“భోజనం చేద్దువు గానీ రారా” కేకేసింది కమల.
“వస్తున్నానమ్మా” జవాబిచ్చాడు రవి అదే స్థాయిలో తల్లితో.
రవి బ్యాంకులో గుమాస్తాగా పని చేస్తున్నాడు. ప్రమోషన్ కోసం ఎప్పుడూ ఏదో చదువుతూ ఉంటాడు. ఒకసారి డిపార్ట్‌మెంట్ పరీక్ష రాసాడు కానీ పాస్ అవలేదు. అందుకని ఈసారి పట్టుదలగా చదువుతున్నాడు.
కమలకి ఇల్లు, వంట, పూజలు తప్ప వేరే ప్రపంచం తెలీదు. రవి తండ్రి మోహన్ రావు, స్కూల్ టీచర్‌గా పనిచేస్తున్నాడు. వీళ్ళకి రవి ఒక్కడే సంతానం.
“ఈసారన్నా పాస్ అవుతానో లేదో” అన్నాడు రవి, అన్నం తింటూ వాళ్ల అమ్మతో.
“పాస్ అవుతావు లేరా, నువ్వు చదవాల్సింది శ్రద్దగా చదువు, కొరవ లేకుండా, అదే పాస్ అవుతావు, ఆ పై దేవుడు చూసుకుంటాడు” అన్నది కమల.
రవికి ఎప్పుడూ ధైర్యంగా ఉంటుంది కమల. అమ్మ మాటలే రవికి మోటివేషన్, స్ఫూర్తి, ఎంతో తృప్తినిస్తాయి. ఉద్యోగం చేస్తున్నా కూడా అన్ని పనులు అమ్మని అడిగే చేస్తాడు. అమ్మ సలహా తోనే చేస్తాడు.
రవి పరీక్షలకు చదువుకోవడం కోసం, కమల రవికి ఎంతో తోడుగా ఉంటుంది. రవి చదువుకుంటున్నంత సేపు తాను కూడా రవితో పాటు మెలకువగా ఉండి ‘టీ’ పెట్టి ఇస్తుంది. కమల కూడా డిగ్రీ పాస్ అయింది.
***
“రవి, రవి” కేక వేస్తూ వచ్చాడు రవి ఫ్రెండ్ శేఖర్.
“ఏం శేఖర్ బాగున్నావా” అడిగింది కమల శేఖర్‌ను.
“బాగున్నా ఆంటీ, రవి ఉన్నాడా” అడిగాడు శేఖర్.
“ఆ! ఉన్నాడు తన రూమ్‌లో చూడు” అన్నది కమల.
“హాయ్ రవి, ఏం చేస్తున్నావ్” అడిగాడు శేఖర్.
“ఏముంది, పుస్తకాలతో కుస్తీ పడుతున్నాను” చెప్పాడు రవి.
“వదిలేయ్ రా!, ఎప్పుడు పుస్తకాలు పట్టుకు కూచుంటావు, ఇంక లైఫ్ ఎప్పుడు ఎంజాయ్ చేస్తావు, పద బయటకు పోదాం” అన్నాడు రవితో శేఖర్.
శేఖర్, రవి ఇద్దరూ ఒక స్కూల్, కాలేజీలో చదవక పోయినా, బ్యాంకులో ఒకే చోట ఉద్యోగం చెయ్యడంతో మంచి స్నేహితులయ్యారు. శేఖర్, రవి లాగా సీరియస్‌గా భవిష్యత్‌ను ముందుగా అలోచించి ఏ పనీ చెయ్యడు. ‘ఇవాళ హ్యాపీగా ఉన్నామంటే చాలు’ అన్నట్టు ఉంటాడు. రవి కొంచం సీరియస్‌గా ఉంటాడు, భవిష్యత్ గురించి ముందుగా ప్లాన్ చేసి అంతా ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవాలనుకుంటాడు.
“ఇప్పుడెందుకురా బయటకు, ఏం చేద్దాం బయటకు వెళ్లి” అన్నాడు రవి.
“ఏం లేదురా, మన వాళ్ళందరూ కలుస్తారుగా ఆ టీ స్టాల్ దగ్గర” అన్నాడు శేఖర్.
“వద్దులేరా, నేను రాను, అక్కడకు చేరి అందరు మాట్లాడుకునేది ఏమీ ఉండదు, టైం వేస్ట్” అన్నాడు రవి. రవికి నిజానికి పరీక్షలకి చదువుకోవాలని ఉంది. కానీ ఆమాట శేఖర్‌కి చెపితే ఇంకా ఎగతాళి చేస్తాడు.
