Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వైభవచరిత్ర

[నల్లబాటి రాఘవేంద్రరావు గారు రచించిన ‘వైభవచరిత్ర’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక – బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో సాధారణ ప్రచురణకి ఎంపికైన కథ.]

రామశాస్త్రిగారు మరణ ఘడియల కోసం భారతంలో భీష్ముడులా ఎదురు చూస్తున్నారు.

ఐదు పుష్కరాల తర్వాత తన పిలుపు మేరకు వచ్చి కొంచెం దూరంగా నిలబడ్డ పెద్దబ్బాయి కళ్ళ ల్లోకి చూడలేక పోతున్నారు ఆయన. ఆయన చుట్టూరా మిగిలిన కొడుకులు కోడళ్ళు వాళ్ళ సంతానం కూతుళ్లు అల్లుళ్ళు వాళ్ల పిల్లలు.

అందరూ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.. ఆయన “కన్నుమూసే ముందు చెప్తాను” అన్న ఆ రహస్యం వినడం గురించి.

ఆయన భార్య జానకమ్మ మాత్రం భర్త కాళ్ల దగ్గర బాధగా కూర్చుని పెద్దబ్బాయి వైపే కన్నార్పకుండా చూస్తుంది.. ప్రేమగా కాదు కసిగా, కోపంగా, చీదరింపుగా.

రామశాస్త్రిగారు పది రోజుల క్రితం తనకు పరలోక ప్రయాణం తప్పదని నిశ్చయించుకుని వణుకుతున్న స్వహస్తాలతో ఉత్తరాలు రాసి తన రక్త సంబంధీకులు అందరినీ రప్పించుకున్నారు. ఆయన రాసిన ఉత్తరాల్లో చివర ‘ఇంతే సంగతులు’ అని లేదు. ‘నేను చచ్చిపోయే ముందు మీ అందరికీ గొప్ప రహస్యం చెబుతాను.. తప్పక ఆ సమయంలో దగ్గర ఉండండర్రా..’ అని ఉంది. వాళ్లు అలా ఉత్తరాలు రాస్తేనే తప్పకుండా వస్తారని సెల్ ఫోన్ ఉపయోగించలేదు.. రామశాస్త్రిగారు.

ఆ రహస్యం తెలుసుకోవాలి అన్న ఉబలాటంతోనే వాళ్లంతా సెలవులు పెట్టడానికి ఏమాత్రం అవకాశం లేకపోయినా ఏదో ప్లాన్ వేసి సెలవులు పెట్టి వచ్చి ఈరోజుకి అప్పుడే నాలుగు రోజులు అవుతుంది.

అదే ఊరిలో ఎక్కడో చివర ఉంటున్న పెద్దబ్బాయి మాత్రం ప్రతిరోజు వస్తూ వెళుతూ ఉన్నాడు ఈ నాలుగు రోజులు నుండి తండ్రి మీద అత్యంత ప్రేమతో.

ఈరోజు ముసలాయన పరిస్థితి మరింతగా విషమించినట్లు ఉండడంతో ఫ్యామిలీ డాక్టర్ కూడా పెదవి విరిచెయ్యడంతో శాస్త్రిగారు ఈరోజు తప్పక పరలోక ప్రయాణానికి బయలుదేరతాడని ఇంట్లో వాళ్ళు అందరూ కచ్చితంగా నిశ్చయించేసుకున్నారు.

“పెద్దవాడి..తో సహా అందరూ ఉన్నారా.. నా సమయం అయి..పోయింది.. నేను మిమ్మల్ని అంద..రిని విడిచి పోతున్నా..నర్రా…” రామశాస్త్రి గారి మాటలు నీరసంగా, అస్పష్టంగా విన్న భార్య జానకమ్మ రోదిస్తూ ఆయన పాదాలపై పడి స్పృహ కోల్పోయింది.

దారిన పోయే దానయ్యలు వీధిలో ఎదురింటి అరుగు మీద కూర్చుని మాట్లాడుకుంటున్న మాటలు స్పష్టంగా వినపడుతున్నాయి లోపలకు.

***

“ఈ ముసలాడు చచ్చిపోయే ముందు ఏదో రహస్యం చెబుతానన్నాడట ఇంటి వారందరికీ.. అంటే నిధి ఎక్కడైనా దాచాడంటావా?” నవ్వేస్తూ అన్నాడు నాగముని.

