[శ్రీమతి బి. కళాగోపాల్ రచించిన ‘వాడి పేరు మనిషి..!!’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక – బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో ₹ 2,000/- బహుమతి గెల్చుకున్న కథ.]
సుభద్రకు లోన దుఃఖంగా ఉంది. మనసంతా అలజడిగా ఉంది. ఏమిటేమిటో జిగట ఆలోచనలు ఆమెను నిలవనీయడం లేదు. మనిషి మనసు మనసులో లేక బెంబేలెత్తసాగింది.
పదేళ్ల బాబు ప్రజ్వల్‌కు రావలసిన ఆలోచనలేనా ఇవి? వాడి వయసు పిల్లలంతా చక్కగా చదువుకుంటూనో లేదా టి.వీనో, కామిక్ షోనో చూస్తూ ఆనందంగా కాలం గడుపుతారు. అమ్మానాన్నల ప్రేమ పొందుతారు. అడిగింది కావాలని మారాం చేస్తారు. సరదాగా పిక్నిక్లకీ పార్క్లకీ మాల్స్‌కీ తిప్పమంటారు.
కొత్త బొమ్మలు, ఆటవస్తువులు కొనిస్తే వాళ్ళ కళ్ళు ఆనందాల హరివిల్లును విరబూస్తాయి. అమ్మమ్మ, తాతల మెడ చుట్టూ గారంగా చేతులు వేసి ఊసులు చెప్తారు. కానీ.. కానీ తన బాబేమిటి ఇలాంటి ఆలోచనల్తో ఖేదపడుతున్నాడు. వాడి ఆలోచనా ధారను అర్థం చేసుకోలేక అన్యమనస్కంగా ఉండసాగింది సుభద్ర. లోనంతా అశాంతి. అందమైన పొదరిల్లులా అల్లుకున్న జీవనలతను ఏవో రాక్షస హస్తాలు బలంగా వేళ్ళతో పీకి పారేస్తున్నట్లు వాడు ప్రతిసారీ గుచ్చి గుచ్చి అడుగుతున్న ప్రశ్నలకు ఆమె ఉండచుట్టిన దుఃఖమై మ్రాన్పడిపోసాగింది. వీడు సుధాకర్ లాగే.. వద్దు వద్దు ఇంకేమాత్రం ఆ పీడకల లాంటి జీవితాన్ని మరోమారు తల్చుకోకూడదనుకుంది. సుధాకర్ ఆమె జీవితంలో ఓ సునామీ. ఓ దుఃఖపు మరక ఆమె ఎంత చెరిపివేసుకుందామన్నా చెరిగిపోక మానని గాయమై ఎదను తొలిచే అంతులేని వ్యథ.
***
రాత్రి తొమ్మిదైంది. క్లినికల్ సైకాలజిస్ట్ డాక్టర్ నిరంజన్ తన టేబిల్ మీదున్న ఫైళ్ళను సర్దుతూ కారు కీస్ తీసుకున్నాడు. బయట వార్డులో పేషంట్ల అలజడి తగ్గింది. ఎలాంటి గోలా, గలాటా వినబడటం లేదు. కౌంటర్ దగ్గర టీవీలు కట్టేశారు. కారిడార్‌లో లైట్లను ఆర్పుతున్నారు, స్వింగ్ డోర్ తెరుచుకొని నర్స్ రమ్య లోనకొచ్చింది.
“సార్ బయట ఒక పేషెంట్ వెయిటింగ్లో ఉన్నారు. పేరు సుభద్ర. తప్పకుండా మిమ్మల్ని కలవాలి అని ప్రాధేయపడుతున్నారండి. ‘కన్సల్టేషన్ టైం ఐపోయింది. మీరు రేపు రాగలరా ప్లీజ్’ అని ఎంత కన్విన్స్ చేసినా ఒప్పుకోవడం లేదు డాక్టర్. మీ అపాయింట్మెంట్ ఇపుడే కావాలని గట్టిగా పట్టుబడుతున్నారు డాక్టర్. మనిషి చాలా నెర్వస్‌గా, ఆందోళనగా ఉన్నారు” అంది రమ్య. రోగి మానసికస్థితిని అంచనా వేయడంలో పదేళ్ళకు పైగా అనుభవం ఆమెది. అందునా జాలిగుండె కావటంతో డాక్టర్ గారికి పరిస్థితి వివరించాలన్నా ఉబలాటమూ ఆమె మాటల్లో ద్యోతకమవసాగింది. మరో ఐదునిముషాల్లో క్లినిక్ క్లోజ్ చేయబోతున్న నిరంజన్ రమ్య మాటలకు తలూపుతూ “లోపలకు పంపించండి” అన్నాడు. అలసటగా అరచేతులతో కళ్ళను రుద్దుకొని టేబిల్ మీదున్న కళ్ళజోడును అందుకున్నాడు.