“సరేలేరా నేను వస్తాను” అంటూ లేచాడు శేఖర్ కాసేపు కూచుని.
రవికి పరీక్ష డేట్ దగ్గర పడుతోంది. 15 రోజులలోకి వచ్చింది. రవి బాగా టెన్షన్ పడుతున్నాడు. అన్నిటికీ కంగారు పడతాడు. తొందరగా కోపం వస్తోంది. అంతలోనే ఏదో ఆలోచనలో పడిపోతాడు. ఇదంతా కమల గమనిస్తూనే ఉంది. రవిని ఎలా శాంతపరచాలో కమలకి అర్థం కావడం లేదు. ‘ఈ కాస్త పరీక్షకు, ఎందుకు అంత టెన్షన్ పడుతున్నాడో’ కమలకి అర్థం కావడం లేదు.
రవి పడే టెన్షన్ చూడలేక ఇంక కమల ఆ ఏడుకొండల వాడికి ‘రవి ఈ పరీక్ష పాస్ అయ్యి, ఆఫీసర్‌గా మొదటి జీతం అందుకున్నాక, ఆ జీతం అలాగే నీ హుండీలో వేస్తాను స్వామీ’ అంటూ మొక్కుకుంది. కానీ ఈ మాట రవికి చెప్పలా, వద్దా, అని ఆలోచనలో పడింది. సరే. ‘ఇంకా టైం ఉంది కదా, అన్నీ ఆ భగవంతుడే చూసుకుంటాడు’ అనుకుంటూ పనిలో పడిపోయింది.
రవి అన్ని విషయాలలో అమ్మ మాట వింటాడు, కానీ, ఈ మొక్కులు, మొక్కుబడులు తీర్చడాలు అంటే, “ఏంటమ్మా ఇదంతా నీ చాదస్తం కాకపోతే, దేవుడికి లంచం ఇస్తావా” అంటాడు. అందుకే తరువాత చెపుదాం అనుకుంటూ వంటింట్లోకి వెళ్ళింది.
ఆ రోజు రవి పరీక్ష రాయాల్సిన రోజు..
“ఏరా! అన్నీ బాగా ప్రిపేర్ అయ్యావా” అడిగింది కమల రవిని.
“ఆ! అన్నీ చదివానమ్మా” అన్నాడు రవి.
“రవీ! ఎక్కడా కూడా టెన్షన్ పడకు. ఎక్కువ టెన్షన్ పడితే చదివింది కూడా మర్చిపోతావు.” అంటూ టీ గ్లాసు అందించింది కమల రవికి.
“లేదులేమ్మా ఈ సారి బాగానే రాస్తాను” అన్నాడు రవి టీ తాగుతూ.
రవి తనకి ఇష్టమైన స్కై బ్లూ కలర్ షర్ట్, డార్క్ బ్లూ కలర్ ప్యాంటు వేసుకుని అమ్మకి ‘బై’ చెప్పి పరీక్షకి బయలుదేరాడు. కమల, రవి పరీక్ష నుండి తిరిగి వచ్చేదాకా దేవుడికి దండాలు పెడుతూనే ఉంది.
రవి పరీక్ష రాసి వస్తూనే “ఈ సారి పరీక్ష బాగా రాసానమ్మా” అంటూ వచ్చాడు ఇంట్లోకి.
“కాళ్ళు కడుక్కు రా రా లోపలికి” అన్నది కమల రవిని చూసి.
“ప్రమోషన్ వస్తే పోస్టింగు దూరం గానే వేస్తారమ్మా” అన్నాడు రవి.
“అవునురా అన్నీ మనకు తగ్గట్టు గానే కావాలంటే ఎలా వస్తాయి., ప్రమోషన్ ఇచ్చి, పోస్టింగ్ కూడా మనం ఉండే విశాఖపట్నం లోనే కావాలంటే రావచ్చు లేదా రాకపోవచ్చు. ఎక్కడికయినా వెళ్ళడానికి సిద్ధంగా ఉంటేనే ఈ పరీక్షలూ, గట్రా, రాయాలి. అందుకు గదూ, శేఖర్ ఏ పరీక్షలూ రాయకుండా, చీకు చింత లేకుండా తిరుగుతాడు” అన్నది కమల సలహా ఇస్తున్నట్లుగా.
“అవునమ్మా, నేను ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధపడే ఈ పరీక్ష రాసాను” అన్నాడు రవి.
