Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వారసత్వం

[శ్రీ ఎం. వెంకటేశ్వరరావు రచించిన ‘వారసత్వం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

“హలో! అక్కా! చెప్పు” అన్నాడు మురళి ఫోన్ లిఫ్ట్ చేసి.

“ఆఁ.. మురళీ! నేను రాత్రి నా ఫ్రెండ్ సంధ్య కూతురు పెళ్లి కోసం హైదరాబాద్ వచ్చాను. రాత్రి పెళ్లి అయిపోయింది. ఇప్పుడు ఇంటికి వస్తున్నాను. లొకేషన్ షేర్ చెయ్యి. క్యాబ్‌లో వస్తాను” అంది స్రవంతి.

“ఇప్పుడు ఎక్కడున్నావు?”

“మారేడుపల్లిలో, సంధ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాను.”

“నేను తార్నాకలో ఫ్రెండ్ ఇంటికి వచ్చాను. అక్కడే ఉండు. నేనే వచ్చి పికప్ చేసుకుంటాను”.

“సరే.”

***

అక్క తమ్ముడు కార్లో బయలుదేరారు.

“ఊఁ.. ఏంటక్కా.. సంగతులు? బావ, శ్రావ్య బాగున్నారా?”

“ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. శ్రావ్యకి ఎప్పుడు హాస్పిటల్ పేషెంట్లు ఇదే గొడవ! మీ బావకి ఆఫీస్ అంతా తన తల మీదే నడుస్తుందన్న ఫీలింగు”

“శ్రావ్యకి సంబంధాలు చూస్తున్నారా?”

“ఆఁ.. చూస్తూనే ఉన్నాం. ఓ పట్టాన కుదరటం లేదు. జాతకాలు నక్షత్రాలు కుదర లేదని కొన్ని, దానికి నచ్చక కొన్నీ, వాళ్లకి నచ్చక ఇంకొన్ని.. ఇలా నడుస్తున్నాయి.”

“ఉఁ.. యోగ క్లాసులు, డైటింగ్, వాకింగ్ చేస్తున్నావా? బాగా సన్నబడ్డావు?”

“హెల్దీగా ఉండాలిగా!.. అవునూ.. రాధిక ఎలా ఉంది? మహేష్, పల్లవి బావున్నారా?”

“నిక్షేపంగా ఉన్నారు. తల్లీ పిల్లలకి సమ్మర్ హాలిడేస్ కదా! ముగ్గురు కలిసి రాధిక వాళ్ళ పుట్టింటికి వెళ్లారు. ప్రస్తుతం పెళ్లైన బ్రహ్మచారిని”

“ఒక్కడివే ఉన్నావా? నువ్వూ లీవ్ పెట్టి వెళ్ళొచ్చుగా?”

“సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల్లో అన్నన్ని రోజులు లీవ్ దొరకదక్కా!”

“హైదరాబాద్ రోజు రోజుకి చాలా మారిపోతుంది మురళీ! ఏదో విదేశంలో ఉన్నట్టుంది” అంది ఆశ్చర్యంగా పరిసరాల్ని చూస్తూ.

“అవును.. బిజీ లైఫ్. ఈ స్కై హై టవర్లు చూడు. 60 అంతస్తులు దాటి కడుతున్నారు.. జనం ఎక్కడి నుంచి వస్తున్నారో అర్థం కావట్లేదు.”

 మాట్లాడుతూనే గచ్చిబౌలి దాటి వచ్చేసారు.

“అక్కా! మంచి కాఫీ తాగుదాం” అని కారు కంచి కెఫే ముందు ఆపాడు.

ఇద్దరూ కాఫీ తాగుతూ.. “నీ క్లాస్మేట్ సంధ్య కూతురు పెళ్లన్నావు కదా! ఎలా జరిగింది?”

“అబ్బబ్బ! ఎంత పెద్ద కళ్యాణ మండపమో తెలుసా! విపరీతమైన జనం. బాగా ఖర్చు చేశారు”

“వాళ్ళ ఆయన పాలిటిక్స్‌లో ఉన్నాడన్నావు కదా!”