“ఏమో ఎవరికి తెలుసు లంకెబిందెల విషయం ఏదైనా బయట పెడతాడేమో?” పెదాలు బారలు చాపి 32 పళ్ళు పూర్తిగా కనపడేలా ఇకిలిస్తూ అనేశాడు అప్పారావు.

“తన గదిలోనే ఎక్కడో లంకెబిందెలు దాచిపెట్టి ఉంటాడు.” భరతనాట్యం చేస్తున్నట్టన్నాడు నాంచారయ్య.

“ఈడి సిగతరగ నా ఉద్దేశం దొడ్లో ఎక్కడైనా పాతిపెట్టాడేమో.. ఈ ముసలోడు అని నానుమానం..” కించిత్తు అనుమానిస్తూనే అన్నాడు అనుమానలరావు.

“మొన్న ఆ రుద్రయ్యచౌదరి గారు.. అటక మీద పాత సామాన్లలో రెండు లంకెబిందెలు దాచేసాడు. చెప్పకుండా చచ్చాడు. ఈ రామశాస్త్రిగారుగారు చచ్చిపోయే ముందు రహస్యం చెబుతాను.. అన్నాడు.. అదీ సంతోషించదగిన విషయం.” బూరెలు మూకిడిలా పెదాలు మెలిపెట్టి అనేశాడు రుద్రయ్య.

“కాదా మరి ఆయన సంపాదన బ్రహ్మాండంగా ఉండేది. ఎన్ని పెళ్లిళ్లు, ఎన్ని వ్రతాలు, ఎన్ని పూజలు, ఎన్ని బారసాలలు, ఎన్ని గృహప్రవేశాలు, ఎన్ని తద్దినాలు లెక్క పెట్టగలమా?” ఏదో లెక్కపెడుతున్నట్టన్నాడు గురువయ్య.

“ఈ చుట్టుపక్కల ఈయన ఒక్కడే కదా మహా గొప్ప సిద్ధాంతి. రెండు చేతులతో కాదు నాలుగు చేతులతో ఎడాపెడా దున్నేసిన సంపాదన ఆయనది. లక్షల మీదే ఉండొచ్చు..” లక్షణంగా బుర్రవూపుతూ అన్నాడు అహోబిలం ముసలోడు.

“అందుకనే ఒక్క పెద్ద అబ్బాయిని తప్ప మిగిలిన అందర్నీ పై చదువులు చదివించి పెద్ద పెద్ద హోదా అయిన ఉద్యో గాల్లో పడేశాడు. ఆరు నెలల క్రితం ఇంటితో సహా మొత్తం ఆస్తి తన సంతానానికి పంచి పెట్టేసాడట..” కొత్త ఉపగ్రహం ఎక్కేసినట్టన్నాడు గండబీరుండం.

“పెద్దబ్బాయి కులం గాని అమ్మాయిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయాక వాడికి ఏమాత్రం ఖర్చు పెట్టలేదు సరికదా.. పెళ్ళాం జానకమ్మ మాట విని చిల్లి గవ్వ ఆస్తిని కూడా ఇవ్వలేదు పాపం.. ఈ రామశాస్త్రి” పరిశోదించినట్టన్నాడు శోధనరావు.

“పాపం.. ఆ పెద్దబ్బాయి బుద్ధిమంతుడో తెలియదు.. అమాయకుడో తెలియదు.” కళ్ళనీళ్లు రాలకపోయినా తుడుచుకుంటూ అన్నాడు తూర్పుకాపు.

అలా వీధిలో వాళ్లు మాట్లాడుకుంటున్న మాటల ధ్వని వల్ల రామశాస్త్రి గారు చెప్పబోయే రహస్యపు మాటలు సరిగా వినబడవు అని కాబోలు.. లోపల ఎవరో సింహద్వారం దగ్గరగా మూసేశారు.

అంత నీరసంలోనూ నోటి నుండి మాట సరిగా రాలేని ఆ చిట్ట చివరి దశలోనూ ఏదో చెప్పేయాలన్నట్లు తన బరువు దించేసుకోవాలన్నట్లు నోరు తెరిచారు రామశాస్త్రి గారు. బిలబిలమంటూ దగ్గరగా గుమిగూడారు ఆయన చుట్టూ ఇంట్లోని వాళ్ళు.. తులసి రసం పోయడానికి కాదు ఆ ముసలాయన చెప్ప బోయే ఆ రహస్యం వినడం కోసం.

