Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

దేవతలు విహరించే ‘దేవ భూమి’- సుందరమైన కుమాన్ పర్వత శ్రేణి

[ఉత్తరాఖండ్ లోని అతి సుందరమైన కుమాన్ ప్రాంతంలోని బిన్సర్, నౌ కుచియా తల్, జిమ్ కార్బెట్ పార్క్‌లను దర్శించి, ఆ అనుభవాలను పాఠకులతో పంచుకుంటున్నారు శ్రీ రమణ బంధకవి.]

ప్రతి ఏడాది విహార యాత్రలకు వెళ్ళడం మాకు పరిపాటి. సాధారణం, చారిత్రిక, ఆద్యాత్మిక లేదా ప్రకృతి సుందర దృశ్యాలు ఉండే ప్రాంతాలకు వెళ్ళుతూ ఉంటాము. ఈ సారి, ‘దేవ భూమి’ అని పిలవబడే ఉత్తరాఖండ్ లోని అతి సుందరమైన కుమాన్ ప్రాంతంలోని, బిన్సర్, నౌ కుచియా తల్, జిమ్ కార్బెట్ పార్క్ లకు ప్రయాణం పెట్టుకుని మార్చి ఒకటిన బయలుదేరాము.

హైదరాబాదు నుండి ‘దురంతో’ నాన్-స్టాప్ రైలులో బయలుదేరి, మర్నాడు హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్‌లో దిగాము. ఆ రాత్రి పదకొండు గంటలకు పాతడిల్లీ స్టేషన్‌లో రానిఖేత్ ఎక్స్‌ప్రెస్ ఎక్కి మరునాడు ఉదయం ఇదు గంటలకు ‘కట్గోడం’ అనే చిన్న వూరు చేరుకున్నాము. అది కుమోన్ పర్వత ప్రాంతానికి దిగువున ఉంది. ఉదయం చీకటిలో, చలిలో అక్కడ దిగడం చాలా వింత అనుభూతి. అక్కడ ముందుగా మాట్లాడుకున్న టాక్సీ ఎక్కి పర్వతాల అధిరోహణ ప్రారంబించాము. దారి పాములాగా మెలికలు తిరుగుతూ పైకి సాగింది. చలి సుమారు 15 డిగ్రీలు ఉండవచ్చు. పర్వత ప్రాంతములో దారులు చాల సన్నగా ఉండటమే కాక, గతుకులతో ఉంటాయి. అక్కడక్కడ వర్షాల వలన చరియలు జారి దారి మూసుకు పోతూ ఉంటుంది. దారి పక్కనున్న చిన్న గ్రామంలో వేడి సమోసాలు, టీ తీసుకుని, ‘బిన్సర్’ వైపు ప్రయాణం చేసాము.

కుమోన్ వేసవి విడిది బిన్సర్:

సముద్ర మట్టానికి సుమారు 2310 మీటర్ల ఎత్తున అల్మోర నగరానికి 30 కిలోమీటర్లు ఈశాన్యంగా ఉన్న సుందరమైన ఆహ్లాదకరమైన పర్వత ప్రాంతం బిన్సర్. మేము క్లబ్ మహేంద్ర వారి వ్యాలీ రిసార్ట్‌కి చేరుకున్నాము. అక్కడ మా బస మూడు రోజులు. చలి చాలా ఎక్కువగా ఉండటము వలన, ఉన్ని దుస్తులు ధరించాము. రూములో హీటర్స్ ఉండటము వలన వెచ్చగా ఉంది. మరునాడు అక్కడికి 65 కిలోమీటర్ల దూరములో ఉన్న జగేశ్వర్‌కి ప్రయాణం.