“అవును”

ఇద్దరూ కాఫీ తాగి.. బయలుదేరారు.

20 నిమిషాల్లో కోకాపేటలో రాజహంస గేటెడ్ కమ్యూనిటీలో బి బ్లాక్‌లో 20వ ఫ్లోర్‌కి వచ్చారు.

“రా! అక్కా!” అని స్రవంతి చేతిలో బ్యాగ్ తీసుకుని ఇంట్లోకి వచ్చాడు మురళి.

ఫ్యాన్ ఆన్ చేశాడు. ఇద్దరూ సోఫాలో కూర్చున్నారు. టీ.వీ ఆన్ చేసాడు.

“ఫ్రెష్ అయ్యి రా! అక్కా! బ్రేక్‌ఫాస్ట్ జొమాటోలో ఆర్డర్ చేస్తాను.”

“ఏం వద్దు మురళీ! నేను చేస్తాను.”

“రోజూ ఇంట్లో చేస్తూనే ఉన్నావుగా! నీకు ఇష్టమైన పుల్లట్లు, చల్ల పునుగులు ఆర్డర్ చేశాను. త్వరగా ఫ్రెష్ అయ్యి రా!”

 అరగంట తర్వాత జోమాటో ఆర్డర్ వచ్చేసరికి.. అక్క తమ్ముడు ఫ్రెష్ అయ్యి వచ్చారు.

“ఇదిగో!” అని సంధ్య పెళ్లికి ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ప్యాక్ స్రవంతి ఇవ్వబోతుంటే..

“నాకెందుకు అక్కా! నేను పెళ్లికి రాలేదుగా?”

“నా తమ్ముడువని.. నీకిమ్మనిచ్చింది సంధ్య.”

“రిటర్న్ గిఫ్ట్ కూడా బాగా కాస్ట్లీగానే ఉంది.” అని తీసుకుని టేబుల్ మీద పెట్టి లోపలికి వెళ్తుంటే..

“ఎక్కడికి వెళ్తున్నావు? టిఫిన్ కంప్లీట్ చేసి వెళ్ళొచ్చుగా!” అంది స్రవంతి.

“వన్ సెకండ్” లోపలి నుంచి నగల పెట్టె తెచ్చాడు.

“ఏంటది?”

“అమ్మ బంగారం”

దానిని తెరిచి అందులో ఉన్న తల్లి నాన్తాడు తాళిబొట్లున్న గొలుసు, నల్లపూసల గొలుసు మరో గొలుసు చూసిన స్రవంతికి కళ్ళల్లో తడి.

అది చూసి మురళి “ఎమోషనల్ అవకు అక్కా!” అన్నాడు చేతి మీద చెయ్యేసి.

“అమ్మ మొదటిసారి చేయించుకున్న నాన్తాడు గొలుసిది. ఒక గ్రామం రెండు గ్రాములు అని కొద్దికొద్దిగా కూడా పెట్టి మన బజారులో ఉన్న..” అని ఆపేసింది ఆ చైన్ తడుముతూ.

“రాఘవాచారి గారు అక్కా” గుర్తు చేశాడు మురళి.

“ఆఁ.. ఆఁ…”

“నువ్వు కాలేజీకి వెళ్లి లేటుగా వచ్చే దానివి. నేను స్కూల్ నుండి తొందరగా వచ్చేవాణ్ణి. నన్ను.. రాఘవాచారి ఇంటికి గొలుసు పూర్తయిందో లేదో కనుక్కురమ్మని ప్రతిరోజూ నన్ను పంపేది అమ్మ.”