దూరంగా నిలబడి ఉన్న పెద్దబ్బాయి మాత్రం ఈసారి కొంచెం దగ్గరగా వచ్చి పక్కనున్న తులసి రసం తండ్రి నోట్లో చెంచాతో మూడుసార్లు పోశాడు. వెంటనే కొంచెం దూరంగా వెళ్లి నిలబడ్డాడు. కాసే పటికి జానకమ్మ తెప్పరిల్లి తను కూడా మూడు సార్లు తులసి రసం పోసింది. శాస్త్రి గారు తృప్తిగా తులసిరసం గుటక వేసినట్లు అందరికీ అనిపించింది.

భార్య ముఖం చూస్తూ శాస్త్రి గారు ఆమె తన్మయం చెందేటట్టు తనకు తన భార్యకు మధ్య జరిగిన తొలి రాత్రి స్మృతులు గుర్తుకు వచ్చేట్టు చిన్నగా పెదవి విరుపుతో చిరుమందహాసం చేశారు. జానకమ్మ శరీరం కంపించి పోయింది.

***

శోభనం గది

“నీకు ఓ రహస్యం చెప్పాలనుకుంటున్నానోయి”

“ఏమిటండీ అది.” భర్త చేతిపట్టు తప్పించుకుంటూ సిగ్గుపడి కిలాకిలా నవ్వేస్తూ అంది జానకి.

“అది.. అది.. ఈ శృంగారసమయంలో.. ఇప్పుడు ఎందుకులే ఇప్పుడు కాదు. నేను చచ్చిపోయే ముందు ఘడియల్లో చెప్తాలే.” అన్నాడు రామశాస్త్రి.

“ఛీ ఈ సమయంలో అదేం మాటలండి ఏదైనా మంచి విషయం చెప్పండి. శృంగారం చెలరేగిపోయేల ఉండాలి.” మెలితిరిగిపోతూ అంది.. జానకి.

“దేవాలయంలో ఆరోజు నిన్ను మొట్టమొదటిగా చూసి నీ అందానికి ముగ్ధుడిని అయిపోయాను. నువ్వే నా రాణివి.. అని అనుకున్నాను. నిన్ను పెళ్లి చేసుకొని నీ అందాన్ని ఆస్వాదించలేక పోతే నా జన్మ చాలించాలనుకున్నాను.” శృగారస్నానం చేస్తున్నట్టన్నాడు రామశాస్త్రి.

“మళ్లీ ఏమిటా మాటలు.. మీ భార్యనయ్యాక కూడా ఎందుకు నన్ను అలా వర్ణిస్తారు?”

“శాస్త్రాలన్నీ బట్టీయం పట్టానుగా.. నీ అందాన్ని వర్ణించకుండా ఉండలేకపోతున్నాను. అసలు ఏ మంత్రం రాని ఒంటరి అయిన నాకు మీ వాళ్ళు నిన్ను ఇచ్చి పెళ్లి చేయటం చిత్రం కదూ.”

“పెళ్లికి ముందు మా వాళ్ళు మాటవరసకు అన్నారని పెద్దల ముందు ప్రతిజ్ఞ చేసి రెండు సంవత్సరాలు నాకు దూరంగా ఉండి కఠోరదీక్షగా మంత్రాలన్నీ నేర్చుకొని వచ్చి నన్ను పెళ్లాడారు. చాలా గొప్ప ఘనకార్యమే కదా అది. ఆ రెండు సంవత్సరాలు మీరు కనిపించనప్పుడు నేను ఎంత బాధ పడ్డానో తెలుసా మీకు.” తపిస్తున్నట్లన్నది.

“ఈ రాణి గారిని పొందడం కోసం తప్పలేదు మరి.. లేక పోతే అష్టావధాని పరమేశ్వరంగారు మా ముత్తాత గారే అని ఎంత చెప్పినా మీ వాళ్ళని నమ్మించలేకపోయాను. ఎంతోమంది పరమేశ్వరాలు ఉంటారు. అందులో ఎవరు..? అంటూ ప్రశ్నించారు. మా వాళ్లు రైలు ప్రయాణంలో చచ్చిపోయినప్పుడు కూడా నేను బాధపడలేదు. నువ్వు నాకు దక్కవేమోనని మాత్రం చాలా బాధపడ్డాను. భయపడి మీవాళ్లు శాసించిన మీదట పెళ్లికి ముందే శాస్త్రాలన్నీ చదివి మంత్రాలన్నీ నేర్చుకొని నీకోసం ధైర్యంగా వచ్చాను. సరే నా మీద నీకు ప్రేమ ఉంది కనుక నా కోసం ధైర్యంగా ఉండిపోయావు కనుక మనిద్దరం ఒకటయ్యాం. ఈ క్షణం వరకు నీకోసం నేను ఎంత తపించిపోయానో తెలుసా?” విరహవేదనతో మాట్లాడాడు రామశాస్త్రి.