బిన్సర్ వాలీ రిసార్ట్

శైవ క్షేత్రం, దారుకా వన నాగేశ్వర క్షేత్రం జగేశ్వర్ ధామ్:

సముద్ర మట్టానికి సుమారు 1870 మీటర్ల ఎత్తున, దేవదారు అడవుల మధ్యన ఉన్న సుందరమైన ప్రాంతం జగేశ్వర క్షేత్రం. అది 124 చిన్నాపెద్దా గుళ్ల సముదాయం. అక్కడ ఉన్న పెద్ద దేవాలయం మహా మృత్యుంజయ స్వామిది. స్వామి లింగాకారంలో దర్సనం ఇస్తాడు. ఈ దేవాలయ సముదాయం క్రీ.శ. 8 మరియు 9 వ శతాబ్దంలో కట్యురి రాజవంశీకులు నిర్మించారు. అక్కడ ఉన్న మరో ముఖ్య దేవాలయం 8 వ జ్యోతిర్లింగంగా స్థానికంగా ప్రాచుర్యం పొందిన దారుకావన నాగేశ్వరుడు లేదా జగేశ్వరునిది. ఈ రెండు దేవాలయాలలో అఖండ నేతి దీపారాధన వెయ్యి సంవత్సరాలుగా జరుగుతోంది. సముదాయంలో ఉన్న మిగతా దేవాలయాలు – పుష్టి మాత (పార్వతీ), వినాయకుడు, ఆంజనేయుడికి చెందినవి.

జగేశ్వర్ దేవాలయ సముదాయం

లఖు దియార్ – కాంస్య యుగపు చిత్ర లేఖనాలు:

జగేశ్వర్ నుండి తిరుగు ప్రయాణంలో ఒక కొండశిఖరం పైన పాము పడగ ఆకారములో ఉన్న గుహ లోపల, రాతి, కాంస్య యుగపు రంగుల చిత్ర లేఖనాలు రాతిగోడలపైన కనిపిస్తాయి. ఆ కాలంలో ప్రకృతి వైపరీత్యాల నుండి తల దాచుకోవటానికి ఇటువంటి గుహలను ఆశ్రయించేవారు. వారు తమ భావ ప్రకటనలను మొక్కలనుండి లభించే రంగులతో రాతిపైన బొమ్మలుగా వేసేవారు. ఇవి మౌలికమైన ఆకారాలు, వేట దృశ్యాలు. వేల ఏళ్ళ నుండి ప్రకృతి ప్రభావానికి లోనై, కొంత వెలసి పోయాయి. యాత్రికులకు పరిసర ప్రాంతాలు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి.

లఖు దీయార్ – గుహ చిత్రాలు

చితాయి ‘గోలూ దేవత’ మందిర్:

ఇది అక్కడ నుండి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఒక చిన్నగుట్ట పైన ఉన్నదేవాలయం. అక్కడ విచిత్రం ఏమిటంటే, బయట ప్రవేశ ద్వారం నుండి లోపల గుడి వరకు మరియు ఆవరణ అంతా వేలాది ఇత్తడి గంటలు కట్టబడి ఉంటాయి. గంటలతో పాటు కాగితం పైన వ్రాసిన ఎన్నో విన్నపాలు, ప్రార్థనలు ఉంటాయి. ఆ గుడిలోని దేవత పేరు ఆ ప్రాంతములో చాల భక్తితో కొలవబడే ‘గోలు దేవత.’ ఆయన రూపం చిన్న పాలరాయి ఫలకం పైన అశ్వారుడుడై విల్లంబులతో దర్శనమిస్తాడు. స్థల పురాణం ప్రకారం ‘గోలూ’ చాంద్ రాజుల కాలంలో మహా శూరుడైన సేనాధిపతి. న్యాయం కోసం పోరాడిన వ్యక్తి. శత్రువులతో పోరాడి వీర మరణం పొందిన అమర వీరుడు. ఆయనిని ఈ ప్రాంత ప్రజలు దైవసమానునిగా కొలుస్తారు. ఆయన వారి సమస్యలను పరిష్కరిస్తాడని నమ్మి విన్నపాలను వ్రాసి కడతారు. సమస్య తీరేక, కృతజ్ఞతతో ఇత్తడి గంట కట్టటం ఆనవాయతీ.