“ఉఁ.. అప్పుడే అమ్మ పోయి ఆరు నెలలయింది. ఆ సమయంలో మనం దీనిని గురించి మాట్లాడుకోవటానికి కుదరలేదు. సరే నువ్వు ఎలాగూ పెళ్లికి వస్తానన్నావని లాకర్‌లో నుంచి తీశాను. అప్పుడిది 26 గ్రాములు ఉందనుకుంటాను. దీనిని మనిద్దరినీ చెరిసగం తీసుకోమని అమ్మ చెప్పింది. రాధికని అడిగాను. అమ్మ నాన్తాడు గొలుసు చెడగొట్టకుండా నీకు ఇచ్చేయమని చెప్పింది. నువ్వు తీసుకో అక్కా!”

స్రవంతి నగలు పెట్టె మూసి.. మురళి వైపు నెడుతుంటే..

“ఏమైంది!?!”

“అమ్మకి కిడ్నీలు ఫెయిలయినప్పుడు నువ్వు ఒక్కడివే ఆసుపత్రికి డయాలసిస్ కోసం తీసుకెళ్తూ కష్టపడుతుంటే.. నేను వచ్చి నీకు కనీసం తోడు ఉండకుండా.. ఇప్పుడు అమ్మ బంగారంలో భాగం తీసుకోవటం ఎంతవరకు న్యాయం చెప్పు?”

“అర్థం కాలేదు!”

“ఇందులో నీకు అర్థం కాకపోవడానికి ఏముంది? అమ్మ కిడ్నీ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతుంటే వెంటనే అంబులెన్స్‌లో ఆసుపత్రికి తీసుకెళ్లి వారం పది రోజులు ఆస్పత్రిలో ఉంచటం మళ్ళీ తీసుకురావడం.. అప్పుడు నువ్వు లీవులు పెట్టటం.. నీతో పాటు రాధిక కూడా లీవ్ పెట్టి ఉండటం.. సంవత్సరం పాటు అవస్థ పడ్డారు. నాకు ప్రతిసారి రావటానికి కుదిరేది కాదు. వీలున్నప్పుడు వచ్చి చూసి వెళ్ళటం తప్ప అమ్మకి నేను చేసిందేమీ లేదు. అమ్మ చివరి రోజుల్లో కూడా అమ్మతో ఉన్నది నువ్వు, నీ భార్యే.”

“నీకు ఎలా కుదురుతుంది అక్కా? ఇంట్లో బావగారు, శ్రావ్య, మీ అత్తగారిని చూసుకోవాలి కదా! ఒకట్రొండు రోజులు నీకు వీలున్నప్పుడు వచ్చి అమ్మతోనే గడిపే దానివి.”

“ఊఁ.. హు.. రాధిక కి ఇవ్వటం న్యాయం.”

“అక్కా! ఎవరికి అవకాశం వచ్చినప్పుడు వాళ్ళు చూశాం. ఇన్నాళ్లు నాన్నని అమ్మని ఊర్లో నువ్వే కనిపెట్టుకొని ఉన్నావు ఇన్నాళ్లు! అమ్మకి బాగుండక పోబట్టి నాకు అవకాశం వచ్చింది. ఇప్పటికీ నాన్న నువ్వే చూస్తున్నావు. ఆయన ఇక్కడ ఉండమంటే ఉండటం లేదు. అందుకని దీనిని పెద్ద విషయంగా చూడకుండా అమ్మ వేసుకున్న నాన్తాడు తాళిబొట్లు నీకే చెందుతాయి. కాదనకుండా తీసుకో. మిగిలిన నల్లపూసల గొలుసు రాధిక తీసుకుంటుంది.”

“నాకొద్దు మురళీ! నా మనస్సాక్షి ఒప్పుకోవడం లేదు. ఆ హక్కు నాకు లేదు”

“అక్కా! హక్కులకి బంధాలకి ఎందుకు ముడిపెట్టి మాట్లాడుతున్నావ్?”

“బంధం ఎప్పుడు బంధమే మురళీ! కానీ హక్కు దగ్గరకు వచ్చేసరికి..” స్రవంతి చెప్పబోతుంటే.. అడ్డొచ్చి

“ఆపక్కా! ఎప్పుడూ నువ్వు చెప్పిందే వినాలంటావు.” అన్నాడు చిరాగ్గా.

