Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ఒక సున్నిత హృదయుడి జీవన యాత్ర ‘వాడ్రేవు చినవీరభద్రుడి కథలు ’

[శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడు రచించిన ‘వాడ్రేవు చినవీరభద్రుడు కథలు 1980-2023’ అనే పుస్తకం సమీక్షని అందిస్తున్నాము.]

ప్రఖ్యాత రచయిత, విమర్శకుడు, కవి, పండితుడు శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడు 1983 నుంచి 2023 వరకు అంటే 43 ఏళ్ళ కాలంలో రచించిన 35 కథల సంపుటి ఈ పుస్తకం. అంటే, ఒక సృజనాత్మక రచయిత తన జీవిత ప్రవాహంలో ఈదుతూ, తన మనసును కదిలించిన సంఘటనల అనుభవాలు, అనుభూతులకు, వాటికి తన స్పందనను, అవగాహనను, ఆలోచనలను అక్షరాలలో ప్రతిష్ఠించి రూపొంచించిన అక్షర చిత్రాలు ఈ కథలు అన్నమాట.

సృజనాత్మక రచయిత పరిణామక్రమాన్ని నదీ ప్రవాహంతో పోల్చవచ్చు. కొండకోనల్లో చిన్నటి నీటి ధారలా ఆరంభమయి, ఇతర నీటి ప్రవాహాలను తనలో కలుపుకుని, శక్తివంతమై, కోండలపైనుండి జలపాతంలా దూకి, ఆపై, అనేకానేక ఉపనదులను కలుపుకుంటూ వేగవంతంగా ప్రవహిస్తూ, మైదాన ప్రాంతాలను చేరుకుని, పరిణతి పొంది మంద్రగతిలో ప్రవహిస్తూ, అనేకానేక అనుభూతులను మోయలేకమోస్తూ, సముద్రం చేరుకుంటుంది నది. రచయిత సృజన కూడా అంతే!

ఒక రచయిత రాస్తూన్న కథలను విడివిడిగా చదవటం వేరు, అన్నీ కలిపి ఒకటొకటిగా వరుసగా చదవటం వేరు. ఒక సినిమాలో ఒక్కో దృశ్యాన్ని వేర్వేరుగా చూడటం వేరు. వాటన్న్నించి ఒక పద్ధతి ప్రకారం వరుసగా చూడటం వేరు. ఒకటొకటిగా ఈ సంపుటిలోని కథలు చదువుతుంటే ఒక సృజనాత్మక కళాకారుడు, సున్నిత మనస్కుడు కాలం గడుస్తున్న కొద్దీ, విభిన్నమైన అనుభవాల ప్రభావంతో పరిణతి సాధించటం, ఆవేశం ఆలోచనగా రూపాంతరం చెందటం కనిపిస్తుంది. ఒక రకంగా చూస్తే ఈ కథలలో వ్యక్తిగా, రచయితగా చినవీరభద్రుడి కథలలో కనిపించే అసంతృప్తి, నిరాశ, సంఘర్షణలు సార్వజనీనం. కానీ వాటికి స్పందన, కాలక్రమేణా జీవితంలో రాజీపడి, తనని తాను తెలుసుకుని, తన గమ్యం, లక్ష్యాలను నిర్దేశించుకోవటం రచయిత ప్రత్యేకం.

‘శరణార్థి’ కథలో “చదువుకునే రోజుల్లో చదువే ముఖ్యమని చదివి పైకొచ్చాను. సంపాదించే రోజుల్లో డబ్బే ముఖ్యమని సంపాదించాను. కష్టపడి పని చేసినట్టే పెళ్ళి చేసుకొని పిల్లల్ని కన్నాను. ఇంతకాలం గడిచిపోయాక నేను జీవితంలో ఏదో పోగొట్టుకొన్నానని తెలిసింది” అంటుంది ప్రధాన పాత్ర. ఇది జీవితారంభంలో, భవిష్యత్తును తలచుకున్న ప్రతి ఆలోచనాపరుడి ఆక్రోశం.  ఎందుకు చదువుతున్నామో తెలియకుండా చదవటం, ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా, ఉద్యోగంలో చేరటం, ఉద్యోగంలో చేరగానే, పెళ్ళి పిల్లలు, చదువులు, పిల్లలు పెళ్ళిళ్ళు.. ఒక దశలో వెనుతిరిగి చూసుకుంటే, ‘ఆర్ద్రత లేని అనుభవాల’తో నిండిన జీవితం, ఎందుకు ఏం సాధిస్తున్నామో, తెలియని ప్రయాణం మిగులుతాయి.