గోలూ మందిర్-చితాయి

హిమాలయ దర్శనం – జీరో పాయింట్:

మరునాడు అక్కడ నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నబిన్సర్ బర్డ్ శాంక్చ్యురీకి వెళ్ళాము. అల్మోర దారిలో పది కిలోమీటర్ల వెళ్ళిన తరువాత, కొండ పైకి ఇరుకు మలుపుల దారిలో వెళ్ళాలి. పైకి వెళ్ళిన తరువాత, 2 కిలోమీటర్లు ట్రెక్కింగ్ ప్రారంభం. ఓక్ మరి రోడెన్ డ్రాన్ అడవుల మధ్య నుండి చిక్కటి చలి మంచు తెరలలో నుండి 7500 అడుగులనుండి 8000 అడుగుల ఎత్తుకు నడక. దారిలో విరబూసిన ఎర్రటి రోడెన్ డ్రాన్ పుష్పాలు కనులకు విందు కలిగిస్తాయి. పైన జీరో పాయింట్‌కి జేరుకున్నాము. అక్కడ మంచె లాంటి కట్టడం పైన నుంచుంటే, దూరంగా 350 కిలోమీటర్ల పరిధి వరకు హిమాలయ పర్వత శిఖరాలు కనబడతాయి. మబ్బులు లేక పొతే నంద దేవీ, త్రిశూల్ మొన్నగు శిఖరాలు చక్కగా చూడవచ్చు. వాటిని చూసి వసతి చేరుకున్నాము.

జీరో పాయింట్

నౌ కుచియ తల్, భీమ తల్, సాత్ తల్:

మరునాడు అచ్చటికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న నౌ కుచియా తల్ వెళ్ళాము. అక్కడ క్లబ్ మహీంద్రా వారి వసతిలో బస. నౌ కుచియాతల్ అనగా తొమ్మిది కోణాలు కల సరస్సు. చాల సుందరంగా ప్రశాంతంగా ఉండే సరస్సు. అక్కడ నుండి భీమతల్‌కి వెళ్ళాము. అది నైనితల్ దిగువున ఉన్న సుందర తటాకం. భీముని పేరుతో పిలవబడుతుంది. ఒడ్డున చాంద్ రాజుల కాలములో కట్టిన 300 ఏళ్ళ నాటి శివాలయం ఉంది. తటాకం మధ్యలో అక్వేరియం ఉంది. తరువాత 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న సాత్ తల్ కు వెళ్ళాము. అది చిక్కటి అడువులతో కొండల వడిలో ఉన్న అద్భుత ప్రాంతము అక్కడ 7 తటాకాలు ఉన్నాయి. వాటికి రామ, లక్ష్మణ, సీత, భరత, హనుమాన్, గరుడ,నల దమయంతి తటాకాలని పేరు. అద్భుతమైన ఆ సరస్సులో ప్రశాంతంగా బోటు విహారం చేసాము. ఒడ్డున అనేక భోజన శాలలు ఉన్నాయి. వాటిలో రుచికరమైన ఖడి చావాల్, రాజ్మ చావాల్ మరియు చక్కటి ఖీర్ పాయసం తినొచ్చు.

కైంచీ ధామ్ – నీమ్ కరోలిబాబా ఆశ్రమం:

తరువాత రోజున అక్కడికి 30 కిలోమీటర్ల దూరములో ఉన్న నీమ్ కరోలిబాబా ఆశ్రమం చేరాము. కోసి నదీ వడ్డున ప్రశాంత వాతావరణంలో సుందరంగా నిర్మించిన ఆశ్రమం. అక్కడ హనుమాన్, శివ మరియు దుర్గా దేవీకి చక్కటి ఆలయాలు ఉన్నాయి. వాటిని దర్శించి ప్రశాంతత పొందాము.