“నమస్కారం డాక్టర్” అంటూ బలహీనంగా విన్పడ్డ గొంతువైపు చూశాడు నిరంజన్. సుమారు ముప్ఫై నలభై ఏళ్ళున్న మహిళ బూడిదరంగు చీరలో అంతే వివర్ణమై వడలిన మొహంతో అతని ముందు నిలబడి ఉంది.
నిరంజన్ పరిశీలనగా ఆమె మొహంలోకి చూశాడు. ఆమె కళ్ళలో జీవం లేదు. భయం, బెరుకుతో కన్రెప్పలు బరువుగా వాలిపోతున్నాయి. మనిషి నిలువెల్లా దుఃఖ మేఘం కమ్ముకున్నట్టుగా ఉంది.
“కూర్చోండి” అన్నాడు అనునయంగా.
పవిటను భుజాల చుట్టూ తిప్పి కన్నీళ్ళను తుడుచుకుంది సుభద్ర. “ఇంత రాత్రి వేళ, అర్జంట్ అపాయింట్మెంట్ తీసుకున్నారంటే మీ సమస్య ఇగ్నోర్ చేయదగ్గది కాదని తెలుస్తూనేఉంది. మా క్లినిక్‌కి వచ్చే రోగులందరూ దాదాపు ఇలాగే ఉంటారు. ఎన్నో రకాల సమస్యలతో సతమతమయ్యేవారు, డాక్టర్‌తో సెషన్స్ సెషన్స్‌గా ముట్లాడి ఉపశమనం పొందుతారు. కొన్నింటికి మందులతోనూ, మరికొన్నింటికీ కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీతోనూ చికిత్స అందిస్తాం. రోగి మానసిక పరిస్థితిని సమస్య లోతును చర్చించటం ద్వారా కేసును త్వరితగతిన పరిష్కరిస్తాం. మీ సమస్య ఏదైనా పరిష్కారం ఇవ్వటమే మాదైన అసలు బాధ్యత” అన్నాడు నిరంజన్ ఆమెకు భరోసానిస్తూ
“ఇంతకీ విషయమేమిటో చెప్పండి” అన్నాడు బరువైన నిట్టూర్పుతో.
“డాక్టర్ మానని గాయాన్ని మళ్లీ మళ్లీ రేపుకుంటున్నాను నేను. ఒక విషయం చెప్పండి. తల్లితండ్రుల నుండి వంశపారంపర్యంగా కొన్ని మానసిక లక్షణాలు పిల్లలకు వస్తాయంటారా?, ఇలా అందరికీ జరుగుతుందంటారా?” అన్నది సుభద్ర అలజడిగా. “చూడమ్మా!, తల్లీతండ్రుల నుండి, పూర్వీకుల నుండి కూడా కొన్ని శారీరక సమస్యలు, మానసిక లక్షణాలు పిల్లలకు వస్తాయని వైద్య శాస్త్రాలు చెబుతున్నాయి. కొంతనుంది ముభావంగా ఉంటారు. కొంతమంది ఆవేశపరులు, మరికొంత మంది అతి వాగుడుకాయల్లానూ ఉంటారు. అతి బద్ధకం, జాడ్యం లాంటి లక్షణాలు కూడా పిల్లల్లో కనిపిస్తాయి. ఐతే ఇవి ఖచ్చితంగా వస్తాయనీ చెప్పలేం!? వస్తే వచ్చాయనీ ఆశ్యర్యపోనవసరమూ లేదు” అన్నాడు నిరంజన్.