‘శరణార్థి’ కథలో రచయిత అంతరంగ సంఘర్షణ కనిపిస్తుంది. జీవితాన్ని అవగాహన చేసుకోవాలన్న ప్రయత్నం కనిపిస్తుంది. పరిస్థితులతో రాజీ పడ్తున్న అవగాహన కనిపిస్తుంది. తన లోలోపలి ఆకాంక్షలకూ, నిజ జీవితంలోని సత్యాలకూ నడుమ సంఘర్షణ కనిపిస్తుంది. ఈ సంఘర్షణ లోంచి తనలో నూతన సంతృప్త మానవుడు ఉదయించాలన్న ఆశాభావన కనిపిస్తుంది. ఒక రకంగా చూస్తే భవిష్యత్తులో ఈ రచయిత రాయబోయే కథలన్నిటికీ ‘ప్రాతిపదిక ఈ కథ అనిపిస్తుంది. భవిష్యత్తులో రాయబోయే  కథాంశాలన్నిటినీ   ఈ కథ సూక్ష్మంలో ప్రదర్శిస్తుంది.

‘సశేష ప్రశ్న’ లో “మా వూరెళ్ళి వ్యవసాయం చేసుకుంటాను. ఈ మానుష ప్రపంచాన్ని నేను భరించలేను. నేను సుఖంగా ఉండగలిగేది ప్రకృతి ఒళ్ళో మాత్రమేనేమో. ఈ వేగవంతమైన జీవితంలో నాకు భవిష్యత్తు లేదు. నేనసమర్థుణ్ణి” అన్న ప్రధాన పాత్ర మాటల ప్రతిధ్వని ఈ సంపుటిలోని కథలన్నిటిలో ఏదో ఒక రూపంలో వినిపిస్తునే ఉంటుంది. అందుకే ఈ సంపుటి ఒక సున్నిత హృదయుడి ‘జీవన యాత్ర’ను, ‘మానసిక పరిణతి’ని ప్రదర్శించే కథల సంపుటిలా అనిపిస్తుంది.

ఈ కథలలో అడుగడుగునా తన ఇష్టానికీ, తన సామాజిక బాధ్యతలకూ నడుమ సంఘర్షణ కనిపిస్తుంది. వ్యక్తికీ, సమాజానికీ నడుమ సంఘర్షణ స్వరూపం కనిపిస్తుంది. కవికీ కథకుడికీ మధ్య సంఘర్షణ కనిపిస్తుంది. తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవటంతో పాటు తనని తాను అర్థం చేసుకుంటూ తన జీవితానికి అర్థాన్ని గ్రహించాలన్న తపన కనిపిస్తుంది. భౌతిక వాంఛలను అధిగమించి  ఆధ్యాత్మిక సత్యాన్ని గ్రహించాలన్న ప్రయత్నం కనిపిస్తుంది. తాను గడుపుతున్న జీవితం పట్ల అసంతృప్తి, ఇంకేదే పొందటం ద్వారా ప్రశాంతత సాధించాలన్న ఆరాటం కనిపిస్తుంది.

‘ఆకాశం’, ‘గృహోన్ముఖంగా’ వంటి కథలు ప్రధాన పాత్రలలో ఈ రకమైన సంఘర్షణను చూపిస్తాయి. ‘అనాచ్ఛాదిత’ కథ ఈ కథలకు భిన్నమైనది. ఇందులో ప్రధాన పాత్ర స్త్రీపురుష సంబంధాలలోని లైంగికతను అర్థం చేసుకోవటం ద్వారా ఆ సంబంధాలలో స్త్రీ ముందు ఎన్నటికీ పసివాడే అయిన పురుష హృదయాన్ని ప్రతిఫలిస్తుంది కాస్త డ్రమటిక్‍గా.