“అంటే ఇక ముందు నాకోసం తప్పించరన్నమాట..” మూతి మూడు వంకర్లు తిప్పుతూ అన్నది జానకమ్మ.. శృంగారం ముందుకు ఒలకబోస్తూ.

“అలా అనకు జానకి నీ మోములో వేయి చందమామల వెలుగు ఉంది. ఈ రామశాస్త్రి నీకోసం ఎప్పుడూ జీవితం చివరి క్షణం వరకు తపిస్తూనే ఉంటాడు.. పరితపిస్తూనే ఉంటాడు.”

“ఈ పరితపించడాలు, ప్రేమలు నాకెందుకు బాబు. పంచాంగం చేతపుచ్చుకొని రేపటి నుండే మీరు మా తండ్రిగారి కూడా వెళ్లాలి. మా తండ్రిగారిలాగే మీరు కూడా ఈ ఊర్లో, చుట్టుపక్కల మంచి పేరు సంపాదించి నన్ను పోషించగలగాలి. మన పిల్లలను గొప్ప వాళ్లను చేయగలగాలి. అంతే కాదండోయ్ శ్రీవారు.. నాలుగు డబ్బులు వెనకేయగలగాలి.” అజ్ఞాపించిoది జానకి.

“దేవి గారి ఆజ్ఞ.”

“మరో ముఖ్యమైన మాటండి.. ఆచారం అంటే మా కoదరికీ ఎనలేని ఇష్టం. నాకు మరీను. వల్ల మాలిన అభిమానం. నిజం చెప్పాలంటే ఈ శ్రీవారు కన్నా.. ఆచారాన్ని నేను ఎక్కువగా ప్రేమిస్తాను. ఇప్పుడు బాగా అర్థమైందా మీకు. అందుచేత మీరు బయటకు వెళ్లి వచ్చిన ప్రతిసారి దొడ్డి గుమ్మం దగ్గర చల్లని బావినీళ్లతో మా తండ్రిగారిలాగే తలస్నానం చేసి మరీ లోపలకు రావాలి.”

“ఏమిటి చలికాలంలో కూడా చల్లని నీళ్లతో నేనా..” భయపడుతున్నట్టు అన్నాడు రామశాస్త్రి.

“అలా కాకపోతే ఈరోజు నుండే మీ దారి మీది నా దారి నాది” అన్నది కొంచెం దూరంగా జరిగిపోతూ జానకమ్మ.

“దేవి గారి ఆజ్ఞ తప్పదుగా..” అంటూ రామశాస్త్రి ఆమెను ఒడిసి పట్టుకున్నాడు కదలకుండా.

ఇవి ఆ దంపతుల గత స్మృతులు.. ఆ మొదటి రాత్రి జ్ఞాపకాలు అలా గుర్తుకు వచ్చాయి జానకమ్మకు అలా అలా అలలా..

***

ఆ తర్వాత పెద్ద అబ్బాయి సత్యం పెళ్లి సమయం గుర్తు వచ్చింది జానకమ్మకు.

“కూర్చో జానకి, మన పెద్దబ్బాయి పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నాను.”

“ఏమండీ మా తమ్ముడుగారు అమ్మాయి లలిత డిగ్రీ. మనవాడు డిగ్రీ పూర్తి చేశాడు. ఇద్దరికీ సరిపోతుందని నా అభిప్రాయం. సరే మీ అభిప్రాయం ఏదైనా ఉంటే చెప్పండి”

“అడిగావు కనుక చెప్తున్నాను నా ఫ్రెండ్ వెంకట శాస్త్రికి ఒక అమ్మాయి ఉంది. రంభ లాగా ఉంటుంది. తల్లి లేని పిల్ల. వాడు కట్నాలు ఇచ్చి పెళ్లి చేసే స్థితిలో లేడు. ఆ విషయం నా దగ్గర ప్రతి రోజు చెబుతూ బాధపడుతుంటాడు. అందుకనే మనవాడికి ఆ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే ఒక కుటుంబం నిలబెట్టినట్టు అవుతోందని.. నా అభి ప్రాయం. ఆహా అలాగని బలవంతంగా ఆ పిల్లనే చేయాలని నా అభిప్రాయం కాదు. నువ్వు వద్దు అంటే మానేస్తాను. నీకు ఇష్టంలేనిది ఏది నేను చేయనని నీకు తెలుసుకదా..”