“ఐతే.. మావాడిని మీరే కాపాడాలి డాక్టర్” ఆమె శోకసంద్రమైంది.
“ఏడవకండి సుభద్ర గారూ! ప్రతి సమస్యకీ పరిష్కారం ఉంటుంది. ప్లీజ్ అసలు మీవాడి ప్రాబ్లెం ఏంటో స్పష్టంగా చెప్పండి.” ఓదార్పుగా అన్నాడు నిరంజన్.
“సార్ మావాడి గురించి చెప్పేముందు మీకు నా జీవితంలో పెను సమ్మెటపోటులాంటి సుధాకర్ గురించి చెప్పాలి. మేముండేది హైదరాబాద్‌లో. మానాన్న రామనాథం గారు మా కాలనీలో పేరు మోసిన ఛార్టర్ అకౌటెంట్. అపుడు నేను డిగ్రీ చదువుతున్నాను. నాన్న దగ్గర జూనియర్‌గా చేరాడు సుధాకర్.
మనిషి స్ఫురద్రూపి. అందగాడు. కోటేరు ముక్కు. మనిషిని సూటిగా చురుకుగా చూసే చిన్న కళ్ళతో ఆకర్షణీయంగా ఉంటాడు. వయస్సు తెచ్చిన ఆకర్షణకు లోనైన నేను నా జీవితంలోని కలల రాకుమారుడితనేనని ఊహల లోకంలో విహరించేదాన్ని, రెక్కలగుర్రాల స్వారీ, కత్తి యుద్థపు వీరుడూ, స్వర్గలోకపు ఆనవాళ్ళూ అన్నీ ఇతనితోనేనని మదిలో మంత్రోచ్ఛారణలు మ్రోగుతుంటే అతడితో కల్సి సినిమాలు, షికార్లకూ తిరిగేదాన్ని. సుధాకర్ ఆవేశపరుడు, ప్రతీ చిన్న విషయానికి తీవ్ర భావోద్వేగానికి గురవుతాడు. అతిగా ఆలోచిస్తాడు. సామాజిక అసమానతల పట్ల కన్నీరుమున్నీరవుతాడు. ఐనా.. అతను నా పట్ల చూపించే ప్రేమకు కరిగిపోయాను.
ప్రపంచం పట్ల ఇంత దయ, జాలి ఉన్నాయంటే తనను కట్టుకోబోయే భార్యను మరెంతో బాగా ప్రేమిస్తాడని, మరెంతో బాగా చూసుకుంటాడనీ భావించాను. ఓరోజు ఇద్దరం మార్నింగ్ వాక్ ముగించి పార్క్‌కు కాస్త ఎడంగా ఉన్న మంచి ఉడుపి రెస్టారెంట్లో టిఫిన్‌కు ఆర్డరిచ్చాం. ఎందుకో అతడి ముఖం వాడి పోయింది. మనిషి ఉదాసీనమయ్యాడు. ‘సుధాకర్.. సుధాకర్!’ అంటూ కుదిపాను. అంతే ఒక్కసారిగా భోరుమన్నాడు. మార్నింగ్ వాక్‌లో అతడికి రోడ్డు పక్క ఓ బిచ్చగత్తె ఆ పక్కగా ఆడుకుంటున్న ఆమె ఇద్దరు పిల్లలు అర్థనగ్నంగా కన్పించారు. పాచిపోయిన బ్రెడ్డు ముక్కకై ఆ ఇద్దరు పిల్లలు కొట్లాడుకుంటుంటే ఆ దృశ్యం సుధాకర్ మనసును గాయపర్చింది.
ఇక్కడ మనం తింటున్న టిఫినులో అన్నీ పురుగులే కన్పిస్తున్నాయంటూ భోరున విలపించసాగాడు. ఏ ఒక్కరు కూడా ఆ బిచ్చగత్తెకు ఒంటినిండా బట్టలు, ఆమె బిడ్డలకు కడుపునిండా తిండి పెట్టలేరా? అని ఆవేశంతో అరవసాగాడు. అతడిని తీసుకొని బలవంతంగా బయటకు వచ్చేశాను. తర్వాత నాలుగు రోజుల వరకు మనిషిని కాలేకపోయాను. ప్రతి చిన్న సామాజిక సమస్యకు ఇంత అతిగా ప్రవర్తించే వ్యక్తితో నా జీవితాన్ని పంచుకోగలనా? అన్న సంశయం తలెత్తింది నాలో.. కానీ మరోరెండు రోజులకే అది పటాపంచలైంది.
