[జి.వి.శ్రీనివాస్ గారు రచించిన ‘వాడ చేరిన వేణుగానం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక – బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో సాధారణ ప్రచురణకి ఎంపికైన కథ.]
చంద్రుడు కాస్త మబ్బు పట్టి ఉన్నాడు. మసక వెలుతురులో కూడా ఆలయ శిఖరం అందంగానే కనిపిస్తోంది. పక్కనే ఉన్న కోనేరుపై నుంచి వచ్చే చల్లగాలి సంగీతానికి ఆలయం చుట్టూ ఎత్తుగా పెరిగిన చెట్లు తలలూపుతూ వంతపాడుతున్నాయి.
“తాళాలు భద్రంగా వేసావటురా?” పెద్ద పూజారి గారి గొంతు ఖంగుమంది.
“ఆ! రెండుసార్లు లాగి మరీ చూశాను గురువు గారు” వినయం శిష్యుని గొంతులో.
“అసలే ఈ రోజు విశేష అలంకరణ చేశాము. నిలువునా ధగధగ మెరిసే బంగారు ఆభర్ణాలతో స్వామివారు చూడ ముచ్చటగా ఉన్నారు సుమీ”
“అవును గురువు గారు, చూడటానికి రెండు కళ్ళు చాలలేదంటే నమ్మండి”
క్రమంగా దూరమవుతున్న గురుశిష్యుల మాటలు వింటూ ఆలయ ప్రాకారానికి ఆవల.. గుబురు చెట్ల మాటున ఎంతోసేపటి నుంచి వేచి ఉన్న ఆ రెండు ఆకారాలు ఆనందంతో చేతులు కలుపుకున్నాయి.
***
నడిఝాము గంట ఎక్కడో దూరంగా మోగింది. అంతవరకు ఓపికగా కూర్చున్న ఆ రెండు ఆకారాలు అటుఇటు చూసి ఎవ్వరూ లేకపోవడం గమనించి, ఆలయ ప్రాకారం బయటనుంచి ఏపుగా పెరిగి, లోపల వైపుకు విస్తరించిన కొమ్మలు పట్టుకొని ఎగబాకసాగాయి.
“మరేం పర్లేదు అంటావా?” లోగొంతుతో ప్రశ్నించాడు వెనుక పాకుతున్న ఈరన్న.
“చట్! ఈ పొద్దు కోసమే గదా ఇన్నాల్లా బట్టి ఎదురుసూస్తున్నది. మరేం భయం లేదు, నా ఎనకాల మెల్లగా పాక్కొంటూ ఒచ్చేయ్” ధైర్యం చెప్పాడు ముందున్న సూరన్న.
గస్తీవాళ్ళ మాటలు దగ్గర్లో వినబడసాగాయి. బల్లిలా చెట్టు కొమ్మలకు కరుచుకొని కదలక మెదలక ఉండిపోయారిద్దరూ.
బుస్.. ఒక్కసారిగా అదిరిపడి చూశాడు సూరన్న. అడుగు దూరంలో కొమ్మకు చుట్టుకొని సర్పం పడగ విప్పి సూరన్ననే చూస్తుంది. నుదుటిపై చెమట ధార కట్టింది. కదిలితే, ఆ అలికిడి విని రాజ భటులు దాడి చేస్తారు. కదలకుండా ఉందామంటే.. కోరలు దింపడానికి సిద్ధమవుతూ బుసలు కొడుతుంది సర్పరాజం. పాము సవ్వడి విన్న ఈరన్న కూడా బిక్క చచ్చిపోయాడు.
భటుల సవ్వడి క్రమంగా దూరమయ్యింది. కోరలు బయటకు లోపలకు ఆడిస్తూ సూరన్న ముఖాన్నే చూస్తుంది సర్పం. చెట్టుపై నుంచి కిందకు చూశాడు. ఆలయ ప్రాంగణం కనిపిస్తుంది. తెగించి కిందకు దూకేసాడు సూరన్న. ధబ్ మన్న శబ్దంతో పాటు ‘ఉమ్’ ఆన్న మూలుగు కూడా వినవచ్చింది ఆ వెనకనే దూకిన ఈరన్నకు.