“అమ్మ నాన్తాడు అదనంగా వచ్చి నాకు ఒరిగేదేముంది రా?”

“సరే! నీకు ఇవ్వకుండా అమ్మ బంగారమంతా ఉంచుకుని నేనేం చేసుకుంటాను?”

“ప్రతి మాటకి ఇలా ఎదురు చెబుతుంటే నేనేం చెప్పేది?” అంది స్రవంతి నిష్టూరంగా.

“ఒక్క నిమిషం నేను చెప్పేది విను.. అమ్మకి ఆరోగ్యం బాగా లేనప్పుడు నేనేదో చేశానని, నువ్వేమీ చేయలేదని అనుకుంటున్నావు అంతే కదా! అయితే ఆ సమయంలో అమ్మని చూసినందుకు బదులుగా బంగారం అంతా నన్నే ఉంచుకోమంటావా?”

“పెద్ద మాటలు మాట్లాడకుండా చెప్పింది విను మురళీ”

“నేను నీ తమ్ముణ్ణేగా! నీ మొండితనంలో నాకు వాటా ఉంటుందిగా!”

“……….”

“ఇప్పుడు నువ్వు సగం తీసుకోలేదనుకో.. శ్రావ్యకి ఎలాగూ పెళ్లి చేస్తావుగా! అప్పుడు అమ్మమ్మ బహుమతిగా దానికి అమ్మ బంగారమంతా ఇచ్చేస్తాను. దానిని కాదనే హక్కు నీకు లేదుగా! అర్థం చేసుకోకుండా ఏదేదో మాట్లాడుతున్నావు” అని లేచి నిలబడ్డాడు మురళి.

స్రవంతి కళ్ళల్లో నీళ్లు.. అది చూసి చలించిన మురళి అక్క చేతి మీద చెయ్యేసి..

“అక్కా! కోపంగా మాట్లాడానని అపార్థం చేసుకోకు.. అమ్మ నిన్ను ‘నా బంగారం’ అని పిలుచుకునేది. తన తదనంతరం ఆ బంగారం నీకే ఇవ్వాలని అమ్మ ఆశపడేది. నేను రాధిక కూడా అదే అనుకున్నాం. ఇంకేం మాట్లాడకుండా తీసుకో అక్కా.. ప్లీజ్!” అని స్రవంతి కళ్ళల్లోకి చూస్తూ రెండు చేతులు పట్టుకున్నాడు మురళి.

“సరే” అంది స్రవంతి చెమ్మగిల్లిన కళ్లతో.

***

సంవత్సరం తర్వాత:

“హలో! ఎక్కడున్నావు రా! మురళీ!”

“మన ఊరే వచ్చానక్కా!”

“మా ఇంటికి వెళ్ళకు. నేను మన ఇంటికి వచ్చాను.”

కాసేపటికి కారులో ఇంటికి వచ్చిన మురళిని చూసి. “రా.. రా!” అంది స్రవంతి నవ్వుతూ.

ఇల్లు చూసి, వాకిట్లో ఉన్న చెట్లను చూసి “ఇల్లంతా ఇంత శుభ్రంగా ఉంది. నాన్న పోయాక కూడా ఆయన ఉన్నప్పుడు ఉన్నట్టే ఉంది.”

“అవును.. రోజు వచ్చి ఈ చెట్లను పోసి.. ఇల్లు శుభ్రం చేసి వెళ్తాను. ఈ చెట్లని అమ్మానాన్న పెట్టినవి కదరా!”

“అవును చెట్లని బాగా ఎదిగినయి”

“ఫ్రెష్ అయ్యి రా! కాఫీ ఇస్తాను.”

“తర్వాత తాగుతాను అక్కా!”

“కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చావు కదా అలసటగా ఉంటుంది. కాఫీ తాగితే కాస్త రిలీఫ్‌గా ఉంటుంది. ఇదుగో”అని లుంగీ టవల్ ఇచ్చింది.

వాటి వైపు ఆశ్చర్యంగా చూస్తూ “ఇది నాన్న లుంగీ కదా!” అన్నాడు.

