Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఉత్తరం చేసిన మేలు

[శ్రీమతి చిలకమర్రి రాజేశ్వరి గారు రచించిన ‘ఉత్తరం చేసిన మేలు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక – బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో సాధారణ ప్రచురణకి ఎంపికైన కథ.]

ఫీసులో అత్యవసరమైన పని తగలడంతో రాజేష్ ఆఫీసు నుంచి బయలుదేరడం మామూలు కన్నా ఆలస్యం అయింది. దాంతో అలసిపోయి చికాకుగా ఇంటికి చేరాడు. నాన్న రాక కోసమే ఎదురు చూస్తున్న ఆకాష్ నాన్నను చూడగానే ఎదురు వచ్చాడు “నాన్నా” అంటూ.

“ఏమిట్రా, ఇంట్లోకి కూడా రానీయవా నన్ను” అంటూ విసుక్కున్నాడు రాజేష్.

“ఆకాష్, నాన్నను లోపలికి రానీ. కొంచెం విశ్రాంతి తీసుకున్న తరువాత నీతో మాట్లాడతారు. నువ్వు వెళ్ళి చదువుకో” అంటూ గది లోకి పంపించింది రమ్య.

“రమ్యా, ఆకలి వేస్తోంది. స్నానం చేసి వస్తాను. నువ్వు ఈ లోపల భోజనానికి ఏర్పాటు చేయి” అంటూ వెళ్ళాడు రాజేష్.

“ఆకాష్, నువ్వు కూడా రా, భోజనానికి” అంటూ పిలిచింది రమ్య.

“ఏమిటీ, వాడు ఇంకా భోజనం చేయలేదా, ఏం చేస్తున్నాడు ఇప్పటిదాకా” అన్నాడు రాజేష్.

“ఇవాళ పాఠశాలలో ఏదో ప్రాజెక్టు పని ఇచ్చారట. అది ఎల్లుండికల్లా పూర్తి చేయాలిట. దాని గురించి మీతో మాట్లాడాలని భోజనం కూడా చేయకుండా మీ కోసం ఎదురు చూస్తున్నాడు” అంది రమ్య.

ముగ్గురూ భోజనం చేసిన తరువాత “ఏంటి, అమ్మ ఏదో చెప్తోంది. విషయం ఏమిటి?” అని ఆకాష్‌ను అడిగాడు రాజేష్.

“తెలుగులో ఉత్తరం రాయాలి, ఒక్క ఇంగ్లీష్ పదం రాకుండా. రాగానే అమ్మని అడిగాను, రాసి పెట్టమని. అమ్మ ఏమో ‘నేను మొదట్నించీ ఇంగ్లీష్ మీడియం. అదే కాక ఇంగ్లీష్ పదాలు రాకుండా అచ్చ తెలుగులో రాయాలంటే నా వల్ల కాదు. నాన్న కి తెలుగు పుస్తకాలు చదివే అలవాటు ఉంది కాబట్టి నాన్న అయితే బాగా రాయగలరు’ అని చెప్పింది. పైగా తాతయ్య నీకు క్రమం తప్పకుండా తెలుగు లోనే వారానికి ఒక ఉత్తరం రాసేవారట కదా, అమ్మ చెప్పింది. నాకు తెలుగులో ఉత్తరం రాసి ఇవ్వు నాన్నా” అని అడిగాడు ఆకాష్.

‘నాకు మాత్రం ఇప్పుడు ఇంగ్లీష్ పదాలు లేకుండా ఉత్తరం రాయడం వస్తుందా. అదీ కాక ఒకప్పుడు పుస్తకాలు చదివే అలవాటు ఉన్నా, పని ఒత్తిడిలో పడి, ఆ విషయమే మరిచిపోయాను. నాన్న రాసిన ఉత్తరాల సంగతి కూడా మనసులో ఒక మూలకి తోసేసాను. ఇవన్నీ తెలిసి కూడా బాగా ఇరికించింది’ అని తనలో తాను అనుకుంటూ కోపంగా చూసాడు రమ్య వంక రాజేష్.

“ఎప్పుడూ వాడి హోంవర్క్ నేనేగా చేయించేది. మీకు కూడా అందులో ఉన్న కష్టాలు తెలియాలనే ఇలా చేసా” అన్నట్టు చూపులతోనే బదులిచ్చింది రమ్య.

“సరే, నాకు తప్పుతుందా, ఇంతకీ ఏం చేయమన్నారు మీ గురువు గారు” అని అడిగాడు రాజేష్.

“కళాశాలలో చదువుకుంటున్న కొడుకుకి నాన్న ఉత్తరం రాయాలిట.” అన్నాడు ఆకాష్.