“ఏటయ్యిందిరా?” గుసగుసగా అడుగుతూ చూసాడు.
మసక వెలుతురులో సూరన్నతల నుంచి రక్తం కారిపోతూ కనిపించింది. అప్పుడు చూశాడు దూకిన చోట ఉన్న బండను. సర్రున పంచె అంచు చింపి, పక్కనే ఉన్న మొక్క నుండి కొన్ని ఆకులు నలిపి సూరన్న తలకు కట్టు కట్టాడు.
ఎగిసిపడుతున్న గుండెలతో కాసేపు అలానే కూర్చోండి పోయారు. అంతటా నిశ్శబ్ధం. కీచురాళ్ళ సవ్వడి, ఆయాసంతో ఉన్న ఎగ ఊపిరి శబ్ధం తప్ప మరే విధమైన అలికిడి లేదు.
“కొంపదీసి పాము కూడా మనతో పాటు కింద పడిందంటావా?” కళ్ళు చిట్లిస్తూ నేలపై చూస్తూ అనుమానంగా అడిగాడు ఈరన్న.
వెన్నులో వణుకు మొదలయ్యి భయంగా దగ్గరకు ముడుచుకున్నారు.
“ఒరేయ్ ఈరన్న! తప్పు చేశామంటావా? ఇంట్లో మీ అప్పకు ఈ పని గురించి చెప్పినప్పుడు నెత్తి, నోరు కొట్టుకొని ఏడ్చింది. నానే ఇనకుండా నిన్ను కూడా రెచ్చగొట్టి తీసుకొచ్చాను”
“అవున్రా, ఒకవేళ దొరికిపోతే పరిస్థితి ఏంటిరా? పెళ్ళాం, పిల్లలతో వూరొదిలి పారిపోవాలి. అది కూడా జనాలు మనల్ని పేనాలతో బతకనిస్తే” ఈరన్న ముఖంలో దిగులు కనిపిస్తోంది.
“బహుశా దేవుడికి ఇష్టం లేదంటావా? అందుకే ఇలా జరుగుతున్నాయా?” లెంపలేసుకున్నాడు సూరన్న.
“ఇంత దూరం తెగించి ఒచ్చాము. ఓ నాలుగడుగులు ఎస్తే సాలు”
అలుపు తీరిన తర్వాత లేచి, పిల్లిలా సవ్వడి కాకుండా గర్భగుడి వైపు అడుగులు వెయ్యసాగారు.
మొలలో దోపిన చిక్కం నుంచి చిన్న ఇనుప చువ్వను తీసి తాళం తెరవడానికి ప్రయత్నించసాగాడు సూరన్న. ఎందుకో తెలియదు గాని కాళ్లు, చేతులు సన్నగా వణకసాగాయి. అరచేతులలో చెమట ఊరుతూ చేతులు పట్టు తప్పిపోతున్నాయి. ఈరన్న అటు ఇటు గాబరాగా చూస్తూ కాపలా కాయసాగాడు. వీళ్ళు చేస్తున్న పనికి గాలి కూడా విస్తుపోయి నిలబడిపోయింది.
వెనుక నుండి ఒక్కసారిగా తీతువు పిట్ట భయంకరంగా అరుస్తూ ఎగిరిపోయింది. గుండె ఝల్లుమంది ఇద్దరికీ. ఇంతలో చిన్న శబ్ధంతో తాళం తెరుచుకుంది. సూరన్న సంతోషం పట్టలేక గభాల్నా ఈరన్నను కౌగిలించుకున్నాడు.
శబ్ధం కాకుండా గుడి తలుపులు తెరిచారు. అంతే.. కంటెదురుగా ఉన్న దృశ్యాన్ని చూస్తూ నోట మాట రాక శిలా ప్రతిమలా నిలబడిపోయారు.