“‘నేను మాత్రం ఈ 22 సంవత్సరాల నుండి మీ మాటకు ఎదురు చెప్పానా”

“ఇదంతా ఎందుకు అబ్బాయి మనసు తెలుసుకుంటే సరి కదా.”

“అడుగో వస్తున్నాడు. రా బాబు సత్యం.. ఇలా కూర్చో ఒకసారి నీతో నీ పెళ్లి విషయం మాట్లాడాలి రా. అమ్మ ను అడుగుతున్నాను.. ఇప్పుడు..”

“చెప్పద్దమ్మ. నేను అంతా విన్నాను. నేను మేరీని ప్రేమించాను ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను. లేకపోతే నేను బ్రతకను. ఊరిపోసుకొని చావడం ఖాయం. ఇప్పుడు చెప్పమ్మ.. కూర్చోమంటావా?” నిబ్బరంగా చెప్పేశాడు పెద్దకొడుకు సత్యం.

జానకమ్మ తల గిర్రుని తిరిగిపోయింది. తాను అశుద్ధపు ఊబిలోకి పూర్తిగా కూరుకుయినట్లు అనిపించింది.

పెద్దకొడుకు సత్యం తల్లి కళ్ళ నుండి వచ్చే వేడి వాడి సెగలను చూసి తట్టుకోలేకపోయాడు.

రామశాస్త్రిగారు దూరంగా నిలబడి చూస్తున్నారు భార్య స్పందన కోసం.

“ఒరేయ్ దుర్మార్గుడా..” అంటూ జానకమ్మ ఒక్కసారిగా ఉరికి కొడుకు జుట్టు పట్టుకుంది. కసిగా చెంపలు వాయించింది.

“నీ తల్లి తండ్రి చచ్చిపోయారనుకోరా. ఎంత ధైర్యం నీకు. మా ఎవరితోనూ ఇక నీకు సంబంధాలు ఉండవు. మగాడివైతే ఈ ఆస్తి గురించి కూడా ఆలోచించకు. బయటకు పో. ఇలాంటి వాడివి అవుతావని తెలిసి ఉంటే నువ్వు పుట్టిన వెంటనే నీ పీక నలిపి చంపి ఉందును. ఇంత పాపిష్టి వాడివి అవుతావని ఊహించి ఉంటే నా చనుబాలు పట్టి ఉండేదాన్ని కాదురా.. దుష్టుడా.” జానకమ్మ అక్క డున్న బిందెడు నీళ్లు తలపై పోసేసుకుంది.

“మన పెద్దబ్బాయి సత్యం ఈరోజు చచ్చిపోయాడండి. వాడు వదిలిన గాలి మీరు ఎవరైనా పీల్చితే అలా పీల్చిన వాళ్ళందరూ నా దృష్టిలో చచ్చిపోయినట్టే.” భర్తవైపు, అక్కడ గుమికూడిన మిగతా కుటుంబ సభ్యుల వైపు శాసించినట్టు భయంకరంగా చూసి జానకమ్మ మండుతున్న అగ్నిగుండంలా లోపలకు వెళ్ళిపోయింది. రామశాస్త్రి గారు పెదాలు కదపలేకపోయారు ఆ క్షణం.

భర్త చిట్ట చివరి ఘడియల చిరు మందహాసపు మోము చూశాక.. దూరంగా నిలబడిన పెద్ద కొడుకు ముఖం చూశాక ఈ జ్ఞాపకం కూడా జానకమ్మ స్మృతి పథంలో మెదిలింది.

***

తర్వాత.. ఆమె మదిలో షష్టిపూర్తి మహోత్సవపు శుభసమయం కూడా కదలాడింది.

రామశాస్త్రి గారి ఇల్లు రంగరంగ వైభవంగా అలంకరింపబడి ఉంది. బంధువర్గం, స్నేహితులు, ఊరి పెద్దలు బారులు తీరి కూర్చున్నారు. సుగంధ పరిమళాలు.. వేదమంత్రాలు.. కన్నెపిల్లల సిగ్గులు మొగ్గలు కలగలిపిన సమయం అది. ఆ శుభ ఘడియలలో రామశాస్త్రి దంపతులు చాలా ఆనందగా ఉన్నారు.

