సమయంలో ఈనాటికీ గానం చేస్తారు.
‘రామాయణ్ యక్ ఖాఫియా’ 1200 ద్విపద (షేర్)ల కావ్యం. ఇందులొ రాముడి వర్ణన అద్భుతంగా ఉంటుంది.
హై సర్ పేషానియే ఫుర్‍నూర్ కా తిలక్
యా సదాశివ్ కీ జభీనే సాఫ్ పర్ హై చంద్రమా
రాముడి ఫాల భాగంలో ఉన్న చందన తిలకం, శివుడి శిరస్సుపై వెలుగుతున్న చంద్రుడిలా ఉంది.
మరో సందర్భంలో, రాముడి వర్ణన చేస్తూంటే తన కలం తన్మయత్వంలొ పరుగిడుతోందంటాడు.
దిల్ కో ఖ్వాహిష్ హై కి రఘువర్ కా సరాపా హో బయాన్
ఖీంచ్‍తా హై రామ్కీ తస్వీర్ యూ కిత్నీ రవా
నూర్ కీ తస్వీర్ సర్ సే పావ్ తక్ హై రామచంద్ర
సాంవ్లీ సూరత్ పే సబ్ కో మర్దు మన్ కా హై గుహన్
శిరస్సు నుండి పాదం వరకూ తేజోవంతమైన రాముడి అందం వర్ణనాతీతం.
‘ఉఫఖ్’ తన కవితలో సీతాదేవి భవానీదేవిని ప్రార్థించే ఘట్టాన్ని గొప్పగా వర్ణించాడు.
కర్ కే దిల్ కాబూ మే, సీతా వాం గయీ మంది మే ఫిర్
దిల్ మే షక్లే రామ్, వస్ఫే భగవతీ విర్దే జబాన్
ఖుద్ శివాలే మే థీ, లేకిన్ దిల్ థా మహవే సోజే ఇష్క్
దేఖ్‍తీ థీ దమ్‍బదమ్ ఫిర్ ఫిర్ కే సూయే బోస్తాం
హర్ ఫూలోం కా జో మూరత్ పర్ చఢాయా పూజ్ కర్
గిర్ పడా రూయీ జమీన్ పర్ ఛుట్ కే మాలా నాగహాం
ముస్కురాయీ భగవతీ ఇస్ బేఖుదీ కో దేఖ్ కర్
జానకీ నే సహమ్ కర్ కీ ఆర్జూ-ఏ- దిల్ బయాన్
మందిరంలో భగవతిని ప్రార్థిస్తున్న సీత పెదిమలపై దేవి నామం ఉంది. కానీ హృదయం నిండా రాముడే ఉన్నాడు. రాముడి ధ్యాసలో సర్వం మరిచిన సీత దేవి మెడలో వేయాల్సిన పూలమాలను నేలజార్చింది. ఆమె మైమరపును అర్థం చేసుకున్న దేవి చిరునవ్వు నవ్వింది. రాముడిని తనకు భర్తగా ఇమ్మని సీత – దేవిని ప్రార్థించింది.
బేతాబ్ బరేల్వీ రచించిన మన్జుమ్ రామాయణంలో వివాహం తరువాత సీతను ఆమె సఖులు ఏడ్పించే ఘట్టం అందంగా ఉంటుంది.
బోలీ సహేలియా కి సియానీ బహక్ గయీ
ఆంఖోం మే ధూల్ ఝోంక్ కే నాదాన్ బనీ రహీ
చిత్‍వన్ మే కటార్ తో లబ్ పర్ నహీ నహీ
ఆంఖోం కహీ హై దిల్ హై కహీ పావ్ హై కహీ
చెలికత్తె ఏడిపిస్తుంటే, కళ్లు ప్రేమను కురిపిస్తున్నా, పెదవులతో ప్రేమ లేదన్న మాట పలుకుతుంది. ఆమె ఎంతగా రామ ధ్యాసలో పడిపోయిందంటే తాను ఎక్కడుందో కూడా తెలియటం లేదు.
అస్ఫర్ హుస్సేన్ ఖాన్ ‘నజీర్ లూధియాన్వీ’ రామాయణ ఆరంభం గమ్మత్తుగా చేస్తాడు.
సదాహా వర్ష్ వలాహతే ఈశా సే పేశ్‍తర్
యే అహలె బజ్మ్ తేరీ జియారత్ సే చెహెరావర్
సదియాం హుయీ కె తూనే జహాన్ సే కియా సఫర్
మౌజూద్ ఆజ్ తక్ తెరే అష్ఆర్ హై మగర్
ఏసుక్రీస్తు జన్మించే కన్నా ముందు కాలంలో నీ జన్మ వల్ల ప్రజలు అదృష్టవంతులయ్యారు. ఎన్ని వేల ఏళ్ళ క్రితం ఈ భూమిపై నివసించావు నువ్వు. కానీ ప్రజల హృదయాలలో, మా కవితలలో నీవు చిరంజీవిగా వున్నావు.
ఓ పర్షియన్ కవి రామాయణాన్ని రచిస్తూ, ‘పేష్-ఎ-ఖిద్మత్ హై – ఉర్దూ శాయరోంకీ దాస్తాన్-ఎ-రామాయణ్’ అంటాడు. ఉర్దూ కవుల దృక్కోణంలొ రామాయణాన్ని అందిస్తున్నానని.