ఆరోజు సుధాకర్ తేరుకున్న ముఖంతో ఓపెద్ద గులాబీ గుచ్ఛంతో పాటు గ్రీటింగ్ జతచేసి ఓ చాక్లెట్ బాక్స్‌తో నాకు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియచేశాడు. పరవశంతో నా మది ఊగిపోయింది. తన్మయత్వంతో మళ్ళీ రెక్కల గుర్రాలు, స్వర్గలోకపు ఆనవాళ్ళు,నా కత్తి వీరుడూ కళ్ళ ముందు నిల్చారు. ఇక ఆగలేకపోయాను. నాన్నకు విషయం తెల్సింది. ప్రపంచాన్ని ఇంత లోతుగా అధ్యయనం చేసిన వ్యక్తి, ప్రపంచపు బాధను తన బాధగా పరిగణించే వ్యక్తి తన భార్యను ఎంతగానో ప్రేమిస్తాడు కదా అనుకునే నాన్న కూడా మాపెళ్ళికి ఎలాంటి అభ్యంతరమూ చెప్పలేదు. మా పల్లెలోని రామాలయంలో అత్యంత నిరాడంబరంగా మా పెళ్ళి జరిగింది.
పెళ్ళైన రెండేళ్ళకు బాబు ప్రజ్వల్ పుట్టాడు. అలా ఎనిమిదేళ్ళు ఎంతో సంతోషంగా, హాయిగా జరిగిపోతున్న మా సంసారంలో సుడిగుండం ఏర్పడింది. ఇన్నేళ్ళలో సుధాకర్ తన కోపాన్ని, ఆవేశాన్ని, అక్కసును అప్పుడప్పుడు ప్రదర్శించినా, తన బలహీనతను సామాజిక సమస్యల పట్ల ఆర్తిని అతిగా మాత్రం ప్రదర్శించలేదు. నేను కూడా అతన్ని అపుడపుడు మందలిస్తూ, మరికొన్నింటినీ చూసీచూడనట్లు వదిలేయాలనీ కొన్ని సమస్యల పరిష్కారం మన చేతుల్లో ఉండదని వివరించేదాన్ని. ఈ క్రమంలో ఒకరోజు స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ పెరేడ్ ఉందనీ, ప్రజ్వల్‌ను భగత్ సింగ్లా తయారుచేయాలని దానికి తగ్గ ఖాకీచొక్కా టోపి, మేకప్ పౌడర్ల కిట్టూ తీసుకురమ్మన్నాను.
బయటకు వెళ్ళి వచ్చిన మనిషి మేకప్ రంగు డబ్బాలను కిందపడేసి తొక్కీ చొక్కాను చించసాగాడు. ఈ వీరంగానికి హడలిపోయిన ప్రజ్వల్ బిక్కుబిక్కుమంటూ తండ్రిని చూడసాగాడు. వంటగదిలోనున్న నేను పరుగెత్తుకుంటూ వచ్చాను. అతన్ని పట్టుకొని కుదిపి కుర్చీలో కూలేశాను. మహోగ్రదగ్రుడైన తండ్రి రూపాన్ని చూసి ప్రజ్వల్ నన్ను వాటేసుకున్నాడు. ఏమైందని నాలుగుసార్లు గట్టిగా భుజాలు పట్టుకొని కుదిపితే బావురుమన్నాడు.