రామశాస్త్రిగారు వణుకుతున్న చేతులతో ఊగుతున్న జానకమ్మ మెడలో స్వర్ణసూత్రధారణ అందరికి కనువిందు అయింది. షష్టిపూర్తి మహోత్సవానికి వచ్చిన అందరూ విందులో పాల్గొని వెళ్లిపోయారు.

రాత్రి.. సుగంధ భరితంగా అలంకరింపబడిన గదిలో రామశాస్త్రిగారు మంచం మీద కూర్చుని మౌనంగా రోదిస్తున్నారు. పాల గ్లాసుతో తలుపు తోసుకుని వెళ్లిన జానకమ్మ భర్త ముఖం చూసి ఆశ్చర్య పోయింది.

“ఆనాడు పెద్దబ్బాయి చేసిన చండాలపు పని గురించేనా మీ బాధ. ఆ పీడ వదిలింది కదా.” అడిగింది భర్త పక్కన కూర్చుంటూ.

“కాదు నా బాధకు కారణం అది కానే కాదు.”

“మరి. దాస్తున్నారేమిటండీ. ఇన్నాళ్ళ కాపురంలో కూడా ఎందుకీ దాపరికాలు. నాకు తెలుసు మీరు చెప్పటంలేదు కానీ వాడి గురించే మీరు బాధపడుతున్నారు. ఆ అప్రాచ్యుడు నా దృష్టిలో ఎప్పుడో చచ్చిపోయాడు.. మీరు కూడా అదే ధ్యాసలో ఉంటే ఈ బాధ ఉండదు కదా మీకు.”

..ఈసారి రామశాస్త్రి గారు తల పైకి ఎత్తారు.. కళ్ళలోంచి నీళ్లు ధారా పాతంగా కారుతున్నాయి. ఆ క్షణం జానకమ్మ హృదయం చలించిపోయింది తన కొంగుతో భర్త కళ్ళు తుడిచింది. రామశాస్త్రిగారు

భార్య కళ్ళల్లోకి ప్రేమగా చూసారు. కానీ అమాయకంగా కనిపిస్తున్న ఆమె వదనం ఎక్కువసేపు చూడలేక పోయారాయన.

“జానకి మన పెళ్లి అయిన దగ్గర నుండి నీకు ఒక రహస్యం చెప్తానని అంటూ వస్తున్నాను కదా.”

“మొదటి రాత్రి నుండి ఇలాగే అంటున్నారు. ఏమిటండి అది ఇప్పుడు చెప్పేస్తారా?”

“అంటే.. అది అది.. వద్దులే.. నేను చచ్చిపోయే ముందు క్షణం చెప్తా అన్నాను కదా అప్పుడే చెప్తాను.” అంటూ రామశాస్త్రి గారు చరచరా హాలు లోకి వెళ్లిపోయారు ఆ షష్టిపూర్తి నాటి రాత్రి.

ఇప్పటిలా రామశాస్త్రి గారు ఒంటరిగా కూర్చుని తనలో తాను ఏదో తప్పు చేసినట్టు బాధపడటం.. చాలాసార్లు గమనించింది జానకమ్మ. పెద్దబ్బాయి విషయం కాకపోతే దేని గురించి ఆయన బాధ..

ఎప్పుడో ఆయన చెప్పబోయే రహస్యానికి ప్రస్తుతం ఆయన పడుతున్న మనోవేదనికి సంబంధం ఏదైనా ఉందా..? అదేమిటో ఇంతవరకు తెలుసుకోలేక పోయింది జానకమ్మ.

***

షష్టిపూర్తి తర్వాత రామశాస్త్రి గారు ఊరందరికీ పెద్ద మనిషి హోదా బాధ్యతలో వెలిగిపోయారు. తగవులు, తీర్పులు ఆయనే తీర్చాలి. ఆయన ఎన్నో ప్రజల సమస్యలు శ్రీకృష్ణదేవరాయలు వలే పరి ష్కరించేవారు. ఆ రోజుల్లో పౌలు సంఘటన ఎంత మధురమైన జ్ఞాపకం అది..

“బాబు గారు నాను బాబు పౌలుని.”

“నువ్వుటరా గోడవతల నిలబడ్డావే కొంచెం ముందుకు రారా పౌలు.”