తొలి కథలలో మార్గదర్శనం చేసే స్త్రీలు అధికంగా కనిపిస్తే, ఈ కథ తరువాత నుంచి కథలలో కనబడే స్త్రీ స్వరూపం మార్పు చెందటం గమనించవచ్చు. భవిష్యత్ కథలలో ప్రధాన పాత్రలు స్త్రీలను అర్థం చేసుకోవటం, వారితో సమాన స్థాయిలో చర్చించటం కనిపిస్తుంది. కానీ ఈ రచయిత కథలన్నిటిలో స్త్రీ ఆధిక్యం స్పష్టంగా తెలుస్తుది. ఆమెను ఒక ఉన్నత స్థాయిలో, ఉత్తమమైన రీతిలో రూపొందించటడం తెలుస్తుంది. అయితే అత్యంత సున్నిత మనస్కుడు, భావుకుడు, ఆలోచనాపరుడు అయిన రచయిత – నడుమ కథలలో వామపక్ష భావజాలంతో ప్రభావితుడై తన ప్రాకృతిక స్వభావానికి భిన్నమైన కథలు రాయటం కనిపిస్తుంది. ఈ కథలలో మనకు కనిపించే రచయిత వేరు. ఈ సంపుటిలో అంతగా మెప్పించని కథలివి.

ప్రతి రచయితకూ తనదంటూ ఒక పరిధి ఉంటుంది. ఆ పరిధిలో ఒదిగి రచనలు చేసినంత కాలం అతని రచనల స్థాయి ఉత్తమ స్థాయిలో ఉంటుంది. ఆ పరిధిని పెంచుకోవాలని ప్రయత్నిస్తూ, చేసిన రచనలు బాగుంటాయి. నిజానికి ఏ రచయిత అయినా తన పరిధిని పెంచుకుంటూ పోవటం వాంఛనీయం. కానీ ఆ పెరుగుదల కూడా రచయిత ప్రాకృతిక స్వభావానికి విరుద్ధం కాకూడదు. అలా అయినప్పుడు ఆ కథలు తేలిపోతాయి. రచయిత మరుగున పడి, సిద్ధాంతాన్ని సమర్థించే వ్యాసకర్త పైకి వస్తాడు. అంగారక శిశువు, పరాయి ప్రపంచం, సుజాత, ఒక తిరుగుబాటు కథ – వంటి కథలు ఈ కోవకి చెందినవి.

అంతలోనే, రచయిత లోని భావుకత, రసం ఇంకా ఇంకిపోలేదని ‘అమృతం’ కథ నిరూపిస్తుంది. ఇదొక విలక్షణమైన కథ. అత్యంత సున్నితత్వం కనిపిస్తుందీ కథలో. నిజానికి ‘అమృతం’ కథ కన్నా, జీవితంలోని డైరీ లోని ఓ పేజీ అవవచ్చు. ఈ కథలో ప్రధాన పాత్రలో ప్రదర్శితమైన సున్నితత్వం చాలా అరుదైనది. ‘ఒక మగవాడు, ఒక స్త్రీ గురించి – ఆమె ఎంత ఉన్నతురాలైనా సరే, మరొక మగవాడితో ప్రస్తావించటమే నేరమనిపించింది’ అన్న భావన ‘ఇరువురి నడుమ ఉన్నంత కాలం అద్భుతం. మూడో వ్యక్తికి తెలిస్తే అసహ్యం’ అన్న సూక్తిని గుర్తు తెస్తుంది. తనకు సన్నిహితులైన స్త్రీల గురించి ఇతరుల ముందు గొప్పగా చెప్పుకునే ‘పురుషు’ల నడుమ ఇలాంటి సున్నిత భావన కల వ్యక్తులు అరుదు. ఈ కథ మొత్తం ఇలాంటి సున్నిత భావనలను, సుతిమెత్తగా వ్యక్తపరిచే ఒక కవితలా అనిపిస్తుంది.

‘అమృతం’ తరువాత కథలలో ఉద్యోగ జీవితంలోని అసంతృప్తులు కనిపిస్తాయి. అన్యాయాలు కనిపిస్తాయి. ప్రధాన పాత్ర ఆగ్రహం కనిపిస్తుంది. ‘మొదటి పనిగంట వేళ’, ‘ప్రశ్నభూమి’, ‘టాపికల్ ఫీవర్’, ‘43 ఎకరాల జొన్నపంట’, ‘మాప్ మేకింగ్’, ‘పోరు తర్వాత’, ‘నమ్మదగ్గ మాటలు’ వంటి కథలతో పాటు మరికొన్ని కథలు ఈ కోవకు చెందుతాయి. ‘ప్రశ్నభూమి’ కథ – ఒక మంచి మనిషి, అధికారం వల్ల పశువయి, రాక్షసుడవటం ప్రదర్శిస్తుంది. ఈ కథల నడుమ ‘రాముడు కట్టిన వంతెన’ ప్రత్యేకంగా నిలుస్తుంది.

