Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

వైద్యో నారాయణో హరిః

అందమైన ఆకాశం. అందులో మరింత అందంగా చంద్రుడు. పౌర్ణమో అదేదో నాకు తెలీదు. చక్కటి అందమైన వెన్నెల నా చుట్టూ పరచుకుంది. ఈ అందానికి నేనే కారణం అన్నట్లు చెట్టు కొమ్మల సందులోంచి రేరాజు గర్వంగా చూస్తున్నాడు. అసలు పుట్టి పెరిగిన తర్వాత వెన్నెల అందాన్ని ఎప్పుడు ఇంతగా చూసిన గుర్తులేదు. ఆ వెన్నెల అందాన్ని నేను పూర్తిగా, ఆస్వాదించనే లేదు. “తమరింక భోజనం చెయ్యండి బాబు. ఇవి శుభ్రం చేసి నేను ఎల్లిపోతాను” అన్నాడు గంటయ్య. “చాలా లేటయ్యింది, నువ్వెళ్ళు గంటయ్యా. మేం తింటాంలే” అన్నాను. “ఉంటాలే బాబు తవరు తిన్నాక అవన్నీ శుభ్రం చేసి ఎల్తా. తవరు మా ఊరికింతజేస్తుంటే, నేను ఈ మాత్రం చెయ్యకపోతే ఎట్టా?” అంటూ అక్కడే చతికిలపడ్డాడు గంటయ్య. “బాబు తవరు మా ఆడోళ్ళకిచ్చిన బలం బిళ్ళలు శానా బాగా పనిచేశాయి. దాని నీరసం తగ్గి ఇయాల పనిలోకెల్లింది. ఊళ్ళో అందరు తమరి గురించే చెప్పుకుంటున్నారు బాబు. ‘డాక్టరుబాబు మనూరు రాకపోతే మన బతుకులు ఎట్టా తెల్లారేవో’ అని. తమరు దేవుళ్ళు బాబు. ఈ వానలకు ఊరంతా ఒకటే జరాలు. తవరిచ్చే మందులతో మంత్రం ఏసినట్టే మాయమవుతున్నాయి” అని చెప్పుకుపోతున్నాడు గంటయ్య. “సరే సరే ఆపు నీ పొగడ్తలింక” విసుగ్గా అన్నాను నేను. “పొగడ్డం కాదు బాబు ఉన్నమాటే” అంటూ మళ్ళీ మొదలుపెట్టాడు గంటయ్య. “నువ్విలా పొగుడుతుంటే మేమింక ఇక్కడే ఉండిపోవలసి వస్తుంది. సరే సరే బయలుదేరింక” అన్నాను. “దండాలు బాబు, ఎళ్ళొస్తా” అంటూ వెళ్ళిపోయాడు గంటయ్య. మెడిసిన్ పూర్తిచేసి డాక్టర్ అవబోతున్న మమ్మల్ని కాలేజీ వాళ్ళు మెడికల్ క్యాంప్ కోసం పల్లెటూళ్ళకు పంపారు. నేను, నా స్నేహితుడు వినయ్ ఈ ఊరొచ్చాం. చుట్టుపక్కల ఊళ్ళలో సర్వే చేసి అవసరమైతే మందులు ఇవ్వాలి. మాకు కావలసిన పనులు గంటయ్య చేస్తుంటాడు. “అదేంటి గంటయ్యా, ఈ ఊళ్ళో డాక్టర్ లేడా?” అంటే “ఉన్నారు బాబు, జెండా చెట్టు దగ్గర నారాయణ, రాములవారి గుడి దగ్గర యాదగిరి ఇద్దరు డాక్టర్లు బాబు” అన్నాడు. గంటయ్య అమాయకత్వానికి నవ్వొచ్చింది నాకు. “అయితే వాళ్లకు సూదిమందెయ్యడం తెలుసు. మీలాగా మందుబిళ్ళలియ్యడం తెలియదు” అన్నాడు. “తమరీ ఊళ్ళోనే ఉండిపొండి బాబు మాకు బాగుంటుంది” అంటాడు గంటయ్య.