“వద్దు బాబు అమ్మగారు ఒప్పుకోరు గందా. ఆవిడ గారికి మడి తడి శానా ఎక్కువ నా ఇసయం ఏమిటంటే.. కడుపులోంచి పేగులు తెగి బయటపడే లాంటి ఇసయం జరిగిందయ్యా. ఇదిగో ఈ ఎదవ నా కొడుకు బాబు. టౌన్‌లో సదువుకుంటూ.. అదిగో బాబు ఆ సెట్టు కాడ నిలబడింది సూడండి ఆ పిల్లని అదే బాబు మీ కులపోల్ల పిల్లని పేమించి కూడా అట్టుకొచ్చేసాడు బాబు. ఆ పిల్ల కూడా వచ్చేసింది. ఏం సెయ్యాలో బద్ధంత కూడా అర్థం కావడం లేదయ్యా. పెల్లి సేయకపోతే ఉరోసుకొని సచ్చిపోతాం అంటున్నారు ఈల్లిద్దరూ.. నన్ను ఏం సేయమంటారు బాబు.. ముందు నన్ను సచ్చిపోమంటారా..?” నమస్కారం పెడుతూ అన్నాడు పౌలు.

రామశాస్త్రిగారు చిన్నగా నవ్వుకున్నారు.

“ఏవోయ్.. పౌలు నీది చాలా చిన్న సమస్య రా. ఒక్క క్షణం ఆగు..” అంటూ.. పౌలు కొడుకుని పిలిచి.. “అబ్బాయి ఆ అమ్మాయి వాళ్ళది సాంప్రదాయబద్ధమైన కుటుంబం లాగున కనిపిస్తుంది. మరి నువ్వు వాళ్ళ ఆచారాలు కట్టుబాట్లు అన్ని సంపూర్ణంగా నేర్చుకోగలవా.” అంటూ ప్రశ్నించాడు.

“అది నాకెలా సాధ్యం అవుతుందండీ. అవన్నీ నేర్చుకోవాలంటే నాకు ఈ జన్మ సరిపోదు. ఇక కాపురం ఎట్టా చేసేది.?” అంటూ తల అడ్డంగా తిప్పేశాడు.. ఆ అబ్బాయి.

“అదన్నమాట విషయం బాగుందిరా.. సరే టౌన్ నుంచి వచ్చిన ఆ పెళ్లికూతురని అడుగుదాం.. అమ్మాయి ఇలా రా.. పౌలు గారు కుటుంబానికి సంబంధించిన వాళ్ళ ఆచార వ్యవహారాల పోనీ నువ్వు అలవాటు చేసుకోగలవా..” ప్రశ్నించాడు ఆ అమ్మాయి వైపు చూసి.

“నాకు కుదరదండి మావి తరతరాలుగా పేరెన్నిక పొందిన అగ్నిపుట్టం లాంటి కుటుంబాలు. మా తాతగారు ఎవరో తెలుసా భమిడిపాటి అగ్నిహోత్రావధానులు గారు..” అంది గట్టిగా ఆ అమ్మాయి.

“సరే మరి మీ ఇద్దరిదీ ఎలాంటి ప్రేమ. ఆకర్షణ కదూ. బాగా ఆలోచించుకుని ఎవరో ఒకరు రాజీ పడలేరా..?” ప్రశ్నించాడు ఇద్దరి వైపు చూసి రామశాస్త్రి గారు.

అంతే ఆ అమ్మాయి వెంటనే తన ఊరు వెళ్లడానికి బస్సు ఎక్కేసింది తెగతెంపులు చేసుకుని. ఆ అబ్బాయి మరో బస్సు ఎక్కేశాడు ఆ ప్రేమ ముక్క చెక్కలు చేసుకొని తను చదువు కొనసాగించడం కోసం.

రామశాస్త్రి గారికి దూరం నుండే నమస్కరించి పౌలు ఆనందంగా ఇంటికి వెళ్లిపోయాడు.

అది అది ఎంత గొప్ప సమస్యాపరిష్కారం.

ఇదే కాదు ఇలాంటి ఎన్నో గొప్ప మధుర స్మృతులు భర్త ఆ చట్ట చివరి ఘడియలలో ఆయన తనను చూసి చేసిన చిరు మందహాసంలో ఆమెకు గుర్తు వచ్చాయి.

***

గతం గడిచిపోయింది.. ప్రస్తుతం.. శాస్త్రిగారి తుది శ్వాస సమయం నడుస్తుంది.