“అవును”

ఐదు నిమిషాల్లో ఫ్రెష్ అయ్యి వచ్చిన తమ్ముడికి కాఫీ గ్లాస్ ఇచ్చి తనుకు తాగుతుంటే..

“ఇప్పుడు ఇక్కడ ఇళ్ళ స్థలాల రేట్లు ఎలా ఉన్నాయి? స్క్వేర్ ఫీట్ ఎంత చెప్తున్నారు?”

స్రవంతి మాట్లాడకుండా తమ్ముడు కళ్ళలోకి చూసింది.

మాట మారుస్తూ “అక్కడ ఇంట్లో పని చాలక.. ఇక్కడికొచ్చి మళ్ళీ పని చేస్తున్నావా?” అన్నాడు మురళి.

“ఇందులో ఏముంది రా! మనం పుట్టి పెరిగిన ఇల్లే కదా!”

“కాదనటం లేదు. ఎవరు ఉంటున్నారు ఇంట్లో! అద్దెకి ఇవ్వకుండా రోజూ నువ్వే వచ్చి మనుషులు ఉంటున్నట్టే ఎంతో శుభ్రంగా ఉంచుతున్నావు! శ్రావ్యకి పెళ్లి అయిపోయింది. హాయిగా నువ్వు బావ రిలాక్స్డ్ గా ఉండకుండా.. ఎందుకీ పాత ఇంటి కోసం కష్టపడుతున్నావో అర్థం కావట్లేదు” అన్నాడు మురళి.

“దేన్ని పాతది అంటున్నావు?”

“దీన్నే.. ఈ ఇంటిని.. ఎప్పుడో ఆ కాలంలో నాన్న కట్టింది. ఇప్పుడు ఉన్నది మనమిద్దరం. ఎంతో కొంత రేటుకి అమ్మి చెరిసగం తీసుకుంటే పని అయిపోతుంది. నీకు ఈ చాకిరీ తప్పుతుంది కదా!”

“ఆఁ..హా.. ఉన్నదాన్ని అమ్ముకుని ఎదురు డబ్బు పెట్టి చెరొక ఫ్లాట్ కొనుక్కుందామనా?”

“అదొక్కటే కాదక్కా! దీన్ని అమ్మేస్తే నీకు, నాకు..”

స్రవంతి మాట్లాడలేదు.

గోడ మీదున్న తల్లిదండ్రి ఫోటో వైపు చూసాడు మురళి. అక్కతో తల్లిదండ్రి గురించి మాట్లాడితే ఎమోషనల్ అవుతుందేమోనని, “నా గది అలాగే ఉన్నట్టుంది? నేను చదువుకునేటప్పుడు వాడిన పాత కంప్యూటర్ కూడా ఇంకా ఉంచారా?”

“అవును.. నువ్వు వాడిని కంప్యూటర్ ఏం కర్మ! మౌస్ కూడా అలాగే ఉంది. నాన్న ఉన్నంతవరకు దీనిని ఎవరైనా ముట్టుకుంటే ఊరుకునే వాడు కాదు.”

మురళి ఆప్యాయంగా మౌస్ ముట్టుకొని ఒక్క క్షణం ముందుకు వెనక్కు కదిలించి మనసు తడుముకున్నాడు.

“అటు షెల్ఫ్ లో చూడు.. స్కూల్లో చిన్నప్పుడు రన్నింగ్‌లో నీకు వచ్చిన కప్పు”

మురళి కంప్యూటర్ ముందు నుండి లేచి షెల్ఫ్ దగ్గరకొచ్చి.. అక్కడున్న కప్పు చేతిలోకి తీసుకొని ఆప్యాయంగా చూసుకుంటుంటే.. అలనాటి జ్ఞాపక వీచిక కళ్ళ ముందు కదిలింది.

“ఇది బ్రాస్ కదా అక్కా! కొత్తదిలా ఉంది”

“అవును.. దానిమీద దుమ్ము పడనిచ్చేవాడు కాదు నాన్న! దానిని నువ్వు సాధించిన ప్రపంచ కప్పులా చూసుకునేవాడు.”