“ఈ చరవాణి వచ్చిన దగ్గర నుంచి, దానిలో సందేశాలు పంపడం తప్ప, ఈ రోజుల్లో ఉత్తరాలు ఎవరు రాస్తున్నారు, మీ గురువు గారికి, ఇలాంటి ఆలోచన ఎలా వచ్చింది రా?” అన్నాడు చిరాకుగా రాజేష్.

“నువ్వు ఎప్పుడూ ఇంతే నాన్నా, నాతో మాట్లాడటానికే నీకు సమయం ఉండదు. ఊరికే చిరాకు పడతావు? సర్‌ని నేను ఎలా అడుగుతాను? ఇంతకీ మీకు ఉత్తరం రాయడం వచ్చా, రాదా, రాకపోతే నేను, వేరే ఎవరిని అన్నా అడుగుతాను” అన్నాడు ఆకాష్ కోపంగా.

“నువ్వు చదివేది ఎనిమిది తరగతి, ఇంగ్లీష్ మీడియం. తెలుగు ఒక అంశంగా ఉన్నా మీ పాఠశాలలో ఎప్పుడూ ఆంగ్ల భాష లోనే తప్ప పోటీలు లాంటివి కూడా తెలుగులో ఇప్పటిదాకా పెట్టలేదు కదా. ఇంత హఠాత్తుగా ఈ ఉత్తరం అదీ తెలుగులో రాయడం అనేది ఎలా వచ్చింది అని సందేహం కలిగింది. అందుకే అడిగాను” అన్నాడు రాజేష్.

“అది కాదు నాన్నా, మా పాఠశాలకు పై నుంచి ఆదేశాలు వచ్చాయిట తెలుగులో ఏమన్నా పోటీలు పెట్టమని. మా తెలుగు మాస్టారికి ఎక్కడలేని ఆనందం కలిగి, ఈ విషయం పెట్టారు” అన్నాడు ఆకాష్.

“ఒక్కమాట అన్నానో లేదో అంత కోపం ఎందుకురా, నేను ఆలోచించి రాసి పెడతానులే, నువ్వు వెళ్ళి హాయిగా పడుకో” అన్నాడు రాజేష్ అనునయంగా.

“అలాగే నాన్నా” అంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు ఆకాష్.

రాజేష్ కూడా తమ పడక గది లోకి వెళ్ళాడు. రమ్య , వంట ఇంట్లో పని ముగించుకుని గది లోకి వచ్చింది. రాజేష్ పడుకోకుండా మంచం మీద కూర్చుని ఆలోచించడం చూసి “ఏమిటి ఆలోచిస్తున్నారు” అని అడిగింది రమ్య.

“ఏముంది, ఆకాష్ చెప్పినదాని గురించే ఆలోచిస్తున్నాను” అన్నాడు రాజేష్.

“ఆ పని తరువాత చేయచ్చు, మధ్యాహ్నం వేరే కాగితాల కోసం వెతుకుతుంటే బరువుగా ఉన్న కవర్ కనిపించింది. చాలా జాగ్రత్తగా దాచినట్టున్నారు. అందుకే నేను తీసి చూడలేదు. ముందు మీరు ఈ కవరులో ఉన్న కాగితాలు ఏమిటో ఒకసారి చూసి అవసరం లేదు అంటే చింపేస్తాను, సరేనా”, అంటూ ఆ కవర్ రాజేష్ చేతికి ఇచ్చింది రమ్య.

“ఆకాష్ అడిగిన ఉత్తరం రాయడానికే ఓపిక లేదు అని నేను అనుకుంటుంటే, ఈ పని నువ్వు ఇప్పుడే పెట్టాలా, నా వల్ల కాదు” అని విసుక్కుంటూ కవర్ పక్కన పెట్టేశాడు రాజేష్.

“అవును, ఇది చాలా ముఖ్యమైనది, అందుకే ఇప్పుడే చూడమంటున్నాను” అంటూ మళ్ళా కవర్ చేతిలో పెట్టింది రమ్య.

ఇక తప్పదని ఆ కవర్ తీసుకొని తెరిచాడు. అందులో ఉన్న ఉత్తరాలు ఎగిరి మంచం మీద పడ్డాయి. ఆ ఉత్తరాలలో కనిపించిన దస్తూరి చూసి ఒక రకమైన ఉద్వేగానికి లోను అయ్యాడు. కళ్ళల్లో నీరు నిండింది. రమ్య నెమ్మదిగా రాజేష్ భుజం మీద చేయి వేసి “ఏమైందండి యివన్నీ ఏమిటి? ఎవరు రాసిన ఉత్తరాలు? ఇంత జాగ్రత్తగా దాచుకున్నారు” అంటూ అనునయంగా అడిగింది.