ఎదురుగా దీపకాంతుల మధ్య చిరునవ్వులు చిందిస్తూ, చేత వేణువు పట్టుకొని ఒళ్ళంతా తళ్ళుక్కుమనే బంగారు ఆభరణాలతో, వజ్రాలు పొదిగిన కిరీటంతో నిలిచి ఉన్న శ్రీకృష్ణుని దివ్య మంగళ విగ్రహం కన్నుల పండుగలా ఉంది.
ఇన్నేళ్ళ శ్రమ ఫలించగా తెలియకుండానే రెండు చేతులు జోడించి, కళ్ల నుండి ఆనంద భాష్పాలు జలజలరాలుతుండగా తన్మయత్వంతో తెలిసిన లొల్లాయి పదాలు పాడుతూ ఒళ్ళు తెలియని స్థితిలో అలా నిలబడి వూగిపోసాగారు.
***
తూర్పున వెలుగు రేఖలు విరబూసాయి. తెరిచి ఉన్న తలుపులు చూస్తూ విస్తుబోతూ, గుడిలో అడుగు పెట్టిన పూజారి వీళ్ళద్దరిని చూడగానే గగ్గోలు పెట్టారు. జనం గుమిగూడారు. బయటకు లాక్కొచ్చారు.
“దేవుని గుడిలోనే దొంగతనానికి వస్తార్రా?” భటుల శూలాలు గొంతుల మీద కూర్చున్నాయి.
“లేదు దొరా, మావు దొంగలము కాదు. దేవుణ్ణి కంటి నిండా సూడాలనే ఒచ్చాము సామి. మా మాట నమ్మండి. మావు గుడిలో అడుగేట్టగానే ఎయ్యి సెందమామల్లా ఎలిగిపోతున్న సాములోరిని సూత్తూ ఒల్లెరగక అలా నిలబడిపోనాము. మావక్కడ ఏదీ ముట్టుకోలేదు. మమ్మల్ని నమ్మండి దొరా” ఏకధాటిగా ఏడుస్తూ అన్నాడు సూరన్న.
గర్భగుడి లోపల పరిశీలించిన పెద్ద పూజారి గారు నగలన్నీ భద్రంగా ఉన్నాయని చెప్పగానే అందరూ వూపిరి పీల్చుకున్నారు. అయితే సూరన్న, ఈరన్న ఎవరన్నది తెలియగానే అక్కడున్న అందరిలో కోపం కట్టలు తెంచుకుంది.
“వెధవల్లారా! ప్రవిత్రమైన గుడిని అపవిత్రం చేశారు గదరా?”
ఆవేశంతో పైకి లేచిన కర్రలు సూరన్న, ఈరన్న వీపులపై తాండవం చేశాయి. వారిద్దరిది అరణ్యరోదనే అయ్యింది. దెబ్బలకు తాళలేక వారిద్దరూ చేస్తున్న హాహాకారాలు గాలిలో కలిసిపోతున్నాయి. కొరడా దెబ్బలకు ఇద్దరి వీపులపై వాతలు తేలాయి. శక్తిహీనులయి నేలపై కూలబడి పోయారు.
“పదండి! ఈ వెధవలను రాజాస్థానానికి తీసుకొని వెళ్దాం. ప్రభువులే శిక్ష వేస్తారు”
పురోహితుల సూచనతో వారిద్దరి చేతులు వెనక్కి విరిచి, శూలాలతో పొడుచుకుంటూ రాజుగారి వద్దకు తీసుకొని వెళ్లారు.
***
సభ అంతా నిండుగా ఉంది. మంత్రులు, పుర ప్రముఖులు, రాజ్య పురోహితులు, నాట్యగత్తెలు, వాణిజ్య ప్రముఖులు, రైతు పెద్దలు, పొరుగుదేశపు సందర్శకులతో పాటుగా సామాన్య ప్రజానీకం, రకరకాల విన్నపాలుతో వచ్చినవారు, ఇలా సభ కళకళ లాడుతుంది.