దారిలో వచ్చేటపుడు గాంధీతాతలాగ ఒళ్లంతా సిల్వర్ కలర్ పూసుకొని ఓ పదేళ్ల బాలుడు నిశ్చలంగా నిలబడి చేయిసాచి అలాగే బొమ్మలాగా ఉన్న దృశ్యం చూసి మనసు చెదిరి పోయిందన్నాడు. అతడి చేతిలో చిల్లర నాణేలు వేస్తున్న జనం ప్రజాస్వామ్యాన్ని లూటీ చేస్తున్నారన్నాడు. ఆ బాలుడి ముఖంలోని దైన్యం, జారుతున్న చెమటను తుడుచుకోలేని అతడి అతి నిస్సహాయ బీదరికం పట్ల తనకు ఏవగింపు కల్గిందన్నాడు, ‘ఓరేయ్ చిన్నా నీకు ఫ్యాన్సీ పెరేడ్లో అలాంటి బట్టలు వేస్తే నీవు అలాగే ఐపోతావు’ అన్నాడు. అతడి బీదరికం, దైన్యం నా బాబును శాపాలై చుట్టుకుంటాయి. అందుకే అందుకే అంటూ రొప్పసాగాడు, మళ్ళీ కథ మొదలు, నాదైన ఊరడింపు వాక్యాలను మళ్ళీ మొదలుపెట్టాను. చూడు సుధాకర్! చుట్టూ ఉన్న సమాజంలోని అభాగ్యులను, అనాథలను అంతగా పట్టించుకొని మనమేం చేయగలం? మన ఒక్కరి వల్ల ఏం అవుతుంది చెప్పు?
ఆ పనులు చేయాల్సింది అధికారులు, ప్రభుత్వం వారు, అనవసరమైన గజిబిజి ఆలోచనలతో అటు నీ ఆరోగ్యాన్ని, ఇటు బాబు భవిష్యత్ ను నాశనం చేయకు, నీకు దండం పెడతాను, మనమంతా ఈ ఇంట్లో సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటాను గానీ, నిత్యమూ అలజడితో, భయాందోళనలతో బిక్కుబిక్కుమంటూ బతకలేనిక అంటూ ఇదే చివరిసారి అన్నట్టు హెచ్చరించాను,
ఐనా.. ఆరోజు నాకూ ఆయనకు అదే ఆఖరి రోజు అవటం నేనెంత మర్చిపోదామన్న మర్చిపోలేని పీడకలలాంటి రోజది” సుభద్ర భోరున విలపించసాగింది.
“ప్లీజ్ ఏడవకండమ్మా! ఆ తర్వాతేం జరిగిందో చెప్పండి. ఆందోళన చెందకండి, ఈ లోకంలో అన్ని సమస్యలకి పరిష్కారాలున్నాయి.” నిరంజన్ ఆమెను సముదాయిస్తూ అన్నాడు.
కళ్ళు తుడుచుకొని చెప్పటం ప్రారంభించింది సుభద్ర. “గాలి మార్పుతోనైనా మనిషిలోని ఆవేశాలు, భయాందోళనలు తగ్గుతాయాని మా స్నేహితురాలెవరో సలహా ఇచ్చింది డాక్టర్ గారు! వైజాగ్‌లో ఉంటున్న మా పిన్ని వాళ్ళింటికి వెళ్దామని అనగానే ఏ కళనున్నాడో సరేనన్నాడు. ప్రజ్వల్‌ను నాన్న దగ్గర వదిలి నేనూ ఆయనా బయలుదేరి వైజాగ్ వెళ్లాం. ఓరోజు సాయంత్రం బీసెంట్ రోడ్డుకు వెళ్దామనుకొని అందుకై బెంజి కంపెనీ దగ్గర బస్సెక్కాలి, అక్కడ ఏ దృశ్యమైతే ఆయన కళ్ళలో పడకూడదనుకున్నానో అదే దృశ్యం ఆయన చూడనే చూశాడు. అక్కడ రోడ్డు పక్కన ఒక బిచ్చగత్తె అట్టలుగట్టిన జడలు, చిరుగుల, లంగాతో పడిఉంది. మాసిన జాకెట్టు మొత్తం చిరిగిపోయి ఉంది. మట్టిగొట్టుకపోయి చచ్చిన శవంలా దుమ్ము బురదలో కూరుకపోయి ఉంది. అంతే సుధాకర్‌ను ఎవరూ కంట్రోల్ చేయలేకపోయారు. మనిషి పిచ్చిపట్టినవాడిలా, చుట్టూ ఉన్న సభ్యసమాజం మానవీయ విలువలంటూ ఉపన్యాసాలిస్తారు గానీ, ఈ బిచ్చగత్తె మానప్రాణాలను కాపాడలేక పోతున్నారని, తన షర్టూ,ప్యాంట్ ఊడబీకి ఆమెపై విసిరేశాడు.