“అవి ఊసుపోక ఉత్తరాలు కాదు రమ్య, మా నాన్న తన మనసు విప్పి నా కోసం, నా భవిష్యత్తు బాగుండాలనే తపనతో రాసిన అక్షరాల మాలికలు. నేను ఈ రోజు ఇంత ఉన్నత స్థాయిలో నిలబడగలిగానంటే అది మా నాన్న తన వారం వారం క్రమం తప్పకుండా రాసిన ఉత్తరాల ద్వారా నాలో రగిలించిన విజయ కాంక్ష, నూరిపోసిన ఆత్మ స్థైర్యం వల్లనే” అన్నాడు రాజేష్.

“బహుశా, ఆయనకు తీరిక ఎక్కువ ఉండేదేమో, అందుకే మీకు అన్ని ఉత్తరాలు రాయగలిగారు, ఇప్పుడు ఎవరికీ అంత తీరికా లేదు, ఓపిక అసలు ఉండట్లేదు” అంది రమ్య

“నాన్నకు కూడా ఉద్యోగ బాధ్యలతో క్షణం తీరిక ఉండేది కాదు, ఉద్యోగ రీత్యా అనేక ప్రదేశాలకు వెళ్లాల్సివచ్చేది. ఉదయం బయలుదేరితే రాత్రి పది దాటిపోయేది ఇంటికి చేరేటప్పటికి. అయినా, తెలిసినవారికి ఏమైనా సమస్యలు ఎదురయ్యాయని తెలిస్తే, వాటికి తగిన పరిష్కారాలు చెప్పేవారు. అందరికీ ఎప్పుడూ అందుబాటులో ఉండేవారు. అందరికీ ఆయన అంటే గౌరవం. ఎంత తీరిక లేకపోయినా, నాకు మాత్రం వారానికి ఒక రెండు పుటల ఉత్తరం తప్పనిసరిగా వచ్చేది, ఆయన చదువు అంటే ప్రాణం పెట్టేవారు. పుస్తకాలు అంటే మరీ ఇష్టం. తీరిక చేసుకుని చదివేవారు. ఆ ఇష్టాన్నే నాకు కూడా కలుగచేయడానికి ప్రయత్నించేవారు.”

“అవును, మీరు కళాశాలలో చదువుకునేటప్పుడు మీ నాన్నగారు, మీకు వారానికి ఒక ఉత్తరం రాసేవారని, ‘ఆ ఉత్తరాల కోసం వారం అంతా ఎదురు చూసేవాడినని, అవే మీకు ఇంటి మీద దిగులుని మరిపించి, బాగా చదువుకోవడానికి నాకు ధైర్యాన్ని ఇచ్చేవని, అవీ కాక తరగతి పుస్తకాలతో విసుగు వస్తే, మనసుని తేలిక పరచడానికి పెద్ద కవులు, రచయితలు వ్రాసిన పుస్తకాలు చదవమని చెప్పేవారని, దానివల్లే మీకు పుస్తక పఠనం అలవాటు అయింద’ని మన పెళ్లి అయిన కొత్తలో చాలా సార్లు చెప్పేవారు. ఎంత పనిలో ఉన్నా నెలకు ఒక్క సారి అయినా ఉత్తరాలు తీసి చదువుకొనేవాడినని, అవి చదివితే మీలో పని ఒత్తిడి తగ్గి, ఉత్సాహం వస్తుందనీ, అలాగే ఏదో ఒక పుస్తకం అయినా కాసేపు చదవకపోతే, ఆ రోజు మీకు ఏదోలా ఉంటుందని మరీ మరీ చెప్పేవారు. కొన్నాళ్ల తరువాత నెమ్మది నెమ్మదిగా పనిధ్యాస ఎక్కువ అయి పక్కన పెట్టారు. ఆ తరువాత ఆ కవర్ అందులో ఉత్తరాలు బీరువా అడుగుకి వెళ్లిపోయాయి. పని ఒత్తిడితో మీకు రాను రాను విసుగు, చిరాకు ఎక్కువ అయ్యాయి. మా కోసమే కాదు, మీ కోసం కూడా కొంత సమయం కేటాయించుకోలేకపోతున్నారు. చూసారా, మీ నాన్నగారు ఎంత పని ఒత్తిడిలో ఉన్నా, మీకు కావలసిన సమయం కేటాయించి, మిమ్మల్ని ఒక మంచి వ్యక్తిగా తీర్చిదిద్దారు. మనం కుటుంబం, ఆఫీసు, రెండిటినీ సమన్వయం చేసుకుంటూ జీవితాన్ని గడపాలి. అప్పుడే మీరు, ఆఫీసులో అధికారుల వద్దే కాదు, ఇంట్లో పిల్లల మనసుకు కూడా గెలుచుకుంటారు. ఆ పాత జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటే మీలో మార్పు వస్తుందనే ఆకాష్‌కి మీరే ఉత్తరం రాయగలరు అని చెప్పాను” అంది రమ్య.