“చూద్దాం లేరా, వాళ్లు వేరే ఊరు వేసినప్పటి సంగతి కదా, అన్నీ ఆ దేవుడే చూసుకుంటాడు లే” అన్నది కమల.
‘ఏమిటో అన్నీ ఆ దేముడి మీదికి నెట్టేస్తుంది అమ్మ’ అనుకుంటూ స్నానానికి వెళ్ళాడు రవి.
ఈలోగా రవి తండ్రి మోహన్, బయటనుండి ఇంట్లోకి వచ్చాడు.
“కమలా, రవి పరీక్ష నుంచి వచ్చాడా, ఎలా రాసాట్ట” ఆత్రుతగా అడిగాడు మోహన్ రావు, కమల ఇచ్చిన టీ గ్లాస్ అందుకుంటూ.
“ఇంట్లోనే ఉన్నాడుగా, మీరే అడగండి” అంది కమల తడి చెయ్యి చీర కొంగుకు తుడుచుకుంటూ.
“ఏరా రవీ, పరీక్ష ఎలా రాసావు” అడిగాడు మోహన్ రవిని.
“బాగా రాసాను నాన్నా, ఈసారి తప్పక సెలెక్ట్ అవుతాను” అన్నాడు రవి.
“దీనికి కూడా ఇంటర్వ్యూ ఉంటుందా” అడిగాడు మోహన్.
“ఉంటుంది కానీ, అదేమంత కష్టం కాదు, అది సింపుల్ గానే ఉంటుంది” అన్నాడు రవి.
“ప్రమోషన్ అంటే ఎక్కడో దూరంగా పోస్టింగ్ వేస్తారేమో” అన్నాడు మోహన్.
“ఎక్కడికయినా సరే, నేను వెడతాను నాన్నా” అన్నాడు రవి.
“సరే చూద్దాం లే” అని మోహన్ టీవీ చూస్తూ కూచున్నాడు.
ఒక నెల రోజుల తర్వాత..
రవికి, ఆఫీసర్‌గా ప్రమోషన్ ఇచ్చి ఉద్యోగం చిత్తూరుకి మార్చారు. ‘విశాఖపట్నం నుంచి చిత్తూరుకి’ అనగానే కమల చాలా దిగులు పడిపోయింది. ఏదో చదువుకుంటూ, ఉద్యోగం చేస్తూ పిల్లవాడు కళ్ళ ఎదురుగా ఉండేవాడు. ఇపుడు అంత దూరం వెళ్ళిపోతాడంటే, కమల చాలా బెంగ పడిపోతోంది.
***
అమ్మని ఓదార్చి, నచ్చచెప్పి చిత్తూరులో జాయిన్ అవటానికి బయలుదేరాడు రవి. చిత్తూరులో జాయిన్ అయి కాస్త అలవాటు పడుతున్నాడు. అది పేరుకు ఆంధ్ర అన్న పేరే కానీ అంతా తమిళనాడు లాగా ఉంది. ముఖ్యంగా భాష తెలుగు లోనే మాట్లాడుతున్నారు కానీ తమిళ్ లాగా అనిపిస్తోంది. వినడానికే అదోరకంగా ఉంది వాళ్ళు మాట్లాడే తెలుగు. రవి మాట్లాడుతున్న తెలుగుని కూడా వాళ్ళు ఆలాగే అంటున్నారు. నెల రోజులు తిరిగే సరికి రవి తండ్రి ఫోన్‌ల మీద ఫోన్‌లు చేస్తున్నాడు. అమ్మ నీ కోసం పూర్తిగా బెంగ పెట్టుకుంది, ఒక్కసారయినా వచ్చి వెళ్ళమని ఫోన్ చేసాడు. చేసేది లేక జీతం తీసుకున్నాక, రవి బయలుదేరాడు.
డైరెక్ట్‌గా, విశాఖపట్నం దాకా వెళ్లే ట్రైన్ చిత్తూరు లోనే ఎక్కాడు రవి. పేరుకు 3rd AC బోగీ అయినా, ఫుల్ రష్‌గా, అశుభ్రం గానే ఉంది. ట్రైన్ చిత్తూరులో బయలుదేరి తిరుపతి దాకా వచ్చింది. తిరుపతిలో ఇద్దరు వ్యక్తులు ఎక్కారు. రవి బెర్త్ పక్క బెర్త్ నంబర్లు అని చెప్పారు. వచ్చిన వాళ్లలో ఒకడు రవితో మాట కలిపాడు.
“ఎందాకా సర్ మీరు” అడిగాడు రవిని.
“విశాఖపట్నం” అన్నాడు రవి
“మీరు ఎక్కడికి” అడిగాడు రవి.