పుర రక్షకాధిపతి అనుమతితో సభలోనికి ప్రవేశపెట్టబడిన ఆ ఇద్దరినీ సాలోచనగా చూశారు రత్న ఖచిత సువర్ణ సింహాసనంపై ఠీవిగా కూర్చున్న రాజుగారు.
“ఏమి వీరు చేసిన అపరాధం?” గంభీరంగా ప్రశ్నించారు.
“ప్రభు! ధర్మం, సనాతన సాంప్రదాయాలు నిండుగా నడయాడే తమరి పాలనకే మచ్చ తెచ్చే పనిచేశారు ఈ దుర్మార్గులు”
భృకుటి ముడివేసారు ఏలినవారు.
“పవిత్రమైన దేవాలయం లోనికి దొంగతనంగా ప్రవేశించారు ఈ అంటరానివాళ్ళు. దేవాలయపు గాలికూడా సోకనంత దూరంలో ఉండవలసిన వీళ్ళు, తాళం తెరిచి మరీ అడుగుపెట్టారు ఈ కడజాతిహీనులు”
ఆవేశంగా చెప్తున్న పుర రక్షకాధిపతిని ఆగమని చెయ్యెత్తి “భగవానుని ఆభరణములు ఏమైనా తస్కరించినారా?” అడిగారు రాజావారు.
తలలు అడ్డంగా వూపుతూ ఏడ్వసాగారు ఈరన్న, సూరన్న.
ప్రభువుల కుడిచేతి చూపుడువేలు అసంకల్పితంగానే చుబుకం పైనుండి పెదవుల పైకి వెళ్ళింది.
“నడిఝామున దొంగతనంగా దేవాలయంలో ప్రవేశించి, దొంగతనం చెయ్యకుండా అక్కడ మీరు ఏమి చేశారు?” గద్దించారు ప్రభువులు.
“ఏలినదొరవారు! మా తప్పు కాయాలి, మావేమీ కాజేయ్యదానికి పోలేదు” ఏక కంఠం, ఏడుపు జీరతో ఇద్దరూ ఒక్కసారే చెప్పారు.
“మరి?.. ఫర్వాలేదు, చెప్పండి” అభయం ఇచ్చారు ప్రభువులు.
“సిన్నప్పటి నుండి గుడిలోని సామి గురించి బోలెడు కతలు ఇన్నాము. సామినో పాలి సూత్తే సాలు జల్మ జల్మల పాపాలన్నీ పోతాయని ఇన్నాము. కానీ మావు అంటరానోళ్లమని, గుడిలో అడుగేట్టకూడదని కట్టుబడి ఉంది. కానీ, సామిని సూడాలన్నఆరాటంతో, సూడకుండా ఉండనేక ఈ పని సేశాము. దొరికిపోతే పేనాలు పోతాయని తెలిసినా మావు ఎల్లాము. మా తప్పుకాయండి దొరా”
మోకాళ్ళపై కూలబడిపోయి శిరస్సులను నేలకు తగిలిస్తూ ఏడుస్తున్న వారిని చూసిన ప్రభువుల హృదయం ద్రవించింది.
“ముందు వాళ్ళిద్దరి బంధనాలు తొలగించండి”
ఆజ్ఞ పాలించారు భటులు. కట్లు విప్పిన చేతులతో దండాలు పెడుతూ నిల్చున్నారు ఈరన్న, సూరన్న.
“అవునూ, వెళ్లారు సరే. మరి చూసి, వచ్చినదారినే వెళ్లిపోకుండా సుప్రభాతం వేళ వరకు అక్కడే ఎందుకు ఉండిపోయారు?” కుతూహలంగా అడిగారు ప్రభువులు.
“వేకువఝామున నేను వెళ్ళేసరికి గుడి తలుపులు తెరిచిఉన్నాయి ప్రభూ. ఆందోళనతో లోపలికి వెళ్ళిన నాకు కళ్ళు మూసుకొని, ఏవేవో పిచ్చి పదాలు పాడుకుంటూ వూగిపోతూ కనిపించారు ప్రభూ” విన్నవించాడు పెద్ద పూజారి.