దిసమొలలతో పరిగెత్తుతున్న అతన్ని పోలిసులు పట్టుకొని పిచ్చి బాగా ముదిరిపోయిందని వైజాగ్ మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేస్తామని అక్కడికే వచ్చి కలవమని సిగ్గుతో బిక్క చచ్చిపోయి చూస్తున్న నాకు తెలియజేశారు. ఇక అదే ఆఖరి రోజు నా సంసారానికి. నేను తిరిగి హైదరాబాద్ వచ్చేశాను. ఉండబట్టలేక కొన్నిరోజుల తర్వాత మెంటల్ హాస్పిటలోకి వెళ్తే దూరం నుండే సెల్ లోనున్న అతన్ని చూపించారు. మనిషి ఎవ్వర్నీ ఆఖరికి నన్ను కూడా గుర్తు పట్టటంలేదు.
ఏదో పిచ్చి చూపులు చూస్తూ పలవరిస్తూ వేళ్ళను ఆడిస్తూ అటు ఇటూ తిరుగుతుంటే కడుపులోంచి దుఃఖం తన్నుకొచ్చింది నాకు. వాళ్ల తల్లితండ్రులు కూడా వెళ్లి సుధాకర్‌ని చూసి అప్పుడప్పుడు మనవడిని చూసి పోదామని నా దగ్గరకు వస్తుంటారు. ప్రజ్వల్‌కు నాన్నకు జ్వరం వచ్చి జబ్బు చేసింది. హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తున్నారని చెప్పేదాన్ని. నాన్న దగ్గరే ఉంటున్నాను నేను. కానీ విధి నన్ను మరోమారు వెక్కిరించింది డాక్టరు గారు” అంటూ సముద్రపు హోరులా మళ్లీ దుఃఖ సునామీలా విరుచుకుపడింది సుభద్ర.
“సుభద్రగారూ! ప్లీజ్ డోంట్ బీ యగ్జైటైడ్, బాబుకు ఏం జరిగిందో చెప్పండి. పరిష్కారానికి ప్రయత్నిద్దాం” అన్నాడు ఎగసిపడుతున్న ఆమె దుఃఖానికి ఆనకట్ట వేస్తూ.
“డాక్టర్ గారు ఒకరోజు మా పనిమనిషి జ్వరమని రాలేదు. ఆరోజు తన పదేళ్ల అమ్మాయిని పనికి పంపింది. ఆ అమ్మాయిు వెళ్ళిపోయాక ప్రజ్వల్ ‘అమ్మా! నేను బడికి వెళ్లన’ని మారాం చేశాడు, ఏమైందని బుజ్జగించగా ఇందాక వెళ్లిన బుజ్జి లాంటి అమ్మయిలే తన క్లాసులోనూ ఉన్నారని, వాళ్లంతా చదువుకుంటుంటే, బుజ్జి స్కూలుకు ఎందుకు వెళ్ళటం లేదని ప్రశ్నిస్తున్నాడు డాక్టర్!
వీడూ తన తండ్రిలాగే ఆలోచిస్తూ పిచ్చిపట్టి పోతాడని భయంగా ఉంది డాక్టర్. నా జీవితానికి వెలుగు వీడే. తండ్రి లక్షణమే వీడికి సంక్రమిస్తుందేమోనని ఆందోళనగా ఉంది డాక్టర్” అంది సుభద్ర బెంబేలెత్తుతూ.
నిరంజన్ నిట్టూర్చాడు, “చూడమ్మా ఇది సోషల్ ప్రాబ్లమ్. పిల్లవాడికి కష్టాలు, కన్నీళ్లూ, అభాగ్యులూ, అనాథలూ కంట పడితే ఇలాగే మానసికంగా బలహీనపడే ప్రమాదం ఉంది. వేదనలు, అశాంతులూ, సంఘర్షణలకు గురికాకుండా చూసుకోండి. ఇది మాత్రమే ట్రీట్మెంట్ అంటే సభ్యసమాజంలో తిరుగుతున్న మనం ఇవన్నీ వాడి కంట పడనీయకుండా ఎలా పెంచేది అని అడుగుతారు కాబోలు, చిన్నప్పటినుండే పిల్లవాడి అంతర్లీన గాయాన్ని పరిష్కరించడమే మన లక్ష్యంగా పని చేద్దాం.