తన బాల్యంతో తన సంతానం అనుభవిస్తున్న బాల్యాన్ని పోలుస్తూ, ‘రామాయణం’ నాటకం వేయాలన్న తపన ‘పవర్ రేంజర్స్’గా రూపాంతరం చెందటాన్ని వివరిస్తూ, తన సంస్కృతి సంప్రదాయాలను అర్థం చేసుకోవటం ద్వారా తనని తాను అర్థం చేసుకోవాలన్న ప్రయత్నాన్ని, మన సమాజంలో వస్తున్న మానసిక మార్పును అతి చక్కగా ప్రదర్శింపజేస్తుందీ కథ. చాలా కాలానికి రచయిత స్థాయికి తగిన అంతరంగ ఘర్షణను అతి సున్నితంగా ప్రదర్శించిన కథ ఇది అనిపిస్తుంది.

చినవీరభద్రుడు రచించిన ఈ కథలు చదువుతుంటే మరో విషయం స్పష్టంగా కనిపిస్తుంది. రచయితకు రచన తనను తాను అర్థం చేసుకునే ప్రక్రియలో ఒక భాగం మాత్రమే. కథ ఆకర్షణీయంగా ఉందా, పాఠకుడిలో ఉద్విగ్నతను రగిలించి, ఆసక్తిని కలిగిస్తున్నదా అన్నదానిపై ధ్యాస లేదు. తన ఆలోచనలను పంచుకునే వేదిక కథ అనిపిస్తుంది. ముఖ్యంగా కొన్ని కథలలో కథా నిర్మాణం కన్నా తాననుకున్న విషయాలను కథలో పొందుపరిచేందుకే రచయిత ప్రాధాన్యం ఇచ్చారనిపిస్తుంది. దాంతో కొన్ని సందర్భాలలో చదువుతున్నది కథ కాదు, చర్చనో, వ్యాసమో చదువుతున్న భావన కలుగుతుంది. కొన్ని కథలలో ‘ముగింపు’ కనబడదు. Closure లేని కథలవి. అయితే కథాప్రక్రియ భిన్న పుంతలు తొక్కుతున్న కాలంలో వీటిని ఓ ప్రయోగంలా భావించవచ్చు. కానీ కథలన్నింటిలో రచయితలోని కవి, సున్నిత హృదయం, భావుకత, ఆలోచనలు, సంఘర్షణలు తొంగి చూస్తూనే ఉంటాయి.

చినవీరభద్రుడి ఈ కథలు చదువుతూంటే పాశ్చాత్య విమర్శకుల్లా – రచయిత మానసిక పరిణామ క్రమాన్ని కథలలో ప్రదర్శితమైన విధానాన్ని అధ్యయనం చేయవచ్చనిపిస్తుంది. ఒక సున్నిత మనస్కుడి సంఘర్షణలు, నిరాశలు, ఉద్విగ్నతలు తెలుసుకోవచ్చనిపిస్తుంది. తెలుగు సాహిత్య ప్రపంచంలో తనదైన  ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించగల చక్కని కథల సంపుటి ఇది. ముత్యపు చిప్ప కోసం ఎదురు చూస్తున్న వాన చినుకు ఈ కథల సంపుటి. సాహిత్యంపై అభిమానం కలవారు, కథల పట్ల ఆసక్తి కలవారు, పరిశోధకులు, సామాన్య పాఠకులు తప్పనిసరిగా కొని, భద్రం చేసుకుని, మాటిమాటికీ చదువుతూండాల్సిన సంపుటం ఇది.  రచయితకు అభినందనలు.

***

వాడ్రేవు చినవీరభద్రుడు కథలు 1980 – 2023
రచన: వాడ్రేవు చినవీరభద్రుడు
ప్రచురణ: ఎమెస్కో బుక్స్
పేజీలు: 504
వెల: ₹300.00
ప్రతులకు:
ఎమెస్కో బుక్స్ పై. లి.
#33-22-2,
చంద్రం బిల్డింగ్స్, సి. ఆర్. రోడ్,
చుట్టుగుంట, విజయవాడ – 520 004. ఫోన్: 0866-2436643.
ఆన్లైన్‍లో ఆర్డర్ చేసేందుకు:
https://www.sahithibooks.com/ProductDetails.aspx?ProductId=1283&BrandId=297&Name=Kathalu+1980-2023
https://www.amazon.in/Vadrevu-Chinaveerabhadrudu/dp/B0C14K7SRX

 

Exit mobile version