ఒక్క నిమిషం పాటు ప్రభువులు కళ్ళు మూసుకొని, మౌనం వహించారు. సభ అంతటా నిశ్శబ్ధం. వీరిద్దరికీ మరణశిక్ష ఖాయం అని అందరూ మనసులో అనుకోసాగారు.
మెల్లగా కళ్ళు తెరిచిన ప్రభువల సుందర వదనంలో చిరు మందహాసం వీచింది.
“ప్రాణాలు పోతాయని తెలిసి కూడా దేవాలయంలోని భగవంతుణ్ణి కన్నులారా చూడాలని, సాహసం చేసి తాళం తెరిచి ప్రవేశించి, కళ్ల ఎదురుగా కలలపంటను చూస్తూ తన్మయత్వంతో ఒళ్ళు, సమయం మరిచిన వీళ్ళద్దరూ నిజమైన భక్తులు”
సభ అంతటా విస్మయం, గుసగుసలు. ప్రభువుల అంతరంగం అర్థం చేసుకున్న మంత్రి చిరునవ్వు నవ్వారు ప్రభువులను చూసి.
“అటువంటి భక్తాగ్రేసురలకు ఎటువంటి శిక్ష వెయ్యాలి? వారి పాద ధూళి శిరస్సున ధరించడం తప్ప”
ప్రభువుల మాటలు సభ మనసుతో వింటోంది.
“దొంగతనానికై వెళ్ళి ఉంటే, వారీ సమయమనకు మన హద్దులు దాటి ఉండేవారు. స్వామి మంగళ రూపం కనులారా చూడాలనే తాపత్రయం తప్ప వేరే ఏ చెడు ఆలోచన లేదు వారిద్దరిలో. ఎందుకు వారు అర్థరాత్రి అంత సాహసం చేయవలసి వచ్చింది? అని నన్ను నేను ప్రశ్నించుకుంటే అందుకు మన నియమాలే కారణం అని మనసు చెప్పింది. అందువలనే వాళ్ళు అలా చేయవలసి వచ్చింది, ఆ యత్నంలో వారి ప్రాణాలు పోయి ఉంటే ఆ పాపం ఈ రాజ్యపు రాజుగా నాదే అవుతుంది. అందుకే ఒక నిర్ణయం ప్రకటిస్తున్నాను”
ప్రభువుల కనుచివరల నుండి గుండెలోని ఆవేదన జారువారుతుంది. వేదన నిండిన కళ్ళతో రాజగురువు వైపు చూశారు ప్రభువులు. వారు కళ్ళతోనే అంగీకారం తెలిపారు. ప్రభువులనే రెప్పవెయ్యకుండా చూస్తున్న సభికుల హృదయాలు చెమ్మదేరాయి.
“ఇది పూర్వ పద్ధతులకు విరుద్ధంగా ఉండవచ్చు. కానీ మారుతున్న కాలంతో పాటు సమాజహితం కోసం, రాజ్యంలోని ప్రజలందరూ నా బిడ్డలే అన్న ప్రేమతో ఈ నిర్ణయం ప్రకటిస్తున్నాము. ఈరోజు నుండి మన రాజ్యంలోని అన్ని కులాలవారికి నిరభ్యంతరంగా దేవాలయ ప్రవేశం కల్పిస్తున్నాను. అందరికీ ప్రభువైన ఆ దేవదేవుణ్ణి కనులారా దర్శించడం అందరి హక్కు కూడా. నాకు కనువిప్పు కలిగించిన ఈ ఉత్తమ భక్తులను నిర్దోషులుగా విడుదల చేస్తున్నాము. అలాగే తగురీతిన సత్కరిస్తాము. వారికి కొలువులో పని కూడా ఇస్తాము”
సభికుల హర్ష ధ్వనులు మిన్నంటాయి. సూరన్న, ఈరన్నల ఆనందం అంబరం అంటింది. తూరుపు దిక్కునుండి కాంతికిరణాలు రాజ్యమంతటా బంగారు వన్నె పరిచాయి.