 ఆ షెల్ఫ్ మీద ఉన్న కర్టెన్ పక్కకు తొలగించి తన ఇంజనీరింగ్ చదివినప్పటి పుస్తకాలు ప్రాజెక్టు వర్క్ చేసిన స్పైరల్ బుక్స్ చూసి.. “ఇవి నా ప్రాజెక్ట్ బుక్స్” అని చేత్తో తడిమాడు మురళి.

“అవును.. ఆ అరంతా నీ బుక్సే. ఇంటికి వచ్చిన వాళ్ళకి వీటిని చూపించి నా కొడుకు ఎన్ని బుక్స్ చదివాడో అని గొప్పగా చెప్పేవాడు.”

మురళి తండ్రి ఫోటో వైపు చూసేసరికి ఏదో తెలియని తడి మనసులో మొదలైంది.

అది గమనించిన స్రవంతి “రా! మురళీ! డాబా మీదకి వెళ్దాం” అని తీసుకెళ్లింది.

డాబా మెట్లు ఎక్కుతూనే “ఈ మామిడి చెట్టు ఎంత పెద్దదయింది అక్కా!” అన్నాడు.

“అంతేకాదు చెట్టు నిండా ఎన్ని కాయలున్నాయో చూడు” అంది మురిపెంగా.

“మన చిన్నప్పుడు నాన్న నూజివీడు నుంచి చిన్నరసాల మొక్క తెప్పించి నాటాడు. ఇంతకుముందు కాంపౌండ్ వాల్ వరకు ఉండేది. ఇప్పుడు మన ఇల్లు దాటి పక్క అపార్ట్‌మెంట్‌కి సగం వరకు పెరిగిందక్కా” అన్నాడు మురళి అబ్బురంగా చూస్తూ.

“ఊరరగాయ పచ్చడికి ఈ చెట్టు కాయలే పెడతాను. నీకు పంపించేది అదే.”

“అక్కా! అప్పుడు ఇక్కడి నుంచి చూస్తే మనం చదువుకున్న హై స్కూల్ తెలిసేది కదా! ఇప్పుడు ఏమీ కనిపించడం లేదు చూడు” అన్నాడు.

“అవును మురళీ! ఇప్పుడు పక్క సందు రోడ్డు కూడా తెలియటం లేదు. ఎన్ని బిల్డింగ్‌లు వచ్చాయో చూడు.”

“అబ్బా! ఈ అపార్ట్‌మెంట్ కల్చర్ వచ్చి పల్లెటూరి అందాలను కూడా పాడు చేస్తోంది.”

“అవునవును.. రా! అన్నం తిందాం. నీకు గుర్తుందా! అమ్మ పెట్టిన దొండ పాదు ఇప్పటికీ ఉంది. నాన్న దానికి రోజు నీళ్లు పోసేవాడు. అది ఎప్పుడూ కాయలు కాస్తూనే ఉంటుంది. నీకు ఇష్టమని దొండకాయ వేపుడు చేశాను.” చెప్పింది మెట్లు దిగుతూ.

“అవునా!”అని దొండ పాదును చూశాడు.

“కాలేజీకి వెళ్లే రోజుల్లో ఎమర్జెన్సీకి అమ్మ ఈ పాదు కాయల కూర చేసి బాక్స్‌లో పెట్టేది” గుర్తు చేసుకున్నాడు మురళి.

ఇద్దరు కిందికొచ్చి అన్నం తింటూ కబుర్లు చెప్పుకుంటూ తిన్నారు.

మురళి చెయ్యి కడుక్కుంటూ “భోజనం సూపర్ గా ఉందక్కా! అచ్చం అమ్మ చేతి వంటలాగే ఉంది”

“అమ్మ నేర్పిన వంటే గదరా! అలానే ఉంటుంది” అందొకలాంటి నవ్వుతో.