“అవును, అన్నీ గుర్తుకి వస్తున్నాయి. పోటీ ప్రపంచంలో నా అస్తిత్వాన్ని నిలబెట్టుకోవాలనే ప్రయత్నంలో నన్ను నేనే మర్చిపోయాను. మీతో వీలైనంత సమయం గడపడానికి, నా ఇష్టాలను తీర్చుకోవడానికి కూడా సమయం కేటాయించలేకపోయాను. ఆ విషయం అర్థమవుతూనే ఉన్నా, ఎలా సమన్వయం చేసుకోవాలో తెలియక నాలోని చిరాకుని మీమీద చూపిస్తున్నాను.” అన్నాడు రాజేష్.

“మరి ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నారు? రేపు ఆఫీసుకి సెలవు పెట్టేయండి. మీ నాన్నగారు రాసిన ఉత్తరాలన్నిటినీ, హాయిగా కూర్చుని నెమ్మదిగా చదువుకోండి. మీకే కొత్త ఉత్సాహం కలుగుతుంది మళ్ళా. మీ నాన్నగారు మీలో కలిగించిన స్ఫూర్తిని మీ అబ్బాయికి ఉత్తరం రూపంలో బహుమతిగా ఇవ్వండి. ఇకనైనా కొంత సమయం మన కోసం, మీ కోసం, కొంత సమయం మీకు ఇష్టమైన పుస్తకాలు చదవడం కోసం కేటాయించండి. పైగా ఈ మధ్య ఆకాష్ కూడా బాగా మీరు వాడితో సమయం గడపట్లేదని చాలా బాధ పడుతున్నాడు” అని రమ్య.

“అవును రమ్య, నువ్వు సమయానికి బాగా గుర్తుచేశావు, నాలో ఎందుకు విసుగు, చిరాకు పెరిగిపోతున్నాయా అని మథన పడుతున్నాను కారణం తెలుసుకోలేక. ఇప్పుడు నాకు కావలసినది ఏమిటో అర్థమైంది. నాన్న ఉత్తరాల సంగతి తలుచుకుంటేనే నా ఒళ్ళు సంతోషంతో పులకరిస్తోంది. అవి చదువుతుంటే, నాన్న నా ప్రక్కనే ఉన్నట్లు అనిపిస్తుంది. రేపు నువ్వు చెప్పినట్లే చేస్తాను. ఇక నుంచి, నా కోసం, మన కోసం కొంత సమయాన్ని పక్కన పెడతాను. మన ఆకాష్‌కి వాడికి నేను రాసే ఉత్తరం ఒక అపురూపమైన బహుమతిగా అందిస్తాను. ఇకనైనా వాడికి ఒక మంచి నాన్నగా మారి, వాడి భవితవ్యానికి బంగారు బాట వేస్తాను” అని అన్నాడు రాజేష్.

“అవును, ప్రస్తుతం వాడు కౌమారదశలో ఉన్నాడు. ఈ వయసులో వాళ్లకు చాలా సందేహాలు కలుగుతాయి. అవి అమ్మగా నాతో పంచుకోలేకపోవచ్చు. అందుకే మీకు మరీ మరీ చెపుతున్నాను. అందుకే మీరు వాడితో ఎక్కువ సేపు సమయం గడపడానికి ప్రయత్నించాలి. వాడి సందేహాలను తీర్చి, చెడు గుణాలవైపు మనసు మరలకుండా, ఏది మంచి, ఏది చెడు అనేది తర్కబద్ధంగా, అర్ధం అయ్యేలా చేయాలి. అప్పుడే వాళ్లను చదువుతో పాటు సంస్కారం ఉన్న పిల్లలుగా తీర్చిదిద్దగలం. ఒక సంఘజీవిగా అది మన కర్తవ్యం.” అంది రమ్య.

“అవును, నువ్వు నిజం చెప్పావు, ఇప్పుడు మన పని ఒత్తిడిలో పిల్లలను పట్టించుకోకుండా వదిలేస్తున్నాం, తర్వాత వాళ్ళు పెద్ద అయిన తరువాత మన మీద అభిమానం, ప్రేమ చూపించటం లేదని, స్వార్థపరులుగా మారిపోయారని బాధ పడుతున్నాం. తల్లి తండ్రులుగా మన కర్తవ్యం మనం నెరవేరుద్దాం” అన్నాడు రాజేష్.

“అలాగే, నాన్న ఉత్తరం ఇప్పుడు కూడా మీలో మార్పుకు నాంది పలికింది” అని ఆనందంగా అంది రమ్య.

Exit mobile version