విరామం లేకుండా వస్తున్న ఆలోచనలను ప్రక్కన పెట్టి “వినయ్ డిన్నర్ చేద్దాం రా” అని పిలిచాను. “నాకు ఆకలిగా లేదు. నువ్వు తిను” అన్నాడు ముభావంగా వినయ్. “ఏమైంది వినయ్! ఎందుకలా ఉన్నావు?” అని అడిగాను. “ఏమవ్వాలి? ఇంతకంటే ఇంకేం కావాలి? ఇద్దరం కలిసి మెడిసిన్ పూర్తి చేశాం. ఒక పెద్ద హాస్పిటల్లో డాక్టర్లుగా ఎదగవలసిన మనం ఇక్కడ ఇలా ఉన్నామంటే కోపం రాక ఏమవుతుంది? ఎలాగొలా పూర్తిచేద్దామంటే పేదలు, సేవ అంటూ నెల రోజులు గడిపేశావు. ఏముందీ ఊళ్ళో? మట్టి, మురికి తప్ప. కనీసం మనకు కావలసిన భోజనం కూడా సరిగా దొరకడం లేదిక్కడ” అంటూ ఆవేశంగా చెప్పుకుపోతున్నాడు వినయ్. వినయ్ మాటలకు నేను అడ్డు తగులుతూ “వర్షం పంట పొలాలమీద కురిస్తే ఉపయోగం కాని సముద్రం మీద కురిస్తే ఏం ఉపయోగం? మన అవసరం ఈ అమాయకులకే గాని ధనవంతులకు కాదు. ‘న్యూటన్, ఐన్‍స్టీన్ అందరు కాలేరు. కానీ మనసున్న మనుషులంతా మదర్ థెరిస్సాలు కాగలరు’ అని ఎక్కడో చదివాను. అసలు డాక్టర్ చెయ్యాల్సిందేంటో ఈ నెలరోజుల్లో నాకు అర్థమైంది. మనం కాకపోతే వీళ్ళనెవరు ఆదుకుంటారు చెప్పు” అన్నాను. “బాబోయ్ నేను రేపే బయలుదేరి వెళ్ళిపోతాను. ఆ సేవా కార్యక్రమాలేవో నువ్వే చూసుకో. ఇవన్నీ నేను రాజీపడలేను. నన్ను క్షమించు ఫ్రెండ్” అంటూ వినయ్ నిద్రలోకి జారుకున్నాడు.

నాకు నిద్ర రావడం లేదు. ఆ రోజు పేపర్ తీసి ఓసారి తిరగేస్తూ కూర్చున్నాను. పేపర్ ఓ మూల ఓ చిన్న వార్త నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఓ వృద్ధుడు ఎటువంటి ఎక్సరే, స్కానింగ్ లేకుండానే పెద్దపెద్ద రోగాలకు చికిత్స చేస్తున్నాడు. అతను చేసే ప్రకృతి వైద్యంతో అనారోగ్యం దూరమవడమే కాకుండా నూతనోత్సాహం కలుగుతుందట. ఆ డాక్టర్ ఫోటో కూడా వేశారు. వినయ్‍ని నిద్ర లేపాను. “ఓసారి ఇది చూడు వినయ్ లే, లే” అంటూ వినయ్ కూడా వార్త చదివాడు. “అద్భుతం కదా! చుట్టూ దట్టమైన అడవి ప్రాంతం. ప్రతిభావంతమైన క్షేత్రం ఋషికేశ్ సమీపంలో ఉంది ఈ ప్రకృతి వైద్యాలయం. ఇలాంటి వాళ్ళు చాలా చోట్ల ఉంటారు. నాకు నిద్ర వస్తోంది నేను పడుకుంటున్నాను. వివేక్ నువ్వు పడుకో” అన్నాడు వినయ్. ‘లేదు వినయ్ ఇది అలా లేదు. పెద్ద పెద్ద రోగాలను ఆకు, అలములతో కుదర్చడం వండర్‌ఫుల్ కదా! ఈయన గురించి తప్పకుండా తెలుసుకోవాల’ని అనుకుంటు నిద్రలోకి జారుకున్నాను.