“మేము గూడూరు దిగుతాం సార్” అన్నాడు ఆ వ్యక్తి.
“ఏం సార్, చిత్తూర్ నుండి వస్తుంటిరా, ఏం చేస్తారు సార్” అన్నాడు అతను..
“బ్యాంకులో ఉద్యోగం” అన్నాడు రవి.
“మీరు” అడిగాడు రవి.
“మాది బట్టల వ్యాపారం సార్, గూడూరులో మాకు పట్టు చీరల షాప్ ఉంది. మీ విశాఖపట్నం నుండి చాలామంది మా కస్టమర్స్ ఉన్నారు. మా అంగట్లో బట్టలు తీసుకుని పోతారు సార్.” అన్నాడు.
“మా దగ్గర మంచి మంచి వెరైటీ పట్టు చీరలు ఉన్నాయి, మాది హోల్‌సేల్ దుకాణము, చాలా తక్కువ రేటుకే అమ్ముతాము. శాంపిల్ కావాలంటే చూడండి సార్”, అని వెంటనే తన బాగ్ లోంచి రెండు చీరలు తీసి చూపించాడు. “ఇరవై అయిదు వేల రూపాయల చీర ఇరవై వేలకే, ఇస్తున్నాము సార్” అని చీర చూపించాడు. చీర చూపించాడు కానీ, బాక్స్ మీద మూత మటుకే తీసి చూపించాడు.
చీర చాల బాగుంది. కలర్ బాగా నచ్చింది రవికి. అమ్మ అంటే చాలా ఇష్టం రవికి. ఆఫీసర్‌గా జాయిన్ అయ్యాక మొదటిసారి ఇంటికి వెడుతూ అమ్మకి ఆ చీర పట్టుకెళదాం అనిపించి, తనకు వచ్చిన శాలరీ లోంచి ఇరవై వేలు తీసి అతనికి ఇచ్చాడు రవి. వెంటనే అతను ఎవరో పిలిచినట్లు వెళ్ళిపోయాడు, ఈలోగా ట్రైన్ కదిలింది. కానీ అతను తిరిగి రాలేదు. బిల్ ఇవ్వలేదు. రవికి అతను బిల్ ఇవ్వకపోయే సరికి, అదీకాక తిరుపతిలో ట్రైన్ ఎక్కి తిరుపతి లోనే దిగిపోయే సరికి, తాను దొంగ సొమ్ము కొన్నాడేమో అన్న భయం ఇంకా పట్టుకుంది. ఇంటికి వెళ్లేవరకూ ఆ చీర ఉన్న బాక్స్ ఓపెన్ చెయ్యకూడదు అనుకుని మౌనంగా ఉండిపోయాడు.
***
మరునాడు రవి ఇంటికి చేరి, అమ్మను చూసి చాలా బాధ పడ్డాడు.
“ఏంటమ్మా! నువ్వు ఇలా బెంగ పడిపోతే ఎలా, చిత్తూరు ఏమీ దగ్గర కాదాయే, వెంటా వెంటా రావడానికి. అదివరకులా ఇపుడు సెలవలు కూడా ఇవ్వరు” అన్నాడు రవి.
“సరే లేరా, నేనేం బెంగ పడలేదు కానీ, నువ్వు ఎలా ఉన్నావు. అక్కడ భోజనం ఎలా ఉంది. హోటల్ తిండి పడక చూడు ఎలా చిక్కిపోయావో” అన్నది కమల రవిని చూస్తూ, ఎంతో ఆప్యాయంగా రవి తల నిమురుతూ.
“అమ్మా! చూడు నేను నీకోసం ఎం తెచ్చానో!” అని తాను తెచ్చిన చీర బాక్స్ అమ్మకు ఇచ్చాడు రవి. కమల చీర పూర్తిగా ఓపెన్ చేసింది పవిట డిజైన్ చూద్దామని.
ఆశ్చర్యం! అసలు చీర పూర్తిగా లేదు. చిన్న ఓణీ గుడ్డ ముక్క, చీర మాదిరిగా ఒక అట్టముక్కకి చుట్టి, మడతపెట్టి బాక్స్‌లో పెట్టి ఇచ్చారు.
అప్పుడు కానీ అర్థం కాలేదు రవికి, ‘ట్రైన్ లో తనకు చీర అమ్మిన వాడు మోసం చేసాడు’ అని.
“ఏమయిందిరా, ఏంటి చీర అన్నావు, ఇలా గుడ్డ ముక్క ఉంది” అడిగింది కమల.
రవి ట్రైన్‌లో వాళ్లు తనకు చీర అమ్మినది, తాను కొన్న విషయం చెప్పాడు అమ్మకు.
కమలకు అప్పుడు అర్థం అయింది. తాను తిరుపతి బాలాజీకి మొక్కుకున్న మొక్కు తీర్చకుండానే, రవి ఆఫీసర్‌గా జాయిన్ అయిన తర్వాత మొదటి జీతంతోనే ఇంటికి బయలుదేరాడు. కానీ ఆ దేవుడు తిరుపతి లోనే ఈ రూపంగా తీసుకున్నాడు అని.
“అవునురా! నువ్వు ఆఫీసర్ అయ్యాక వచ్చిన మొదటి జీతం, ఆ వెంకటేశ్వర స్వామి హుండీలో వేస్తామని మొక్కుకున్నానని చెప్పాను కదా!, మరి ఎందుకు ఇలా చీర పట్టుకొచ్చావు?” అడిగింది రవిని కమల.
“ఏదో లేమ్మా! నాకు నువ్వంటే ప్రేమ కదా, చీర చూడగానే, తీసుకోవాలనిపించింది. నాకు మొక్కుబడి సంగతి గుర్తు రాలేదు” అన్నాడు రవి.
“అందుకే ఇలా అయింది. వెంకటేశ్వర స్వామితో ఆటలాడకూడదు, ఆయనకు చేసిన మొక్కుబడి తీర్చాల్సిందే.” అన్నది కమల.
“సరేలే ఒక పని చెయ్” అంటూ, ఆ దేవుడికి అపరాధ ముడుపు కట్టి ఉంచి, రవితో, “వచ్చే నెల అయినా, చిత్తూర్ నుండి తిరుపతికి వచ్చి రెండో జీతం హుండీలో వెయ్యి” అని చెప్పింది.
“సరే లేమ్మా అలాగే చేస్తాను” అన్నాడు రవి.
***
రవి అమ్మ మాట తీసెయ్యలేక ‘సరే’ అని, మళ్ళా చిత్తూరు వెళ్లి జీతం తీసుకున్నాక, ఆ డబ్బు మొత్తం తిరుపతి బాలాజీ దేవుని హుండీలో వేసాడు. ఈ విషయం రవి వెంటనే అమ్మకు చెప్పాడు.
“భగవంతునికి ఒక మాట ఇచ్చి, మన అవసరం తీరిపోయిన తర్వాత, మాట దాటెయ్యకూడదు. మొక్కుబడి ఏదయినా సరే, ఏ దేవునిదయినా సరే, వెంటనే తీర్చేయ్యాలి, లేకుంటే తిరుపతిలో చీరలు అమ్మిన వ్యక్తి ద్వారా ఆ భగవంతుడు తన మొక్కుబడిని తీసుకున్న మాదిరిగా తీసుకుంటాడు. అలా తీసుకున్న కూడా మనల్ని కరుణించినట్లే.” అని, “పోనిలే ఇప్పటికయినా ఒక మంచి పని చేసావు” అన్నది కమల రవితో.
ఎప్పుడూ అమ్మ చెప్పే మంచి మాటలు, సలహాలు పాటించే రవి, ‘ఇక, ముందు జీవితంలో కూడా ఎవరికీ రుణపడకుండా ఉండా’లని ఆ క్షణం లోనే నిర్ణయించుకున్నాడు.
ఇటీవలే కథా రచన చేస్తున్న శ్రీ ఎం. వి. సత్యప్రసాద్ MA, MBA, PGDPM (PG Dip in Personnel MGT, From NIPM-Calcutta), PGDHRD (from NILAM, Chennai) చదివారు.
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో 31 సంవత్సరాలు పని చేశారు. డిప్యూటీ మేనేజర్‌గా రిటైర్ అయ్యారు. ఇందులో 17 సంవత్సరాలు ఆఫీసర్‌గా పనిచేశారు. వారి శ్రీమతి అనురాధ, MA చదివారు. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లో Administrative Officer గా పని చేసి రిటైర్ అయ్యారు.
సత్యప్రసాద్ గారికి పాటలు పాడటం అలవాటు. హిందీ సాంగ్స్ tunes కి కొన్ని పాటలు కూడా రాశారు.
వంట గ్యాస్ ఉపయోగాలు, జాగ్రత్తలు మీద మూడు సార్లు All India Radio లో విజయవాడ, కడప కేంద్రాలలో ప్రోగ్రామ్‌లు ఇచ్చారు.