సుందర తటాక నగరం నైనితల్:

మరునాడు ఉదయాన్నే బయలుదేరి అక్కడకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న నైనితల్‌కు బయలు దేరాము. సముద్ర మట్టానికి సుమారు 1938 మీటర్ల ఎత్తున కొండ చరియలపైన, పైన్ అడవుల నడుమన వెలసిన రమ్యమైన నగరం నైనితల్! దక్ష యజ్ఞంలో సతీదేవీ ఆత్మాహుతి చేసుకున్న తరువాత పరమ శివుడు ఆమె దేహాన్ని మోసుకున్నివెళ్తుంటే, మహావిష్ణువు చక్రంతో ఆమె శరీరం ఖండించినప్పుడు, ఆమె కళ్ళు కింద పడిపోయి పెద్ద తటాకం ఏర్పడిన ప్రాంతమే ఇది అని ప్రతీతి. కళ్ళు(నయన్) పడిన సరస్సు కాబట్టి ‘నైనితల్’ గా పేరొందింది. అక్కడ తటాకం ఒడ్డున ‘నైనా’ దేవీ మందిరం ఉంది. అక్కడి వింతలలో హిమాలయ దర్శనం, గుర్రపు స్వారి, టిఫిన్ టాప్ రోపే వే, నైనదేవీ మందిరం దర్శించాం. అన్నిటిలోకి మనసును ఉల్లాసపరిచేది, సరస్సులో బోటు విహారం. కొండల వడిలో చల్లగా, ప్రశాంతముగా, 1372 మీటర్ల పొడుగున, 457 మీటర్ల వెడల్పున విస్తరించిన అద్భుతమైన సరోవరం అది. ఒక గంట సేపు ఆ చల్లటి గాలిలో ప్రశాంతమైన సరస్సులో బోటు మీద ప్రయాణం ఒక దివ్యమైన అనుభూతి. తరువాత అక్కడి టిబ్బేట్ బజారులో శాలువలు , స్వేట్టేర్స్, కాండిల్స్ లాంటివి కొని సాయంత్రానికి తిరిగి వచ్చాము.

నైనాదేవి మందిరం – నైనితల్

జిమ్ కార్బెట్ వన్య ప్రాణి సంరక్షక వనం:

మరునాడు ఉదయాన్నే బయలుదేరి అక్కడకు 110 కిలోమీటర్ల దూరంలో కొండల దిగువున ఉన్న జిమ్ కార్బెట్ పార్క్‌కు ప్రయాణం. దారిలో హాల్ద్వాని అనే ముఖ్యమైన నగరం గుండా ప్రయాణించి, దారిలో ‘ఖాలాడుంగి’ దగ్గర ఉన్న’జిమ్ కార్బెట్’ జలపాతాన్ని చూసాము. దానికి దగ్గరలోనే జిమ్ కార్బెట్ మ్యుజియంలో జిమ్ కార్బెట్ వదిన వస్తువులు మొదలైనవి భద్ర పరిచారు. తరువాత రాంనగర్ మీదుగా క్లబ్ మహీంద్రా వారి సుందరమైన బసలో విడిది. జిమ్ కార్బెట్‌కి వెళ్ళటానికి ఢిల్లీ నుండి రామనగర్ రైలులో రావచ్చు.