రామశాస్త్రిగారి పరలోక ప్రయాణానికి సమయం బాగా దగ్గర పడుతున్నట్టుగా ఉంది అక్కడి వాతావరణం. కొంచెం తల పక్కకు తిప్పి దూరంగా నిలబడిన పెద్దబ్బాయి సత్యం వైపు చూసి దగ్గరకు రమ్మని ప్రేమగా పిలిచినట్టు అనిపించింది అందరికీ. కానీ అతనిని రానివ్వకుండా అతనికి ఆ అవకాశం ఇవ్వకుండా మిగిలిన వాళ్లు కొంచెం దగ్గరగా వంగి ఆయనని పైకి లేవదీశారు.

చేతులు ఊపి భార్యను మరింత దగ్గరకు రమ్మని సైగ చేసి.. ఆమె ముఖం తేరిపార చూసి.. పిచ్చి దానా అమాయకపుదాన అన్నట్టు నవ్వినట్టు పెదాలు కొద్దిగా మెలితిప్పారు.

“నాన్నగారు.. మీరు ఏదో రహస్యం చెబుతానన్నారు.. మాట్లాడండి..” మంచం చుట్టూరా మూగి ఉన్న అందరూ అడిగారు. సత్యం మాత్రం దూరంగా నిలబడి గుక్కపట్టి ఏడుస్తున్నాడు.

శాస్త్రిగారు నేత్రాలు రెండు పెద్దవి చేసుకున్నారు. ఆ నేత్రాలు రెండు సూర్యగోళ జ్ఞాననేత్రాల వలె మెరిసి పోతున్నాయి. బలంగా మెడ నరాలను కూడా తీసుకుని చుట్టూరు ఉన్న ఒక్కొక్కరిని తేరిపార చూశారు.

“నాన్నగారు బాగా తెలివిలోకి వచ్చారు.. ఇప్పుడు ఆ రహస్యం చెప్పేస్తారు. మనందరం లాభపడే విషయమే అయి ఉంటుంది కదా. వినండి బాగా వినండి.. జాగ్రత్తగా అక్షరం అక్షరం వినండి. రెట్టించి అడిగితే చెప్పలేరు జాగ్రత్తగా వినండి..” అన్నట్టు సైగ చేసుకుంటూ వాళ్ళందరూ ఆయనకు దగ్గరగా చెవులు పెట్టారు.

శాస్త్రిగారు పెదాలు కదిపారు.. అందరూ పొంగిపోతున్నారు.

శాస్త్రిగారు తన మెడను నెమ్మదిగా ఇటు తిప్పి దూరంగా ఏకాకిలా నిలబడిన పెద్ద కొడుకును మరింత దగ్గరకు రమ్మన్నట్టు మళ్లీ వేళ్ళు ఊపారు.. సత్యం ఏడుస్తూ వచ్చి తండ్రి దగ్గరగా నిలబడ్డాడు.

ఆ చిట్ట చివరి ఘడియలలో సైతం చాలా ప్రయత్నించి శాస్త్రిగారు తల్లి కొడుకుల చేతులు కలిపారు.. జానకమ్మ విసురుగా తన చేతిని వెనక్కు లాగేసుకుంది.

శాస్త్రిగారు నోరు బాగా విప్పారు. కానీ ఆయన నోట్లోంచి శబ్దం రావడం లేదు అందరికీ ఆత్రుత పెరిగిపోతుంది. మళ్లీ ఆయన పెదాలు మూసుకుపోయాయి. చుట్టూ మూగిన అందరికీ మళ్లీ ఆదుర్దా పెరిగిపోతుంది ఆయన ప్రాణం నిలబడాలని కాదు, పోవాలని కాదు.. ఆయన చెప్పబోయే ఆ తుది రహస్యం గురించి.

శాస్త్రిగారు పెదాలను విప్పాలని మళ్లీ తెగ ప్రయత్నించి.. ప్రయత్నించి అతి బలవంతంగా శబ్దాన్ని రప్పించుకోగలిగారు.

“ర హ స్యం.. జాగ్ర.. త్తగా విను జా..న కీ.. నేను అస..లు.. శా..స్త్రి..ని కాదు.. నేను.. పుట్టుక..తో.. డే..వి..డ్..ను.”

అంతే.. డేవిడ్ శాస్త్రి గారి మెడ ఒక పక్కకు ఒరిగిపోయింది.

Exit mobile version