[జీ.వీ.యస్. ఆచార్యులు గారు రచించిన ‘వానప్రస్థం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
బస్సెక్కి రైలెక్కి
ఓడెక్కి విమానమెక్కి
విశ్వమంతా చుట్టేద్దామా
వింతలెన్నో చూసొద్దామా.. అంటూ
వార్ధక్యపు వయసులో
వంగిన తనువులతో
అడుగులో అడుగేసుకుంటూ
గోడ గడియారపు ముళ్ళుల్లా
నాలుగు గోడల గదిలో
అక్కడక్కడే తిరుగుతూ
అంత్యకాల నిరీక్షణలో
అలసటను దరిజేరనివ్వకుండా
ఉబసుపోక ఉత్తుత్తి ఊసులెన్నో
హుషారుగా చెప్పుకుంటూ
ఒకరి ఆసరాతో మరొకరు
వానప్రస్థంలో వారిద్దరు..
