Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వాగ్దానం..!!

నసంతా కమ్ముకున్న ముసురు..
చుట్టుముట్టిన చీకట్లో
కొట్టుమిట్టాడుతున్నా…
ఓ సారి వచ్చిపోవా…!

ఏడేడు జన్మల బంధం కదా…
అస్తమానూ నీ ధ్యాసే…!

చిరుగాలి పైట తొలిగించినా…
చిరుజల్లు తనువంతా తమకంతో తడిపినా…
తీరాన అలలు పాదాలు ముద్దాడినా…
మంచు వెన్నెల ముద్ద చేసి మురిపించినా…

నీ స్మృతుల్లో విస్మృతమై నేను…
ఏ రూపంలో నువ్వున్నావోనన్న చిత్త వైకల్యంలో…
అన్నింటినీ అపురూపంగా ఆస్వాదిస్తూ…
అమాంతం అబ్బురమేదో జరుగబోతోందని భ్రమిస్తూ…
ఏదో రూపంలో ఓసారి వచ్చిపోవా…!

నువ్వు కర్కోటకుడవని నాకు తెలుసు…
విలపిస్తున్న నా ఒంటరితనం నిను కరిగించదు..
ఏ ప్రేమజంటను చూసినా…
ఏ ప్రేమకావ్యం చదివినా….
ఉప్పెనలా ముంచెత్తే దిగులు…

కయ్యంతో కలబడటానికైనా సరే…
సన్నగిల్లని ఓపికతో వేచివున్నా…
పరుషవాక్కులైనా సమ్మోహనమే….
ఓసారి వచ్చి పోవా….!

నేనో వడ్డించిన విస్తరినంటారందరు..
నీ లేమి ఎలా కాల్చేస్తుందో ఎవరికి తెలుసు…
అయినా వాగ్దానం చేసావుగా..
నేను చేసిన సేవల బాకీ చెల్లిస్తానని…
వస్తావులే….రాకేం చేస్తావు…
మరో పదేళ్ళకైనా రావలిసిందే..
నేను నిస్సత్తువతో పరుపుకు కరుచుకు పోయినప్పుడు…
నన్ను నీ కౌగిలిలోకి తీసుకోవటానికైనా వస్తావు….
మాటిచ్చావుగా….
అది తప్పవనే భరోసా నాకుంది…
నీ ప్రేమను అప్పుడైనా భట్వాడా చేస్తావన్న నమ్మకముంది….!

Exit mobile version