సైకో థెరపీ ఒక ఆప్షన్, వాడికి నచ్చిన పనిపై దృష్టి పెట్టండి. మన చేయి దాటిపోతుంది అనిపించినపుడు ఇలా థెరపిస్ట్‌లు లేదా కౌన్సెలర్‌తో మాట్లాడి సమస్యకు పరిష్కారాల్ని కనిపెట్టవచ్చు. ఏం ఫరవాలేదు. వాడూ మనిషే స్వీయ సంరక్షణ పరిధి వాడికీ అవసరమే, ప్రకృతి మూగజీవుల పట్ల ప్రేమ, జాలి, దయ అందరికీ ఉండే సార్వత్రిక ఉద్వేగాలు, ప్రయత్నిస్తే వీటిపై పట్టు సాధించవచ్చు. ఈసారి వాడిని తీసుకొని రండి, అందరం కల్సి కుళ్లిన సమాజానికి శస్త్రచికిత్స చేద్దాం. మీ బాబులాంటి సున్నిత హృదయుల్ని అతిగా ఆలోచించి స్వీయ హాని చేసుకోకుండా నిండైన వ్యక్తిత్వంతో నిండు నూరేళ్లు జీవించాలా చేద్దాం” నిరంజన్ అంటుంటే గడియారం పన్నెండు గంటలు కొట్టింది.
కొత్త ఉదయపు ఆశావహకాంతి ఎర్ర కలువల్లాంటి ఆమె కళ్ళలో మెరిసింది. కన్రెప్పల మీద కూర్చున్న బండలాంటి భయం మాయమై ప్రశాంతమైన వదనంలో ఆత్మవిశ్వాసపు తేజస్సు విచ్చుకుంది. “మీరున్నారు డాక్టర్. వాడిని తిరిగి మనుషుల్తో కలపడానికి. మా వాడిని మీరే కాపాడాలి డాక్టర్” అంటున్న సుభద్ర చేతిని ఆత్మీయంగా స్పృశించాడు నిరంజన్.
శ్రీమతి బి. కళగోపాల్ గత దశాబ్ద కాలంగా కవితలు కథల్ని రాస్తున్నారు. పుట్టింది నిజామాబాద్ జిల్లాలో. ఎం.ఎ ఇంగ్లీషు, బిఎడ్ చేసిన వీరు ఆంగ్ల సహ ఉపాధ్యాయునిగా పని చేస్తున్నారు. ఇంతవరకు వీరివి 450కి పైగా కవితలు వివిధ వార, మాస సాహిత్య పత్రికలలో ప్రచురితమయ్యాయి. కవితా సంపుటి ‘మళ్లీ చిగురించనీ..’ 2015లో 74 కవితలతో ప్రచురించారు. అంతేగాక స్థానిక నిజామాబాద్ రేడియో ఎఫ్.ఎం.లో 20 కథానికలు ప్రసారమయ్యాయి. 25 వ్యాసాలు వివిధ పత్రికల్లో వచ్చాయి. 50 కథలు వివిధ పత్రికల్లో అచ్చు అయ్యాయి. వాటిల్లో 20 కథలు వివిధ సందర్భాల్లో అవార్డులను పొందాయి. వీరి కవితలు కూడా అనేక సందర్భాల్లో పలు అవార్డులను పొందాయి. రాధేయ, ఎక్స్ రే, భిలాయ్ వాణి, కలహంస, భూమిక, సాహితీకిరణం, ద్వానా, వాల్మీకి, మల్లెతీగ వారి కవితా పురస్కారాలు పొందారు. సోమేపల్లి, వట్టికోట ఆళ్వారు స్వామి, జలదంకి పద్మావతి కథా పురస్కారాలను పొందారు.