స్రవంతి లేచి ఓ డైరీ తెచ్చి ఇచ్చింది.

“ఏంటక్కా! ఇది?”

“చూడు.”

మురళి పేజీలు తిప్పుతూ ఆశ్చర్యంగా అక్క మొహం లోకి చూశాడు.

“నువ్వు ఉద్యోగంలో చేరిన కొత్తల్లో నాన్న వద్దన్నా.. నెలనెలా అమ్మా నాన్నకి డబ్బు పంపేవాడికి గుర్తుందా? అందులోంచి ఒక్క రూపాయి కూడా ముట్టుకోకుండా అన్నీ కలిపి ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు. నామినీగా నీ పేరే పెట్టాడు. ఎప్పుడు? ఎంత? నువ్వు పంపిందీ, ఎంత ఫిక్స్డ్ చేసిందీ ఇందులో రాశాడు చూడు.”

డైరీ చూస్తున్న మురళి కళ్ళు మసకబారాయి. కళ్ళల్లో చేరిన తడిని భుజం మీద ఉన్న తండ్రి టవల్‌తో తుడుచుకున్నాడు మురళి.

“ఆయన హ్యాండ్ రైటింగ్ చూశావా ముత్యాల్లాంటి అక్షరాలు.. ఎంత బాగున్నాయో! ఈ డైరీ ఆయన దిండుకింది పెట్టుకొని పడుకునే వాడు. రోజూ రెండు మూడు సార్లు అయినా చూసుకునేవాడు.”

“అక్కా!” మురళి గొంతులో ఆర్ద్రత.

“నీ రూమ్ చూశావా! నువ్వు స్కూలు కాలేజీల్లో చదువుకున్నప్పటి, నువ్వు పనికి రానివని పడేసిన పుస్తకాలన్నీ.. అదిగో ఆ గోతాల్లో ఎత్తి భద్రంగా ఉంచాడు. నాన్నకి ఇదొక మ్యూజియం లాంటిది. అమ్మ పోయాక నాన్న ఇందులోనే ఉండేవాడు. మధ్యాహ్నం భోజనానికి మాత్రం వచ్చేవాడు. రాత్రి భోజనం నేనే తెచ్చి ఇచ్చేదాన్ని. ఈ ఇంట్లో ఉంటే మనం ఆయనతోనే ఉన్నట్టు ఫీల్ అయ్యేవాడు. ఈ గదిలో నీ వస్తువులు ఆయనకి అడ్డుగా ఉన్నాయని ఏనాడు అనుకోలేదు మరి.” అంది స్రవంతి.

మౌనంగా డైరీ మూసి పక్కన పెట్టాడు మురళి.

“అంతెందుకు.. ఆ రోజుల్లో నువ్వు వేసుకున్న ప్యాంటు షర్ట్లు కూడా ఇదిగో.. ఈ పెట్టిలోనే పెట్టి చూసుకునేవాడు. నువ్వు వాడిన టేప్ రికార్డును క్యాసెట్లు ఇప్పటికీ అలాగే ఉన్నాయి నీకు ఇష్టమైన పాటలు పెట్టుకుని వింటుండేవాడు.”

“అప్పటి టేప్ రికార్డర్ ఇంకా పనిచేస్తుందా?!” అన్నాడు.

“నిక్షేపంగా!”అని లేచింది బీరువాలో నుంచి తెచ్చి మురళి ముందు పెట్టింది.

సి టి ఆర్ 300 ఓల్డ్ టేప్ రికార్డు ప్లేయర్.

క్యాసెట్ పెట్టి ఆన్ చేసింది స్రవంతి.

‘శివరంజనీ.. నవరాగిణీ’.. శివరంజని సినిమాలోని పాట వినిపిస్తోంది. చాలాకాలం తర్వాత మళ్లీ ఆ పాట వింటున్న మురళి మనసు గతంలోకి వెళ్ళింది.

“మురళీ! ఈ పాట వినీ వినీ నేర్చుకుని.. స్కూల్లో పాడి.. సెకండ్ ప్రైజ్ తెచ్చుకున్నావు గుర్తుందా?”