మర్నాడు డ్యూటీ పూర్తి చేసుకుని అప్పుడే కూర్చున్నాను. ఇంతలో నాన్న ఫోన్ చేశారు. “వివేక్, నీతో మాట్లాడాలి” అన్నారు. “చెప్పండి నాన్నా” అన్నాను. నాన్న నేను రోజూ ఫోనులో మాట్లాడుకుంటున్నాం కానీ నాన్న ఇప్పుడిలా మాట్లాడాలి అని అనడం నాకు కొంచెం ఆశ్చర్యం అనిపించింది. “వివేక్! నువ్వు ఊరు వెళ్ళినప్పటి నుండీ నీతో ఈ విషయం మాట్లాడాలనుకుంటున్నాను. నన్ను దోషిగా చూస్తావనే భయంతో చెప్పలేకపోయాను. కానీ ఇంకొక పదేళ్ళ తరువాత నువ్వు నాలా బాధపడకూడదని చాలా ఆలోచించి నీకీ విషయాన్ని చెప్పాలని నిర్ణయించుకున్నాను. ఈరోజు పేపర్ చూసే వుంటావు. అందులో ఋషికేశ్ సమీపంలోని ఒక ప్రకృతి వైద్యుడి గురించి వార్త వచ్చింది. నువ్వు చదివే ఉంటావు. అతనెవరో కాదు నాతో కలిసి హాస్పిటల్లో పనిచేసిన కృష్ణమూర్తి. నా క్లాస్‍‌మేట్, స్నేహితుడు కూడ. మేమిద్దరం డాక్టర్లుగా చాలా సవాళ్లను ఎదుర్కొన్నాం. సంఘంలో మంచి డాక్టర్లుగా పలుకుబడి, చేతినిండా డబ్బు విందులు, వినోదాలు జీవితం పూలపాన్పుగా ఉంది. అలాంటి సమయంలో ఇద్దరం కలిసి ఒకతనికి ఆపరేషన్ చేయవలసి వచ్చింది. వాళ్ళు చాలా పేదవాళ్ళు. డబ్బు ఇచ్చుకోలేరని తెలిసీ కొన్ని లక్షలు వసూలు చేశాం. ఇది మాకు చాలా తేలిక అని ధీమాతో ఆపరేషన్ చేశాం. కానీ అది సక్సెస్ కాక అతను మంచాన పడ్డాడు. అతని భార్య మా కాళ్ళమీద పడింది. ‘ఏదైనా చేసి నా భర్తను కాపాడండి’ అంటూ ఏడ్చింది. అతను పనిచెయ్యకపోయే కుటుంబానికి ఆధారం లేదని ఎలాగైనా కాపాడమని వేడుకుంది. వాళ్లంతా హాస్పిటల్ ముందు పెద్ద గొడవ చేశారు. మా పరపతి ఉపయోగించి వాళ్ళ నోరు నొక్కేశాము. వాళ్ళ డబ్బు తిరిగి ఇచ్చేద్దామన్నాడు కృష్ణమూర్తి. నేను ఒప్పుకోలేదు. ‘తప్పు నీదే’ అని చెబుతున్నా నా అంతరాత్మ నోరు నొక్కేశాను. నా అహం ముందు కృష్ణమూర్తి నిలువలేకపోయాడు. ‘డాక్టర్లకు ఇలాంటి పొరపాట్లు తప్పవు’ అని అతనికి నచ్చచెప్పాను. మేమిద్దరము చాలా ఆత్మ సంఘర్షణకు లోనయ్యాము. నేను కొంతకాలనికి మామూలు జీవితానికి అలవాటుపడిపోయాను. కృష్ణమూర్తి అపరాధభావంతో హాస్పిటల్‍కి రావడం మానేశాడు. ‘జయాపజయాలు దైవాధీనాలు. మనం నిమిత్తమాత్రులం’ అనే నాకే తెలియని వేదాంతాన్ని చెప్పాను. అతన్ని వచ్చి డ్యూటీలో జాయినవ్వమన్నాను. నెలరోజులు ఎదురుచూశాను అతనికోసం. అతను రాలేదు. ఇల్లు వదిలి వెళ్ళిపోయాడని తెలిసింది. అతనొక్కడే