[బాలబాలికల కోసం ‘వైజ్ఞానిక విప్లవానికి శ్రీకారం చుట్టిన నికోలస్ కోపర్నికస్’ అనే రచన అందిస్తున్నారు డా. కందేపి రాణీప్రసాద్.]
పిల్లలూ! విశ్వానికి భూమి కేంద్రబిందువు కాదన్న సిద్ధాంతాన్ని మొదటగా ప్రతిపాదించినవాడు కోపర్నికస్. కానీ దాన్ని ప్రకటించటానికి ఆనాడు ఆయనకు ధైర్యం చాలలేదు. ఆనాటి చర్చి మతాధికారుల క్రోధానికి గురికావలసి వస్తుందని భయపడ్డాడు. ఒక శతాబ్దం తరువాత గెలీలియో దీనిని ప్రకటించాడు. ఆధునిక యుగంలో వైజ్ఞానిక విప్లవానికి శ్రీకారం చుట్టిన నికోలస్ కోపర్నికస్ గురించి ఈరోజు తెలుసుకుందామా!
కోపర్నికస్ 1473వ సంవత్సరంలో ఫిబ్రవరి 19వ తేదీన పోలెండ్ లోని టోరున్ నగరంలో జన్మించాడు. ఈయన చిన్నతనంలోనే తల్లితండ్రులిరువురూ మరణించారు. మేనమామ అయిన ‘లుకాస్ వాజెన్ రోడ్’ దగ్గర పెరిగాడు. ఈయన ‘బొలాగ్నా యూనివర్శిటీ’ నుండి ధర్మశాస్త్రంలో డాక్టరేట్ పొందారు. ఆయన స్వయంగా విద్యావేత్త కావడం వలన కోపర్నికస్‌ను బాగా చదివించారు. ప్రతి విషయాన్నీ విమర్శనాత్మకంగా ఆలోచించటం కోపర్నికస్‌కు చిన్నతనం నుండీ అలవాటు. కోపర్నికస్ ‘క్రాకౌ’ యూనివర్శిటీ’లో రెండేళ్ళు చదివారు. తరువాత ఆయన ‘ఫ్రంబర్క్ చర్చి’లో మతాధికారిగా చేరారు.
1496లో కోపర్నికస్ బొలాగ్నా యూనివర్శిటీలో చేరారు. ఆ తరువాత ‘పడువా’, ‘ఫెరారా యూనివర్శిటీ’లలో చదివారు. కనిపించిన ప్రతి పుస్తకాన్నీ చదవడం, ఎక్కడ ఉపన్యాసమున్నా వినడం కోపర్నికస్ చేసేవాడు. ధర్మశాస్త్రాన్ని చదువుతున్నప్పటికీ ఖగోళ గణిత శాస్త్రాలపైననే కోపర్నికస్ ఎక్కువ దృష్టిని నిలిపేవాడు. ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త ‘డొమినికో మరియా’తో కలిసి పరిశోధనలు చేసి ‘టాలెమీ’ సిద్ధాంతంలో వాస్తవికత లేదని తెలుసుకున్నాడు. అంతేకాక ప్రత్యామ్నాయ సిద్ధాంతం కొరకు అన్వేషించారు. ఫలితంగా ‘సూర్యకేంద్ర’ సిద్దాంతం తయారైంది.
అరిస్టాటిల్, టాలెమీలు విశ్వానికి భూమి కేంద్ర బిందువని ఎలా నిర్ధారించారా అని కోపర్నికస్ పరిశోధించాడు. భూమి ఒక నిర్దిష్ట కక్ష్యలో తన చుట్టూ తాను తిరగడం గమనించాడు. ఇలా భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడం వలన, వారు సూర్యునితో సహా గ్రహాలన్నీ భూమి చుట్టూ తిరుగుతున్నాయని భ్రమపడ్డారు. చంద్రుడు మాత్రమే భూమి చుట్టూ తిరుగుతున్నాడని కోపర్నికస్ ప్రకటించాడు. అంగారకుడు, బృహస్పతి, శని గ్రహాలు భూమి కంటే చాలా దూరంలో సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయని గ్రహించాడు.
జర్మనీ గణితశాస్త్ర ప్రొఫెసర్ రెటికస్ 1540లో కోపర్నికస్ సిద్ధాంతాన్ని ప్రచురించారు. కోపర్నికస్ 1543 మే 24వ తేదీన మరణించాడు.
డా. కందేపి రాణీప్రసాద్ MA, MSc, PHD, బాల సాహితీ వేత్త, కవయిత్రి, అనువాదకులు, చిత్ర కళాకారిణి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశిష్ట మహిళా పురస్కారం అందుకున్నారు. తెలుగు విశ్వ విద్యాలయం వారి ఉత్తమ రచయిత్రి పురస్కారం అందుకున్నారు. రాణీ ప్రసాద్ ఆర్ట్ పేరుతో హాస్పిటల్ వేస్ట్‌తో 4000 బొమ్మలను సృష్టించారు. బాల సాహిత్యంలో 48 పుస్తకాలు రచించారు. ‘తెలుగు బాల సాహిత్యంలో సైన్స్ రచనలు’ అనే అంశంపై నాగార్జున విశ్వవిద్యాలయంలో పరిశోధన చేశారు. తెలుగు విశ్వ విద్యాలయంలో బాల సాహిత్య కీర్తి పురస్కారాన్ని నెలకొల్పారు. మిల్కీ మ్యూజియం, స్వీటీ చిల్డ్రన్ లైబ్రరీ లను తమ ఆసుపత్రిలో పిల్లల కోసం నిర్వహిస్తున్నారు. తమ సొంత ఆసుపత్రిలో ప్రిస్క్రిప్షన్ పాడ్ మీద పిల్లల కోసం తెలుగు పాట, బొమ్మ పెట్టి ప్రింట్ చేస్తున్నారు. సైన్సు, యాత్రా సాహిత్యం విరివిగా రాస్తున్నారు. కళాభారతి, కవిత వాణి, చిత్ర కళారాణి అనే ఎన్నో బిరుదులను, 6 వరల్డ్ రికార్డ్స్నూ సొంతం చేసుకున్నారు.