మౌనంగా అక్క కళ్ళలోకి చూశాడు.

ఆ కేసెట్ తీసి.. “ఈ క్యాసెట్లో నాన్నకి ఇష్టమైన పాటలు ఉన్నాయి” అని ఆ క్యాసెట్ పెట్టింది.

‘ఏటిలోని కెరటాలు ఏరు విడిచి పోవూ.. ఎద లోపలి మమకారం ఎక్కడికీ పోదూ’..

పాట వింటూనే.. “అవునక్కా! నాన్నకి ఈ పాట ఎంతో ఇష్టం. నాకింకా గుర్తుంది” అన్నాడొకలా.

“మనం చూడు అమ్మానాన్న ఇక లేరు అనగానే.. అమ్మ బంగారం పంచుకుందామా! పనికిరాని సామాన్లు తీసేద్దామా? పాతకాలం నాటి ఇల్లు అమ్ముకుందామా? అని ఆలోచిస్తున్నాం. కానీ.. మన ఎదుగుదలతో పాటు అమ్మానాన్న మన కోసం కొన్న వస్తువుల్ని భద్రపరిచి వాటిలో మనల్ని చూసుకుంటూ చివరి వరకు గడిపేశారు. ఇల్లు అంటే నాలుగు గోడలు మాత్రమే కాదు మురళీ! అమ్మానాన్నల సజీవ స్వప్నం. అణువణువులో మనల్ని చూసుకుంటూ ఇన్నేళ్లు వాళ్ళు కాపాడిన ఇంటిపై మమకారం మీకే కాని.. మాకు లేదంటూ.. అనుబంధాలని తెగతెంపులు చేసుకుందామని.. అనుకుంటున్నాం!”

“…………….”

“డైరీలో నాన్న రాసిన చివరి పేజీ చదివావా?”

 లేదన్నట్టు తలూపాడు.

“ఇదిగో చదువు..” అని తీసి ఇచ్చింది

“మా ఇద్దరి శ్రమ ప్రేమ లకు ప్రతిరూపం ఈ ఇల్లు. ఇది కేవలం ఇటుకలు సిమెంటు మాత్రమే కాదు. ఇది జ్ఞాపకాల గోపురం. ఈ ఇంట్లోనే మీరిద్దరూ పుట్టారు. ఇందులో పెనవేసుకున్న అనుబంధాలతోనే మాకు చేతనైనంత వరకు మీ ఇద్దరినీ విలువలతో పెంచాం. మా తదనంతరం మీరు కూడా మీ పిల్లల్ని అలాగే పెంచుతారని కోరుకుంటున్నాను.”

పెద్దగా చదివుతున్న మురళికి గొంతు బొంగురు పోయింది. స్రవంతి తమ్ముడు చేతి మీద చెయ్యేసి.. “ఎమోషనల్ అవ్వకు.”అని లేచెళ్లి.. బీరువాలో ఉన్న.. తల్లి నగలపెట్టె తెచ్చి తెరిచింది.

సంవత్సరం క్రితం మురళి స్రవంతికిచ్చిన తల్లి నాన్తాడు తాళిబొట్లు అలానే ఉన్నాయి.

“అ.. క్కా!” అన్నాడు ఆర్తిగా.

తమ్ముణ్ణి దగ్గరికి తీసుకుని..

“అవును మురళీ!.. అమ్మానాన్నల జ్ఞాపకాలెప్పుడూ సజీవంగానే ఉండాలి. వాళ్ళు ఉన్నప్పుడు విలువ తెలియదు.. మనం మన పిల్లలకి అందించాల్సింది వాళ్ళు ఇచ్చిన వారసత్వపు ఆస్తులు కాదు. విలువలు మానవ సంబంధాలు. ఆ బాధ్యత మనదే కదా!” అంది స్రవంతి.

ఆ తర్వాత ఇద్దరి మధ్య కాసేపు మౌనం మాట్లాడుకుంది.

Exit mobile version