పాపం చెయ్యలేదు. ఆ పాపంలో నాకూ భాగం ఉంది. కానీ నా కుటుంబం దృష్టిలో, సమాజం దృష్టిలో దోషినవడం నాకు ఇష్టం లేదు. అందుకే ఎవరికీ తెలియనివ్వలేదు. నా స్నేహితుడు నాకు రోజు గుర్తుకొస్తూనే ఉన్నాడు. దాదాపు రెండేళ్ళ తర్వాత కృష్ణమూర్తి నుండి నాకు ఫోన్ వచ్చింది. ఇంటినుండి వెళ్ళి అతను చాలా ఊళ్ళు తిరిగాడట. అలా తిరుగుతూ పవిత్రక్షేత్రం ఋషికేశ్ చేరుకున్నాడట. అక్కడ ఒక యోగి చేసిన బోధన వల్ల కొంత శాంతి లభించిందని, వదిలేసిన వైద్యాన్ని తిరిగి మొదలుపెట్టానని చెప్పాడు. కొంతమంది విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నట్లు చెప్పాడు. అనుకున్నది సాధించాడు కృష్ణమూర్తి. గాయపడ్డ అతని మనసును ప్రకృతి సేదదీర్చింది. అతని మాటల్లో సంతృప్తి కనిపించింది నాకు. నాన్నా వివేక్! నువ్వొకసారి వెళ్ళి నా స్నేహుతుడిని కలిసి అతని ఆశయంలో భాగం పంచుకోవాలి. నేను చేసిన తప్పు నువ్వు చెయ్యకూడదు. నీ తెలివితేటలను, నా స్నేహితుని అనుభవంతో జోడించి దేశం కీర్తించే గొప్ప డాక్టర్‍గా నువ్వు ఎదగాలి. నాలోని మానసిక సంఘర్షణకు అది జవాబు అవుతుంది. ఆలోచించు, మరి ఉంటాను” అంటూ ఫోన్ పెట్టేశారు నాన్న.

నాన్న చెప్పిన విషయం చాలాసేపు ఆలోచించాను. నాన్న మనసులో ఆవేదన నాకర్థమైంది. అందుకే ఋషికేశ్ వెళ్ళి ఆశ్రమం చూడాలని నిర్ణయించుకున్నాను. వినయ్ కూడా నాతో వస్తానన్నాడు. ఇద్దరం బయలుదేరి కొంతదూరం ఫ్లైట్‍లో, ఆ తర్వాత కార్లో ఋషికేశ్ ప్రకృతి ఆశ్రమానికి చేరుకున్నాము. అక్కడి ప్రకృతి సౌందర్యానికి నాలో చెప్పలేని ఆశ్చర్యం, ఏదో తన్మయత్వం. చిన్న చిన్న ఇళ్ళు రెల్లుతో కప్పబడి ఉన్నాయి. పైన్, దేవదారు లాంటి ఎత్తైన చెట్లు ఆకాశాన్ని తాకుతున్నట్లుగా ఉన్నాయి. ఆ ప్రాంతమంతా కళ్ళు చెదిరే పచ్చదనం. ఎక్కడ చూసినా కొండలు, చెట్లు, సెలయేళ్ళు, పిల్లకాలువలు కనిపిస్తున్నాయి. చెట్లమీద పక్షులు చేసే భిన్నమైన ధ్వనులు సుస్వరాల్లా మురళీకృష్ణుని వేణునాదంలా వినిపిస్తున్నాయి. ఈ ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ, మరో నాలుగడుగులు వేశాము. కుటీరాల ప్రక్కగా గంగానది ఒక కాలువలా ప్రవహిస్తోంది. శివుడి జటాజూటం నుండి జాలువారిన గంగ ప్రవహించడం వల్లనే ఆ ప్రాంతం అంత పవిత్రంగా ఉందనిపించింది. అక్కడక్కడ యోగులు కాషాయరంగు దుస్తులతో మౌనంగా, ధ్యానం చేస్తూ కనిపించారు. అక్కడ కొంతమంది రాతికల్వాలలో మూలికలు నూరుతున్నారు. కొందరు కషాయాలు తయారు చేస్తున్నారు. కొంతమంది కాయలు, ఆకులు ఎండబెడుతున్నారు. అలా ఎవరికి వాళ్ళు ఎంతో క్రమశిక్షణగా, ప్రశాంతంగా ఎవరి పని వాళ్ళు చేసుకుపోతున్నారు. ఒకతను మా దగ్గరికి వచ్చి “గురువుగారి కోసమా? రండి” అంటూ తీసుకెళ్ళాడు. అక్కడ చెట్టుక్రింద అరుగుమీద ఒకాయన చుట్టు కొంతమంది కూర్చుని, అందరు ఏదో మాట్లాడుకుంటున్నారు. మాతో వచ్చిన అతను గురువుగారు అంటూ పరిచయం చేసి వెళ్ళిపోయాడు. నేను ఆయనను చూసి ఆశ్చర్యపోయాను. తెల్లగా గుండెలను తాకుతూ పెద్ద గడ్డం. కళ్ళు చాలా ప్రశాంతంగా దైవత్వం ఉట్టిపడుతూ ఉన్నాయి. నిరాడంబరతను సూచిస్తూ, తెల్లటి సంప్రదాయమైన దుస్తులు ధరించి ఉన్నాడు. “అచ్చు రవీంద్రనాధ్ ఠాగూర్‍లా ఉన్నారు కదూ” అన్నాడు వినయ్ నెమ్మదిగా. నేను నమస్కారం చెయ్యడం మరిచిపోయి ఆయననే చూస్తూ ఉండిపోయాను. ఆయన కళ్ళల్లో కాంతి నన్ను కట్టిపడేసింది. విశ్వకవి రవీంద్రుని పోలికలు, దుస్తులు, అదే ప్రశాంతత – వండర్‍ఫుల్ అనిపించింది. విశ్వకవి రవీంద్రుని అద్భుత సృష్టి శాంతినికేతన్! అదే విశ్వభారతి మీద మమకారంతో రవీంద్రుడే తిరిగి వచ్చాడేమో అనిపించింది. “రండి ఇలా కూర్చోండి” అంటూ ఆయన ఆ అరుగ్ మీద మాకు చోటు చూపించాడు. “నమస్కారమండి. మేము మెడిసిన్ చేశాము. మా నాన్నగారి సలహాతో మీ దగ్గర శిక్షణ పొందాలను వచ్చాము” అన్నాను నేను. “అవును సార్. ఇక్కడి వాతావరణం మాకెంతో నచ్చింది. మీరు అనుమతిస్తే మేము ఇక్కడ ఉండి మీతోబాటు ఇవన్నీ చేయాలనుకుంటున్నాము” అన్నాడు వినయ్. “అలాగే బాబు. మీరు వస్తున్నట్లు మీ నాన్న చెప్పాడు నాకు. ఒకప్పుడు అపజయం వెంటాడుతుండగా పారిపోయి ఈ ఋషికేశ్ చేరుకున్నాను. పిచ్చివాడిలా తిరుగుతున్న నాకు ఒక యోగి హితబోధ చేశాడు. ‘మనకు పాఠం అవసరం అయినప్పుడే అపజయం వరిస్తుంది. నిరుత్సాహంతో కర్తవ్యనిష్ఠ మరువకూడదు. విశ్వకళ్యాణ భావనకు వేదిక ప్రకృతి. ప్రకృతిని ప్రేమించని వాళ్ళు ఎవరినీ ప్రేమించలేరు. నిబద్దత, క్రమశిక్షణతో ప్రకృతితో సహాజీవనం చేస్తే సాధ్యం కానిదేదీ లేదు’ అని చెప్పాడా యోగి. ఆ మాటలతో నా మానసిక స్థితిలో మార్పు వచ్చింది. నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇదంతా దైవప్రేరణలా అనిపించింది నాకు. మానేసిన వైద్యాన్ని తిరిగి మొదలుపెట్టాను.