బ్రిజ్ నారాయణ బర్‍బస్త్ ఉర్దూ రామాయణంలో కౌసల్యకు వీడ్కోలు చెప్తాడు రాముడు.
రూఖ్‍సత్ హువా వో బాప్ సే లేకర్ ఖుదా కా నామ్
రాహే-వఫా కీ మంజిలే-అవ్వల్ హుయీ తమామ్
మంజూర్ థా జో మా కీ జియారత్ కా ఇంతిజామ్
దామన్ సే అశ్క్ పోఛ్ కర్ దిల్ సే కియా కలామ్
తండ్రికి వీడ్కోలు పలికి, తల్లిని చేరి కన్నీళ్ళు తుడుచుకుంటూ, ‘వెళ్ళొస్తా’నన్నాడు రాముడు.
మున్షీ జగన్నాథ్ ఖుష్తార్ రామాయణం రచించే ముందు తన కలానికి ప్రతిబంధాలు రాకూడదని రాముడిని ప్రార్థించాడు.
ఖుదాయా ఖామా కో నామ్‌వరీ దే
కలమ్ మే జల్వయే బాలోపరీ దే
(యే ఖుదా ఇస్ కలమ్ కో శోహరత్ దో, తాకి యె ఉడాన్ కర్ సకే)
దేవుడా ఆగకుండా రామాయణం రచించే శక్తినివ్వు.
ఆయనకు సరస్వతి కలలో కనపడి, కలంతో కాదు హృదయంతో రాయమని చెప్తుంది.
‘దిల్ కీ ఆంఖోంసే ఇసే గౌర్ సే లిఖ్నా’
ఈ రకంగా ఆనాటి కవులు ఫార్సీ, ఉర్దూ రచనలలో రామాయణాన్ని రచించటం ద్వారా తాము అమరులవటమే కాదు, సమాజంలో స్నేహ సౌభ్రాతృత్వపు భావనలను విస్తరింప చేస్తున్నామని అర్థం చేసుకున్నారు. ఎదుటివారి నమ్మకాలను అవహేళన చేయకుండా, తక్కువచేసి చూపకుండా, తప్పులెన్నకుండా, అర్ధం చేసుకోవాలని ప్రయత్నించటం ద్వారా, ఎదుటివారి దృక్కోణాన్ని అవగాహన చేసుకోవటం ద్వారా వారి ఆలోచనలను గౌరవిస్తూ పరస్పర గౌరవాభిమానాలతో ఒకరినొకరు అర్ధం చేసుకుంటూ కలసి జీవించే దిశగా అడుగులేశారు. అందుకు సాహిత్య సృజనను వేదికగా చేసుకున్నారు.
ఈనాడు రాముడిని అపహస్యం చేసేవారొక వైపు, రాముడిని ద్వేషానికి, క్రోధానికి వాడే వారొక వైపుగా రాముడిపై దూషణలు కురిపిస్తూ, అవహేళన అపహాస్యాలతో రెచ్చగొడుతూ, ఓ సినీ కవి చేసిన హెచ్చరిక ‘రామ్ కా నామ్ బద్నామ్ న కరో’ను విస్మరించి సమాజంలో ద్వేష భావనలు పెంచుతూ, అడ్డుగోడలు నిర్మిస్తూన్న సమయంలో ఈనాటి తెలుగు సాహిత్య ప్రపంచం, మధ్యయుగం నాటి ఉర్దూ, పర్షియన్ కవులను స్ఫూర్తిగా తీసుకుని తమ కలాన్ని – ప్రజల నడుమ అడ్డుగోడలు పడగొట్టి, ద్వేష భావనలను చల్లార్చి. స్నేహ సౌభ్రాతృత్వ సమన్వయ భావనలు పెంచేందుకు ఉపయోగించాలని రామనవమి సందర్భంగా ‘సంచిక’ అభ్యర్థిస్తోంది. అందుకు రాముడు, రామాయణాలను గౌరవ భావనతో అర్ధం చేసుకునే ప్రయత్నాలు ఆరంభించాలని కోరుకుంటున్నది.
సుఖాన్ కే కుఛ్ తో గోహర్ మై భీ నజ్ర్ కరతా చలూం
అజాబ్ నహీ కీ కరే యాద్ మాహ్-ఓ-సాల్ ముఝే
ఈ ఉర్దూ కవితను మీకు అంకితం ఇస్తున్నాను. ఇది ప్రపంచం నన్ను గుర్తుంచుకునేందుకు కారణం కావాలి.
రస్మ్-ఓ-రివాజ్-ఎ-రామ్ సే ఆరీ హై శర్ పసంద్
రావణ్ కీ నీతియోం కే పూజారీ హై శర్ పసంద్
(దౌష్ట్యాన్ని సమర్థించే వారికి రాముడి సంప్రదాయం తెలియదు. వారు రావణుడిని పూజించేవారు.)
స్వర్ హై శక్తి ఈశ్వర్ హై
హర్ సుర్ మె బసే హై రామ్
ఈశ్వరుడి శక్తి స్వరం. ప్రతి స్వరంలో వున్నాడు శ్రీరాం!
(అమీర్ ఖుస్రో ఖవ్వాలీ నుండి)
జై శ్రీరాం!!!!