జిమ్ కార్బెట్ టైగర్ సంరక్షణ వనాన్ని1936లో అప్పటి గవర్నర్ కొలోనెల్ జేమ్స్ (జిమ్) కార్బెట్ సలహా మేరకు వన్య ప్రాణి సంరక్షణ వనంగా ఏర్పరచి దానికి ‘హైలీ జాతీయ వనం’ అని పేరు పెట్టారు. స్వతంత్రం వచ్చిన తరువాత 1952 లో ఆ వనానికి ‘రామ్ గంగా జాతీయ వనం’ అని పేరు మార్చేరు. తరువాత 1957 లో జిమ్ కార్బెట్ సంస్మరణార్థం దానికి ‘జిమ్ కార్బెట్ జాతీయ వనం’ అని నామకరణం చేసారు. ఈ వనం సుమారు 525 చదరపు కిలో మీటర్ల వైశాల్యముతో ఉండి, అనేక జంతు, వృక్ష, పక్షి జాతులకు ఆశ్రయం ఇస్తోంది. ఈ వన సందర్శనానికి ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. వనాన్ని మూడు ముఖ్యమైన గేట్స్ నుండి ప్రవేశించవచ్చు. అవి బిజరాని, ధికాల మరియు దుర్గా దేవీ. బిజరని మరియు దుర్గా దేవీ నుండి జిప్సీ వాహనం ద్వారాను, ధికాల నుండి కేన్టర్ బస్సు ద్వారాను సందర్శించవచ్చు. మేము బిజరని ద్వారం నుండి జిప్సీలో వెళ్లి సుమారు మూడు గంటలు అటవీ మార్గం గుండా ప్రయాణించాము. మాకు పులులు కనబడలేదు. ఎన్నో జింకలు దుప్పులు కనిపించాయి. కాని అటవీ ప్రయాణం కొత్త అనుభవాన్ని ఇచ్చింది.

జిమ్ కార్బెట్ పార్క్

గిర్జాయ్ – గిరిజా దేవీ మందిరం:

మరునాడు, అక్కడికి 5 కిలోమీటర్ల దూరంలో కోసి నదీ మధ్యన ఒక రాతి గుట్ట పై ఉన్న గిరిజా దేవీ మందిరం దర్శించాము. అది ఒక చక్కటి అనుభవం. ఆ రాతి గుట్ట పైకి 70 మెట్లు ఎక్కితే పైన వర్తులాకారంలో చిన్నగుడి ఉంటుంది. మెట్లు చాల ఎత్తుగా నిటారుగా ఉంటాయి. అందరు ఒకరి తరువాత ఒకరు లైన్ లో వెళ్ళాలి. మందిరంలో పార్వతీ దేవీ విగ్రహం పాలరాయితో మలచబడి సుందరంగా ఉంటుంది.

గిరిజా దేవీ మందిరం

హాంగింగ్ బ్రిడ్జి:

ఆ దేవిని దర్శించుకుని అక్కడి దగ్గరలో కోసి నదీ పైన 19వ శతాబ్దంలో ఆంగ్లేయులు నిర్మించిన ‘హాంగింగ్ బ్రిడ్జి’ చూసాము. నది పైన సన్నటి వంతెన. దానిని ఇరుపక్కల పట్టి ఉంచే ఇనుప తాళ్ళు. రెండు వైపులా ఎత్తైన రాతి ద్వారాలు. ప్రస్తుతం ఆ బ్రిడ్జి పైనుండి రోప్ క్లైంబింగ్, బంజీ జంపింగ్ మొదలైన ‘సాహసమైన ఆటలు’ నిర్వహిస్తున్నారు. వాటిని చూసి దగరలో ఉన్న ప్రదర్శనశాల దర్శించి వసతికి తిరిగి వచ్చాము. దీనితో మా కుమన్ యాత్ర సుసంపన్నం అయింది.

హాంగింగ్ బ్రిడ్జి

ఉన్నతమైన పర్వత శ్రేణులతో, శీతల వాతావరణంతో, చల్లటి నదులతో, అటవీ మరియు వన్య సంపదతో ప్రకృతి రమణీయతను మూటకట్టుకున్న కుమాన్ ప్రాంతం నిజంగా దేవతలు విహరించే ‘దేవభూమి’. పదకొండు రోజుల మరిచిపోలేని అనుభవాలను ప్రోది చేసుకుని, మరునాడు రామనగర్ స్టేషన్ నుండి రానిఖేత్ లింక్ రైలు తీసుకుని ఢిల్లీ చేరుకొని అక్కడనుండి హైదరాబాద్ తిరిగి వచ్చాము.

Exit mobile version