పూర్వం చరకుడు, శుశ్రుతుడు ఎలా చెట్ల ఆకులతో, వేళ్ళతో రోగాలను నయం చేసేవారో, అదంతా అధ్యయనం చేశాను. ముందు దగ్గరగా ఉన్న చిన్న చిన్న పల్లెల్లో వైద్యం మొదలుపెట్టాను. ఏ రోగము నాకు ఎదురుతిరగలేదు. నేను చేసే వైద్యం పట్టణాలకు కూడా చేరుకుంది. నా పేరు విని గుర్తుపడతారని కృష్ణమాచార్యులుగా పేరు మార్చుకున్నాను. ఇక్కడ ధ్యానం చేసుకుంటున్న యోగులు, సన్యాసులు నాకు ఇక్కడి మొక్కల గురించి, చెట్ల గురించి చాలా విషయాలు చెప్పారు. పట్టణాల నుండి ఆసక్తిగల యువకులు నా దగ్గర శిష్యరికం చెయ్యడం మొదలుపెట్టారు. వీళ్ళంతా వాళ్ళే. ఇతర రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు ఇందులో. నాకు వీళ్ళంతా పరమశివుడు పంపిన అష్టదిక్పాలకుల్లా కనిపిస్తారు. ఆరోగ్యమైన, స్వచ్ఛమైన సమాజాన్ని చూడాలనేదే నా లక్ష్యం. మేము తయారుచేసే మందులను చాలాచోట్లకు పంపిస్తుంటాము. నిస్వార్థంగా మేము చేస్తున్న ఈ పనివల్ల మాకెంతో తృప్తి ఉంది. ప్రతి డాక్టరు ఒక ధన్వంతరిగా మారాలనేదే నా కోరిక. మీరు ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. భవిష్యత్తులో గొప్ప డాక్టర్లుగా రాణించడానికి ఈ అనుభవం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మీరీరోజుకు విశ్రాంతి తీసుకోండి. రేపటినుండి పాఠాలు ప్రారంభిద్దాం” అన్నాడాయన. నేనూ, వినయ్ ఆయన మాటలు తన్మయత్వంతో వింటూ వుండిపోయాము. గురువుగారికి ఒకసారి పాదభివందనం చేసి సెలవు తీసుకున్నాము. తర్వాత నాన్నకు ఫోన్ చేసి ఇక్కడి విషయలన్నీ వివరంగా చెప్పాను. నాన్న నా నిర్ణయానికి చాలా సంతోషించారు. సంవత్సరకాలం ఇట్టే గడిచిపోయింది. ఐదేళ్ళ మా డాక్టర్ కోర్సుకు రెట్టింపు జ్ఞానాన్ని మేమిక్కడ నేర్చుకున్నాము. గురువుగారి శిక్షణలో బహుగొప్ప నైపుణ్యంగల డాక్టర్లుగా మేము తయారయ్యాము. చివరగా గురువుగారు మాట్లాడుతూ, “పొందడమే తప్ప పంచడం చేతకానివారు, అందుకోవడమే తప్ప ఇవ్వడం తెలియనివారు, సమాజానికే కాదు తమకు తామే పెద్ద బరువవుతారు. అహం, భేషం మర్చిపోయి ప్రేమ, దయ చూపించగలిగితే ప్రపంచమంతా వసుధైక కుటుంబంలా మారిపోతుంది” అన్నారు. గురువుగారికి మరోసారి నమస్కారం చేసి సంతృప్తి నిండిన మనస్సుతో అక్కడ నుండి సెలవు తీసుకున్నాము.

Exit mobile version